Skip to main content

Notebooks: నోట్‌బుక్స్‌ పంపిణీకి సిద్ధం

ready for distribution of notebooks in nirmal district telangana
  • నిర్మల్‌ జిల్లాలో మొత్తం నోట్‌బుక్‌లు 2,76,789 
  • 6 నుంచి ఇంటర్‌ విద్యార్థులకు ప్రయోజనం

నిర్మల్‌ఖిల్లా: రాష్ట్ర ప్రభుత్వం మనఊరు–మనబడి ద్వారా సర్కారు బడుల బలోపేతానికి కృషి చేస్తోంది. ఇప్పటికే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, పౌష్టికాహార మధ్యాహ్న భోజనం తదితర సౌకర్యాలు కల్పిస్తుండగా ఈ విద్యాసంవత్సరం ఉచిత నోట్‌బుక్స్‌ పంపిణీకి రంగం సిద్ధం చేసింది. ఈమేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. బడులు ప్రారంభమైన తొలివారంలో ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు వర్క్‌బుక్స్‌, 6 నుంచి ఇంటర్‌ వరకు తరగతుల వారీగా బుక్‌లు పంపిణీ చేయనుంది. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ, పంచాయతీరాజ్‌, కేజీబీవీ, గురుకులాలు తదితర ప్రభుత్వ విద్యాసంస్థలన్నింటిలో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు వర్క్‌బుక్స్‌, 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్‌లను అందించనున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్పవాల్లో భాగంగా ఈనెల 20 విద్యాదినోత్సవం నాటికి పంపిణీ చేయనున్నారు.

చ‌ద‌వండి: నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం.. తల్లిదండ్రుల్లో ఆందోళన

ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు
రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ, సమగ్ర శిక్ష సమన్వయంతో ఇప్పటికే ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. మన ఊరు–మనబడి ద్వారా బడుల రూపురేఖలు మారిపోయాయి. గతేడాది పదో తరగతి విద్యార్థుల కోసం సాయంత్రం స్టడీ అవర్స్‌ కోసం ఉచిత స్నాక్స్‌, రాగిజావా పంపిణీని చేపట్టింది. ఈ విద్యాసంవత్సరం జూన్‌ 20 నుంచి పూర్తిస్థాయిలో రాగిజావా అందజేయాలని సంకల్పించింది.

బడిబాటలో విద్యార్థుల నమోదు
ఈనెల 3 నుంచి ప్రారంభమైన ‘బడిబాట’లో భాగంగా ఉపాధ్యాయులు విద్యార్థుల ఇంటింటివెళ్లి ప్రభుత్వ బడుల్లో చేరాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. గడపగడపకూ తిరిగి ప్రభుత్వ బడుల్లో కల్పిస్తున్న సౌకర్యాలను వివరిస్తున్నారు. వారి పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు గణనీయంగా పెరుగుతోంది.

తరగతుల వారీగా...
ఆరు, ఏడో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఒక్కొక్కరికి 6 నోట్‌బుక్‌లు ఉచితంగా ఇవ్వనుండగా.. 8వ తరగతి వారికి ఏడు, 9, 10వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి 14 నోట్‌ బుక్‌లు పంపిణీ చేయనున్నారు. ఇంటర్‌ విద్యార్థులకు ఒక్కొక్కరికి 12 నోట్‌ బుక్‌లు, జిల్లా వ్యాప్తంగా 2,76,789 బుక్‌లు అందిచనున్నారు. జిల్లాకేంద్రం నుంచి ఆయా మండలాల ఎంఈవోలకు ఈ నోట్‌ బుక్స్‌ పంపిణీ కానుండగా.. మండలాల నుంచి ఆయా పాఠశాలలకు అవి చేరనున్నాయి. హెచ్‌ఎంలు వాటిని విద్యార్థులకు అందిస్తారని అధికారులు పేర్కొంటున్నారు.
విద్యార్థులకు బుక్స్‌ అందిస్తాం

చ‌ద‌వండి: Schools Reopening: జూన్ 17 వరకు ఒంటి పూటే

ఈ విద్యాసంవత్సరం నోట్‌ బుక్స్‌ పంపిణీకి ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని మండలాల వారీగా నోట్‌బుక్స్‌ పంపిణీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. అవి వచ్చిన వెంటనే విద్యార్థులకు అందజేస్తాం.
– డాక్టర్‌ రవీందర్‌రెడ్డి,
డీఈవో, నిర్మల్‌


నిర్మల్‌ జిల్లా వివరాలు..
(ప్రభుత్వ, పంచాయతీరాజ్‌, గురుకులాలు, మోడల్‌, కేజీబీవీలు, అర్బన్‌ స్కూళ్లు)
మండలం స్కూల్స్‌/కాలేజీలు నోట్‌ బుక్స్‌

బాసర - 20 6,573
భైంసా - 60 28,781
దస్తురాబాద్‌ - 15 7,351
దిలావార్‌పూర్‌ - 23 9,233
కడెం - 43 13,120
ఖానాపూర్‌ - 49 17,026
కుభీర్‌ - 67 14,594
కుంటాల - 28 15,663
లక్ష్మణచాంద - 32 17,059
లోకేశ్వరం - 37 12,394
మామడ - 40 18,444
ముధోల్‌ - 40 15,544
నర్సాపూర్‌(జి) - 22 9,986
నిర్మల్‌అర్బన్‌ - 42 30,690
నిర్మల్‌రూరల్‌ - 27 8,091
పెంబి - 19 4,925
సారంగపూర్‌ - 56 18,308
సోన్‌ - 23 12,623
తానూర్‌ - 44 16,384
మొత్తం - 687 2,76,789

Published date : 12 Jun 2023 06:01PM

Photo Stories