Skip to main content

Department of Higher Education: ఉన్నత విద్యలో 'గేమ్‌ చేంజర్‌'

సాక్షి, అమరావతి: ఉన్నత విద్యారంగంలో మరో విప్లవాత్మక మార్పునకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
Department of Higher Education
ఉన్నత విద్యలో 'గేమ్‌ చేంజర్‌'

పేద, మధ్య తరగతి విద్యార్థులకు సైతం ప్రపంచ స్థాయి కోర్సులను అందించేందుకు మార్గం సుగమం చేసింది. హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్‌­ఫర్డ్, కేంబ్రిడ్జి సహా ఇతర ప్రపంచ అత్యుత్తమ వర్సి­టీల సర్టిఫికేషన్‌ పొందేలా ప్రముఖ మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్‌’తో అవగా­హన ఒప్పందం కుదుర్చుకుంది. ఆగ‌స్టు 17న‌ క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఎడెక్స్‌ వ్యవస్థాపకుడు, సీఈవో, పద్మశ్రీ అవార్డు గ్రహీత అనంత్‌ అగర్వాల్, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జె.శ్యామలరావు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు రూపొందించిన ఎడెక్స్‌ ఆన్‌లైన్‌ కోర్సులతో రాష్ట్ర వర్సిటీ కోర్సులను మిళితం చేసి ఉత్తమ విద్య అందించేలా రోడ్‌ మ్యాప్‌ రూపొందించనున్నారు. ఎడెక్స్‌ ఒప్పందాన్ని ఉన్నత విద్యలో గేమ్‌ ఛేంజర్‌గా ముఖ్యమంత్రి జగన్‌ అభివర్ణించారు. ప్రపంచంలో అనూహ్యంగా మారుతున్న శాస్త్ర, సాంకేతిక రంగాలతోపాటు సామాజిక, సాంఘిక శాస్త్రాలకు సంబంధించి వివిధ రకాల సబ్జెక్టులను ఉచితంగా నేర్చుకునే అవకాశం మన విద్యార్థులకు దక్కుతుందన్నారు. విదేశాలకు వెళ్లి చదువుకోలేని ఎంతో మంది విద్యార్థులకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన వర్సిటీలు రూపొందించిన కోర్సులను సులభంగా నేర్చుకునే అవకాశం లభిస్తుందన్నారు. సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

చదవండి: JNVST 2024: ఈ చాన్స్ మిస్ చేసుకోకండి... మీరు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారా..?

మెరుగైన ఉపాధి, ఉద్యోగాలు

రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న ప్రతి విద్యార్థికి అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను ఉచితంగా నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నాం. ఈ కోర్సులు చేసిన విద్యార్థులకు హార్వర్డ్, ఎంఐటీ, కేంబ్రిడ్జి, ఆక్స్‌ఫర్డ్‌ వంటి వర్సిటీలతో ఎడెక్స్‌ సంయుక్త సర్టిఫికేషన్‌ లభిస్తుంది. ఇది మన విద్యార్థుల ఉపాధి, ఉద్యోగ అవకాశాలను మరింత మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా దేశంలో అందుబాటులో లేని ఎన్నో కోర్సులను ఎడెక్స్‌ అందిస్తుంది. వివిధ కోర్సులకు సంబంధించి అందుబాటులో లేని బోధనా సిబ్బంది కొరతను దీని ద్వారా అధిగమించవచ్చు.

ఇంజనీరింగ్, మెడిసిన్‌ లాంటి కోర్సులతో పాటు ఆర్ట్స్, కామర్స్‌లో పలు రకాల సబ్జెక్టులకు చెందిన కోర్సులను ఎడెక్స్‌తో ఒప్పందం ద్వారా అందుబాటులోకి తెస్తున్నాం. ఇది ఉన్నత విద్యలో గొప్ప మార్పులకు దారితీస్తుంది. ఈ క్రమంలో ఉన్నత విద్య సిలబస్‌ను పూర్తిస్థాయిలో పునఃపరిశీలన చేసి అన్ని విభాగాల్లోని కోర్సులను రీ డిజైన్‌ చేయాలి. ఆధునికతను అందిపుచ్చుకుంటూ నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా కోర్సులను తీర్చిదిద్దాలి. కోర్సుల్లో ఎక్కువ వర్టికల్స్‌ పెట్టాలి. తద్వారా విద్యార్థి తనకు కావాల్సిన వర్టికల్‌ను చదువుకునే అవకాశం ఇవ్వాలి. ఇప్పుడున్న ప్రతి కోర్సునూ, అందులో ఉన్న సబ్జెక్టులను పూర్తిగా మార్పు చేయాలి. ఇందుకోసం ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేద్దాం.  

చదవండి: Govt Degree College: డిగ్రీ కాంట్రాక్ట్‌ అధ్యాపకులకు Good News

సీఎం జగన్‌ విజన్‌ గొప్పది 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజన్‌ చాలా గొప్పది. విదేశాలకు వెళ్లి చదువుకోలేని పేద విద్యార్థుల కోసం ప్రపంచం మెచ్చిన అత్యుత్తమ వర్సిటీల నుంచి ఉత్తమ కోర్సులను, నిపుణులైన అధ్యాపకులతో బోధన అందించాలని తపిస్తున్నారు. టెక్నాలజీతో కూడిన విద్య అందించడం ద్వారానే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని దూరదృష్టితో గుర్తించారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికీ ప్రపంచ స్థాయి విద్య అందించాలనే సంకల్పంతో ఎడెక్స్‌ను ఆహ్వానించారు.

ఈ ఒప్పందం ద్వారా ఏపీ విద్యార్థులు దాదాపు వెయ్యికి పైగా కోర్సులను ఆర్ట్స్, కంప్యూటర్‌ సైన్స్, ఆర్టిఫిషీయల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌లెర్నింగ్, లా, సైకాలజీ, బయాలజీ, మెడిసిన్‌ లాంటి అనేక విభాగాల్లో చదువుకోవచ్చు. ఆధునికతకు తగ్గట్టుగా పాఠ్యాంశాల రూపకల్పన, కొత్త సాంకేతిక నిపుణులను సృష్టించడం, ఇప్పటికే ఉన్న కోర్సుల పునరుద్ధరణ, రీ స్కిల్లింగ్, అప్‌ స్కిల్లింగ్‌ తదితర అంశాలపై ఏపీతో కలసి పనిచేస్తాం. ఎడెక్స్‌ ద్వారా టాప్‌ వర్సిటీల్లో కోర్సులు పూర్తి చేసిన వారికి సర్టిఫికేషన్‌ లభిస్తుంది. 
– అనంత్‌ అగర్వాల్, ఎడెక్స్‌ వ్యవస్థాపకుడు  

టాప్‌ ఈ–లెర్నింగ్‌ ప్లాట్‌ ఫారమ్‌..

‘ఎడెక్స్‌’ ప్రపంచంలో ప్రముఖ ఈ–లెర్నింగ్‌ ప్లాట్‌ ఫారమ్‌. ఇది 170కిపైగా టాప్‌ ర్యాంకింగ్‌ విద్యా సంస్థల నుంచి ఆన్‌లైన్‌ కోర్సులను అందిస్తోంది. ఇందులో 37 టాప్‌ 50 విశ్వవిద్యాలయాలున్నాయి. ప్రపంచంలోనే టాప్‌–4 వర్సిటీలైన ఎంఐటీ, హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్‌ కూడా ఉన్నాయి. ఎడెక్స్‌ ఓపెన్‌ సోర్స్‌ ప్లాట్‌ ఫారమ్‌ను మన రాష్ట్ర విద్యార్థులు ఉచితంగా ఉపయోగించుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈమేరకు ఉన్నత విద్యాశాఖతో కలసి ఎడెక్స్‌ పని చేస్తుంది. 

నైపుణ్యంతో రాణించేలా.. 

విద్యార్థులు గ్లోబల్‌ స్టూడెంట్‌గా ఎదిగేందుకు ప్రపంచంలో చోటు చేసుకుంటున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా సిద్ధం చేయాలి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్, డేటా మైనింగ్, డేటా అనలిటిక్స్, వర్చువల్‌ రియాలిటీ, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్, క్వాంటం కంప్యూటింగ్‌ లాంటివి ప్రస్తుతం ప్రపంచంలో అభివృద్ధి చెందిన టెక్నాలజీ. ఈ మొత్తం సబ్జెక్టు నేర్చుకోవాలంటే బోధనా విధానంతో పాటు అందుబాటులో ఉన్న కంటెంట్‌ను మెరుగుపరచాలి.

ప్రపంచంలో అత్యున్నత స్థాయి విశ్వవిద్యాలయాలు / సంస్థలకు చెందిన అత్యుత్తమ అధ్యాపకులతో మన విద్యార్థులకు బోధించేలా ఎడెక్స్‌తో ఒప్పందం దోహదం చేస్తుంది. టీచింగ్, లెర్నింగ్‌ కోసం కొత్త టెక్నాలజీ, బోధనా విధానాలను ఎడెక్స్, ఏపీ ఉన్నత విద్యాశాఖ సంయుక్తంగా రూపొందించనున్నాయి. విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అవసరమైన శిక్షణ, అభ్యాసన నైపుణ్యాలను అందించడంలో ఎడెక్స్‌ సహకరిస్తుంది. ప్రొఫెషనల్, సంప్రదాయ డిగ్రీ విద్యలో లోటుపాట్లను గుర్తించి స్కిల్‌ ఓరియంటెడ్‌ కోర్సులను అందించడం ద్వారా నైపుణ్యం కలిగిన మానవ వనరులను సమకూరుస్తుంది.

చదువుల్లో సమూల సంస్కరణలు..

విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసి కార్పొరేట్‌ స్థాయి చదువులను పేద విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. జగనన్న విద్యా దీవెన (తల్లుల ఖాతాలకు 100 శాతం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌), జగనన్న వసతి దీవెన (రూ.20 వేల వరకు హాస్టల్, బోర్డింగ్‌ ఖర్చుల కోసం), జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాల ద్వారా పోస్ట్‌ మెట్రిక్‌ స్థాయి చదువులకు అడుగడుగునా అండగా నిలుస్తున్నారు.

విదేశీ విద్యా దీవెన ద్వారా క్యూఎస్‌/టైమ్స్‌ ర్యాంకింగ్‌లో టాప్‌ 50 విద్యా సంస్థల్లో సీట్లు పొందిన విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఆన్‌లైన్‌ వర్టికల్స్, తప్పనిసరి ఇంటర్న్‌షిప్‌లు, నాలుగేళ్ల డిగ్రీ, జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సులను ప్రవేశపెట్టడం ద్వారా పాఠ్య ప్రణాళికలో సమూల మార్పులు తెచ్చారు. ఈ క్రమంలో ఎడెక్స్‌తో సరికొత్త విద్యా విప్లవాన్ని ప్రారంభించారు. 

మన విద్యార్థులకు ప్రయోజనం ఇలా..

రాష్ట్ర ప్రభుత్వం ఎడెక్స్‌ సంస్థతో చేసుకున్న ఒప్పందం ద్వారా లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్, ఎంఐటీ, హార్వర్డ్‌ లాంటి అత్యున్నత స్థాయి సంస్థలు అందించే పలు కోర్సులను ఆన్‌లైన్‌లో అభ్యసించే అవకాశం మన విద్యార్ధులకు లభిస్తుంది. ఈ సంస్థలు అందించే సర్టిఫికెట్లు, క్రెడిట్ల ద్వారా మన విద్యార్ధులకు మంచి వేతనాలతో కూడిన ఉన్నత ఉద్యోగాలు దక్కుతాయి. విద్యార్ధులు తాము ఎంపిక చేసుకున్న మేజర్‌ కోర్సులతో పాటు మైనర్‌ కోర్సులుగా వీటిని అమలు చేయనున్నారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా ఉన్నత విద్యాసంస్థల్లో పలు కోర్సులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సంస్కరించి పైథాన్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ లాంటివి సిలబస్‌లో చేర్చింది. ఈమేరకు కరిక్యులమ్‌ సిద్ధమైనా బోధనా సిబ్బంది తగినంతగా అందుబాటులో లేనందున విద్యార్ధులకు పూర్తి స్థాయిలో ప్రయోజనం అందడం లేదు.

ఈ నేపథ్యంలో ఎడెక్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా మన విద్యార్ధులు వరల్డ్‌క్లాస్‌ వర్సిటీలు, ఇతర విద్యా సంస్థలు అందించే కోర్సులను రెగ్యులర్‌ కోర్సులతో పాటుగా అభ్యసించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మేజర్‌ కోర్సుల సర్టిఫికెట్లు, క్రెడిట్లతోపాటు ఎడెక్స్‌ ద్వారా అంతర్జాతీయ విద్యాసంస్థల నుంచి మైనర్‌ కోర్సుల సర్టిఫికెట్లు, క్రెడిట్లు కూడా విద్యార్ధుల ఖాతాలో జమ కానున్నాయి. తద్వారా చదువులు పూర్తైన అనంతరం అవకాశాలను గరిష్టంగా అందుకోగలుగుతారు.

Published date : 18 Aug 2023 03:41PM

Photo Stories