Study Abroad: విదేశాలకు విద్యార్థినుల క్యూ.. ఈ రుణాల కోసం పోటీ
ఉన్నత విద్య కోసం విదేశీ బాట పడుతున్న విద్యార్థినులు మూడేళ్లలో 150 % పెరుగుదల ప్రశంసించిన ప్రపంచ బ్యాంక్
దేశంలోని నగరాల నుంచే కాకుండా.. చిన్న పట్టణాల నుంచి కూడా విద్యార్థినులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళుతుండటం పెరుగుతోందని ప్రపంచ బ్యాంక్ నివేదికను ఉటంకిస్తూ విద్యారంగంలోని ప్రముఖ కన్సల్టెన్సీ ప్రొడిగీ ఫైనాన్స్ నివేదిక వెల్లడించింది. అమెరికా, బ్రిటన్‌లతోపాటు యూరప్‌లోని పలుదేశాల్లో ఉన్నత విద్య పట్ల మన విద్యార్థినులు ఆసక్తి చూపిస్తున్నారు. విదేశీ విద్య కన్సల్టెన్సీలను, విదేశీ విద్య రుణం కోసం బ్యాంకులను సంప్రదిస్తున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
చదవండి: Foreign Education: విదేశీ విద్యకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత
విదేశీ విద్యలోనూ సగం
2019కు ముందు దేశంలోని మెట్రో నగరాల నుంచి విదేశీ విద్య కోసం వెళ్లే పురుషులు, మహిళల నిష్పత్తి 70:30గా ఉండేది. అంటే విదేశాలకు వెళ్లేవారిలో పురుషులు 70 శాతం, మహిళలు 30 శాతం మంది ఉండేవారు. కానీ.. 2022లో మెట్రో నగరాల నుంచి విదేశాల్లో విద్య కోసం వెళ్లిన పురుషులు, మహిళల నిష్పత్తి 50:50గా ఉండటం విశేషం. అంటే పురుషులు, మహిళలు సమానంగా ఉన్నారు. దేశంలోని చిన్న నగరాల నుంచి 2019కి ముందు విద్య కోసం విదేశాలకు వెళ్లే పురుషులు, మహిళల నిష్పత్తి 80:20గా ఉండేది. కానీ 2022లో దేశంలో చిన్న నగరాల నుంచి విదేశాల్లో విద్య కోసం వెళ్లిన పురుషులు, మహిళల నిష్పత్తి 60:40గా ఉండటం విశేషం. 2019కి ముందు దేశంలోని చిన్న పట్టణాల నుంచి విదేశాల్లో విద్య కోసం వెళ్లే పురుషులు, మహిళల నిష్పత్తి 80:20గా ఉండేది. 2022లో చిన్న పట్టణాల విదేశాల్లో విద్య కోసం వెళ్లిన పురుషులు, మహిళల నిష్పత్తి 55:45గా ఉంది.
చదవండి: Botsa Satyanarayana: విదేశీ విద్యావకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
ప్రపంచ బ్యాంక్ ప్రశంసలు
ప్రపంచంలో మిగిలిన దేశాల కంటే భారతీయ విద్యార్థినులు అత్యున్నత విద్యా ప్రమాణాలు సాధిస్తున్నారని ప్రపంచ బ్యాంక్ నివేదిక ఇటీవల ప్రశంసించడం విశేషం. భారత్‌లో సైన్స్–టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమెటిక్స్ సబ్జెక్టుల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారిలో మహిళలు 43 శాతంగా ఉన్నారని పేర్కొంది. విద్య, ఉపాధి రంగాల్లో ఆడ పిల్లలను ప్రోత్సహించే దృక్పథం భారతీయ తల్లిదండ్రుల్లో పెరుగుతుండటమే అందుకు కారణమని చెప్పింది. విద్యార్థినుల కోసం స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు పెరుగుతుండటం కూడా అందుకు దోహదపడుతోందని చెప్పింది. ఈ సానుకూల దృక్పథం రానున్న కాలంలో మరింతగా పెరుగుతుందని కూడా పేర్కొంది.
చదవండి: EB 5 Consultant: ఐదు నగరాల్లో ఉచిత ఈబీ–5 కన్సల్టేషన్స్
విద్యా రుణాల కోసం పోటీ
విదేశీ విద్య కోసం బ్యాంకులకు వస్తున్న దరఖాస్తుల్లో కూడా పురుషులతోపాటు మహిళలు సమానంగా ఉంటుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. 2019కి ముందు విదేశీ విద్య కోసం బ్యాంకులకు అందే దరఖాస్తుల్లో విద్యార్థినులు 10శాతం మంది మాత్రమే ఉండేవారు. కాగా.. 2022లో విదేశీ విద్యా రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయించే విద్యార్థినుల దరఖాస్తులు ఏకంగా 49 శాతానికి పెరగడం విశేషం. మేనేజ్‌మెంట్, మెడిసిన్ రంగాల్లో ఉన్నత విద్య కోసం బ్యాంకు రుణాల కోసం భారతీయ విద్యార్థినుల నుంచి 145 శాతం దరఖాస్తులు పెరిగాయని ప్రముఖ కన్సల్టెన్సీ ప్రొడిగీ ఫైనాన్స్ వెల్లడించింది.