Degree Education: ఇకపై డిగ్రీ నాలుగేళ్లు.. ఈ రూల్స్ పాటించాల్సిందే..
2022–23 విద్యా సంవత్సరం నుంచే దీనిని ప్రారంభించేలా వర్సిటీ అకడమిక్ సెనేట్ కీలక నిర్ణయం తీసుకుంది. వర్సిటీ సమావేశ మందిరంలో మార్చి 29వ తేదీన(మంగళవారం) అకడమిక్ సెనేట్ సమావేశమైంది. వైస్ చాన్స్‌లర్ కేబీ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎం. రామిరెడ్డి, సీడీసీ డీన్ సుందరకృష్ణ పాటు కమిటీలో 32 మంది సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. 2021–22 సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాలను సభ్యుల ముందు ఉంచారు. అదే విధంగా 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ కార్యకలాపాలు, తదితర 50 అంశాలపై చర్చించి, సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. విద్యా పరంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
➤ నూతన విద్యా పాలసీకి అనుగుణంగా యూనివర్సిటీ అనుబంధ కాలేజీలన్నింటిలోనూ నాలుగేళ్ల డిగ్రీ కోర్సు అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మూడు ఏళ్లు పూర్తయ్యాక పదినెలల ఇంటర్న్‌షిప్ ఉండేలా సిలబస్‌ను రూపొందించనున్నారు. దీనిని 2022–23 విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని నిర్ణయించారు.
➤ డిగ్రీ కోర్సులన్నీ ఇంగ్లిష్ మీడియంలో బోధన, పరీక్షల నిర్వహణకు నిర్ణయించారు.
➤ డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయిలో పరీక్షల నిర్వహణలకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించారు.
➤ కాలేజీల్లో నాణ్యమైన విద్యాబోధన చేపట్టేలా అన్ని చర్యలు తీసుకునేలా పర్యవేక్షణ పెంచనున్నారు.
➤ నాలుగేళ్ల డిగ్రీతో బయటకు వచ్చే ప్రతి విద్యార్థి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను తప్పనిసరిగా పొందేలా బోధనకు ప్రాధాన్యం ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సెనేట్ సభ్యులు సూచించారు.
➤ అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ జయశంకర్ ప్రసాద్ సమన్వయకర్తగా వ్యవహరించగా, రిజిస్ట్రార్ డాక్టర్ ఎం. రామిరెడ్డి సెనేట్ అజెండా, వర్సిటీలో నూతన విద్యా విధానం అమలు తీసుకుంటున్న చర్యలపై వివరించారు.