లింగంపేట(ఎల్లారెడ్డి): భవానిపేట హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీర్చాలని కోరుతూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
ఉపాధ్యాయుల కొరత తీర్చాలని ఆందోళన
జూలై 31న పాఠశాలకు తాళం వేసిన విద్యార్థులు కామారెడ్డికి తమ తల్లిదండ్రులు, గ్రామస్తులతో కలిసి తరలివెళ్లారు. కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడారు. పాఠశాలలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు 75 మంది విద్యార్థులు ఉండగా ఒకే ఉపాధ్యాయురాలు పనిచేస్తోందని తెలిపారు.
ఒక్కరే విద్యా బోధన చేయలేకపోవడంతో విద్యార్థులు తమ విలువైన చదువులు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డీఈవో రాజుకు వినతిపత్రం అందజేసి సమస్య వివరించినట్లు తెలిపారు. డీఈవో సానుకూలంగా స్పందించి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించడంతో ఆందోళన విరమించారు.