Skip to main content

SVPNPA Director Amit Garg : వీటిపై పట్టు ఉంటేనే.. 'ఐపీఎస్' విధి నిర్వహణ పక్కాగా ఉంటుంది..

సాక్షి ఎడ్యుకేష‌న్ : సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీసు అకాడమీలో (ఎస్‌వీపీఎన్‌పీఏ) ఐపీఎస్‌ ట్రైనీలకు ఇచ్చే శిక్షణలో ప్రవర్తనకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు డైరెక్టర్‌ అమిత్‌ గార్గ్‌ చెప్పారు.
SVPNPA Director Amit Garg News in Telugu
SVPNPA Director Amit Garg

ఇందులోభాగంగా ఈ ఏడాది నుంచి ప్రవర్తన, నైతిక‌ విలువలు, మానవ హక్కులు అనే కొత్త పాఠ్యాంశాన్ని చేర్చామన్నారు. అకాడమీలో తొలి దశ శిక్షణ పూర్తి చేసుకున్న 75వ రెగ్యులర్‌ రిక్రూటీస్‌ (ఆర్‌ఆర్‌) బ్యాచ్‌ పాసింగ్‌ ఔట్‌ పరేడ్ అక్టోబ‌ర్ 27వ తేదీన (శుక్రవారం) జరగనుందని, దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హాజరవుతారని తెలిపారు. 

ఇది 75వ బ్యాచ్‌ కావడంతో..
అకాడమీలో శిక్షణ పొందిన వాటిలో ఇది 75వ బ్యాచ్‌ కావడంతో ‘అమృత్‌కాల్‌ బ్యాచ్‌’గా పరిగణిస్తూ ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అక్టోబ‌ర్ 25వ తేదీన (బుధవారం) అకాడమీలో జాయింట్‌ డైరెక్టర్‌ ఎన్‌.మధుసూదన్‌రెడ్డితో కలిసి ఆయన వెల్లడించారు.

☛ UPSC Civils Topper Bhawna Garg Success Story : యూపీఎస్సీ సివిల్స్‌.. ఫ‌స్ట్‌ అటెమ్ట్.. ఫ‌స్ట్ ర్యాంక్‌.. నా స‌క్సెస్‌కు..

శిక్షణలో టాప‌ర్ ఈమే..
సమకాలీన అవసరాలకు తగ్గట్టు ట్రైనింగ్, పాఠ్యాంశాల్లో మార్పుచేర్పులు చేస్తున్నారు. ప్రవర్తనకు సంబంధించిన అంశాలతోపాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్, సైబర్‌ క్రైమ్‌ మాడ్యుల్‌ను కొత్తగా చేర్చారు. దేశంలోని ఒక్కో రాష్ట్ర పోలీసు విభాగం ఒక్కో అంశంలో ప్రత్యేకత కలిగి ఉంది. అవన్నీ సమ్మిళితం చేసి ట్రైనీలకు నేర్పిస్తున్నారు. కీలక, సంచలనాత్మక కేసుల్ని దర్యాప్తు చేసిన వారినే గెస్ట్‌ ఫ్యాకల్టిలుగా పిలిపించి వారి అనుభవాలను ట్రైనీలకు తెలియజేస్తున్నారు. శిక్షణలో అనుష్త కాలియా ఓవరాల్‌ టాపర్‌గా నిలిచారు. న‌వంబ‌ర్ 14వ తేదీ నుంచి 76వ బ్యాచ్‌ ట్రైనింగ్‌ మొదలు కానుంది.  

వీటిపై పట్టు ఉంటేనే భవిష్యత్తులో..

ips officer success story in telugu

సాధారణంగా ఐపీఎస్‌ అధికారులకు ఎఫ్‌ఐఆర్, పంచనామా సహా ఇతర రికార్డులు రాసే అవసరం, అవకాశం ఉండదు. అయితే వీటిపై పట్టు ఉంటేనే భవిష్యత్తులో వారి విధి నిర్వహణ పక్కాగా ఉంటుంది. దీంతో వారితోనే కొన్ని చార్జ్‌షీట్లు తయారు చేయిస్తున్నారు. న్యాయవాదులు, రిటైర్డ్‌ న్యాయమూర్తులతో మాక్‌ కోర్టులు నిర్వహిస్తూ విచారణ చేయించి రికార్డుల్లోని లోపాలు వారికి తెలిసేలా చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచి.. ఐపీఎస్‌లు వీరే..
ప్రస్తుతం శిక్షణ పూర్తి చేసుకున్న 75వ బ్యాచ్‌లో 155 మంది (2021, 2022 బ్యాచ్‌ల ఐపీఎస్‌లు) ఉన్నారు. వీళ్లు శిక్షణలోనే కర్ణాటక ఎన్నికలు, హైదరాబాద్‌లో గణేశ్‌ ఉత్సవాలు తదితర బందోబస్తుల్లో పాల్గొన్నారు. రైతు చట్టాలకు వ్యతిరేక ఉద్యమం జరుగుతున్నప్పుడు పంజాబ్‌లో ప్రధాని మోదీ కాన్వాయ్‌ను అడ్డుకోవడం, ఆయన సెక్యూరిటీలో తలెత్తిన లోపాలను ఓ కేస్‌స్టడీగా పరిచయం చేశారు. ఇప్పుడు శిక్షణ పొందిన వారిలో తెలంగాణకు 14 (మహిళలు–5, పురుషులు–9) మంది, ఏపీకి 15 (మహిళలు–5, పురుషులు–10) మందిని కేటాయించారు.

➤ UPSC Civils Ranker Success Story : నేను చిన్న వ‌య‌స్సులో.. తొలి ప్ర‌యత్నంలోనే సివిల్స్‌ కొట్టానిలా.. నా స‌క్సెస్ సీక్రెట్ ఇదే..

చివరి ప్రయత్నంలో ఐపీఎస్‌..
అల్వాల్‌ మా స్వస్థలం. బీ ఫార్మసీ, ఎంబీఏ పూర్తి చేశా. తండ్రి రిటైర్డ్‌ జడ్జి. ఆయనకు ఇచ్చిన మాట కోసమే ఐపీఎస్‌ కావాలనుకున్నా. 2016లో 10 మార్కులు తక్కువ రావడంతో ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యా. బెంగళూరు, గోవాల్లో ఆదాయపు పన్ను శాఖలో ఐదేళ్ల పాటు పని చేశా. 2021లో చివరి ప్రయత్నంలో 155వ ర్యాంక్‌తో ఐపీఎస్‌ సాధించా. తెలంగాణ కేడర్‌కే అలాట్‌ కావడం సంతోషంగా ఉంది.    – ఎస్‌.చిత్తరంజన్, ఐపీఎస్‌ ట్రైనీ  

నా తొలి లక్ష్యం ఇదే.. 
మాది మహారాష్ట్ర. ముంబైలోని ఐసీటీ నుంచి కెమికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశా. తండ్రి అక్కడే ఏఎస్సై, మేనమామ హెడ్‌–కానిస్టేబుల్‌. వీరి ప్రోద్బలంతోనే పోలీసు కావాలనుకున్నా. రెండో ప్రయత్నంలో ఐపీఎస్‌ వచ్చింది. తెలంగాణ కేడర్‌కు అలాట్‌ అయ్యా. అందుకే తెలుగు నేర్చుకోవడమే నా తొలి లక్ష్యం. అప్పుడే ఇక్కడి ప్రజలతో మమేకం కాగలం.  – చేతన్‌ పందేరి, ఐపీఎస్‌ ట్రైనీ 

155 మంది ఐపీఎస్‌ ట్రైనీల్లో 32 మంది మహిళలే..

women ips success story in telugu

మ‌హిళలు అన్ని రంగాల్లో పురుషుల‌తో స‌మానం దూసుకుపోతున్నారు. చిన్న స్థాయిలో ఉద్యోగం నుంచి పెద్ద స్థాయి ఉద్యోగం వ‌ర‌కు పురుషుల‌తో వీరు స‌మానంగా పోటీప‌డుతున్నారు. తాజాగా హైదరాబాద్‌ శివార్లలోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీసు అకాడెమీలో (ఎస్‌వీపీఎన్పీఏ) శిక్షణ పూర్తి చేసుకున్న 155 మంది ఐపీఎస్‌ ట్రైనీల్లో 32 మంది మహిళలే ఉన్నారు. అన్ని విభాగాల్లోనూ తన సత్తా చాటి ఓవరాల్‌ టాపర్‌గా నిలిచిన అనుష్త కాలీయా అక్టోబ‌ర్ 27వ తేదీన (శుక్రవారం) జరిగే పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌కు (పీఓపీ) నేతృత్వం వహించనున్నారు. ఇలా ఓ మహిళ ట్రైనీ పీఓపీకి నేతృత్వం వహించడం 75 ఏళ్ళ అకాడెమీ చరిత్రలో ఇది మూడోసారి. ప్రొబేషనరీ మ‌హిళ‌ ఐపీఎస్‌ అధికారుల స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం..

ఢిల్లీకి చెందిన అనుష్త కాలియా ఢిల్లీ యూనివర్శిటీలోని క్లస్టర్‌ ఇన్నోవేషన్  సెంటర్‌ నుంచి డేటా సైన్స్‌లో బీటెక్‌ పూర్తి చేశారు. అక్కడే బ్లింకిట్‌ అనే స్టార్టప్‌ సంస్థలో డేటా సైంటిస్ట్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలపై ఉన్న ఆసక్తితో ఆరునెలలకే ఈ ఉద్యోగం వదిలారు. కోవిడ్‌ ప్రభావంతో కోచింగ్‌ సెంటర్లకు బదులు ఆన్ లైన్  క్లాసులకు పరిమితం అయ్యారు.లాక్‌డౌన్  కారణంగా ఇతరుల్ని కలవడం తగ్గిపోవడంతో దాన్ని పాజిటివ్‌గా వాడుకుని చదువుకే పరిమితం అయ్యారు. 

మొద‌టి ప్ర‌య‌త్నంలోనే..
మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్సీ సివిల్స్‌లో 143వ ర్యాంకు సాధించారు. స్కూలు, కాలేజీ రోజుల్లో బ్యాడ్మింటన్, కరాటే పోటీల్లో పాల్గొన్నారు. అయినప్పటికీ ఎన్ పీఏలో అడుగు పెట్టే సమయానికి గంటకు కిలోమీటరు దూరం కూడా పరిగెత్తలేని స్థితిలో ఉన్నారు. ఇక్కడి శిక్షణ కారణంగా ప్రస్తుతం గంటకు 16 కిమీ పరిగెత్తే సామర్థ్యాన్ని సాధించారు. ఈ బ్యాచ్‌లో ఓవరాల్‌ టాపర్‌గా, ఔట్‌డోర్‌ టాపర్‌గానే కాకుండా పరేడ్‌ కమాండర్‌గా నిలిచే అవకాశంతోపాటు స్వార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌ సొంతం చేసుకున్నారు. ప్రజాసేవలో సాంకేతికతని వినియోగించాలన్నదే తన లక్ష్యమని చెప్తున్నారు.  ఎన్‌పీఏ శిక్షణలో ఎన్నో అంశాలు నేర్చుకున్నానని, గ్రేహౌండ్స్‌ ఆధ్వర్యంలో జరిగిన నెల రోజుల జంగిల్‌ ట్రైనింగ్‌ మాత్రం కఠినంగా అనిపించిందని చెప్పారు.

IAS Officer Success Story : ఈ క‌సితోనే.. ఎలాంటి కోచింగ్ లేకుండానే.. ఐఏఎస్ ఉద్యోగం కొట్టానిలా.. కానీ..

లాయ‌ర్ టూ ఐపీఎస్.. రెండో ప్రయత్నంలోనే..
ముంబైకి చెందిన ఇషా సింగ్‌ తండ్రి యోగేష్‌ ప్రతాప్‌ (వైపీ) సింగ్‌ ఐపీఎస్‌ అధికారి అయినప్పటికీ వీఆర్‌ఎస్‌ తీసుకుని న్యాయవాదిగా మారారు. తల్లి అభాసింగ్‌ సైతం న్యాయవాది. వైపీ సింగ్‌ మహారాష్ట్రలో కలకలం సృష్టించిన ఆదర్శ్‌ హౌసింగ్‌ సొసైటీ స్కామ్‌లో బాధితుల తరఫున న్యాయపోరాటం చేస్తున్నారు. 2018లో బెంగళూరులోని నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్శిటీ నుంచి ఇషా పట్టా పొందారు. 26వ ఏటనే పీపుల్స్‌ లాయర్‌గా పేరు తెచ్చుకున్నారు. 

చనిపోయిన వారి కోసం..
అక్కడి గొవాండీలో ఉన్న మౌర్య హౌసింగ్‌ సొసైటీలో 2019 డిసెంబర్‌ 3న జరిగి ఉదంతం ఇషా దృష్టికి వచ్చింది. అక్కడ సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేయడానికి ప్రయత్నించిన ముగ్గురు సఫాయీ కార్మికులు చనిపోయారు. చనిపోయిన వారి భార్యలకు న్యాయం చేయడం కోసం అసిస్టెన్స్‌ ఫర్‌ సఫాయీ కరమ్‌చారీ (ఆస్క్‌) స్థాపించారు. క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా నిధులు సమీకరించి అందించారు. ఇలా మరణించిన వారికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని 1993 నుంచి మహారాష్ట్ర లో నిబంధనలు ఉన్నా అమలు కాలేదు. దీనిపై ముంబై హైకోర్టులో 2021లో రిట్‌ దాఖలు చేసి వారి తరఫున పోరాడి వారికి పరిహారం ఇప్పించారు. ఈ కేసుపై అప్పటి జడ్జ్‌ ఉజ్వల్‌ భూయాన్ 1993 నుంచి ఇలా చనిపోయిన వారి జాబితా తయారీకి ఆదేశాలు జారీ చేశారు. తండ్రి చూపిన మార్గంలో ఐపీఎస్‌ కావాలని భావించిన ఇషా రూ.20 లక్షల ప్యాకేజీతో వచ్చిన ఉద్యోగం వదులుకుని రెండో ప్రయత్నంలో 191వ ర్యాంక్‌ సాధించింది.

UPSC Civils Ranker Suraj Tiwari : ఓ ప్ర‌మాదంలో కాళ్లు, చేయి కోల్పొయినా.. ఈ దైర్యంతోనే యూపీఎస్సీ సివిల్స్ కొట్టాడిలా..

యూట్యూబ్‌ చూసి యూపీఎస్సీ సివిల్స్ కొట్టానిలా..
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ సమీపంలో ఉన్న మావు పట్టణానికి చెందిన సిమ్రన్  భరద్వాజ్‌ ఢిల్లీ యూనివర్శిటీ నుంచి జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేశారు. తండ్రి ఆర్మీలో లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌గా పని చేస్తుండటంతో సాధారణంగానే యూనీఫామ్‌∙సర్వీసెస్‌పై మక్కువ ఏర్పడింది. తాను నివసించేది చిన్న పట్టణం కావడంతో పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి అవసరమైన కోచింగ్‌ సెంటర్ల వంటి సదుపాయాలు లేవు. దీనికి తోడు 2021 జూన్లో గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే సివిల్స్‌ పరీక్ష రాయాల్సి ఉంది. 

23 ఏళ్ళ వయస్సులోనే ఐపీఎస్‌..
కరోనా ప్రభావంతో కోచింగ్‌ సెంటర్లు అన్నీ మూతపడ్డాయి. దీంతో యూట్యూబ్‌ ఛానల్స్‌లో క్లాసులు వింటూ రోజుకు 8 నుంచి 10 గంటల పాటు సివిల్స్‌కు ప్రిపేర్‌ అయింది. మిగిలిన సమయం కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ (సీడీఎస్‌) పరీక్షకు వెచ్చించింది. కోవిడ్‌ కారణంగా వాయిదా పడిన ఈ రెండు పరీక్షలు 2021 అక్టోబర్‌లో జరిగాయి. మొదటి ప్రయత్నాల్లోనే సీడీఎస్‌లో ఆరో ర్యాంక్, సివిల్స్‌లో 172వ ర్యాంక్‌ సాధించింది. 23 ఏళ్ళ వయస్సులోనే ఐపీఎస్‌కు ఎంపికైంది. ఎలాంటి ఇతర యాక్టివిటీస్‌ లేని కోవిడ్‌ టైమ్‌ తనకు కలిసి వచ్చిందని సిమ్రన్  చెప్తున్నారు.

☛ ఇలాంటి మ‌రిన్ని స‌క్సెస్ స్టోరీల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

ఐఏఎస్‌ అనుకున్నా ఐపీఎస్ వ‌చ్చిందిలా.. కానీ..
వరంగల్‌కు చెందిన బి. చైతన్య రెడ్డి అక్కడి ఎన్‌ఐటీ నుంచి బీటెక్‌ పూర్తి చేశారు. తండ్రి గ్రూప్‌–1 ఆఫీసర్‌గా ఉండటంతో సివిల్‌ సర్వీసెస్‌పై మక్కువ ఏర్పడింది. సివిల్‌ సర్వెంట్స్‌గా ఉంటేనే ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం దక్కుతుందని అని తండ్రి చెప్పిన మాటలు ఆమెలో స్ఫూర్తి నింపాయి. ఇరిగేషన్  శాఖలో ఏఈగా పని చేస్తూనే ఐఏఎస్‌ కావాలనే లక్ష్యంతో సివిల్స్‌ వైపు మొగ్గారు. మెయిన్స్‌లో మూడుసార్లు అపజయం ఎదురైనా కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళారు. సివిల్స్‌తోపాటు కేంద్ర సాయుధ బలగాల్లో ఎంపికకు సంబంధించిన పరీక్షల్నీ రాశారు. దీంతో ఐఏఎస్‌ నుంచి దృష్టి ఐపీఎస్‌ వైపు మళ్ళింది. 2022లో 161వ ర్యాంక్‌ సాధించి తెలంగాణ క్యాడర్‌కు ఎంపికయ్యారు.

Published date : 26 Oct 2023 02:03PM

Photo Stories