High Court: మెడికల్ సీట్ల కేటాయింపు వివాదంపై తీర్పు రిజర్వు
కొత్త మెడికల్ కాలేజీల్లో కన్వినర్ కోటాలోని 100 శాతం ఎంబీబీఎస్ సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 72ను కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్‌కు సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూలైలో ఉత్తర్వులు జారీ చేసింది.
దీని ప్రకారం 2014, జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో కన్వినర్ కోటాలోని 100 శాతం ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ విద్యార్థులకే రిజర్వు కానున్నాయి. ఈ మేరకు జూలై 3న రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 72ను విడుదల చేసింది.
అంతకుముందు జాతీయ కోటా 15 శాతం పోగా.. మిగిలిన సీట్లలో 85 శాతం స్థానిక విద్యార్థులకు ఉండగా, మిగతా 15 శాతం అన్ రిజర్వుడుగా ఉండేది. అన్ రిజర్వుడులో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా పోటీపడేవారు. ప్రభుత్వ తాజా జీవోతో అన్ రిజర్వుడు అనేది ఉండదు. దీంతో ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గంగినేని సాయి భావనతో పాటు మరికొందరు తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
చదవండి: DME: జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ కోర్సులకు దరఖాస్తులు
జీవో నంబర్ 72 చట్టవిరుద్ధమని, దానిని కొట్టివేయడంతో పాటు కౌన్సెలింగ్‌లో పాత విధానాన్నే అనుసరించేలా ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం సెప్టెంబర్ 6న విచారణ చేపట్టింది.
ప్రభుత్వ నిర్ణయం చట్టవిరుద్ధమని పిటిషనర్ తరఫున న్యాయవాది వాదించారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన రాష్ట్ర విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, వర్సిటీ తరఫు న్యాయవాది ప్రభాకర్‌రా వు వాదనలు వినిపించారు.
పునర్‌వ్యవస్థీకరణ చట్టానికి, రాజ్యాంగానికి ప్రభుత్వ నిర్ణ యం వ్యతిరేకం కాదని చెప్పారు. విభజనకు ముందు ఉన్న కాలేజీల్లో ఏపీ విద్యార్థుల కు కూడా అవకాశం ఇస్తున్నామన్నారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం.. కొత్త కాలేజీల్లోని సీట్ల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.