Skip to main content

TS Inter Admissions 2025 : ఇక‌పై ఇంట‌ర్‌లో ప్ర‌వేశాలు DOST లాగే.. JOST.. ఎలా అంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలను దోస్త్ (DOST) విధానం ద్వారా నిర్వ‌హిస్తున్న విష‌యం తెల్సిందే. అయితే.. డిగ్రీ ఆన్‌లైన్‌ అడ్మిషన్ విధానం (దోస్త్) తరహాలో ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు జోస్త్ (JOST) ద్వారా ఆన్‌లైన్‌ అడ్మిషన్ ప్రక్రియ 2025 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని ఇంటర్మీడియట్ బోర్డ్ కసరత్తు ప్రారంభించింది.
Junior College Snline Services  DOST degree admissions Telangana   JOST intermediate admissions 2025  Telangana online admission process Intermediate Board of Telangana JOST process

10వ‌ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులు జూనియర్ కళాశాలలను ఆన్‌లైన్‌లో ఆప్షన్లు పెట్టుకోవచ్చు. అలాగే మెరిట్ ఆధారంగానే సీట్లను కాలేజీలను కేటాయిస్తారు. ఈ తరహా ఆన్‌లైన్‌ అడ్మిషన్ల కోసమే పదో తరగతిలో ఈ ఏడాది నుంచి గ్రేడింగ్ పద్ధతి తీసేసి మార్పుల విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టిన సంగతి తెల్సిందే.

ఈ విధానంలో స‌మ‌స్య ఇదే..?
ప్రైవేట్ జూనియ‌ర్‌ కాలేజీలో అడ్మిషన్లు ఆన్‌లైన్‌ ద్వారా పొందిన విద్యార్థులకు ఫీజుల సంగతి ఎలా అనేది ప్రస్తుతం సమస్య‌గా మారనుంది. ఇంటర్మీడియట్ లో నియంత్రణ ఉండాల్సి ఉంటుంది. ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ తో పాటు ఎఫ్‌సెట్, జెఈఈ, నీట్ కోచింగ్‌లు అదనంగా ఇస్తారు. వీటికి ఫీజులు కూడా విద్యార్థులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ఫీజుల విధానంపై త్వరలోనే ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

డిగ్రీ కళాశాలల్లో మాత్రం..
డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ప్రస్తుతమున్న ‘డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌– తెలంగాణ (దోస్త్‌)’ విధానాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. డిగ్రీ ప్రవేశాలను పాత విధానంలోనే చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు పూర్తి స్వేచ్ఛ లభించే వీలుంది. ఎవరికి సీటివ్వాలి ? ఎవరికి ఇవ్వకూడదనేది కాలేజీలే నిర్ణయించేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. ఉన్నత విద్యామండలి దీనిపై ఇప్పటికే చేపట్టిన అధ్యయనం తుది దశకు చేరుకోగా, త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. దీన్ని ఆమోదిస్తే, వచ్చే విద్యా సంవత్సరం (2025–26) నుంచి దోస్త్‌ను ఎత్తివేసినట్టేనని మండలి వర్గాలు చెబుతున్నాయి. 

‘దోస్త్‌’ను కొన్ని కాలేజీలు కొన్నేళ్లుగా వ్యతిరేకిస్తున్నాయి. అవి ఇప్పటికీ దోస్త్‌ జాబితాలో చేరలేదు. ఆయా కాలేజీల ఒత్తిడి మేరకే దోస్త్‌కు స్వస్తి చెప్పబోతున్నట్లు విద్యాశాఖలో చర్చ జరుగుతోంది. దీనిపై అన్నివర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి.  

ఏమిటీ దోస్త్‌ ?   
రాష్ట్రవ్యాప్తంగా 1,055 ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీలున్నాయి. గతంలో డిగ్రీ సీటు కోసం ప్రతీ కాలేజీలోనూ రుసుం చెల్లించి దరఖాస్తు చేయాల్సిన పరిస్థితి ఉండేది. సీటు ఎక్కడ వచి్చందో తెలుసుకునేందుకు ప్రతీ కాలేజీకి వెళ్లాల్సి వచ్చేది. సీటు రాకపోతే మరో కౌన్సెలింగ్‌ పెట్టే వరకూ అన్ని కాలేజీలూ తిరగాలి. విభిన్న కోర్సుల కోసం వివిధ దరఖాస్తులు చేయాల్సి వచ్చేది. ఈ విధానం వల్ల విద్యార్థులు వ్యయ ప్రయాసలకు గురయ్యేవాళ్లు. దీనిపై జాతీయస్థాయిలో విస్తృత చర్చ జరగ్గా, ఆన్‌లైన్‌లో ఏకీకృత ప్రవేశాలు ఉండాలంటూ యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ 2015లో ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో 2016 నుంచి దోస్త్‌ ద్వారా ప్రవేశాలు చేపడుతున్నారు.  మారుమూల గ్రామాల్లో ఉన్న విద్యార్థి కూడా ఆన్‌లైన్‌లో అన్ని కాలేజీలకు, అన్ని కోర్సులకు దరఖాస్తు చేసే అవకాశం వ‌చ్చింది. ఎక్కడికీ వెళ్లకుండానే సెల్‌ఫోన్‌లోనే ఎక్కడ? ఏ కోర్సులో? సీటు వచ్చిందనే సమాచారం వచ్చే వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది.

దోస్త్‌ ద్వారా కొంతమంది విద్యార్థులకు నష్టం జరుగుతోందని ఉన్నత విద్యామండలి వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులకు స్థానికంగా కాకుండా, మెరిట్‌ ప్రకారం ఎక్కడో సీట్లు వస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు వచ్చినా విద్యార్థులు చేరడం లేదని అధికారులు అంటున్నారు. మరోవైపు ప్రైవేటు కాలేజీలు దోస్త్‌లో విద్యార్థుల చేత ఆప్షన్లు ఇప్పించుకునేందుకు పోటీ పడుతున్నారని చెబుతున్నారు. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో దోస్త్‌ ప్రవేశాలు ఎక్కువగా ఉంటున్నాయని, కొన్నిచోట్ల తక్కువగా ఉంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. దోస్త్‌ పేరుతో మండలి ఆధిపత్యం చేస్తోందని, ఫలితంగా కాలేజీలు కొత్త కోర్సులతో విద్యార్థులను ఆకర్షించలేకపోతున్నాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. పాత విధానం వల్ల కాలేజీలపై ప్రభుత్వ అజమాయిషీ తగ్గుతుందని, ఇష్టానుసారం ఫీజులు వసూలు చేసే అవకాశం       వస్తుందని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. లోపాలుంటే సరిచేయాలి తప్ప, వ్యవస్థనే రద్దు చేయడం ప్రైవేటు సంస్థలకు మేలు చేయడమేనని చెబుతున్నాయి.

Published date : 31 Dec 2024 09:18AM

Photo Stories