SFI: విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు వెనక్కి తీసుకోవాలి
జూలై 31న తెయూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మినీ సెమినార్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వర్సిటీ అధ్యక్ష, కార్యదర్శులు లవిశెట్టి ప్రసాద్, కె శ్రీశైలం మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు బయటకు తెలుస్తాయనే భయంతోనే ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఇలాంటి ఆదేశాలు జారీ చేశారని విమర్శించారు.
విద్యా సంవత్సరం ప్రారంభమై 50 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు విద్యార్థులకు యూనిఫామ్స్ ఇవ్వలేదన్నారు. పాఠశాలల్లో వసతుల కల్పన కోసం మన ఊరు– మన బడి పథకం కింద మంజూరు చేసిన నిధులు కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి ఉపయోగపడ్డాయని విమర్శించారు. వెంకటేష్, సంధ్యారెడ్డి, నవీన్, చిత్ర, దినేష్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: School Students: ఉపాధ్యాయుల కొరత తీర్చాలని ఆందోళన
స్కూళ్లలో సంఘాలకు నో ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: ఇకపై ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలోకి కూడా విద్యార్థి సంఘాలు అడుగుపెట్టడం కష్టమే. ఏ విద్యార్థి సంఘాన్ని అనుమతించవద్దంటూ డీఈఓలకు పాఠశాల విద్య డైరెక్టర్ సర్క్యులర్ జారీ చేశారు. ఏదైనా పాఠశాలలోకి ఏ విద్యార్థి సంఘం నాయకుడైనా వచ్చినట్టు రుజువైతే దానికి ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆ సర్క్యులర్‌లో పేర్కొంది. ఒకవేళ విద్యార్థిసంఘం నేతలు స్కూలుకు వస్తే హెచ్‌ఎంపై కఠినచర్యలూ తప్పవని హెచ్చరించింది.
ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులతో పాఠశాలవిద్య డైరెక్టర్ దేవసేన ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థి సంఘాలను కట్టడి చేయడమే లక్ష్యంగా ఈ కాన్ఫరెన్స్ జరిగినట్టు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో విద్యాసంస్థలు కేంద్రంగా ఎలాంటి వ్యతిరేకత రాకుండా చూడాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకే పాఠశాలవిద్య డైరెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖవర్గాలు చెబుతున్నాయి.
చదవండి: Teachers Association: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలకు ఈ నిబంధన వర్తిస్తుందని ఆమె తెలిపినట్టు డీఈఓలు చెబుతున్నారు. స్వచ్ఛంద సంస్థలు, పార్టీలు, సంఘాలు, వ్యక్తులు, విద్యా సంఘాలు ఎవరైనా సరే ముందుగా డీఈఓ అనుమతి తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. దీనిపై విద్యార్థి సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇది అప్రజాస్వామికమని, విద్యార్థి సమస్యలపై నినదించే హక్కు తీసివేయడం తగదంటున్నాయి.