Cybercrime: ఫేస్‌బుక్, వాట్సాప్ వాడుతున్నారా.. అయితే జర జాగ్రత్త!!
ఒకప్పుడు ఫేస్‌బుక్, ఆపై డీపీ ఫ్రాడ్స్ చేసే ‘ఈ– నేరగాళ్లు’ ఇప్పుడు ఈ రెండిటినీ ‘కలిపేశారు’. ఫేస్‌బుక్ ద్వారా ఎంటరైన తర్వాత వాట్సాప్ డీపీ వరకు వెళ్తున్నారు. లాక్ చేయని ప్రొఫైల్స్‌లోని వివరాల ఆధారంగా చాటింగ్ చేస్తూ డబ్బు డిమాండ్ చేస్తున్నారు. ఈ స్కామ్స్‌లో ఆర్థిక నష్టం అంతగా లేకున్నా.. న్యూసెన్స్ చాలా ఎక్కువగా ఉంటోంది. ఇటీవల కాలంలో ఈ తరహా స్కామ్స్ పెరిగాయని చెబుతున్న సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ప్రొఫైల్ లాక్ చేసినప్పటికీ ‘రిక్వెస్ట్’తో..
ఫేస్‌బుక్ ఆధారంగా జరిగే సైబర్ నేరాలపై కొంత వరకు అవగాహన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అనేక మంది తమ ఫేస్‌బుక్ ప్రొఫైల్స్‌ని కచ్చితంగా లాక్ చేసి ఉంచుతున్నారు. అలా ఉన్న వాటిని కేవలం ఫ్రెండ్స్ లిస్టులో ఉన్న వాళ్లు మాత్రమే చూడగలరు. దీనికి విరుగుడుగా సైబర్ నేరగాళ్లు ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎత్తు వేస్తున్నారు.
ఎక్కువగా.. యువతులు, కొన్ని సందర్భాల్లో సదరు ఫేస్‌బుక్ యూజర్‌కు పరియచం ఉన్న వారి పేరుతో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నారు. దీని ఆధారంగా తాము టార్గెట్ చేసిన వారికి రిక్వెస్ట్ పంపుతున్నా రు. దీన్ని యాక్సెప్ట్ చేసిన మరుక్షణం సైబర్ నేరగాళ్లకు ఆ ఫేస్‌బుక్ ప్రొఫైల్ చూసే అవకాశం దక్కుతోంది.
Rice Producing: వరి దిగుబడిలో అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ
నకిలీ ప్రొఫైల్‌తో డబ్బు డిమాండ్..
ఇలా ఓ వ్యక్తి ఫేస్‌బుక్ ఖాతాలోకి ఎంటర్ అవుతున్న సైబర్ నేరగాడు అందులోని వివరాలు, ఫొటోల ఆధారంగా నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నాడు. దీని ఆధారంగా మెసెంజర్‌లో చాటింగ్ చేస్తూ డబ్బు అడగటంతో పాటు ఫ్రెండ్స్ లిస్టులోని వారికే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపుతున్నాడు. వీటిని అందుకున్న వాళ్లల్లో అనేక మంది తమ స్నేహితుడే మరో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడని భావించి యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆపై వారితోనే ఇదే పంథా అవలంబిస్తున్నారు. మరోపక్క సదరు వ్యక్తి ఫ్రెండ్స్ లిస్టులో ఉన్న వారిలో ఎవరైతే తమ ప్రొఫైల్‌లో ఫోన్ నంబర్ ఉంచుతున్నారో వారిని మరో విధంగా టార్గెట్ చేస్తున్నారు.
చిన్న మొత్తాలే కావడంతో నో కంప్లైంట్..
సైబర్ నేరాల్లో ఎవరి పేరుతో అయితే నకిలీ ప్రొఫైల్, డీపీ క్రియేట్ అయ్యాయో.. వారితో పాటు నగదు బదిలీ చేసిన వాళ్లు సైతం సైబర్ క్రైమ్ ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. అయితే.. సైబర్ క్రిమినల్స్ కొల్లగొడుతున్నది చిన్న మొత్తాలే కావడంతో అత్యధికులు పోలీసుస్టేషన్ల వరకు వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు.
ఇది నేరగాళ్లకు కలిసి వచ్చే అంశంగా మారుతోంది. మరోపక్క ఫిర్యాదు, కేసు నమోదు జరిగినా.. ఉత్తరాదిలో ఉండే ఈ నేరగాళ్ల కోసం ఇక్కడ నుంచి పోలీసు బృందాలు పంపడం కష్టసాధ్యంగా మారింది. దీంతో చిన్న మొత్తాలతో ముడిపడి ఉన్న కేసుల్లో దాదాపు అన్నీ మూతపడటం కూడా నేరగాళ్లకు అనుకూలంగా మారుతోంది.
Lady Justice Statue: న్యాయదేవత శిల్పంలో మార్పులు.. కళ్లారా చూస్తూ సమన్యాయం
ఆ ఫొటోలే వినియోగించి వాట్సాప్ డీపీ..
సైబర్ నేరగాళ్లు తాము రూపొందించిన నకిలీ ప్రొఫైల్‌లోని ఫొటోలు, వర్చువల్ నంబర్లు వాడి వాట్సాప్ ఖాతాలు తెరుస్తున్నారు. వీటికి డీపీలుగా అసలు యజమానులవి పెడుతున్నారు. ఈ వాట్సాప్ ఖాతాల ఆధారంగా ఫ్రెండ్స్ లిస్టులోని వ్యక్తుల ఫోన్ నంబర్లకు సందేశాలు పంపుతున్నారు.
ఫేస్‌బుక్ మెసెంజర్‌లో అడిగినట్లే వీటి ద్వారానూ అత్యవసరమని, గూగుల్ పే లిమిట్ అయిపోయిందని చెబుతూ డబ్బు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందేశాలు అందుకునే ఎదుటి వ్యక్తుల్లో కేవలం డీపీలు మాత్రమే వాళ్లు తన స్నేహితుడు, బంధువు డబ్బు అడుగుతున్నాడని భావించి బదిలీ చేస్తున్నారు.