Skip to main content

IIIT: కౌన్సెలింగ్ తేదీలివే..

రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్‌జీయూకేటీ–ట్రిపుల్‌ ఐటీలు)లో ప్రవేశాలకు ఈసారి ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులే ఎక్కువమంది ఎంపికయ్యారు. సీట్లు సాధించిన వారిలో 76.97 శాతం మంది వీరే.
AP IIIT Counseling Dates
ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్ తేదీలివే..

ఇందులో బాలికల శాతం 66.04. టాప్‌–3 ర్యాంకులు సాధించిన వారు కూడా ప్రభుత్వ విద్యార్థులే కావడం విశేషం. రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో ఎంట్రన్స్‌ ఫలితాలను సెప్టెంబర్‌ 29న విజయవాడలోని ఆర్జీయూకేటీ చాన్సలర్‌ కేసీ రెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డితో కలిసి ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. 

చదవండి: RGUKT: ట్రిపుల్‌ ఐటీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల

టాప్‌–3 జెడ్పీ విద్యార్థులే.. 

ప్రకాశం జిల్లా సింగరాయకొండ జెడ్పీ పాఠశాలకు చెందిన జల్లెల నందిని మయూరి ఓపెన్‌ కేటగిరీలో ప్రథమ ర్యాంకు, శ్రీకాకుళం జిల్లా టెక్కలి జెడ్పీ పాఠశాలకు చెందిన చక్రపాణి బెహర రెండో ర్యాంకు, గుంటూరు జిల్లా మున్నంగి జెడ్పీ పాఠశాలకు చెందిన సోమిశెట్టి ఫణీంద్ర రామకృష్ణ మూడో ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ విద్యార్థులకు రాష్ట్రంలోని నాలుగు ఐఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తున్నామని, 600 మార్కులకు గాను అన్ని క్యాంపస్‌లలో 93 నుంచి 95 శాతం మార్కులను కేటగిరీల వారీగా కటాఫ్‌గా నిర్ణయించామని వెల్లడించారు. ఈ ఏడాది నుంచి రాష్ట్రంలోని నాలుగు క్యాంపస్‌ల్లోను కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు బొత్స వెల్లడించారు. 

చదవండి: JOSSA: జోసా సీట్ల కేటాయింపు తేదీ ఇదే..

విద్యా రంగానికి ఎంతైనా ఖర్చుచేస్తాం 

మన విద్యార్థులను ప్రపంచస్థాయి నిపుణులుగా తీర్చిదిద్దాలని సీఎం వైఎస్‌ జగన్‌ సంకల్పించారని మంత్రి తెలిపారు. అందుకనుగుణంగా ఐఐఐటీల అభివృద్ధికి, వాటిల్లో వసతులు, ప్రమాణాల పెంపునకు ప్రభుత్వం తరఫున ఎంతైనా ఖర్చుపెట్టేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారన్నారు. ఏటా ఎస్టీ కేటగిరీలో సీట్లు మిగులుతుండడంతో వాటిని ఎస్సీ కేటగిరీకి మార్చేవారమని, అయితే.. ఈసారి ఎస్టీ కేటగిరీలో అభ్యర్థుల సంఖ్య పెరగడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. న్యాయస్థానం సూచనల మేరకు ప్రస్తుతం రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చదివే విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సంకల్పంతో 2008లో ట్రిపుల్‌ ఐటీని నెలకొల్పారని, దీనిని ఆయన తన మానసపుత్రికగా భావించారన్నారు. ప్రస్తుతం ఒక్కో క్యాంపస్‌లో 1,100 సీట్ల చొప్పున మొత్తం 4,400 సీట్లు ఉన్నాయన్నారు. వీటిలో ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ కింద 400 సీట్లు ఉన్నాయని, తద్వారా ప్రతిభ ఉండి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులు కూడా వీటిల్లో చదువుకునే అవకాశం దక్కిందని మంత్రి బొత్స వివరించారు. విద్యా రంగంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమయ్యాయని ఆర్జీయూకేటీ చాన్సలర్‌ కేసీ రెడ్డి తెలిపారు. ఇప్పటిదాకా తమ విద్యార్థులకు 93 శాతం ప్లేస్‌మెంట్స్‌ కల్పించామని, వీటిని మరింత పెంచేందుకు ప్రమాణాలను మెరుగుపరుస్తున్నట్లు ఆయన చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా వారిని తీర్చిదిద్దేందుకు ల్యాప్‌టాప్, యూనిఫారతో సహా అన్ని వసతులను ఉచితంగా కల్పిస్తున్నట్లు కేసీ రెడ్డి చెప్పారు. 

చదవండి: AP RGUKT IIIT notification 2022-2023: పదో తరగతితోనే.. బీటెక్‌

కౌన్సెలింగ్‌ తేదీలివే.. 

అక్టోబర్‌ 12, 13 తేదీల్లో నూజివీడు, ఇడుపులపాయ క్యాంపస్‌లలో, 14, 15 తేదీల్లో ఒంగోలు క్యాంపస్‌వి ఇడుపులపాయలో, 15, 16 తేదీల్లో ఎచ్చెర్ల క్యాంపస్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించి, అక్టోబర్‌ 17 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఆర్జీయూకేటీ చాన్సలర్‌ కేసీ రెడ్డి తెలిపారు. అభ్యర్థుల మెరిట్‌ లిస్ట్‌ను https://rgukt.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని చెప్పారు. ఐఐఐటీ క్యాంపస్‌ల డైరెక్టర్లు ప్రొఫెసర్‌ జీవీఆర్‌ శ్రీనివాసరావు, ప్రొఫెసర్‌ బి. జయరామిరెడ్డి, ప్రొఫెసర్‌ పి. జగదీశ్వర్‌రావు, అడ్మిషన్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గోపాలరాజు పాల్గొన్నారు. 

Published date : 01 Oct 2022 01:50PM

Photo Stories