Govt Schools: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
ఉయ్యాలవాడ: ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సుధాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కొండుపల్లె, ఉయ్యాలవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఏపీ మోడల్ స్కూల్‌ను అయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పై పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, నాడు నేడు కింద చేపట్టిన వివిధ రకాల అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదోతరగతిలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు పాఠశాలల్లో ఉదయం సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించామన్నారు. కొండుపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడు సుధాకర్‌రెడ్డి విద్యార్థులు వర్క్ బుక్‌లో రాసిన వాటిని పరిశీలించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో షోకాజ్ నోటీస్ జారీ చేశామన్నారు. అలాగే పాఠశాలలో నాడు –నేడు పనులు నిర్ణీత సమయంలో పూర్తి అయ్యేలా పర్యవేక్షించడంలో అలసత్వం వహించిన ప్రధానోపాధ్యాయుడు నరసింహుడుకు కూడా నోటీస్ ఇచ్చినట్లు డీఈఓ వెల్లడించారు. అనంతరం ఉయ్యాలవాడలో బుడ్డా విశ్వనాథరెడ్డి ఇంటికి వెళ్లి దివంగత బుడ్డా వెంగళరెడ్డికి అప్పట్లో విక్టోరియా మహారాణి బహుకరించిన బంగారు పథకాన్ని పరిశీలించి, నాటి చరిత్రను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈయన వెంట సర్వశిక్షా అభియాన్ ఏఎంఈఓ రఘురామిరెడ్డి, ఎంఈఓ వీరప్రతాప్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.