పరీక్షలకు పండుగలా సిద్ధం కావాలి.. భవిష్యత్తును నిర్ణయించుకొనే స్వేచ్ఛను పిల్లలకు ఇవ్వాలి..
పరీక్షలంటే భయం వద్దేవద్దని విద్యార్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్బోధించారు. పరీక్షలకు ఒక పండుగలా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పరీక్షలు రాయడం ఇదే మొదటిసారి కాదని, గతంలో ఎన్నో పరీక్షలను విజయవంతంగా ఎదుర్కొన్న అనుభవం విద్యార్థులకు ఉందని, ఒత్తిడికి లోను కావొద్దని సూచించారు. తాము నెరవేర్చుకోలేని కలలు, ఆకాంక్షలను పిల్లలపై బలవంతంగా రుద్దవద్దని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తును నిర్ణయించుకొనే స్వేచ్ఛను పిల్లలకు ఇవ్వాలన్నారు. ఏప్రిల్ 1న ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో కేంద్ర విద్యా శాఖకు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, లిటరసీ నిర్వహించిన ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముచ్చటించారు. నరేంద్ర మోదీ ఇంకా ఏం చెప్పారంటే..
- వాట్సాప్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలతో సమస్య ఏమీ లేదు. సమస్య మన మనసుల్లోనే ఉంది. ఆన్ లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా సరే చదువుపై మనసు పూర్తిగా లగ్నం చేయాలి. అప్పుడు పరధ్యానానికి తావుండదు.
- చదువు నేర్చుకోవానికి అందుబాటులోకి వస్తున్న నూతన మార్గాలను ఒక అవకాశంగానే భావించాలి తప్ప సవాలు అనుకోకూడదు.
- విద్యార్థులు అప్పుడప్పుడు ఇన్ లైన్ లోకి (వారితో వారే గడపాలి) వెళ్లాలి. ఆన్ లైన్ లేదా ఆఫ్‌లైన్ లో గడపడానికి దూరంగా ఉండాలి.
- విద్యార్థులతో మాట్లాడుతున్నప్పుడు నా వయసు 50 ఏళ్లు తగ్గిపోయినట్లుగా అనిపిస్తోంది. ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమం నాకు ఎంతగానో తోడ్పడుతోంది.
- కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ విద్యా విధానాన్ని (ఎన్ ఈపీ) దేశంలో అన్ని వర్గాలు మనస్ఫూర్తిగా స్వాగతిస్తుండడం సంతోషకరం.
- నచ్చిన సబ్జెక్టులను అభ్యసించే అవకాశం ఎన్ ఈపీలో ఉంది. సరిగ్గా అమలు చేస్తే భవ్యమైన భవితకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి.
- పోటీని చూసి బెంబేలెత్తిపోవాల్సిన పని లేదు. దాన్ని జీవితంలో అతిపెద్ద బహుమతిగా భావించాలి. పోటీని ఆహ్వానించాలి. అప్పుడే మనం పరీక్షకు గురవుతాం. సామర్థ్యం బయటపడుతుంది. యువతరం ఎదుట ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అందుకు గర్వపడాలి.
- ‘పీ3 (ప్రో ప్లానెట్ పీపుల్) ఉద్యమ’ అవసరం ఎంతైనా ఉంది. ‘యూజ్ అండ్ త్రో’ సంస్కృతిని వదిలించుకోవాలి.
చదవండి:
ఇకపై డిగ్రీ నాలుగేళ్లు.. ఈ రూల్స్ పాటించాల్సిందే..
విద్యార్థుల మేధాశక్తిని పెంపొందించే దిశగా..
81 ఏళ్ల వయసులో పీజీ.. ఇప్పటికే.. !
బాలికల ప్రతిభను గుర్తించకపోతే ప్రగతే లేదు
కుమారులతోపాటు కుమార్తెలను సమానంగా చూడాలని ప్రధాని మోదీ చెప్పారు. ఇరువురి మధ్య భేదభావం చూపొద్దని కోరారు. ఇద్దరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నారు. బాలికల ప్రతిభను గుర్తించని సమాజం ఎప్పటికీ ప్రగతి సాధించలేదని స్పష్టం చేశారు. పరీక్షా పే చర్చలో ఆయన మాట్లాడుతూ... గతంలో బాలబాలికల మధ్య వ్యత్యాసం చూపేవారని, ఇప్పుడు పరిస్థితి చాలావరకు మారిపోయిందని అన్నారు. కొత్తగా పాఠశాలల్లో చేరుతున్నవారిలో బాలల కంటే బాలికలే ఎక్కువ మంది ఉంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. ప్రతి కుటుంబానికి బాలికలు పెద్ద ఆస్తిగా, బలంగా మారుతున్నారని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో బాలికలు రాణిస్తున్నారని ఉద్ఘాటించారు. తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడానికి పెళ్లికి దూరంగా ఉన్న కుమార్తెలు ఎంతోమంది ఉన్నారని, అదే సమయంలో తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్చి, హాయిగా కాలం గడుపుతున్న కుమారులు కూడా ఉన్నారని మోదీ వ్యాఖ్యానించారు.