Kondapalli Srinivas: సుప్రీం కోర్టు తీర్పు మేరకు గురుకుల ఫలితాలు ప్రకటించాలి
గురుకుల బోర్డు వెలువరించిన అన్ని నోటిఫికేషన్లు సుప్రీంకోర్టు తీర్పు మేరకు మహిళలకు సమాంతర(హారిజంటల్) రిజరేవషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద గురుకుల ఉపాధ్యాయ, పురుష అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, స్టాఫ్ నర్సు నియామకాలలో సమాంతర(హారిజంటల్) రిజర్వేషన్లు పాటిస్తున్నారని, తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, జెన్కో, నియామకాల్లో కూడా ఇదే పద్ధతి అనుసరిస్తున్నారని అన్నారు.
చదవండి: DSC 2024: ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ నిర్వహిస్తాం.. గ్రూప్ పరీక్షలు ఇలా నిర్వహిస్తాం..
గురుకుల బోర్డు ప్రకటించిన అన్ని నోటిఫికేషన్లు బాలికలు, బాలుర పాఠశాలలో మహిళా అభ్యర్థులకు 33 శాతం రిజర్వేషన్లు కేటాయించడంతో 83 శాతం మహిళా అభ్యర్థులకే దక్కుతున్నాయని, దీంతో పురుష అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జీఓ నం.77 విడుదల చేసి అన్ని నోటిఫికేషన్‌లకు సమాంతర రిజర్వేషన్లు పాటిస్తోందన్నారు. ఇప్పటికైనా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను నూతన ప్రభుత్వం గుర్తించి పురుష అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురుకుల ఫలితాల పోరాట సమితి నాయకులు ఉపేందర్, చిరంజీవి, శ్రీనివాస్, హరి తదితరులు పాల్గొన్నారు.