Botsa Satyanarayana: విదేశీ విద్యావకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని ప్రతిభా పాఠశాలలు (స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్), కళాశాల (కాలేజీ ఆఫ్ ఎక్స్‌లెన్స్)ల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలను మే 10న పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొరతో కలిసి బొత్స విడుదల చేశారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరానికి 8వ తరగతిలో 190 సీట్లకు 878 మంది, ఇంటర్మీడియెట్‌లో 450 సీట్లకు 3,548 మంది ప్రవేశపరీక్ష రాశారని చెప్పారు. విద్యార్థులకు వచ్చిన ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తామన్నారు.
చదవండి: Foreign Education: విదేశీ విద్యకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత
ఐఐటీ, మెడికల్ సీట్ల లక్ష్యంగా ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో ప్రారంభించిన ప్రతిభా పాఠశాలలు, కళాశాలల్లో చదువుకున్న గిరిజన విద్యార్థులు పలు ఐఐటీలు, ఎన్‌ఐటీలు, మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధిస్తున్నారని అభినందించారు. ప్రతిభావంతులకు విదేశీ ఉన్నత విద్యావకాశాలనూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కల్పిస్తున్నారని వివరించారు. ఇప్పటి నుంచే లక్ష్యాలను నిర్దేశించుకొని గిరిజన విద్యార్థులు ఆ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను బొత్స, రాజన్నదొర సత్కరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన గురుకులాల సంస్థ సంయుక్త కార్యదర్శి ఎస్.రమణమూర్తి, ఉప కార్యదర్శి రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.