Skip to main content

ఏపీ ‘గురుకుల’ ఫలితాల వెల్లడి.. తొలి స్థానంలో నిలిచింది వీరే..

సాక్షి,అమరావతి/గుంటూరు ఎడ్యుకేషన్‌: ఏపీ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలోని 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను జూన్‌ 8న అధికారులు విడుదల చేశారు.
AP Gurukula results revealed
ఏపీ ‘గురుకుల’ ఫలితాల వెల్లడి

ఈ సంస్థ పరిధిలో 38 పాఠశాలలు, 7 జూనియర్‌ కాలేజీలు, ఒక డిగ్రీ కళాశాల ఉన్నాయి. 2023–24 విద్యా సంవత్సరంలో ఐదో తరగతిలో ఉన్న 3,195 సీట్లకు, 6, 7, 8 తరగతుల్లో మిగిలి ఉన్న 356 ఖాళీల భర్తీకి, ఇంటర్‌లోని ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ/సీఈసీ విభాగాల్లో ఉన్న 1,149 సీట్లకు, డిగ్రీలోని బీఏ, బీకాం, బీఎస్సీలోని 4,852 సీట్లకు మే 20న ప్రవేశ పరీక్ష నిర్వహించినట్లు గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి ఆర్‌.నరసింహారావు తెలిపారు. విద్యార్థుల ర్యాంకులను వారి మొబైల్‌ నంబర్లతో పాటు వారి పాఠశాలలకు కూడా పంపించామని,  https://aprs.apcfss.in వెబ్‌సైట్‌లో కూడా ఉంచామన్నారు. మొత్తం అన్ని విభాగాల్లోను 87,252 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు వివరించారు. వీరికి ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించి అర్హులైనవారికి ప్రవేశాలు కల్పిస్తామన్నారు. కాగా, 12 మైనార్టీ పాఠశాలలు, 3 జూనియర్‌ కాలేజీల్లో మైనార్టీ విద్యార్థులకు ప్రవేశ పరీక్షతో సంబంధం లేకుండా నేరుగా అడ్మిషన్లు చేపడతామని చెప్పారు.

తొలి స్థానంలో నిలిచింది వీరే..

గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 8వ తరగతి వరకు ప్రవేశాలకు 100 మార్కులకు, ఇంటర్, డిగ్రీ కాలేజీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 150 మార్కులకు నిర్వహించారు. వీరిలో అత్యధిక మార్కులు సాధించి తొలి స్థానంలో నిలిచిన అభ్యర్థుల పేర్లను గురుకుల విద్యాలయ సంస్థ వెల్లడించింది. 

  • ఐదో తరగతి ప్రవేశ పరీక్షలో విజయనగరం జిల్లాకు చెందిన బి.దిలీప్‌ కృష్ణ 99 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచాడు. ఆరో తరగతిలో పి.జితేంద్రకుమార్‌ (శ్రీకా­కుళం జిల్లా), ఏడో తరగతిలో జీకే సాయిపవన్‌ (పశ్చిమ గో­దావరి), ఎనిమిదో తరగతిలో కె.నవీన్‌ కుమార్‌ (కృష్ణా జిల్లా) మొదటి స్థానం సాధించారు. 
  • ఇంటర్‌ కేటగిరీలో తూర్పు గోదావరి జిల్లా­కు చెందిన కె.సాయి సృజన (ఎంపీసీ) 146 మార్కులు, టీ సాహితి (బైపీసీ) 140 మార్కులు, విజయనగరం జిల్లాకు చెందిన కేవీ.వంశీకృష్ణ నాయుడు (ఎంఈసీ/­సీ­ఈసీ) 133 మార్కులతో ప్రథమ స్థానం సాధించారు. 
  • డిగ్రీ విభాగంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కె.అచ్యుతరావు (బీఏ), విజయనగరం జిల్లాకు చెందిన ఎం.జ్ఞానతేజ (బీకాం), టి.­పునీత్‌ కు­మార్‌ (బీఎస్సీ–ఎంఎస్‌సీ­ఎస్‌), పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఎస్‌.తేజ (బీఎస్సీ–ఎంపీసీ) విభా­గాల్లో మొదటి ర్యాంకులు సాధించారు.  
Published date : 09 Jun 2023 04:06PM

Photo Stories