Skip to main content

Chandana Deepti, IPS : ఈ ఘటనతోనే ఐపీఎస్ అవ్వాలనుకున్నా.. ఆ లెక్చరర్ అలా అనడంతో కన్నీళ్లు ఆగలేదు..

మా అమ్మ నాతో అన్ని వేళలా ఫ్రెండ్‌లా ఉంటుంది. నాకు ఎల్లప్పుడూ కొండంత ధైర్యం ఆమే అని అంటున్నారు ఎస్పీ చందనా దీప్తి. ప్రజలే ఫ్యామిలీ.. వారికి సేవలందించడంలోనే నాకు సంతృప్తి అని చెబుతున్నారు.
Chandana Deepti, IPS
చందనా దీప్తి, ఐపీఎస్

సంగీతం, కవిత్వంతోపాటు పెయింటింగ్స్‌ వేయడం చాలా ఇష్టమని.. లాంగ్‌ టెన్నిస్, స్విమ్మింగ్‌లో ఎన్నో మెడల్స్‌ వచ్చాయని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. క్రమశిక్షణ, పట్టుదల, అంకిత భావంతో ప్రజలకు సేవ చేస్తూ.. ఐపీఎస్‌లు అంటే ఇలా కూడా ఉంటారా అని శెభాష్ అనిపించుకుంటున్నారు చందన దీప్తి ఐపీఎస్. 2012 ఏపీ క్యాడర్‌కు చెందిన ఈ అచ్చ తెలుగమ్మాయి తన మార్క్ సంస్కరణలు, ప్రయోగాలతో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ప్రతికూల పరిస్థితులను ఎదిరించి జీవితంలో రాణించిన ప్రతి ఒక్కరూ తనకు స్ఫూర్తి అంటూ ఐపీఎస్‌ ఆఫీసర్లలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న చందనా దీప్తితో పర్సనల్‌ టైం ఆమె మాటల్లోనే...

మరిచిపోలేని సంఘటన ఇదే..

Telangana CM KCR


సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మల్కాపూర్‌కు వచ్చిన సందర్భంలో మహిళలు, విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు. ''ఈ అమ్మాయిని చూడండి.. యంగ్‌ డైనమిక్‌ ఎస్పీ.. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరూ రాణించాలి..'' అని పిలుపునిచ్చారు. ఇది నా జీవితంలో మరిచిపోలేని సంఘటన. ప్రతి రోజూ ఏదో ఒక సమస్యతో పలువురు మా దగ్గరకు వస్తుంటారు. పిల్లల మిస్సింగ్, ఇతరత్రా ఫిర్యాదులు అంటూ మా గడప తొక్కుతారు. వారి బాధలు విన్నా.. చూసినా.. మా కడుపు తరుక్కుపోతుంటుంది. వారి సమస్యలు పరిష్కారానికి నోచుకున్నప్పుడు బాధితుల కంటే మాకే ఎక్కువ సంతోషం ఉంటుంది. మనసుకు హాయిగా అనిపిస్తుంది. 

కుటుంబ నేప‌థ్యం :

chandana deepti ips monther


మా అమ్మానాన్నది లవ్‌ మ్యారేజీ. అమ్మ విజయలక్ష్మి ఎమ్మెస్సీ, బీఈడీ పూర్తి చేశారు. నాన్న జకర్యా జాయింట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మైనింగ్‌ అండ్‌ జియాలజిస్ట్‌. ఉమ్మడి ఆంధ్రపదేశ్‌లో చిత్తూరు, కాకినాడ, వరంగల్, నల్లగొండ తదితర ప్రాంతాల్లో పనిచేశారు. అమ్మానాన్నది కష్టపడే మనస్తత్వం. తమ్ముడు ధీరజ్‌ ప్రస్తుతం సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నాడు. నేను వరంగల్‌లోని చందా కాంతయ్య మెమోరియల్‌ (సీకేఎం) ఆస్పత్రిలో జన్మించా. తమ్ముడు ధీరజ్‌ నాకు ఎప్పుడూ సపోర్టివ్‌గా ఉంటాడు.

నా విద్యాభ్యాసం :
రాజమండ్రి, చిత్తూరు, నెల్లూరు, ఢిల్లీలో విద్యనభ్యసించా. రాజమండ్రిలో ఎల్‌కేజీ నుంచి రెండో తరగతి, నెల్లూరులో మూడు, నాలుగో తరగతి.. ఆ తర్వాత చిత్తూరులోని గుడ్‌ షెపర్డ్‌ హైస్కూల్‌లో ఐదు నుంచి 12వ తరగతి (సీబీఎస్‌ఈ) వరకు చదివాను. నెల్లూరులో ఇంటర్‌ విద్యనభ్యసించా. ఢిల్లీ ఐఐటీ కంప్యూటర్‌ సైన్స్‌ చదివా. ఆ తర్వాత సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యా. రెండో పర్యాయంలో ఐపీఎస్‌ ర్యాంక్‌ సాధించా.

ఈ ఘటనతోనే ఐపీఎస్ అవ్వాలనుకున్నా..
నేను చదువుకునే రోజుల్లో వరంగల్‌లో యాసిడ్‌ దాడి ఘటన జరిగింది. అప్పుడు నేను సివిల్స్‌కు ప్రిపేర్‌ కావాలనే ఆలోచనలో ఉన్నా. యాసిడ్‌ దాడి ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. ప్రభావం చూపించింది కూడా. నన్నే కాదు ఎంతో మంది అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆ సంఘటన మొదట్లో ఆడపిల్లలను బయటికి పంపాలంటేనే కుటుంబ సభ్యులు బెంబేలెత్తారు. ఆనాటి పోలీసుల చర్య రాష్ట్రవ్యాప్తంగా మహిళల్లో కొండంత విశ్వాసం నింపింది. మెల్లమెల్లగా ఈ ఘటన నుంచి కోలుకున్నా.

ఆ లెక్చరర్ అలా అనడంతో నాకు కన్నీళ్లు ఆగలేదు...

IPS Story


ఎలాగైనా ఐఐటీ సాధించాలనే పట్టుదల నాలో ఉండేది. హైదరాబాద్‌లోని రామయ్య ఐఐటీ కోచింగ్‌ సెంటర్‌లో చేరాలనుకున్నా. అప్పటికే సీట్లు అయిపోవడంతో కుదరలేదు. అప్పుడు మేము చిత్తూరులో ఉన్నాం. పక్కనే ఉన్న నెల్లూరు పట్టణంలోని పేరున్న ఓ కోచింగ్‌ సెంటర్‌లో చేరేందుకు వెళ్లా. అక్కడ ఓ ఫ్యాకల్టీ నన్ను నిరుత్సాహానికి గురి చేశారు. ''అబ్బాయిలకు మాత్రమే ఐఐటీలు సూటవుతాయి.. ఇంజినీరింగ్, సైన్స్‌ సబ్జెక్టుల్లో వాళ్లు మాత్రమే రాణిస్తారు. అమ్మాయిలు ఐఐటీలో సెట్‌ కాలేరు. వెళ్లి చక్కగా డిగ్రీ చదువుకో..'' అని ఆ లెక్చరర్‌ అనడంతో నాకు కన్నీళ్లు ఆగలేదు. ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నా. నేను ఎదుర్కొన్న మొదటి వివక్ష అదే. ఎలాగైనా ఆ లెక్చరర్‌ అభిప్రాయం తప్పని నిరూపించాలనే కసితో కోచింగ్‌ తీసుకున్నా. కుటుంబ సభ్యులు కొండంత ధైర్యాన్ని ఇవ్వడంతో పట్టుదలతో ఐఐటీ సీటు సాధించా. ఆ తర్వాత ఆ లెక్చరర్‌ ఒకసారి కలిస్తే బాగుండేదనిపించింది.

సివిల్స్‌ వైపు ఇలా...
ఢిల్లీ ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులో చేరా. ఆ తర్వాత సైంటిస్ట్‌ కావాలనుకున్నా. నాన్న సూచనలతో సివిల్స్‌ వైపు మళ్లా. ఐఐటీ పూర్తి కాగానే హైదరాబాద్‌లోని ఆర్‌సీరెడ్డి ఐఏఎస్‌ కోచింగ్‌ సెంటర్‌లో చేరా. మొదటి ప్రయత్నంలో సక్సెస్‌ సాధించలేకపోయా. వెరవకుండా పట్టుదలతో రెండో ప్రయత్నంలో ఐపీఎస్‌ ర్యాంక్‌ సాధించా.

నాకు ఇప్పటికీ గుర్తుండే ఓ జ్ఞాపకం ఇదే ...

chandana deepti ips


నేను చిత్తూరులో ఐదో తరగతి చదువుతున్నప్పుడనుకుంటా.. అప్పుడు జరిగిన సంఘటన జ్ఞాపకంగా మిగిలింది. మా టీచర్‌ హోంవర్క్‌ ఇచ్చారు. నాతోపాటు చాలామంది విద్యార్థులు చేయలేదు. టీచర్‌ నాకు తప్ప అందరికీ పనిష్మెంట్‌ ఇచ్చారు. ఓ విద్యార్థి లేచి ఆమెకు ఎందుకు పనిష్మెంట్‌ ఇవ్వలేదని ప్రశ్నించాడు. అప్పుడు టీచర్‌ ఆమెలా ఒకసారి నువ్వు క్లాస్‌ ఫస్ట్‌ రా.. ఇంక నీకెప్పుడు పనిష్మెంట్‌ ఇవ్వను అన్నారు. అది నాకు ఇప్పటికీ గుర్తుండి పోయింది.

నాకు ఇష్టమైన‌వి ఇవే..

Women IPS


నాకు లాంగ్‌ టెన్నిస్, స్విమ్మింగ్‌ అంటే చాలా ఇష్టం. విద్యార్థి రోజులతోపాటు ఐపీఎస్‌ ట్రైనింగ్‌లో చాలా మెడల్స్‌ సాధించా. వాటితోపాటు కవితలు, కర్ణాటక సంగీతమంటే ప్రాణం. వీణ కూడా నేర్చుకున్నా. ఐఐటీ చదివే రోజుల్లో కల్చరల్‌ ఈవెంట్లలో ఉత్సాహంగా పాల్గొనేదాణ్ని. చిన్నప్పుడే మ్యాథ్స్‌ ఒలింపియాడ్‌ వంటి ప్రతిభా పాటవ పోటీల్లో పాల్గొని గోల్డ్, సిల్వర్‌ మెడల్స్‌ సాధించా.

నాకు ఇష్టమైన‌ ఫుడ్‌..
నాకు వెజిటబుల్‌ ఆహారమంటేనే ఇష్టం. రైస్‌ ఇష్టముండదు.. కూరగాయలే తింటా. మొక్కజొన్న కంకి అంటే చాలా ఇష్టం. ఎక్కడికైనా వెళ్లినప్పుడు రోడ్డ పక్కన కాలుస్తుంటే.. ఆగి మరి కొంటా. సీజనల్‌గా వచ్చే పండ్లు తింటా. సహజ పద్ధతుల్లో పండించే పండ్లు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి కొనుగోలు చేస్తా.

ప్రతి వేసవిలో..

Summer


నాకు కాలుష్యం లేని యూకే, లండన్, స్కాట్లాండ్‌ అంటే ఇష్టం. దేశంలో హిల్‌ స్టేషన్లంటే కూడా. డార్జిలింగ్, ఉత్తరాఖండ్, కశ్మీర్, గుర్గావ్‌ వంటి పలు ప్రాంతాల్లో తరచూ పర్యటించా. ప్రతి వేసవిలో ఎటైనా టూర్‌ వేసేవాళ్లం. వరుస ఎన్నికల నేపథ్యంలో ఈసారి కుదరలేదు.

నా స్నేహితులు..
నాకు చిన్నప్పటి నుంచి చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో నిత్యం చాట్‌ చేస్తారు. ఐఐటీ ఫ్రెండ్స్‌ అందరూ స్థిరపడ్డారు. చాలా మంది విదేశాల్లో సెటిల్‌ అయ్యారు. ఒక చోట కలవడం కుదరని పరిస్థితి. త్వరలో యూకేలో గెట్‌ టుగెదర్‌ పెట్టాలనే యోచనలో ఉన్నాం. సెట్‌ అవుతుందో చూడాలి మరి.

ఓ ప్రాణాన్ని బతికించడం సంతృప్తినిచ్చింది..

Happy


అప్పుడు నేను రంగారెడ్డి జిల్లాలో ఏఎస్పీగా ఉన్నా. సీఎం బందోబస్తు ముగించుకుని తిరిగి వస్తుండగా వికారాబాద్‌ రూట్‌లో ఒక ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను ఓ వాహనం ఢీకొట్టింది. బైక్‌ నడుపుతున్న వ్యక్తి చనిపోయాడని అక్కడున్న వారు భావించి 108 వాహనానికి కాల్‌ చేస్తున్నారు. నేను పోలీస్‌ వాహనం దిగి అక్కడికి వెళ్లా. ఆ వ్యక్తి ఛాతి పైకి, కిందికి వస్తున్నట్లు గమనించా. నా వాహనంలోనే వికారాబాద్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాం. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలించాం. అతడు బతకడంతో నాకు ప్రాణం లేచి వచ్చినట్లయింది.

నా జాబ్‌..
ఐపీఎస్‌ అయ్యాక మొదటగా ప్రొబేషనరీ ఆఫీసర్‌గా నల్లగొండలో పనిచేశా. ఆ తర్వాత తాండూరు ఏఎస్పీగా విధులు నిర్వర్తించా. అనంతరం నిజామాబాద్‌ ఓఎస్డీగా నియామకమయ్యా. మెదక్‌ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించా.

వివాహాం: 

chandana deepti ips marriage


ప్రముఖ పారిశ్రామికవేత్త బలరాం రెడ్డితో ఎస్పీ చందనాదీప్తిల వివాహాం అయింది. ఈ వివాహానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. బలరాం రెడ్డి సీఎం వైఎస్‌ జగన్‌కు బంధువు.  అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈమె వివాహానికి హాజర‌య్యారు.

మహిళలకు న్యాయం జరిగేలా...

Women IPS Officer


మహిళలపై దాడులు తగ్గాలంటే ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తీసుకునే చర్యలతో పాటు పురుషుల్లోనూ పరివర్తన రావాలని దీప్తి భావన. అందుకు తగ్గట్టుగానే ఐపీఎస్ అధికారిణిగా తన పరిధిలో మహిళలకు న్యాయం జరిగేలా చూస్తున్నారు.. వారి భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ‘‘షీ భరోసా’’ లాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు... ఈవ్ టీజింగ్‌ను అరికట్టేందుకు పోలీస్ స్టేషన్ల వారీగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అలాగే పోలీస్ శాఖలో పనిచేసే మహిళా కానిస్టేబుళ్లను అధికారులు ఇతర సిబ్బంది గౌరవించేలా చూస్తున్నారు. ఒక అమ్మాయి బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ చందనకు అప్పగించారు.. ఆమె బాధ్యతను తనే తీసుకున్న దీప్తి ఉన్నత చదువులు చదివిస్తోంది. జిల్లా పోలీసులకు బాస్ అయినప్పటికీ... గల్లీల్లో సైకిల్ వేసుకుని తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. తానొక అధికారిననే అహంకారం కనిపించనీయకుండా ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రతివారం తనను కలుసుకోవడానికి వచ్చే వారిని ప్రేమగా పలకరించి వారి కష్టాలను ఒక కుటుంబసభ్యురాలిగా వింటారు. వినటమే కాకుండా సమస్యల పరిష్కారంలో అంతే శ్రద్ధ చూపిస్తారు. చిల్లరగా తిరగకుండా ఉండాలని యువతలో స్ఫూర్తి నింపుతూనే వీలైతే ఉపాధి మార్గం కూడా చూపిస్తున్నారు చందన దీప్తి. 

Manu Chowdary, IAS : అమ్మ కోసం..తొలి ప్రయత్నంలోనే

IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే...

Success Story: తొలి ప్రయత్నంలోనే..ఎలాంటి కోచింగ్‌ లేకుండా..22 ఏళ్లకే సివిల్స్‌..

Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్‌ వైపు..నా స‌క్సెస్‌కు కార‌ణం వీరే..

IAS Officer, IAS : నిత్యం పాలమ్మితే వ‌చ్చే పైసలతోనే ఐఏఎస్‌ చ‌దివా..ఈ మూడు పాటిస్తే విజయం మీదే :యువ ఐఏఎస్‌ డాక్టర్‌ బి.గోపి

Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

Smita Sabharwal, IAS : స‌క్సెస్ జ‌ర్నీ...ఈమె భ‌ర్త కూడా..

Rohini Sindhuri, IAS: ఈ ఐఏఎస్ కోసం జనమే రోడ్లెక్కారు.. ఈమె ఏమి చేసిన సంచ‌ల‌న‌మే..

Published date : 20 Jan 2022 06:18PM

Photo Stories