Skip to main content

Medical and Health Department: ఒకే రోజు 9 కొత్త మెడికల్‌ కాలేజీలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన తొమ్మిది ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు సెప్టెంబర్‌ 15వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి.
9 new medical colleges, Opening on September 15, Healthcare Education Institutions
ప్రారంభానికి సిద్ధమైన నిర్మల్‌ వైద్య కళాశాల భవనం

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ఒకేసారి వీటిని ప్రారంభించనున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. కాలేజీల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వీటిలో చేరే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులను వెంటనే సమకూర్చాలని సూచించారు. గురువారం ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. 

జిల్లాకో కాలేజీ ఏర్పాటులో భాగంగా.. 

రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడంతోపాటు వైద్య విద్యను చేరువ చేసేందుకు సీఎం కేసీఆర్‌ జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారని హరీశ్‌రావు గుర్తు చేశారు. గతేడాది ఒకే వేదిక నుంచి ఎనిమిది మెడికల్‌ కాలేజీలను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్‌ భూపాలపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ మెడికల్‌ కాలేజీలను ప్రారంభించనున్నట్టు తెలిపారు.

చదవండి: High Court: మెడికల్‌ సీట్ల కేటాయింపు వివాదంపై తీర్పు రిజర్వు

ఈ కొత్త మెడికల్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ అందుబాటులో ఉండి, అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఈ అంశంపై శుక్రవారం మరోసారి సమావేశమై ఏర్పాట్లను పర్యవేక్షించాలని కాళోజీ వర్సిటీ వీసీ, వైద్య విద్య సంచాలకులను మంత్రి ఆదేశించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు తెలంగాణలో కేవలం ఐదే మెడికల్‌ కాలేజీలు ఉండేవని, అందులోనూ మూడు ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుకు ముందే ఉన్నాయని హరీశ్‌ చెప్పారు.

అదే ఇప్పుడు కొత్తవి కలిపి మొత్తం 26 కాలేజీకు చేరాయన్నారు. 2014లో 5 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో కలిపి 850 ఎంబీబీఎస్‌ సీట్లు మాత్రమే ఉంటే.. ఇప్పుడు ఏకంగా 3,915 సీట్లకు పెరిగాయని వివరించారు. 

చదవండి: Collector Jitesh V Patil: వైద్య కళాశాల పనుల్లో వేగం పెంచండి

మహిళల ఆరోగ్యం కోసం.. 

రాష్ట్రంలో మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం కొత్తగా మరో వంద ఆరోగ్య మహిళ కేంద్రాలను సెప్టెంబర్‌ 12వ తేదీన ప్రారంభిస్తున్నట్టు మంత్రి హరీశ్‌ తెలిపారు. వీటితో కలిపి రాష్ట్రంలో ఆరోగ్య మహిళా కేంద్రాల సంఖ్య 372కు చేరుతోందన్నారు.

ఈ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 2,78,317 మందికి స్క్రీనింగ్‌ నిర్వహించి, వివిధ సమస్యలున్న 13,673 మంది మహిళలను ఆస్పత్రులకు రిఫర్‌ చేశామని చెప్పారు. 5,204 స్టాఫ్‌ నర్స్‌ రిక్రూట్‌ మెంట్‌ ఫలితాలను త్వరగా విడుదల చేయాలని.. ఏఎన్‌ఎంల పీఆర్సీ, ఎరియర్స్‌ వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  

Published date : 08 Sep 2023 12:15PM

Photo Stories