Skip to main content

National Medical Commission: సంచలన నిర్ణయం

వైద్య విద్యపై ఆశతో ప్రైవేటు కాలేజీలే అయినా చేరారు. కన్వీనర్, బీ కేటగిరీ, ఎన్‌ఆర్‌ఐ కోటాల్లో అడ్మిషన్‌ కోసం లక్షల రూపాయలు చెల్లించారు.
Sensational decision by the National Medical Commission
జాతీయ మెడికల్ కమిషన్ సంచలన నిర్ణయం

రోజూ తరగతులకు హాజరవుతున్నారు. తీరా నెల రోజులకే తమ మెడికల్‌ సీట్లు రద్దు కావడంతో కంగుతిన్నారు. తెలంగాణ‌ రాష్ట్రంలోని మూడు ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలకు చెందిన ఈ వైద్య విద్యార్థులు.. తమ భవిష్యత్తు ఏమిటో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఆయా కాలేజీల్లో ఇటీవల చేరిన ఎంబీబీఎస్, పీజీ మెడికల్‌ విద్యార్థుల అడ్మిషన్లకు ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తూ జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) తీసుకున్న సంచలన నిర్ణయమే ఇందుకు కారణం. కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ ఇటీవల ఆకస్మిక తనిఖీలు చేసినప్పుడు మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం, అధ్యాపకుల్ని అవసరం మేరకు నియమించక పోవడం, లేబొరేటరీలు సరిపడా లేకపోవడం వంటి తదితర కారణాలతో మొత్తం 520 సీట్లకు ఇచ్చిన అనుమతిని రద్దు చేసినట్లు ఎన్‌ఎంసీ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు లేఖ రాసింది. అలాగే సంబంధిత ఎంఎన్‌ఆర్, టీఆర్‌ఆర్, మçహావీర్‌ కాలేజీల యాజమాన్యాలకు కూడా లేఖలు పంపించింది. కాగా అడ్మిషన్ల రద్దుపై ఈ 3 కాలేజీలు ఎన్‌ఎంసీకి అప్పీలుకు వెళ్లాయి. కాలేజీల్లో చేరిన నెల రోజుల్లోపే ఇలా సీట్లకిచ్చిన అనుమతిని రద్దు చేయడం ఇటీవలి కాలంలో ఎప్పుడూ జరగలేదని వైద్యవిద్య వర్గాలు వెల్లడించాయి. 

చదవండి: 

450 ఎంబీబీఎస్, 70 పీజీ మెడికల్‌ సీట్ల రద్దు

అభ్యంతరాల స్వీకరణకు తుది గడువు ఇదే..

Medical Colleges: ఏపీ మెర్క్‌ పరిధిలోకి నూతన వైద్య కళాశాలలు

విద్యార్థులు క్లాసులకు వెళ్తుండగా..

సాధారణంగా మెడికల్‌ అడ్మిషన్లకు ముందే ఎన్‌ఎంసీ ఆకస్మిక తనిఖీలు చేసి అడ్మిషన్లకు అనుమతి ఇవ్వాలా లేదా అనేది నిర్ణయిస్తుంది. కానీ 2021–22 వైద్య విద్యా సంవత్సరానికి సంబంధించి గతేడాది నవంబర్‌లో అడ్మిషన్లు చేసుకోవచ్చని ఆయా కాలేజీలకు అనుమతినిచ్చింది. తీరా అడ్మిషన్లు పూర్తయిన తర్వాత, విద్యార్థులు కాలేజీలకు వెళ్తున్న సమయంలో ఆయా అడ్మిషన్లకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్లు ఎన్‌ఎంసీ తెలిపింది. ఎంఎన్‌ఆర్‌ (సంగారెడ్డి), టీఆర్‌ఆర్‌ (పటాన్‌చెరు), మహవీర్‌ (వికారాబాద్‌) మెడికల్‌ కాలేజీల్లో మొదటి ఏడాది ఎంబీబీఎస్‌ సీట్లు ఒక్కోచోట 150 చొప్పున మొత్తం 450 సీట్లు భర్తీ అయ్యాయి. ఎంఎన్‌ఆర్, మహవీర్‌ కాలేజీల్లో 70 వరకు పీజీ మెడికల్‌ సీట్లను భర్తీ చేశారు. ఎంబీబీఎస్‌ సీట్లల్లో సగం కన్వీనర్‌ కోటావి ఉండగా, మిగిలిన వాటిల్లో 35 శాతం బీ కేటగిరీ, 15 శాతం ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లున్నాయి. అలాగే పీజీ సీట్లల్లోనూ కన్వీనర్, బీ, సీ కేటగిరీ సీట్లున్నాయి. అలాగే ఇనిస్టిట్యూషనల్‌ కోటా సీట్లున్నాయి. 

విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? 

మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం కాలేజీ యాజమాన్యాల తప్పయితే, అడ్మిషన్లు అయిపోయాక వాటి అనుమతిని రద్దు చేయడం ఎన్‌ఎంసీ తప్పు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆరేడేళ్ల క్రితం కూడా రాష్ట్రంలో ఒకసారి ఇలాగే అడ్మిషన్లు అయిపోయాక సీట్లను రద్దు చేస్తే, ఆయా విద్యార్థులను వివిధ మెడికల్‌ కాలేజీల్లో సర్దుబాటు చేశారు. ఇప్పుడు మూడు కాలేజీలు అప్పీలుకు వెళ్లినందున ఎన్‌ఎంసీ సానుకూలంగా స్పందిస్తే కొంతవరకు పరవాలేదు. ఒకవేళ ఎన్‌ఎంసీ రద్దు నిర్ణయానికే కట్టుబడి ఉంటే విద్యార్థులను ఇతర ప్రైవేట్‌ కళాశాలల్లోనే సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అయితే 450 మంది ఎంబీబీఎస్, 70 మంది పీజీ విద్యార్థులను అడ్జెస్ట్‌ చేయడమంటే మాటలు కాదని అంటున్నారు. 

ఎన్ని ఇబ్బందులో..!

విద్యార్థులు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. బీ, ఎన్‌ఆర్‌ఐ కోటాలో చేరిన విద్యార్థుల్లో పూర్తి కోర్సు పూర్తి ఫీజును చెల్లించినవారు కూడా ఉన్నారు. ఉదాహరణకు ఐదేళ్ల ఫీజు ఒకేసారి చెల్లిస్తే తక్కువ వసూలు చేసిన కాలేజీలు ఉన్నాయి. అటువంటి చోట తిరిగి ఆ ఫీజు వసూలు కాదు. డొనేషన్లు చెల్లించిన చోట్ల కూడా ఆ డబ్బులు తిరిగిరావు. ఎందుకంటే వాటికి రసీదు కూడా ఉండదు. ఎక్కడైనా అడ్జెస్ట్‌ చేస్తే ఆ ప్రైవేట్‌ కాలేజీలు కూడా ఫీజును ముక్కుపిండి వసూలు చేస్తాయి. ఇది విద్యార్థుల తల్లిదండ్రులకు భారంగా మారుతుంది. మొత్తం మీద ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల నిర్లక్ష్యం వైద్య విద్యార్థులకు శాపంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మంత్రి హరీశ్‌రావు దృష్టికి..

కాగా ఆ మూడు కాలేజీలకు చెందిన విద్యార్థులు తమకు జరిగిన అన్యాయంపై మే 31న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావును, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులను కలిసి విన్నవించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఒక ప్రైవేట్‌ కాలేజీ యాజమాన్యం హైకోర్టుకు వెళ్లడంతో ఎన్‌ఎంసీ దీనిపై తగు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించినట్లు కాళోజీ వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. 

విద్యార్థులకు న్యాయం చేయాలి

అకస్మాత్తుగా మూడు ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్, పీజీ సీట్లను రద్దు చేయడం వల్ల ఇప్పటికే చేరిన విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది. కాబట్టి విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా, వారి భవిష్యత్తు అంధకారంలో పడకుండా ఎన్‌ఎంసీ తగిన చర్యలు తీసుకోవాలి.
– డాక్టర్‌ కార్తీక్‌ నాగుల, అధ్యక్షుడు, జూనియర్‌ డాక్టర్ల సంఘం 

విద్యార్థుల జీవితాలతో చెలగాటం

నీట్‌లో మంచి ర్యాంకులు సాధించి కౌన్సెలింగ్‌ ద్వారా ఈ కాలేజీలను ఎంచుకుని చేరిన విద్యార్థుల జీవితాలతో ఎన్‌ఎంసీ చెలగాటమాడుతోంది. ముందుగా వీటికి అనుమతి ఉందని కౌన్సెలింగ్‌ నిర్వహణకు, విద్యార్థులను చేర్చుకోవడానికి అనుమతించి తీరా ఆ ప్రక్రియ ముగిశాక అడ్మిషన్లు రద్దు చేయడంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఇందులో ఏమైనా రాజకీయ కోణం ఉందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. 
– ఒక వైద్యాధికారి

Published date : 31 May 2022 03:52PM

Photo Stories