RGUKT: ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే
ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్‌ను బాసర ట్రిపుల్ ఐటీ వైస్ చాన్స్‌లర్ వి.వెంకటరమణ మే24న ప్రకటించారు. జూన్ 1న నోటిఫికేషన్ విడుదల చేసి, 5వ తేదీ నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తుల సమర్పణకు జూన్ 19 చివరి తేదీగా నిర్ణయించారు. స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు జూన్ 24 చివరి తేదీ అని తెలిపారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం జూన్ 26న ఎంపికైన విద్యార్థుల జాబితాను ప్రకటిస్తామన్నారు.
చదవండి: బాసర ఆర్జీయూకేటీ డైరెక్టర్‌కు పేటెంట్
పారదర్శకంగా ప్రవేశాలు
అత్యంత పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు నిర్వహించనున్నట్లు వీసీ తెలిపారు. పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే ఈ ప్రవేశాలలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. విద్యార్థుల సౌకర్యం కోసం ఈసారి హెప్‌లైన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, సీట్లు పొందిన విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియను 15 నిమిషాల్లో పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశామని వివరించారు. మొదటి రెండు సంవత్సరాలు ఏడాదికి ఒకసారి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. గత ఏడాది 33 వేల దరఖాస్తులు వచ్చాయని, ఈసారి కూడా అదే స్థాయిలో దరఖాస్తులు రావచ్చని అంచనా వేస్తున్నామన్నారు.
చదవండి: RGUKT Admissions: ఆర్‌జీయూకేటీ బాసరలో మాస్టర్స్ ప్రోగ్రామ్
నిజామాబాద్ ఐటీ టవర్‌లో ఆర్జీయూకేటీ సెంటర్
విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వీసీ వెంకటరమణ చెప్పారు. వర్సిటీని పూర్తిగా ఆధునీకరించడంతో పాటు సౌకర్యాలు మెరుగుపరిచామన్నారు. మంత్రి కేటీఆర్ మార్గదర్శకాల మేరకు నిజామాబాద్ ఐటీ టవర్‌లో ఆర్జీయూకేటీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ సెంటర్ ఎంతగానో దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.