10th Class Result 2022: పది పరీక్షల్లో తండ్రి పాస్.. కొడుకు ఫెయిల్.. ఎక్కడంటే..?
తల్లిదండ్రులు నిరక్షరాస్యులైన.. పిల్లలను గొప్పగా చదివించేందుకే తాపత్రయపడుతుంటారు. చదువుకు మధ్యలోనే స్వస్తి పలికిన వారు కొకోల్లలు. ఆర్థిక సమస్యలు, పెళ్లి, కుటుంబ బాధ్యతలంటూ ఎన్నో బరువులను నెత్తిన పెట్టుకొని చదువును దూరం చేసుకుంటారు.తరువాత చదువుకోవాలని అనిపించిన వయసు గుర్తొచ్చి ఆగిపోతుంటారు.
ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో..
అయితే కొంతమంది మాత్రం వయసు సంబంధం లేకుండా విద్యను కొనసాగిస్తారు. మహారాష్ట్రకు చెందిన భాస్కర్ వాఫ్‌మారే కూడా అలాంటి వ్యక్తే. మహారాష్ట్రలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షల ఫలితాలు ఇటీవలే వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో పుణెకు చెందిన 43 ఏళ్ల వ్యక్తి ఉత్తీర్ణత సాధించాడు. విశేషమేంటంటే.. ఇదే ఫలితాల్లో తన సొంత కొడుకు ఫెయిల్‌అయ్యాడు. భాస్కర్ వాఘ్‌మారే తన ఏడో తరగతిలోనే విద్యను ఆపేశాడు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో చిన్న పనిలో చేరి కుటుంబానికి ఆసరాగా నిలిచాడు.
అన్ని సబ్జెక్టుల్లో పాస్.. కానీ
ప్రస్తుతం ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న భాస్కర్‌కు పెళ్లి అయి 15 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అయితే 30 ఏళ్ల తరువాత తన చదువును కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నాడు. కొడుకుతో కలిసి తండ్రి ఒకే ఏడాది పదో తరగతి పరీక్షలు రాశారు. ఈ పరీక్షల్లో భాస్కర్ అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయ్యారు. కానీ తన కొడుకు రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు.
ఇలా చదివా..
‘నేనెప్పుడూ ఉన్నత చదువులు చదువుకోవాలని ఉండేది. కానీ కుటుంబ బాధ్యతల కారణంగా అది కుదరలేదు. ఎప్పటి నుంచి చదువును తిరిగి ప్రారంభించాలనుకుంటున్నా. అందుకే 10వ తరగతి పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నాను. నా కొడుకు కూడా ఈ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్నాడు. వాడి చదువు నాకు సహాయపడింది. రోజు చదవుకునే వాడిని. ఉదయం పనిచేసి సాయంత్రం పరీక్షలకు సిద్ధమయ్యేవాడిని. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినందుకు సంతోషిస్తున్నా.. అయితే నా కొడుకు రెండు పేపర్లలో ఫెయిలవ్వడం బాధగా ఉంది. కానీ వాడిని సప్లిమెంటరీ పరీక్షల కోసం ప్రిపేర్ చేస్తాను.’ అని తన అనుభవాన్ని పంచుకున్నాడు.