Skip to main content

ఆనోభద్రా క్రతవో యంతు విశ్వతః

బుద్ధిపూర్వకంగా పూర్తి ఇష్టంతో చదివేదే చదువు. నేటి తరం విద్యార్థులకు చదివే చదువుకంటే దాని వల్ల వచ్చే ఆరంకెల జీతాన్ని ఇచ్చే కోర్సుల వైపే ఎక్కువ మక్కువ ఉంటోందన్నది నిపుణుల విమర్శ. దీంతో మిగతా కోర్సుల గురించి ఆలోచించడానికే భయపడే పరిస్థితి. మంచి జీతాన్నిచ్చే కోర్సులు జీవితాన్ని ఆనందమయం చేస్తాయా? ధృక్పథం, అభిరుచులు, మాట, సాహిత్యం, పొదుపు లాంటి మౌలిక అంశాలు లేకుండా జీవితంలో సామరస్యాన్ని, సమతుల్యతను సాధించడం కష్టం. సామాజిక బాధ్యత అందివ్వని చదువు దేశ సమగ్రతకు, పాలనావ్యవస్థకు సమస్యగా మారవచ్చు. విద్యార్థులు, ఉద్యోగార్థులు డిగ్రీలతో పాటుగా ఈ మౌలిక లక్షణాలను ఆకళింపుచేసుకుని ఆచరిస్తే... మంచి విద్యార్థిగా, పౌరుడిగా, పాలానాధికారిగా, నాయకుడిగా ఎదిగి ఆనంద భారతావనికి పునాదులు పటిష్టం చేసినవాళ్లవుతారు.

అమెరికా రాజ్యాంగాన్ని ఆ దేశ అగ్రనాయకులు ఆమోదించుకొని బయటకు వస్తున్న సమయంలో... ‘‘మాకు ఎలాంటి ప్రభుత్వ వ్యవస్థను ఇచ్చారు. నియంతత్వమా - రాచరికమా - రిపబ్లికా?’’ అని ఒక యవకుడు బెంజిమిన్ ఫ్రాంక్లిన్‌ను అడిగాడు. దీనికి ఫ్రాంక్లిన్... మీరు సురక్షితంగా ఉంచుకోగలిగే ‘రిపబ్లిక్’ అని సమాధానమిచ్చారు. ప్రభుత్వాధినేతను ప్రజలే ఎన్నుకునే పాలనా వ్యవస్థే రిపబ్లిక్. అంటే అలాంటి పాలన వ్యవస్థను విజయవంతంగా నడిపించుకుంటూ కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే అని ఫ్రాంక్లిన్ భావం. ఆ బాధ్యత ప్రతి పౌరుడిలోనూ నరనరాన జీర్ణించుకోవాలన్నదే ఆయన అభిప్రాయం.

‘‘దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్’’ అన్న గురజాడ మాటలకు అర్థం ఇదే. సమర్థవంతమైన పాలనా వ్యవస్థలో భాగస్వాములై బాధ్యతాయత పౌరులుగా, అధికారులుగా, ప్రజాసేవకులుగా, పాలకులుగా లక్ష్య నిర్దేశం చేసుకుని ముందుకు వెళ్లాలనుకునేవారు బెంజిమిన్ ఫ్రాంక్లిన్ మాటల్లోని సారాంశాన్ని అర్థం చేసుకోవాలి.

దృక్పథం:
రెండు కప్పలు ఒక లోతైన గుంటలో పడిపోయాయి. తన ఖర్మే దీనికి కారణం అనుకుని ఒక కప్ప అలానే ఉండిపోయింది. మరో కప్ప మాత్రం బయటికి రావడానికి అనేక విధాలుగా ప్రయత్నించి గట్టు చేరింది. అప్పటివరకు.. ‘మీరు బయటికి రావడం అసాధ్యం’ అని కేకలు వేసిన తోటి కప్పలు ఈ దృశ్యాన్ని చూసి... ‘మేము అంతలా అసాధ్యం అని అరుస్తుంటే నీకు విన్పించలేదా’? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ... మీరు అరుస్తుండటం కన్పించింది కానీ విన్పించలేదు. మీరంతా నన్ను బయటకు లాగడానికి ప్రయత్నిస్తున్నారని భావించాను అని సమాధానమిచ్చింది. దీని సారాంశం ఏంటంటే... చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులను నిందిస్తూ... స్పష్టమైన లక్ష్యం, గమ్యం లేకుండా సాగే నిరాశావాదులందరికీ, ఆశావాదులందరికీ కూడా బయటకు వచ్చిన కప్ప దృక్పథం అనుసరణీయం, ఆచరణీయం. ఇది ఆచరణ సాధ్యం కావాలంటే ఆత్మపరిశీలనకు అధిక సమయం కేటాయిస్తే... తద్వారా ఇతరుల తప్పులను ఎత్తి చూపడానికి మన దగ్గర సమయం ఉండదు. ఇతరుల నిరాశావాదాన్ని స్వీకరించడానికి మనసు ఇష్టపడదు.
 
సమయానికి తగుమాటలాడే:
సంభాషణ ఒక కళ. దీన్ని సందర్భాన్ని బట్టి ఉపయోగించాలి. ఈ తరం పిల్లల్లో సమయస్ఫూర్తి, సంభాషణా చాతుర్యం, చమత్కారం తగ్గుముఖం పడుతున్నాయని ఇంటర్వ్యూలు నిర్వహించే మానవ వనరుల నిపుణుల అభిప్రాయం. సమయస్ఫూర్తి అంటే వితండవాదం, చమత్కారం అంటే అనారోగ్యకర హాస్యం చేయమని కాదు. సమయస్ఫూర్తి, జీవితానుభవం, ఆత్మావలోకనం ద్వారా చక్కటి సంభాషణ నైపుణ్యం అలవడుతుంది.

1926లో రాధాకష్ణ పండితులు అమెరికాలో ఒక ఉపన్యాసం ఇస్తూ... భారతీయ తత్వ విలువల్లో ప్రపంచాన్ని రక్షించే సందేశం ఉంది అని అన్నారు. భారతదేశం స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న రోజులవి. వెంటనే ఒక విద్యార్థి ఇండియా తనను తాను రక్షించుకోలేకపోతోంది. ప్రపంచాన్ని ఏమి రక్షిస్తుంది? అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా... ‘‘ఏసుక్రీస్తు ఇతరులను రక్షించడానికి పుట్టాడు కానీ తనను తాను రక్షించుకోవడానికి కాదు కదా’’ అని ఆయన చమత్కరించారు.  ఆ సమయస్ఫూర్తి, చమత్కారం ఆయనను  దేశంలోనే అత్యుత్తమ పరిపాలకునిగా తీర్చిదిద్దాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

రామాయణంలో సంభాషణ ఎలా ఉండాలనే అంశంపై వాల్మీకి చక్కగా వివరిస్తారు...

అవిస్తరం అసందిగ్ధం అవిలంబితం అవ్యథం
ఉరస్థం కంఠగం వాక్యం వర్థతే మధ్య మన్వరం

(సంభాషణ క్లుప్తంగా, స్పష్టంగా, సాగతీతలు లేకుండా, మృదువైన స్వరంతో వర్ణోత్పత్తి స్థానాలైన హృదయ, కంఠాలను ఆశ్రయించి మధ్యమ స్వరంలో ప్రతి అక్షరం పలకాలి.)

అప్పుడే ఆ సంభాషణ శ్రోతను ఆత్మీయతతో ఆకట్టుకోగలుతుంది. గంటల కొద్దీ టాక్‌టైమ్‌ను వేలకు వేలు వెచ్చించి కొనుక్కుంటున్నాం కానీ... ఆ ‘టాక్’లో స్పష్టత, లక్ష్యం కొరవడి... సంభాషణ కొరత (కమ్యూనికేషన్ గ్యాప్)తో మానవ సంబంధాలు తల్లడిల్లిపోతూ... సామాజిక మూలాలనే దెబ్బతీస్తోంది అన్న విషయం మరిచిపోతున్నాం. అర్థం, లక్ష్యం లేని సంభాషణలు (చిట్ చాట్, గాసిప్) ఆ సమయంలో ఆనందింపజేసేవిగా ఉన్నా... తర్వాత మానసిక క్లేశాన్ని, న్యూనతాభావాన్ని కలిగిస్తాయని శాస్త్రవేత్తల పరిశోధనల్లో కూడా తేలింది. అర్థవంతమైన సంభాషణ ద్వారా.. ఆ సంభాషణలో వాడే పదాల ద్వారా.. వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలిగే పరిస్థితి ఉందంటే సంభాషణ ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోవాలి.

సాహిత్య ఆస్వాదనం:
వందలకొద్దీ పుట్టుకు వస్తున్న కోర్సుల వరదలో సాహిత్య పఠనాన్ని పూర్తిగా విస్మరించడం యువతరానికి, నవతరానికి శాపమే. సాహిత్యపఠనం వల్ల తాత్కాలిక ప్రయోజనాలు ఏమీ తక్షణం గోచరించకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది అనుకోవచ్చు. అయితే సాహిత్య ప్రయోజనాలను విస్మరిస్తే... ఆధునికత పెరగవచ్చు ఏమో కానీ నాగరికత పెరగదు. సాహిత్య పఠనంలో.. శారీరక మానసిక వికారాలు అణిగి మనస్సు నిర్మలమవుతుంది. కఠిన హృదయాలను మృదు హృదయలుగా మార్చగలగడమే సాహిత్య ప్రయోజనం. అందుకే విశ్వశ్రేయ: కావ్య: అన్నారు. కావ్యం విశ్వశ్రేయస్సును కాంక్షించేది.
 
ఒక రోజు ఒక చిన్న పిచ్చుక రోడ్డు మధ్యలో వీపు నేల మీద ఆన్చి పడుకుని కాళ్లు పెకైత్తి ఆందోళనతో.. కాళ్లను విదిలిస్తుంది. అటుగా వెళుతున్న ఒక గుర్రం దానిని చూసి.. ‘తలకిందులుగా ఏం చేస్తున్నావ్’? అని అడిగింది. దానికి ఆ పిచ్చుక.. ఈ రోజు ఆకాశం, భూమి ఒకటి కాబోతున్నాయట. ఆకాశం, భూమి మీదకు వస్తే.. మనం మిగలం కదా? అందుకే ఆకాశాన్ని భూమి మీద పడకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నాను అంది. దానికి గుర్రం.. ‘పుల్లల్లాంటి కాళ్లతో ఆకాశాన్ని ఆపుతావా’ అంటూ హేళన చేసింది. దానికి పిచ్చుక ‘ఎవరు చేయగలిగింది వారు చేయూలి కదా. నేను చేయగలిగింది నేను చేస్తున్నాను’ అంది. అంత అల్ప ప్రాణికే లోక కల్యాణంపై అంత సమర్పణ భావం ఉందంటే ఉత్కృష్ట ప్రాణులమైన మనకు ఎంత ఉండాలి? ఏదైనా ప్రమాదం లేదా విపత్తు సంభవించినా లోకం ఎలా పోతే నాకేం? నేను సురక్షితంగానే ఉన్నాను కదా అని భావించేవారూ, గుర్రంలా ఆరోపించే వారూ మనలో అధికం. పిచ్చుకలా తమవంతు కృషి చేసేవారూ ఉన్నారు. తమ చుట్టూ ఉన్న సమాజం ఆనందంగా, ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంటేనే మనం భద్రంగా ఉంటాం అనే భావన బలపడాలి. ఆ భావనను సృష్టించి, పెంపొందించేదే సాహిత్యం. విశ్వశ్రేయస్సులోనే వ్యక్తి సౌభాగ్యం కూడా ఇమిడి ఉంది అని దీని అర్థం.
 
అంతర్ముఖ అభివృద్ధికి అభిరుచి:
ఒక వ్యక్తి తాను అనుభవించిన ఆనందాన్ని ఇంకొకరిలో కలిగించడానికి చేసే ప్రయత్నమే కళ అంటారు టాల్‌స్టాయ్. నచ్చిన కళలో ఆనందించడమే అభిరుచి. అభిరుచిని ఎవరికి వారు తమ మానసిక స్థితిని బట్టి ఎంచుకోవాలి. ఎందుకంటే మానసిక స్థితి ప్రతి ఒక్కరిదీ భిన్నంగా ఉంటుంది కాబట్టి. ఎవరో చెప్పారనో, ఇంకెవరో చేస్తున్నారనో కాకుండా.. ఎవరికి వారు తమ తమ ఆత్మానందం కోసం అభిరుచిని అభివృద్ధి చేసుకోవాలి. జీవిత కాలం నిండుగా, నిర్భయంగా, మానవత్వంతో బతకాలంటే అభిరుచి అత్యవసరం అంటారు సంజీవ్‌దేవ్.

సాధారణ వ్యక్తులు కాల, భావ ప్రవాహాల్లో కొట్టుకుపోతారు. కొందరు సమస్యలు, కష్టాల కడగండ్లు చుట్టుముడుతున్నా వాటిలో కొట్టుకుపోకుండా.. తాము సుఖపడుతూ, తమ చుట్టూ ఉన్నవారిని అర్థం చేసుకుంటూ తమకు చేతనైనంత ఆనందం పంచుతారు. దీనికి కారణం అభిరుచి కారణంగా వారిలో ఏర్పడిన అంతర్ముఖ అభివృద్ధి. దురదష్టవశాత్తూ నేటి సమాజంలో మనుషుల మధ్య ప్రేమానురాగాల కంటే సాంఘిక హోదాకే ఎక్కువ గౌరవం లభిస్తోంది. ప్రతివాళ్లకు తాము సుఖంగా జీవించే కంటే అందరూ తాము సుఖంగా జీవిస్తున్నట్లు అనుకోవాలని భావిస్తూ క్రమంగా జీవితంలో పై మెరుగులకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల జీవనం, జీవితం డొల్లగా మారిపోయి మానవసంబంధాల్లో మానవత్వం మృగ్యమవుతోంది. ప్రేమ లేకుండా పెట్టిన రొట్టె చేదుగా ఉండటమే కాకుండా ఆకలిని సగమే తీర్చినట్లు హృదయాలతో మానవసంబంధాలను నెరపని ప్రస్తుత స్థితి అంతర్ముఖ అభివృద్ధి లేని కారణంగా తన చుట్టూ వెగటుతనాన్నే వ్యాపింప జేస్తోంది. అందుకే ఆనందమయ జీవన శైలికి అభిరుచి అత్యవసరం. ‘నీ అభిరుచి చెబితే నువ్వేంటో నేను చెబుతా’ అంటారు ఐన్‌స్టీన్.
 
థామస్ ఆల్వా ఎడిసన్‌ను సృష్టిలో నీకు ఆసక్తి కలిగించే అంశాలు ఏమిటని ప్రశ్నిస్తే.. ‘అన్నీ’ అని సమాధాన మిచ్చారు. ఆయన అభిరుచి సాంద్రత ఆయన జీవన సాంద్రతను పెంచడమే కాకుండా మానవ జీవన గమనాన్ని ఎన్నో రెట్లు సారవంతం చేసింది.
 
పొదుపు:
వివేకానందుని మాటల్లో... మనిషికి గల పాపాలు రెండు. అసహనం, అత్యాశ. అత్యాశవల్ల స్వర్గానికి దూరమయ్యాడు. అసహనం వల్ల స్వర్గాన్ని చేరుకోలేక పోయాడు. దీనికి కారణం మానవుడు సంపద సృష్టి, వినియోగంలో పొదుపు అనే మూల సూత్రాన్ని విస్మరించడమే. ప్రాథమిక అవసరాలు, సౌకర్యాలు, విలాసాలు అనే నిచ్చెనలో ఏ మెట్టు మీద నిలబడాలో తెలియని సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నాడు.

ఉరుకులు, పరుగులతో కూడిన యాంత్రిక జీవనాన్ని సాగిస్తూ.. విశ్రాంతి కోసం టీవీ లాంటి ఉపకరణాన్ని ఆశ్రయిస్తే... మంచి నాన్న అనిపించుకోవాలంటే ఫలానా కారులో తిరగాలని... మంచి భర్త కావాలంటే... ఫలానా కంపెనీ డైమండ్ రింగ్ బహుమతిగా ఇవ్వాలని... కంప్లీట్ మ్యాన్ అనిపించుకోవాలంటే ఫలానా కోటు వేసుకోవాలంటూ చేసే ప్రకటనల దండయాత్రలకీ, పొందాలనుకునే విశ్రాంతికి బదులు అశాంతి, అసహనానికి లోనవుతున్నాం. ఆ అశాంతిలో ఆనందం ఏంటో మరిచిపోయి ఆ ప్రకటనల యద్ధంలో గుచ్చుకున్న బ్రాండ్ల గాయాలన్నీ మాన్పుకోవడానికి షాపింగ్‌మాళ్లకు పరుగెడతాం. ఈ బ్రాండ్ల గందరగోళంలో మన బ్రాండ్ ఏంటో మనమే తెలుసుకోలేని కత్రిమ అజ్ఞానానికి గురవుతున్నాం. ఇంట్లో వస్తువుల బ్రాండ్లన్నీ మార్చినా... మళ్లీ కొత్త బ్రాండ్స్.. కొత్త ప్రకటనలు.. మళ్లీ.. పాత అసహనం.

కూర్చుని టీవీ చూస్తే పొట్ట పెరుగుతుందని.. ట్రెడ్‌మిల్‌పై పరుగెడుతూ టీవీ చూడమని చెప్పే ప్రకటనను అమలు చేయడానికి పరుగెడతాం. ఈ పరుగులో ప్రశాంత జీవన గమనానికి కావాల్సిన శాంతి, సహనం, పొదుపు, తృప్తి అనే మౌలిక అంశాలను మరిచిపోయి... ప్రతి వస్తువు విషయంలో ఇతరులతో పోల్చుకుంటూ మన ఉనికిని కోల్పోతున్నాం. మానవ జీవనన ప్రాథమిక దశలో మనిషి తనకు అవసరమైనంతే వేటాడేవాడు. మరి ఇప్పుడు? ఏ పక్షి కూడా అవసరాన్ని మించి ఆహారాన్ని కూడా పోగేయదు. మరి మనం?

ఇటీవల కొందరు మిత్రులు జర్మనీలో ఒక హోటల్లో భోజనం చేస్తూ... అవసరానికి మించి ఆర్డర్ ఇవ్వడం వల్ల అవి తినలేక వదిలేశారు. ఇదంతా గమనిస్తున్న జర్మన్ మహిళ అభ్యంతరం వ్యక్తం చేస్తే... మా డబ్బు, మా ఆహారం, మా ఇష్టం అని ఆ మిత్రులన్నారు. దానికి ఆమె  ఆవేదనతో స్పందిస్తూ... డబ్బు మీది కావచ్చు కానీ వనరులు సమాజానివి. మీ చర్య వల్ల సామాజిక శాంతికి భంగం వాటిల్లే ప్రమాదం ఉందంటూ ఆ మహిళ సాంఘిక భద్రతా దళాలకు తెలపడం, ఆ యవకులు జరిమానా చెల్లించాల్సి రావడం జరిగింది.

ఆమెకు ఉన్న సామాజిక స్పృహ, పొదుపుపై అవగాహన అందరికీ ఆదర్శం. తనను కలవడానికి వచ్చిన సందర్శకులను చాణుక్యుడు.. ‘మీరు వచ్చిన పని వ్యక్తిగతమా? వృత్తి పరమైనదా’? అని ప్రశ్నించాడు. వారు వ్యక్తిగతం అని చెప్పడంతో.. తాను పనిచేస్తున్న పెద్ద (ప్రభుత్వ) దీపాన్ని ఆర్పివేసి చిన్న (వ్యక్తిగత) కొవ్వొత్తిని వెలిగించాడు. ఆశ్చర్యపోయిన సందర్శకులతో.. వ్యక్తిగత కార్యానికి వ్యక్తిగత వనరుల పరిమితంగా వాడటమే తన జీవనసూత్రమని చాణుక్యుడు వివరిస్తాడు. నాయకత్వం అంటే దారి పొడవునా ముందు నడవడం కాదు. బాట వేయడం.. దారి చూపడం. ఎంత దూరం వెళ్లాం, ఎన్ని వింతలు చూశాం అని కాదు ఎన్ని అనుభూతుల్ని మూటగట్టుకున్నాం? ఎంత ఆత్మ సంతప్తిని పొందగలిగాం అన్నది ముఖ్యం. ఆల్‌ఫ్రెడ్ నోబెల్ బతికుండగానే మరణించినట్లు వార్తలు వచ్చాయట. డైనమెట్ కనిపెట్టి అనేక మంది వినాశనానికి కారణమయిన వ్యక్తి మరణించాడు  అని పత్రికలు సంపాదకీయాలు రాశాయి. నిజంగా మరణించినా ఈ ప్రపంచం తనను ఇలానే గుర్తుంచుకుంటుందని భావించి... తన పేరు చెబితే మంచి గుర్తుకురావాలని ఆయన నోబెల్ బహుమతిని ప్రారంభించాడు. ఇపుడు నోబెల్ అనగానే బహుమతి గుర్తుకువస్తుంది కానీ డైనమెట్ కాదు.

అసంపూర్ణంగా ఉన్న జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు నింపుకోవటమే అభివృద్ధి. అందుకు అనుశీలన, అంతర్‌దృష్టి, అధ్యయనం, ఆలోచన అవసరం. ఆయా రంగాల్లోని మేధావులందరినీ అధ్యయనం చేయాలి. వారికి తట్టని అంశాలను పరిశీలించాలి. సమాజానికి మన వంతు తోడ్పాటును అందించాలి.
 
రుగ్వేదంలో అన్నట్లు
‘ఆనోభద్రా క్రతఓ యంతు విశ్వతః’
(అన్ని వైపుల నుంచి ఉదాత్త భావాలు మనకు సంక్రమించుగాక.)

A.V.Rajamouli, IAS
Published date : 20 Nov 2021 02:12PM

Photo Stories