UPSC Civils Ranker Akhila Success Story : ప్రమాదంలో చేయిని కోల్పోయా..ఒంటి చేత్తోనే.. పోరాటం.. సివిల్స్ కొట్టానిలా..
శరీరంలో ఏ అవయవం లోపించినా.. ఇక తమ జీవితం వ్యర్థమన్న నిరాశలోకి కూరుకుపోతుంటారు చాలామంది. కానీ తమలో ఉన్న ప్రతిభ, పట్టుదలతో ఈ లోపాల్ని అధిగమించి విజేతలయ్యారు ఈమె. ఇటీవలే విడుదలైన యూపీఎస్సీ-2022 ఫలితాల్లో ర్యాంకర్లుగా సత్తా చాటారు. ఈ నేపథ్యంలో అఖిల బీఎస్ సక్సెస్ స్టోరీ మీకోసం..
ఒంటి చేత్తోనే..
కేరళలోని తిరువనంతపురానికి చెందిన అఖిల బీఎస్ చిన్నతనంలో అందరమ్మాయిల్లాగే ఆడుతూ పాడుతూ పెరిగింది. అయితే తనకు ఐదేళ్ల వయసున్నప్పుడు బస్సు ప్రమాదానికి గురై.. కుడి చేతిని కోల్పోయింది. ఆమెకు ప్రోస్థటిక్ చేతిని అమర్చినా.. భుజం ఫ్రాక్చర్ కావడంతో అది సరిగ్గా ఇమడలేదు. ఇకపై ఒంటి చేత్తోనే జీవించాలని ఆ క్షణం రియలైజ్ అయిన అఖిల.. తన తలరాతకు బాధపడలేదు. ఎడమ చేత్తోనే తన పనులు చేసుకోవడం, రాయడం నేర్చుకుంది.
చదువుల్లోనూ టాపర్..
అఖిల స్కూల్లో, కాలేజీలో టాపర్‌గా నిలిచింది. ఐఐటీ మద్రాస్‌లో ఇంటిగ్రేటెడ్ ఎంఏ పూర్తి చేశారు. ఆ తర్వాత సివిల్స్‌పై దృష్టి పెట్టి ప్రిపరేషన్ కొనసాగించింది. యూపీఎస్సీ సివిల్స్ మూడో ప్రయత్నంలో విజయం సాధించి.. తన చిన్న నాటి కల ఐఏఎస్‌ను నిరవెర్చుకుంది.
అప్పుడే నా మనసులో బీజం వేసుకున్నా..
యూపీఎస్సీ సివిల్స్‌లో నాకు జాతీయ స్థాయిలో 760వ ర్యాంకు వచ్చింది. స్కూల్లో ఉన్నప్పుడే మా టీచర్ నా మనసులో దీనికి సంబంధించిన బీజం వేశారు. దీంతో ఐఏఎస్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నా. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక దీనిపై పూర్తి దృష్టి పెట్టా. 2020 నుంచి వరుసగా మూడేళ్లు సివిల్స్ రాశాను. మూడో ప్రయత్నంలో అర్హత సాధించా.
నాలో ఉన్న శారీరక లోపం కారణంగా..
ఏదేమైనా నేను సివిల్స్‌లో ర్యాంక్ కొట్టడం.. ఇదో పెద్ద సవాలనే చెప్తాను. ఎందుకంటే నాలో ఉన్న శారీరక లోపం కారణంగా గంటల తరబడి కూర్చోలేను. ఒకవేళ అలా కూర్చుంటే వెన్నునొప్పి విపరీతంగా వస్తుంది. సివిల్స్ మెయిన్స్ పరీక్ష సమయంలో ఈ నొప్పితోనే పరీక్ష పూర్తి చేశా. అయినా సివిల్స్‌కు అర్హత సాధించడంతో నా ఆత్మవిశ్వాసం రెట్టింపైది. అయితే ఈసారి ఐఏఎస్‌కు ఎంపిక కాకపోతే మళ్లీ సివిల్స్ ఎంట్రన్స్ రాస్తాను. ఆ లక్ష్యాన్ని చేరుకునే దాకా ప్రయత్నం ఆపన్నారు. యువతకు నేను ఇచ్చే సలహా ఒక్కటే.. మన లక్ష్యం బలంగా ఉంటే.. విజయం సాధించడం సులువు అవుతుంది. మనం విజయం సాధించే వరకు మన పోరాటం ఆపకుడదు.