Skip to main content

యోగక్షేమం వహామ్యహం

దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఆ కుర్రాడు ఐఐటీకి వెళ్లి ఇంజినీరింగ్ చదువుకోవాలనే కలలు కన్నాడు. తన కలను నిజం చేసుకోవడానికి తను తీవ్రంగా పరిశ్రమించడమే కాక, తనతోటి మిత్రులకు సైతం సాయం చేసేవాడు.అతని శ్రమకు తగ్గట్లే ఐఐటీలో సీటొచ్చింది. కొడుకు విజయానికి ఆ తండ్రి గర్వపడ్డా ... అవసరమైన స్థోమత లేక, సొంతూరుకు దగ్గరలో ఉన్న కాలేజీలోనే ఇంజనీరింగ్‌లో చేర్పించాడు. ఐఐటీలో చేరకుండా ఇక్కడెందుకు చేరావని అడిగిన మిత్రులకు ‘‘మన భవిష్యత్తును నిర్ణయించేది మనం చేరే కాలేజీ కాదు. మన పరిశ్రమే.’’ అని గంభీరంగా చెప్పిన అతని మాటలు "Dear Brutus our future lies not in our stars, But in us" అన్న జూలియస్ సీజర్ మాటలను స్ఫురింపచేశాయి.

తండ్రి ఆర్థిక స్థోమతను గమనించి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుని.. విమర్శించే వారిని లెక్కచేయకుండా తన నిర్ణయాన్ని నిర్భయంగా అమలు చేసి ఇంజనీరింగ్ పూర్తిచేయడమే కాకుండా... అవకాశాల కోసం వేచి చూడకుండా ఓ కంపెనీలో చేరి ఆ అనుభవం, అర్హతలతో, తన ఆశయాలకు అనుగుణంగా కొందరు మిత్రులతో కలిసి ఒక సంస్థను స్థాపించి, భారతీయ సాఫ్ట్‌వేర్ రంగం ఎల్లలను పునఃనిర్వచించాడు. ఆయనే ఇన్ఫోసిస్ అధినేత నాగవర రామారావ్ నారాయణమూర్తి. చదివేటప్పుడు తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకొని కష్టపడి చదవక, కష్టపడి చదివినా ఆశించిన ఫలితాలు రాక.. ఆశించిన ఫలితాలు వచ్చినా, పరిస్థితులు అనుకూలించక.. అనుకున్న చోట చదవలేక, మెచ్చిన కాలేజ్‌లో నచ్చిన సీటు రాక, వాటిని తమ వైఫల్యాలకు మార్గాలుగా మలచుకొని ఆత్మవంచన చేసుకునే ఎందరో విద్యార్థులకు.. జీవిత సత్యాలను నిజాయితీగా అన్వయించుకొని, తనకంటూ ఒక నిర్దిష్ట జీవన విధానాన్ని, మార్గాన్ని, గమ్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కాలేజీలో చేరకముందే ధృఢ సంకల్పబద్ధుడైన నారాయణమూర్తి ఉదాహరణ ఒక మేలుకొలుపు. ఈ సందర్భంలో ఇంజనీరింగ్‌లో చేరే ప్రతి విద్యార్థికి

ఆత్మ వంచన వల్ల
ఆడు కల్లల వల్ల
అగును హృదయం డొల్ల
ఓ కూనలమ్మ.........

అన్న ఆరుద్ర మాటలు మార్గదర్శకం కావాలి.

అనుకరణ కాదు, ఆచరణ అవసరం:
నారాయణమూర్తిలా అందరూ కాలేరంటూ మనలో చాలా మంది పెదవి విరిచేస్తారు. అయితే ఆయన పరిశ్రమ, క్రమశిక్షణ ఆచరించిన కొందరు ఆయనలా మేరు పర్వతం కాలేకపోయినా..గణించదగిన గిరులుగా తప్పక నిలుస్తారు. కాలేజీలో చేరడంతోనే ఒక రకమైన తాత్కాలిక స్వాతంత్య్రాన్ని, స్వేచ్ఛను పొంది తమకు ఆకర్షణీయంగా అనిపించిన దాన్నే అనుకరించే విద్యార్థులెందరో! Grow more hair, Grow more nails లాంటి Slogans కనిపిస్తాయి కానీ, Grow more discipline, Grow more character లాంటివి అరుదుగా వినిపిస్తాయి. రాముడికి విద్యాబోధన చేస్తూ, వశిష్టుడు క్లిష్ట విషయాలను అర్థం చేసుకోవడానికి విశేషంగా 4 లక్షణాలు ఉండాలని చెబుతాడు. అవి సమం (సమస్థితి - Balance of Mind), ఆత్మ విశ్లేషణ (Self Appraisal) సంతోషం (Happiness), సత్సంగం (Good Compnany).

సమస్థితి ద్వారా శ్రద్ధ పెరుగుతుంది. ఎంత శ్రద్ధ పెరిగితే అంత ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత అభ్యాసం వల్ల వస్తుంది కానీ భయం వల్లో, బలం వల్లో వచ్చేది కాదు. మన శ్రద్ధంతా ఏకాగ్రతపైనే ఉంటే ఫలితాలను సాధిస్తాం. కానీ ఫలితాలపై ఉంటే ఏకాగ్రతను సాధించలేం. కాలేజీలో చేరగానే ఆవహించే అనవసరపు ఆకర్షణలు లక్ష్యసాధనకు ప్రధాన అవరోధాలు. ఇలా ఆకర్షణలకు లోను కావడానికి మూలకారణం ఆత్మవిశ్లేషణ లేకపోవడం. నేనెందుకు ఇక్కడకు వచ్చాను? నా లక్ష్యం ఏమిటి? లక్ష్యసాధనకు నేనేం చెయ్యాలి? నా అలవాట్లు, ఆలోచనలు, నా లక్ష్యసాధనకు తోడ్పడేవేనా! ఇలా ఎవరికి వారు ఆత్మపరిశీలనకు ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. అప్పుడు తమ లోపాలు దిద్దుకోవడానికి అవకాశం లభించడమే కాకుండా ఇతరుల తప్పులు ఎత్తి చూపడానికి సమయం లభించదు.

Watch your thoughts, they become your words
Watch your words, they become your actions
Watch your actions, they become your habits
Watch your habits, they become your character
Watch your character, it becomes your destiny.

ఇలా ఆత్మవిశ్లేషణ జరిగితే మన పట్ల మనం నిజాయితీతో మెలుగుతాం. ఆ నిజాయితీ ఎప్పుడైతే మన జీవనశైలిలో అంతర్భాగం అవుతుందో మనం చేసే పని పట్ల ప్రేమ పెరిగి అది అవ్యక్త ఆనందాన్ని ఇస్తుంది.

Happiness is the chief product of any good work and profit its by product. అనే ఆంగ్లోక్తిని అర్థవంతంగా అన్వయించుకుంటే నాలుగేళ్ల ఇంజనీరింగ్ చదువులో సంతోష పూర్వక పరిశ్రమ, సంతృప్తికర ఫలితాలు వస్తాయి. అయితే వీటన్నింటినీ అమితంగా ప్రభావితం చేసేది మన మంచి మిత్రులే (Good Company). క్యాంపస్‌లో మంచి అలవాట్లయినా, చెడ్డ అలవాట్లయినా వాటికి ముఖ్యమాధ్యమాలు మిత్రులే. Friends and Books Must be few and good. చక్కని శాశ్వత మిత్రులను సంపాదించి పెట్టేది కూడా ఈ సమయమే. కులం, మతం, ప్రాంతం, భౌతిక స్వరూపం ప్రాతిపదికన మిత్రులను ఏర్పరచుకుంటే మిగిలేది అనర్థమే. అందుకే జీవన మిత్రులు (Life-long friends) ఏర్పడే ఈ సమయంలో ఎంతో ఆచితూచి వ్యవహరించాలి. సినిమాలు వేరు, నిజ జీవితం వేరు. క్యాంపస్‌లో ఆకతాయిలను హీరోలుగా చూపించే ఏ సినిమా డెరైక్టర్ సైతం తన పిల్లలు అలా కన్పించాలని కల్లో అయినా కోరుకోరు.

ఇంజనీరింగ్ కాలేజీలో చేరగానే ర్యాంగింగ్ కారణంగా ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మొదట్లో ర్యాగింగ్ బారినపడ్డ విద్యార్థులు ఒకసారి సెకండ్ ఇయర్‌లో చేరగానే అదే పని చేస్తున్నారు. మనం బాధపడ్డాం. కాబట్టి మనం బాధపెట్టకూడదనే విశాల దృక్పథాన్ని అలవర్చుకుంటే జూనియర్ల పట్ల ఆత్మీయతా భావం ఏర్పడి.. వారి సంరక్షకులుగా ఉండే అవకాశం లభిస్తుంది.

ప్రతి విద్యార్థి భారతంలోని ఈ పద్యాన్ని గుర్తుంచుకుంటే ర్యాగింగ్ చేయాలనే ఆలోచనే రాదు.

ఒరులేయవి యొనరించిన
నరవర అప్రియంబు తన మనంబున కగున్
తానవినొరులకు ఒనరింప కుండుటయె
పరాయణము పరమధర్మ పథములకెల్లన్


భావం: ఇతరులేవి చేస్తే మనకు కష్టం కలుగుతుందో అవి ఇతరులకు మనం చేయకుండుటయే ధర్మాలలో కెల్లా శ్రేష్ఠ ధర్మం.

వేగంతో పాటు వివేకం అవసరం:
ఆధునిక జీవనంలో ప్రధానంగా కనిపించే లక్షణం వేగం. జీవితంలో ఏ పార్శ్వాన్నీ ఇది ప్రభావితం చేయకుండా వదల్లేదు. మనిషి ఆలోచనా విధానాన్ని, దైనందిన జీవితాన్ని, ప్రాధాన్యతను (Priorities) నిర్థారించుకోవడాన్ని ఈ వేగమే నియంత్రిస్తుంది. వేగం అవసరమే. కానీ దీనితో పాటు వివేకం ఇంకా అవసరం. ఉన్న స్థితి నుంచి, ఉన్నత స్థితికి ఎదగడానికి అందు బాటులో ఉన్న సన్మార్గాలన్నింటినీ వినియోగించుకోవడమే వివేకం. వివేకం ఉత్తములను.. అనుభవం మధ్యములను.. అవసరం అధములను నడిపిస్తుంది. తరచూ వస్తున్న అలల తాకిడికి, క్రమక్షయానికి గురౌతున్న విశాఖ ఓడ రేవును రక్షించడానికి ఎందరో మేధావులు తలలు పట్టుకొని ఆలోచించినా పరిష్కారం దొరకలేదు. పాత ఓడను ఒక దాన్ని శాశ్వతంగా నిలిపి ఉంచితే, ఆ అలల ఉధృతి తగ్గి, ఓడరేవు సురక్షితం అవుతుందన్న ఆయన ఆలోచన విశాఖ ఓడరేవుకు పునర్జన్మ నిచ్చింది. దైవదర్శనం కోసం తిరుపతి నుంచి తిరుమలకు ఎంచక్కా కారులోనో, బస్సులోనో ప్రయాణించేవారు ఇంత చక్కటి రోడ్డు ఎవరు వేయించారని అనుకోకుండా ఉండరు. ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి కాలిదారిన ఎక్కలేక ఏడు కొండల్లో అవస్థలు పడుతున్న భక్తజన సమస్యలను గమనించి తిరుపతి నుంచి తిరుమలకు రహదారిని నిర్మించేందుకు ప్రణాళికను రూపొందించి సఫలీకృతుడైన వ్యక్తి కూడా ఆయనే. చీకటిని నిందిస్తూ కూర్చొనే కంటే, ఒక కొవ్వొత్తిని వెలిగించే చొరవ తీసుకుంటే జీవితంలో ఏదైనా సాధించే నేర్పు ఏర్పడుతుందన్న ఆ చిరస్మరణీయుని జన్మదినాన్నే ఇంజనీర్ల దినోత్సవంగా జరుపుకుంటాం. ఆయనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. పరిశ్రమించడంలో కష్టం కూడా సుఖాన్నిస్తుంది. కష్టపడి పనిచేసినవాడే విశ్రాంతిని పూర్తిగా అనుభవించగలడన్న మోక్షగుండం మాటలు సదా స్మరణీయం.

విద్యాలయం ఏం అందించాలి?:-
ఖాళీ పాత్రను, తెరచిన పాత్రగా మార్చడమే విశ్వవిద్యాలయం పని అంటాడు ఓ ఆంగ్ల కవి. "Mind is like a parachute which is dangerous it not kept open." రవీంద్రుని గీతాంజలిలో ఈ భావాలను చక్కగా వివరిస్తాడు.

ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో
ఎక్కడ మానవుడు తలెత్తుకు తిరుగుతాడో
ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలదో
ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలై
ఇరుకైన గోడల మధ్య మగ్గిపోదో
ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని
మతాంధ విశ్వాసపు ఎడారిలో ఇంకిపోదో
ఆలోచనలు ఆచరణలో
నిత్యం విశాల పథాల వైపు
ఎక్కడ మనస్సు పయనిస్తుందో
ఆ స్వేచ్ఛా స్వర్గం వైపు తండ్రీ
నన్ను, నా ప్రజలను నడిపించు.....


ఈ భావాలను, విశ్వవిద్యాలయాలు, కాలేజీలు ఆచరించి, ఆచరింపచేస్తే, తమ విద్యార్థులను Enlightened Citizensగా తీర్చిదిద్దే అవకాశం లభిస్తుంది.

వ్యక్తిత్వ నిర్మాణం:
గ్రాడ్యుయేషన్ చదివే సమయం ఏ వ్యక్తి జీవితంలోనైనా కీలక సమయం. విద్యార్థి కాలేజీకి వెళ్లి సంపాదించేది బీటెక్ డిగ్రీయే అనుకుంటే పొరపాటే. కాలేజీకి వెళ్లేది భవిష్యత్ నిర్మాణం కోసం. భవిష్యత్తు అంటే వ్యక్తిత్వం, విలువలు, కెరీర్, మిత్రులు, సామాజిక స్పృహ. ఇవన్నీ కలగలిపితేనే వ్యక్తిత్వం. కెరీర్ లేదా ప్రొఫెషనల్ అర్హత ఒక అంశం మాత్రమే. నేను ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ చదివేటప్పుడు ‘‘తేజస్వి నావధీ తమస్తు’’ (May our study impart that inward light) అనేది Mottoగా ఉండేది. ఏ విద్యా సంస్థలోనైనా ఈ Mottoతో పైన పేర్కొన్న అంశాలన్నింటి పైనే దృష్టి సారించినప్పుడే సమగ్ర విద్య సాధ్యం. ఒక ప్రముఖ కంపెనీ హెచ్‌ఆర్ మేనేజర్ తన అనుభవాన్ని ఇలా వివరించారు. క్యాంపస్ సెలెక్షన్‌లో ఎంపికైన ఇద్దరు విద్యార్థులకు ఒకే మార్కులు, అర్హతలు ఉండటంతో ప్రధాన కార్యాలయానికి పిలిచాం. వారిని ఇంటర్వ్యూకి పిలిచే వరకూ క్యాంటీన్‌లో వేచి ఉండమని చెప్పాం. మొదటి విద్యార్థి బేరర్‌ను పిలిచి కాఫీ తెచ్చిపెట్టమని మృదువుగా అభ్యర్థించాడు. రెండో వ్యక్తి ఆ బేరర్ తన సేవకుడని తనకేదో రుణపడి ఉన్నట్లుగా భావించి కరకుగా అసహనంతో ఆజ్ఞాపించాడు. ఇద్దరి ప్రవర్తనను రహస్యంగా గమనించిన ఆ అధికారి ఇద్దరినీ ఒకేసారి పిలిపించి... మొదటి విద్యార్థితో నిన్ను ఎంపిక చేశామని చెప్పడంతో రెండో విద్యార్థి తనను ఎందుకు ఎంపిక చేయలేదో వివరించాలని కోరాడు. దానికి సమాధానంగా ఆ అధికారి నీ వ్యక్తిత్వ పునాది బలహీనంగా ఉంది. ఇంకా దృఢపరుచుకోవాల్సి ఉంది. విద్యార్థికి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ మాత్రమే కాదు, అంతకుమించిన వ్యక్తిత్వ నిర్మాణం కూడా ఉండాలి. పర్యవేక్షణ లేనప్పుడు ఎలా పని చేస్తారు! ప్రవర్తిస్తారు! అనేది అసలైన ప్రొఫెషనలిజానికి కొలమానం’’ అని వివరించారు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తిలా ఉన్నత స్థాయికి చేరాలని చాలామంది కలలు కనవచ్చు. అయితే ఎంతమంది నారాయణమూర్తిలా ప్రతిరోజూ నిద్రపోయే ముందు నేను ఈ రోజు ఎవరినైనా బాధించానా? ఒకవేళ అలా జరిగితే మరెప్పుడూ అలా పునరావృతం కాకుండా ఉండేందుకు దైవం తనకు శక్తినివ్వాలని ఎంతమంది ఆత్మ పరిశీలన చేసుకుంటారు? ఎంతమంది నారాయణ మూర్తిలా ఖాళీ సమయంలో తను చేసే పనుల్లో టాయిలెట్స్ శుభ్రం చేయడం కూడా ఒకటని ఇష్టంతో ఎంతమంది వినమ్రంగా చెపుతారు? అలా అని టాయిలెట్స్ శుభ్రం చేస్తేనే వ్యక్తిత్వ నిర్మాణం జరిగి పోతుందని కాదు. పరిశుభ్రత పరమాత్మ స్వరూపమనే సత్యాన్ని గ్రహించటం, Dignity of Labourని అలవాటు చేసుకోవటం, ప్రతి పనిలో ఆనందం, అంతర్లీనంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించటం ముఖ్యం. There are no menial jobs, only menial attitudes అన్న ఆంగ్లోక్తిని అందరూ ఆకళింపు చేసుకోవాలి.

వాస్తవికతకు దగ్గరగా:
కాలేజీ జీవితంలోకి అడుగు పెడుతున్న విద్యార్థులకు కాలేజీలో చెప్పని, జీవితానికి అవసరమైన కొన్ని సూచనలను స్వయంకృషితో పైకి వచ్చిన బిల్‌గేట్స్ మాటల్లో....
  1. అదృష్టాన్ని నేనూ నమ్ముతాను, ఎంత ఎక్కువ కష్టపడితే అంత ఎక్కువ వస్తుంది. ఎందుకంటే అదృష్టం కష్టపడే వారినే వరిస్తుంది.
  2. మీరు సులభంగా వివరించలేకపోతే ఆ విషయం మీకు అర్థం కాలేదన్నమాట.
  3. మీ అధ్యాపకుడు కఠినంగా కన్పిస్తుంటే కంగారు పడకండి. ఉద్యోగంలో చేరి బాస్ నుంచి వచ్చే ఆదేశాల కోసం నిరీక్షించండి. కాఠిన్యం అంటే ఏమిటో తెలుస్తుంది.
  4. మన ఆత్మగౌరవం గురించి ప్రపంచానికి పని లేదు. మనల్ని గౌరవించే ముందు మీరు గౌరవింపదగ్గ పనేం చేశారు అని ప్రపంచం అడుగుతుంది.
  5. కాలేజీలో మొదట పాఠం చెప్తారు. తర్వాత పరీక్ష పెడతారు. జీవితంలో మొదట పరీక్ష ఉంటుంది, తర్వాత పాఠం నేర్చుకుంటాం.
  6. శరీర శ్రమ చేయాల్సి వస్తే ప్రతిష్టకు భంగంగా భావించవద్దు. మన తాతల కాలంలో దాన్నే ప్రార్థనగా భావించేవారు.
  7. మీ జీవితాన్ని తీర్చిదిద్దుకునే బాధ్యత మీది. మీ వైఫల్యాలకు తల్లిదండ్రులనో, మరెవరినో నిందించి ఆత్మవంచన చేసుకోకండి.
  8. మీరు పుట్టకముందు మీ తల్లిదండ్రులు మీరు అనుకున్నంత Boring Creatures కాదు. మీ బట్టలు ఉతికి, మిమ్మల్ని గమ్యస్థానాలకు చేరవేసి, మీ స్కూల్ బిల్లులు కట్టి, మీరు చెపితే విని మౌనంగా తల ఊపి వారు అలా నిస్సారంగా కన్పిస్తున్నారు.
  9. కాలేజీలో వేసవి సెలవులు ఉంటాయి. కానీ జీవితంలో ఉండవు. చేసే పని, కావల్సిన సెలవు కూడా సంపాదించుకోవాల్సిందే.
  10. టెలివిజన్ చూసి అదే జీవితమని భ్రమ పడకండి. నిజ జీవితం ఎప్పుడూ కాఫీ షాపుల్లో, ఖరీదైన బట్టల్లో, విలాసవంతమైన కారుల్లో నడవదు. ప్రతిదీ పరిశ్రమించి పొందాల్సిందే.
  11. స్వేచ్ఛ, బాధ్యత అనేవి జీవితం అనే నాణేనికి బొమ్మ, బొరుసు.
వాస్తవికతకు అద్దంపట్టే బిల్‌గేట్స్ సూచనలు ప్రతి విద్యార్థినీ ఆలోచింపచేసేవే. ఈ సందర్భంలో...

గాంధీజీ పేర్కొన్న seven deadly sins...

Wealth without work
Pleasure without conscience
Science without humanity
Knowledge without character
Politics without principle
Commerce without morality
Worship without sacrifice

ప్రతి ఒక్కరూ, ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొనేవే. తమ తమ సందర్భాలకు అన్వయించుకుని ఈ ప్రాణాంతక పాపాలకు పాల్పడకపోతే వారి భవిష్యత్తు భద్రంగా ఉంటుంది.

యూనివర్శిటీ లేదా కాలేజీలను దేవాలయాలతో పోలుస్తారు. అలాంటి దేవాలయాలల్లోకి ప్రవేశించే విద్యార్థులు తన మానసిక ఎల్లలను విస్తరించుకుని అలౌకిక ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలి. ప్రతి విద్యార్థి తన వైవిధ్యాన్ని పరిరక్షించుకుంటూ తన గమ్యానికి చేరడానికి కావలసిన విలువల ఆధారిత పరికరాలను స్వయంగా నిర్మించుకుంటూ, నాణ్యతలో తనతో తాను పోటీపడుతూ, తన రంగంలో కొత్త విషయాలపై ఆసక్తి పెంచుకుంటూ తన వ్యక్తిగత కుటుంబ బాధ్యతలే కాక, సామాజిక బాధ్యతలను కూడా గుర్తెరిగి తనకంటూ ఒక బ్రాండును నిర్మించుకోవాలి. ‘‘మెజారిటీ విద్యార్థులు ఐఐటీల్లో చదవడం వల్ల వచ్చే 6 అంకెల జీతంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు కానీ, చదివే సబ్జెక్ట్‌పై అంత ఆసక్తి ఉండడం లేదు. చేసే పనిని ప్రేమించలేక ఒత్తిడికి గురౌతున్నారు అని అంటారు మద్రాసు ఐఐటీ మాజీ డెరైక్టర్ పి.వి ఇందిరేశన్. కాలేజ్ బ్రాండు విలువ వల్ల పెరిగే సామాజిక ఒత్తిడి వల్ల ఇతర కోర్సుల పట్ల అభిరుచులు ఉన్నా, పిల్లలు, వారి తల్లిదండ్రులు వాటి గురించి ఆలోచించాలంటేనే భయపడుతున్నారంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి స్థితిలో విద్యార్థికి తన వ్యక్తిత్వ బ్రాండు నిర్మించుకోవడం కష్టమే . కానీ అసాధ్యం కాదు.
 
ఇంజనీరింగ్ చదివేది కేవలం కంప్యూటర్స్ ముందో, కంపెనీల్లోనో పనిచేయడానికి కాదు. ఆ విద్య ద్వారా వెలువడిన సాంకేతిక సమాహారాన్ని జీవితంలో ఎప్పుడైనా, ఎక్కడైనా ఉపయోగపడే నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. ఐఐటీ మద్రాసులో ఇంజనీరింగ్ చదివిన ఆర్.మాధవన్ అనే విద్యార్థి వ్యవసాయంపై మమకారంతో కొంతకాలం ఓన్‌జీసిలో పనిచేసి అందులో సంపాదించిన దానితో ఆరు ఎకరాలు పొలం కొని మొదట నష్టాలు చవి చూసినా.. తర్వాత తన సాంకేతిక నైపుణ్యంతో, నాట్లకి, కలుపుతీతకి కొత్త పరికరాలను తయారు చేసుకొని పుడ్ ప్రాసెసింగ్‌పై దృష్టి సారించి తద్వారా లాభాలు గడించాడు. ప్రస్తుతం 60 ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ.. అందులో 10% పొలాన్ని ప్రయోగాలకు వాడుకుంటూ, ఎకరానికి లక్ష నికర ఆదాయాన్ని సంపాదిస్తూ ఆనందంగా జీవిస్తున్నాడు. వ్యవసాయంపై అభిరుచితో, తన ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని వ్యవసాయానికి అన్వయించిన మాధవన్ లాంటి ఇంజనీర్లు వేలల్లో అవసరం.

అవసరాన్ని మించి దేన్ని కొనకు. పొదుపుగా ఉండు. నువ్వు నువ్వుగా ఉండు అని అంటాడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వారెన్ బఫెట్. శాస్త్రీయ సంగీతంలో ప్రావీణ్యం ఉన్నవారు ఏ పాటనైనా అపశృతులు లేకుండా అవలీలగా పాడగలరు. ఎందుకంటే వారి మూలాలు బలీయంగా ఉంటాయి కాబట్టి. వ్యకిత్వ పునాదులు బలంగా ఉంటేనే జీవిత వృక్షం ఫలాలు మధురంగా ఉంటాయి. మానసిక అపరిపక్వతతో జీవితంలో అతి ముఖ్యమైన ఈ విద్యార్థి దశలో చేయరాని/ చేయకూడని పొరపాట్లు చేస్తే ఫలితాలు కూడా దానికి అనుగుణంగానే ఉంటాయి.

‘‘అచిరేణ సదుర్బుద్ధిః పశ్చాత్తాపేన యుజ్యతే’’

(యవ్వనంలో నిర్లక్ష్యంగా, దుర్బుద్ధితో ప్రవర్తిస్తే జీవితాంతం పశ్చాత్తాప పడాల్సి వస్తుంది).

నిర్మాణాత్మక దృక్పథంతో తన భవిష్యత్తు సమాజ భవిష్యత్తులో అంతర్భాగం అనే భావంతో చురుగ్గా ముందుకు సాగేవారే నిజమైన ఇంజనీర్లు అప్పుడే Engineers make the world అనే నానుడి నిజమౌతుంది. 77ఏళ్ల వయసులో యువకులకంటే చురుగ్గా పని చేస్తూ అసాధ్యమనుకున్న కొంకణ్ రైల్వే, ఢిల్లీ మెట్రో లాంటి ప్రాజెక్టులను దేశ భవిష్యత్తు కోసం నిర్మిస్తున్న శ్రీధరన్ లాంటి ఇంజనీర్లు, తన ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని వ్యవసాయ రంగంతో మేళవించి దేశ ఆహార భద్రత కోసం తపిస్తున్న మాధవన్ లాంటి ఇంజనీర్లు స్వయంకృషితో దేశ సాంకేతిక స్వావలంబనకు కృషి చేసే నారాయణమూర్తి లాంటి ఇంజనీర్లను గమనిస్తే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన శ్లోకం గుర్తుకు వస్తుంది.

అనన్యాశ్ఛింత యంతోమామ్ యే జనాః వర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం


భావం: ఎవరెవరు నన్ను ఏఏ విధంగా తెలియ గోరుచున్నారో వారిని ఆయా విధాలుగా అనుగ్రహిస్తున్నాను, కానీ ఏ ఒక్కని యందు అనురాగం గానీ, ద్వేషం గానీ లేవు.
 
ఇంజనీరింగ్ కూడా అంతే. కష్టపడి, ఇష్టపడి (Empathy) తమ సబ్జెక్టును చదివేవారికి ఫలప్రదంగాను.. మొక్కుబడిగా (Apathy) చదివేవారికి ఫలరహితంగాను.. చదువు వదిలిపెట్టి ఇతర వ్యాపకాల్లో (Antipathy) మునిగేవారికి దుష్ఫలితాలు అందుతాయి అన్న ఈ శ్లోకంలో అంతర్లీనంగా ఉన్న భావాన్ని ఇంజనీరింగ్ విద్యార్థులంతా గ్రహించాలి!!
 
A.V.Rajamouli, IAS
Published date : 20 Nov 2021 02:19PM

Photo Stories