Skip to main content

కారణజన్ముడు కలాం

రామేశ్వరంలో ఒక పేద ముస్లిం కుటుంబంలో జన్మించి, కుటుంబ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని తెల్లవారుజామున వార్తా పత్రికలు అమ్ముకొని పగలు స్కూలుకెళ్లి, సాయంత్రం అమ్మకు, నాన్నకు సాయపడుతూ విద్యాభ్యాసం చేసిన నిత్య విద్యార్థి కలాం. ఆయన మన మధ్య నుంచి మహాప్రస్థానం చేసినా, ఆయన జీవితం నేటి విద్యార్థి లోకానికి ఆదర్శప్రాయం అంటూ ఐఏఎస్ అధికారి ఎ.వి.రాజమౌళి రాసిన ప్రత్యేక వ్యాసం...
ఒకప్పుడు ఒక ఊరిలో ఒక పెద్ద యాపిల్ చెట్టుండేది. ఒక చిన్న పిల్లవాడు రోజూ వచ్చి ఆ చెట్టుతో ఆడేవాడు, చెట్టు ఎక్కి యాపిల్స్ కోసుకొని తిని, ఆడి ఆలసిపోయి ఆ చెట్టుకిందే నిద్రపోయేవాడు. కాలం గడిచిపోయింది. చిన్న కుర్రవాడు పెద్దవాడవుతున్నాడు. చెట్టు దగ్గరకు రావటం తగ్గుతోంది. ప్రతి రోజూ రావట్లేదు. చెట్టు బాధతో అడిగింది. నాతో ఆడుకోవూ అని. నేను పెద్దవాడినవుతున్నా కదా ఇప్పుడు నాకు బొమ్మలతో ఆడుకోవాలనుంది అన్నాడు. నా పండ్లను కోసుకెళ్లి అమ్మి బొమ్మలు కొనుక్కొమ్మంది చెట్టు. మళ్లీ చాలా రోజుల తర్వాత పెద్దవాడై కనిపించాడు. చెట్టు అడిగింది నాతో ఆడుకోవూ అని. నేను పెద్దవాడిని ఇల్లు కట్టాలి అన్నాడు. నా కొమ్మలు నరుక్కొని దాంతో ఇల్లు కట్టుకో అంది చెట్టు. చక్కగా ఇల్లు కట్టుకున్నాడు. ఒక రోజు అతను చెట్టు దగ్గరకు వస్తే నాతో ఆడుకోవు అంది చెట్టు. నాకు భార్య పిల్లలు ఉన్నారు. ఖర్చు పెరిగింది. నది దాటి పనికి వెళ్లాలి, పడవ కావాలి అన్నాడు. నా కాండం నరికి పడవ చేసుకో అంది చెట్టు. సంతోషంగా పడవలో వెళ్లోచ్చేవాడు. మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత చెట్టు ఉండే చోటుకు వచ్చాడు. అయ్యో నా దగ్గర యాపిల్స్ ఇచ్చే స్థితి లేదే అని బాధపడింది చెట్టు. నాకు నీ నీడలో సేద తీరాలనుంది అన్నాడు. నా దగ్గర ఎండిపోతున్న వేర్లు తప్ప ఇంకేమీ లేవు. వాటి మీదే కూర్చో నీకు సాంత్వన కూర్చటానికి ప్రయత్నిస్తాను అంది. జీవితంలో అలసిన అతడు ప్రశాంతంగా ఆ మొక్క మోడు మీదే నిద్రపోయాడు. మన తల్లిదండ్రులు ఆ యాపిల్ చెట్టు లాంటి వాళ్లు. మన అవసరాలన్ని తీర్చి మోడుబోయిన తర్వాత కూడా మనం ఆశ్రయిస్తే ఆప్యాయంగా ఆదరించి సేదతీరుస్తారు. మరి పిల్లలు తల్లిదండ్రులకేం చేస్తున్నారు.., స్వార్థించడం, సాధించడం, సాగనంపటం తప్ప. వారు చేసే సేవ మనం గ్రహించం. గ్రహించే సరికి ఆలస్యమవుతుంది. అందుకే తల్లిదండ్రులను ప్రేమతో చూడాలి. ఎన్నోసార్లు ఎంతోమందికి ఈ కథను చెప్పిన వ్యక్తి ఎవరో కాదు పడవ నడిపే నిరుపేద తండ్రిని - 102 ఏండ్ల పాటు జీవించిన తన మూలాన్ని జాగ్రత్తగా చూసుకొన్న సుపుత్రుడు అబ్దుల్ కలాం.

రామేశ్వరంలో ఒక పేద ముస్లిం కుటుంబంలో జన్మించి కుటుంబ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని తెల్లవారుజామున వార్తా పత్రికలు అమ్ముకొని పగలు స్కూలుకెళ్లి, సాయంత్రం అమ్మకు, నాన్నకు సాయపడుతూ విద్యాభ్యాసం చేసిన నిత్య విద్యార్థి. చిన్నతనంలో తల్లిదండ్రులకు ఇంటి పనిలోనో, పొలం పనిలోనో సాయపడుతూ సంపాదించే అనుభవం, నైపుణ్యం తదుపరి జీవితంలో చేయాల్సిన అన్ని పనుల్లోనూ ప్రావీణ్యతను సాధించటానికి తోడ్పడుతుందని స్వానుభవంతో చెప్పిన ఒక ఆచరణశీలి. రామనాథశాస్త్రితో కలిసి ముందు బెంచిలో కూర్చున్నందుకు ఒక అధ్యాపకుడు తిట్టి వెనక్కు పంపినా.. శివ సుబ్రహ్మణ్య అయ్యర్ అనే సైన్సు టీచర్, వంట గదిలో భార్య నిరసించినా.. తనకు పెట్టిన భోజనాన్ని, పక్షులు ఎలా ఎగురుతాయన్న ప్రశ్నకు, బోర్డుపై పక్షి రెక్కలు, తోకల బొమ్మల ద్వారానే కాకుండా, సముద్రం ఒడ్డుకు తీసుకెళ్లి ప్రాక్టికల్‌గా పక్షులు ఎగిరే విధానం చూపిస్తూ చేసిన విద్యా బోధన మరవకుండా.. ఆ స్ఫూర్తితో, ఆ తీపి జ్ఞాపకాలతోనే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివానన్న ఆయన మాటలు జీవితంలో ఒకరు చేసిన మంచిని గుర్తుంచుకుంటూ ఎలా ముందుకు పోవాలో నేర్పిస్తుంది.

బాల్యంలో మనం వినే మాటలు ఊహాచిత్రాలుగామారి మన చేష్టలకు కారణం కావటమే కాక అది జీవితాంతం మన ఊహాశక్తిని, ఆలోచనా సరళిని, ఆచరణ శక్తిని నియంత్రిస్తుందని, అందుకే బాల్యంలో మాతృభాషలో వీలైనన్ని ప్రోత్సాహక పదాల్ని వాడితే.. అవి జీవితాంతం పనికొచ్చే నాడీ రహదారులను మెదడులో నిక్షిప్తం చేస్తాయని తన స్వానుభవంతో పిల్లల పెంపకం గురించి-మాతృ భాషా వైశిష్ట్యం గురించి చెప్పకనే మనసు తట్టి చెప్పిన మహనీయుడాయన. తన అనుభావాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఒక రోజు నేను, నా అక్క ఒక చెట్టు మీదెక్కి ఆడుకుంటున్నాం. నాన్న పెనుగాలి రావటం చూసి కలాం కొమ్మను గట్టిగా వాటేసుకో అన్నారు. అత్తేమో అక్కతో కింద పడిపోతావ్ జాగ్రత్త అంది. పది నిమిషాల తర్వాత పెనుగాలి తగ్గిన తర్వాత నేను కొమ్మను అంటిపెట్టుకొనే ఉన్నా. అక్కమాత్రం కింద పడి ఏడుస్తూ ఉంది. నాన్న నాకిచ్చిన కమాండ్‌ను ఊహాచిత్రంగా మార్చుకొని కొమ్మను వాటేసుకుని సురక్షితంగానే ఉన్నా. అక్క తనకందిన కమాండ్‌ను ఊహాచిత్రంగా మారుస్తూ కిందపడిపోయింది. జాగ్రత్తపడే లోపే ఒక నెగెటీవ్ స్టేట్‌మెంట్ మెదడుపై చూపే చెడు ఫలితాన్ని నివారించటానికి 17 పాజిటీవ్ స్టేట్‌మెంట్స్ అవసరమౌతాయని.. అందుకే మాట్లాడే ప్రతి మాట పాజిటీవ్‌గానే ఉండాలన్న ఆయనకన్నా మంచి మానవ మనస్తత్వ శాస్త్రవేత్త ఎవరు?

కష్టాలు మనల్ని కష్టపెట్టటానికి రావు. అవి మనలో నిబిడీకృతమైన నిగూఢ శక్తుల్ని వెలికి తీసేందుకు వస్తాయి. ఇవి పైలట్‌గా సెలెక్ట్ కాలేకపోయినపుడు ఆయన తండ్రి ఇచ్చిన ప్రోత్సాహపు మాటలు. మనల్ని ఓడించటం కష్టమని కష్టానికి చెప్పాలన్న తండ్రి మాటలు గుర్తు తెచ్చుకుంటూ.. ఇంకా కష్టపడి పనిచేస్తూ, చేతి రాత బాగోలేదని మూడు గంటలు (ప్రతిరోజూ) ఇంపోజిషన్ రాయించిన గురువును స్మరించుకుంటూ.. తన చేతిరాతను, తలరాతను తన చేత్తోనే దిద్దుకున్న శ్రామికుడాయన. ఒకసారి జ్వరం వచ్చి స్కూల్‌కెళ్లకపోతే అధ్యాపకుడు తన ఇంటికి వచ్చి పరామర్శించటం మరువలేని అనుభూతిగా గుర్తుంచుకొన్న అల్పసంతోషి. కలాం పఠనాసక్తిని, అణకువను గమనించి తన ఇంటికి పిలిచి తన వంట గదిలో తన భార్యకిష్టం లేకపోయినా అన్నం పెట్టిన అధ్యాపకుని మనసంతా నింపుకొని.. బ్రాహ్మణులు ఎలా భోజనం చేస్తారో, భోజనానంతరం ఎలా తిన్నచోటుని శుభ్రం చేస్తారో చిటికలో అధ్యాపకుని చూసి నేర్చుకొని.. మరుసటి రోజు గురుపత్ని వాత్సల్యంతో భోజనం పెట్టేలా ఆ సంస్కృతిలో ఒదిగిపోయిన ఓర్పరి. ఈ సంఘటనల నుంచి ఎన్ని విషయాలు నేర్వవచ్చు మనం, మన పిల్లలూ.

అంతరాయాలు ఆపినకొద్దీ సంకల్పం దృఢం కావాలి. చేసే పనిలో తదేకంగా తపించటమే ధ్యానం. ఇలా పని చేసేవారికి వేరే ధ్యానమెందుకు అన్న తన గురువు సతీశ్ ధావన్ మాటలను జీవితాంతం దృఢసంకల్పంతో పాటించిన సాధకుడాయన. మొదటిసారి రాకెట్ ప్రయోగం విఫలమైతే ఆ బాధ్యతను తన నెత్తిన వేసుకొని మా శాస్త్రవేత్తలు శక్తివంచన లేకుండా చేశారు. వారిదేం తప్పులేదు. మరింత సాంకేతిక నైపుణ్యాన్ని వారికి ఇవ్వటానికి నేను కృషి చేయాలని విలేఖరుల సమావేశంలో మాట్లాడి వైఫల్యాన్ని తన మీద వేసుకున్న సతీశ్ ధావన్.. మరుసటి సంవత్సరం ప్రయోగం సఫలమైనప్పుడు కలాం టీంను అభినందించి.. ఓటమిని తనకు, విజయాన్ని కలాంకు ఆపాదించి.. కలాంను విలేఖరుల సమావేశం నిర్వహించమన్న సంఘటన నాయకత్వ పాఠాలను ఆయన మనసుకి హత్తుకునేలా నేర్పింది. ఆ గురువు నుంచి నేర్చుకున్న దాన్ని మరింత ఔన్నత్యంతో అమలుచేసి.. నాయకత్వం వహిస్తూనే సహచరుడిగా ఎలా లక్ష్యసాధనలో మమేకం కావాలో ఆచరించి చూపిన ఆదర్శ నాయకుడు. అలాగే అత్యుత్తమ విజయాలు సాధించిన క్షణాల్లో దేశమంతా ఆనందోత్సాహల్లో తేలి ఉంటే.. ‘తనను ఇంతవాడిని చేసిన గురువులు జీవించి ఉంటే ఎంత సంతోషపడేవారో కదా’ అని బాధపడ్డ సున్నిత మనస్కుడు. ఎక్కడ పనిచేసినా తనలోని శక్తినే కాక తన చుట్టూ ఉన్నవారి శక్తిని కూడా వెలికి తీయగల ద్రష్ట. ఉన్నతమైన లక్ష్యాలతో హృదయం ఉప్పొంగినపుడు దానికి గంభీరమైన విద్యుదయస్కాంత శక్తి వస్తుంది. ఆ లక్ష్యం/కోరిక లోక కల్యాణార్థమైతే ప్రకృతిలో ఉన్న సాత్విక శక్తులన్నీ కేంద్రీకృతమై ఆ కోరికను సాకారం చేస్తాయి అని తను చేపట్టిన ప్రతి బాధ్యతలోనూ రుజువు చేసిన స్రష్ట. ఇంట్లో కష్టపడి పనిచేసి, ప్రభుత్వ కళాశాలలో చదువుకొని, స్వశక్తితో ఉన్నతమైన బాధ్యతలను అందుకొని.. సహచరులనుంచి, గురువులనుంచి టీంలీడర్‌గా ఉంటూకూడా ఎంత ఎక్కువ వీలైతే అంత నేర్చుకుని.. ఏ మాత్రం అహంకార ఛాయ లేకుండా.. సంస్థ లక్ష్యాల కోసం ఒదిగిపోయి తన టీంను విజయ పథంలో నిలుపుతూ వచ్చిన ఆయన మన టీం లీడర్లందరికీ ఆదర్శం కాదూ? వైఫల్యాన్ని నాయకుడిగా తాను స్వీకరించి విజయాన్ని టీంకు పంచటానికి ఎంత ఔన్నత్యం కావాలి.

సత్యంచ సమతాచైవ దమశ్చైవ న సంశయః
అమాత్సర్యం క్షమాచైవ హీస్తితి క్షానసూయతా
త్యాగోధ్యాన మధార్యత్వం ధృతిశ్చ సతతం దయా
అహింసాచైవ రాజేంద్ర సత్యకారా సమో దశ


నిజాయితీ, సమభావం, ఆత్మనిగ్రహం, అనాడంబరం, క్షమ, అణకువ, సహనం, అసూయ లేకపోవటం, దాతృత్వం, ఔన్నత్యం, ఆత్మనిర్భరత, దయ, అపకారం చెయ్యకుండటం, ఈ పదమూడు గుణాలు కలిస్తేనే సత్యం పరిపూర్ణంగా పాటించినట్లు. ఇది కలాం గారికి పూర్తిగా వర్తిస్తుంది. ఒకసారి క్షిపణి తయారీ జట్టులో ఒక సభ్యుడు మరుసటి రోజు మధ్యాహ్నం ఇంటికి త్వరగా వెళ్లాలనీ, పిల్లలను ఎగ్జిబిషన్‌కు తీసుకెళ్లాలని కోరాడు. కలాం అనుమతిచ్చారు. అయితే మర్నాడు ప్రాజెక్టు పనిలో తదేకంగా నిమగ్నమై తన పిల్లల విషయమే మర్చిపోయి సమస్య పరిష్కారానికి తపన పడుతున్న ఆ వ్యక్తి నిష్టను గమనించారు. ఆ సభ్యుడు సాయంత్రం ఇంటికి వెళ్తుండగా పిల్లల సంగతి గుర్తొచ్చి బాధపడ్డాడు. ఇంటికెళ్లేసరికి భార్య ఒక్కతే ఉంది. అదేమని అడిగితే మీ మేనేజరు ఎవరో కలాం వచ్చి పిల్లల్ని ఎగ్జిబిషన్‌కి తీసుకెళ్లారు అంది. నాయకుడిగా ఉంటూ సహచరుడిగా సమభావంతో పనిచేయటం ఆయన దగ్గరే నేర్వాలి. అందుకే ‘సర్వస్మిన్నపి పశ్యాత్మానమ్’ (అందరిలోనూ నిన్నే చూసుకో) అనే భజగోవిందంలోని సూక్తిని పదే పదే గుర్తుచేసే వారాయన. అలాగే ఒక రోజున ఆయన డీఆర్‌డీవో (డిఫెన్‌‌స రీసెర్‌‌చ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్)లో తన టీంకు నాయకత్వం వహిస్తున్న రోజుల్లో భవనాన్ని సురక్షితంగా ఉంచటానికి ప్రహరీగోడ కట్టి, దానికి గాజు పెంకులు అంటిద్దామని సూచించారు నిపుణులు. గాజు పెంకులు పెడితే గోడమీద వాలిన పక్షులు గాయపడవూ! అని వారించారాయన. తనలోని పసి హృదయాన్ని పోగొట్టుకోని ఆయన ఎంత ఉన్నతుడు.

చిన్నపిల్లల దగ్గరైనా మనకు తెలియని విషయం ఉంటే నేర్చుకోవాలనే జిజ్ఞాస ఆయనది. బరువైన లోహపు కాలిపర్స్ ధరించి నడవలేక ఈడ్చుకుంటూ వెళ్తున్న పోలియో బాధిత చిన్నారుల కోసం తేలికైన కాలిపర్స్ రూపొందించారు. తాను క్షిపణుల కోసం తయారు చేసిన లోహంతో 30 గ్రాముల్లో కాలిపర్స్‌ను రూపొందించి ఈడ్చే కాళ్లను నడిచేట్టు చేయగలిగారు. ప్రతీ శాస్త్రవేత్తకు ఉండాల్సిన మానవీయ దృక్పథం ఇది.

సేవ (సర్వీస్) అనే పదానికి సంస్కృతంలో ‘ఆనందించటం’ అని కూడా అర్థం ఉంది. సేవ చేసినప్పుడు ఇతరులకు సాయం చెయ్యటమే కాక ఆనందించాలన్న తత్వం ఆయనది. ఒకసారి తనకు భారత అంతరిక్ష సంస్థలో మిత్రుడైన కస్తూరి రంగన్‌ను రాష్ట్రపతి భవన్‌లో భోజనానికి పిలిచారు. తమ ఇద్దరికీ ఇడ్లీ, దోశ తయారు చెయ్యమని చెప్పి.. డైనింగ్ హాల్‌లో రాష్ట్రపతికి ఉద్దేశించిన కుర్చీలో కస్తూరిరంగన్‌ను ‘అతిథి దేవోభవ’ అని కూర్చోబెట్టి మర్యాదలు చేశారు. ఈ రోజు ఈ విందుకి నీవే ప్రెసిడెంటువి అని చిన్నపిల్లాడిలా సేవ చేశారు. తాను వెంట ఉండి అంతా కలయ తిరిగి చూపించారు. కట్టుకోవటానికి ఒక లుంగీ, ఒక వీణ ఉన్న అతి సాధారణ గదిని తన శయన మందిరంగా కలాం పరిచయం చేసే సరికి కస్తూరి రంగన్ కళ్లు చెమర్చాయి. కలాం రాష్ట్రపతి అయినా.. వ్యక్తిగా సాధారణ దక్షిణ భారత దిగువ మధ్యతరగతి పౌరుడి జీవితమే సాగిస్తున్నారని, ఆహారంలో, ఆహార్యంలో, అలవాట్లలో, అభిమానంలో, ఆప్యాయతలో, అభిరుచులలో తన పాత కలాంలో ఇసుమంత మార్పైనా లేదని లోలోన పొంగిపోయారు కస్తూరి రంగన్.

భారతదేశం శాంతి కాముక దేశం. అలాంటప్పుడు ఆయుధాలు, క్షిపణులు ఇవన్నీ ఎందుకని కొందరు విమర్శించారు. తన బిడ్డల్లా రూపొందించిన క్షిపణుల విషయంలో, అణ్వస్త్రాల విషయంలో కలాం ఇలా స్పందించారు. ‘‘మనం బలం కలిగి ఉంటేనే బలవంతుల చేత గౌరవింపబడతాం. మనం బలహీనంగా ఉండి శాంతి వచనాలు వల్లిస్తే ఎవరూ లెక్కచేయరు’’. అంత గంభీరంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన రాష్ట్రపతిగా మొదటిసారి త్రివేండ్రం వెళ్లినపుడు తాను విక్రమ్ సారాభాయ్ నేతృత్వంలో పనిచేసిన జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకున్నారు. ఆ రోజుల్లో ఆయనకు చెప్పులు కుట్టి ఇచ్చిన వ్యక్తిని, రోడ్డుపక్క చిన్న బండి మీద రాత్రి వేళల్లో ఏదో ఒక ఆహారం రుచిగా చేసి ఆప్యాయంగా పెట్టిన మొబైల్ క్యాంటీన్ యజమానినీ.. ఆదరంగా తన అతిథులుగా ఆహ్వానించి ఆతిథ్యమిచ్చారు. ఉపన్యసించేటపుడు ఎంత నిష్కర్షగా స్పష్టంగా తన అభిప్రాయాలు చెప్పేవారో.. ఉపన్యాసం మధ్యలో కరెంటు పోతే సభికుల మధ్యకు వెళ్లి కొంచెం గట్టిగా మాట్లాడి ఉపన్యాసం కొనసాగించేవారు.

ఒక ఉపన్యాసం అనంతరం ఒక బాలిక దేవుడు ప్రత్యక్షమైతే మీరే వరం కోరతారు అని అడిగితే.. దేశానికి పరిశ్రమించే తత్వాన్ని, దార్శనిక దృష్టిని అలవరచాలని కోరతానని చెప్పారు. భారతదేశ చరిత్ర చూస్తే మనపై ఎంతమంది దండయాత్రలు చేసినా.. మనం మాత్రం ఇతరుల స్వాతంత్య్రాన్ని గౌరవిస్తూ ఆ పని ఎప్పుడూ చేయలేదని అదే మన ఆత్మబలమనీ చెప్పేవారు. అయితే దేశం సుభిక్షంగా ఉండాలంటే.. వర్షాలు కురవటమే కాక ప్రతి పౌరుడి శరీరం నుంచి స్వేదం వర్షించాలనీ ప్రతిదానికీ దేశాన్నీ, ప్రభుత్వాన్ని విమర్శించటం తగదనీ, ఆత్మ నిర్భరత (సెల్ఫ్ రిలయెన్‌‌స)తోనే ఆత్మగౌరవం ఇనుమడిస్తుందనీ.. విదేశాలలో వ్యవస్థలను గౌరవిస్తూ రాణించే భారత పౌరులు ఇక్కడ వ్యవస్థలను ఎందుకు గౌరవించరని బాధపడేవారు. మన ఆత్మను డబ్బుకు తాకట్టు పెట్టకూడదనీ, నిరాశావాదం మంచిదికాదనీ హెచ్చరించేవారు. ఇజ్రాయెల్ దేశంలో బాంబు దాడిలో కొందరు మరణిస్తే.. అక్కడి పత్రికలు మరుసటి రోజు ప్రధాన శీర్షికగా ఎడారి భూమిని తన సాంకేతిక నైపుణ్యంతో సస్యశ్యామలం చేసిన రైతు కథను ఎంచుకొన్నాయనీ, బాంబు వార్త చివరి పేజీలకు వెళ్లిందనీ.. మన ప్రసార సాధనాలు కూడా తమ ప్రాధాన్యాలను గుర్తెరగాలనీ ఆశించారు. సూర్యుడిలా దేశం వెలగాలంటే దేశవాసులంతా సూర్యుడిలా తపించాలని తపన పడేవారు.

ఆలోచనా యంత్రంలో నలిగే వ్యక్తుల్లో జీవరసం ఇంకిపోతుంది. అలా ఇంకనివ్వకుండా ఉండాలంటే.. రససృష్టి అన్నా తెలియాలి రసానందం అన్నా తెలియాలి. ఐన్‌స్టీన్ లాంటి మహానుభావులు వయొలిన్ వాయించుకుంటూ రసానందంపొంది సేదతీరితే.. కలాం వీణవాయిస్తూ ఆనందించేవారు. సంగీతం, గణితం, విజ్ఞానశాస్త్రంలో ఎన్నో సారూప్యతలున్నాయి. శాస్త్రీయ సంగీతాన్ని వినటం, సాధన చేయటం ఎన్నో వ్యక్తిగత విజ్ఞాన శాస్త్ర సందేహాలను సమాధానపరచిందని ఆయన చెప్పేవారు. శాస్త్రీయ సంగీతం స్వీయ ఉద్రేకాన్ని కరిగించి హృదయం నిండా దయనూ, మనసు నిండా నైతిక మూల్యాలనూ నింపే సామాజిక సాధనం అని ఆయన ప్రగాఢ విశ్వాసం. సంగీతంలో ఉండే లయ మన శారీరక మానసిక వ్యాపారాలకు లాలిత్వాన్ని ప్రసాదించి, దైవత్వాన్ని పెంచి మృగత్వాన్ని తగ్గిస్తుందని ఆయన నమ్మేవారు. భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఉన్న గొప్పదనం అది ప్రతి పాదించే శాశ్వత విలువలలో ఉందనీ.. హృదయజనితమైన కళాదృష్టి, మేధోజనితమైన వైజ్ఞానిక దృష్టిని పదును పెట్టటానికి ఉపయోగపడుతుందని ఆయన వక్కాణించేవారు. కర్ణాటక సంగీతంలో శ్రీరాగంలో త్యాగరాజస్వామి పంచరత్న కీర్తన ఎందరో మహానుభావులును ఆగకుండా వీణపై వాయించటం తనకు అత్యంత ఇష్టమని పేర్కొనేవారు. కెరీర్‌ను కళలనూ సమన్వయం చేసుకోవటానికి ఇంతకంటే మరొకరు మార్గదర్శకులు కాగలరా?

వేలసంవత్సరాల క్రితం రాసిన తిరుక్కురళ్, మన ఆరాధ్యగ్రంథం భగవద్గీత నుంచి ఆయన ఎంతో స్ఫూర్తి పొందేవారు. మన ఉథ్గ్రంధాలను చదివితేనే వ్యక్తిత్వంలో దృఢత్వం వస్తుందని ఆయన నమ్మకం.

భగవద్గీతలో చెప్పిన..
ముక్తసంగోనహంవాదీ ధృత్యుత్సాహ సమన్వితః
సిధ్యసిధ్యోర్నిర్వికారః కర్తాసాత్విక ఉచ్చతే.


ఈ పని నేను చేస్తున్నాను అన్న భావన లేకుండా.. ఫలంమీద ఆశ లేకుండా.. ఈ పనివల్ల ఈ ఫలం సిద్ధిస్తుందా లేదా అన్న విచారణ లేకుండా.. ఇది నా విధి/కర్తవ్యం అనే దృష్టితో ఆ పనిని ధైర్యం, ఉత్సాహంతో చేసేవాడు సాత్వికకర్త. తాను సాత్విక కర్తగా పని చేయాలనుకుంటానని కలాం చెప్పేవారు. మన ప్రాచీన గ్రంథాలు చదవటానికి ఇంతకంటే ఎటువంటి ఉదాహరణలు కావాలి?

పైలట్‌గా సెలెక్ట్ కావాలనే తన కోరిక తీరకపోయినా, తనబిడ్డ కలెక్టర్ కావాలనే తన తండ్రి కోరిక తీరకపోయినా నిరుత్సాహపడక భారత అంతరిక్ష కార్యక్రమానికీ, క్షిపణుల నిర్మాణ కార్యక్రమానికీ అణువిజ్ఞాన కార్యక్రమానికీ పైలట్‌గామారి.. భారతరత్నంగా తనను తాను మలచుకున్న మణిపూస కలాం. ఒక్కసారి కూడా విదేశాలలో శిక్షణ పొందకుండా ఈ రంగాలలో భారత దేశం స్వావలంబన సాధించడానికీ , మేక్ ఇన్ ఇండియాకి నిలువెత్తు రూపం ఆ నిస్వార్థజీవి. దేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి అనుగుణంగా ఆ విలువలను మనలో అంతర్లీనంగా ప్రవహింపచేసుకుని, దేశాభివృద్ధిని చేసుకుంటేనే మనం ఆనందించగలుగుతాం అన్న స్వచ్ఛమైన స్వదేశీస్వాప్నికుడు. మనదేశంలో కుటుంబ సభ్యుల మధ్య ఉండే బలమైన సంబంధ బాంధవ్యాలు మనదేశపు తరగని ఆస్తి అనేవారు కలాం. తన చదువుకోసం డబ్బు సమకూరనప్పుడు తన అక్క బంగారు గాజులను తాకట్టు పెట్టి.. ఆ డబ్బు తెచ్చిచ్చి కలాం చదువు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగకూడదని, తనపై అచంచలమైన విశ్వాసాన్ని, ప్రేమను చూపిన అక్క జోహరాను ఆయన పదేపదే గుర్తుకు తెచ్చుకొని, ఆమె త్యాగం స్ఫూర్తితో రాత్రింబవళ్లు కష్టపడి చదివి స్కాలర్‌షిప్ డబ్బులతో చదువు పూర్తిచేసి, తన మొదటి సంపాదనతో ఆ గాజులను విడిపించి అక్కకు కృతజ్ఞత భావంతో సమర్పించిన ఆయన.. తోబుట్టువుల మధ్య ఉండాల్సిన అనురాగం, ఆప్యాయతలను చెప్పకనే చెప్పారు. అలాగే బాల్యంలో, విద్యాభ్యాసంలో తనకు ఎన్నో విషయాల్లో దిశానిర్దేశం చేసిన బావ జలాలుద్దీన్ మరణం తనను ఎంతో కుంగదీసిన పరిణామంగా చెప్పడం మానవ సంబంధాలపట్ల ఆయనకున్న అనుభూతుల గాఢతకు నిదర్శనం.

‘‘క్రియాసిద్ధిః సత్వేభవతి మహతాం నోపకరణే’’

సఫలత్వం సామర్థ్యంలో ఉంటుంది గానీ పనిముట్టులో కాదు...అన్న వాక్కు ఆయన జీవితానికి అక్షరసత్యం.

నా జీవితం అందరికీ మార్గదర్శకంగా ఉండాలని నేను భ్రమపడను. అయితే సుదూర తీరాలలో ఆదరణ, ఆశ్రయం లేక అలమటించే నిస్సహాయులు.. తమ జీవన సంకెళ్ల నుంచి తమను తాము ఉద్ధరించుకోవటానికి నా జీవితం ప్రేరేపిస్తే నా జన్మ సఫలమైనట్లే అనేవారు. మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలి.. శాస్త్రవేత్తగానా? రచయితగానా? రాష్ర్టపతిగానా అని అడిగితే.. ఒక అధ్యాపకుడిగా గుర్తుంచుకొమ్మన్నారు. అందుకేనేమో ఆయన జన్మదినమైన అక్టోబర్ 15ను ప్రపంచ విద్యార్థి దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఆయన జీవించిన చివరి రోజున గౌహతి నుంచి షిల్లాంగ్ వెళ్లేటప్పుడు తన ముందు వాహనంలో ఒక భద్రతగార్డు 3 గంటల నుంచి నిలబడటం చూసి తట్టుకోలేక అతడు అలసిపోతాడు కూర్చోమనండి అని నాలుగుసార్లు కబురుచేసిన ఆయన.. గమ్యానికి చేరిన తర్వాత భుజంతట్టి నావల్ల నీకీకష్టం గదా అంటే.. ఆ గార్డు మీలాంటి వ్యక్తి కోసం 6 గంటలైనా నిలబడతానన్నాడట.

దేశ అత్యున్నత పదవిలో ఉండి చేపట్టిన ప్రతి పనిలోనూ అత్యున్నతంగా రాణించి అత్యుత్తమ విజయాలు సాధించిన ఆయనను.. ఒక చిన్న బాలిక మీరు జీవితంలో సాధించినదేమిటని అమాయకంగా ప్రశ్నిస్తే.. అదే అమాయకత్వంతో ఆ చిన్నారి జిజ్ఞాసను పెంచే విధంగా నేను సూర్యుడి చుట్టూ 83 సార్లు ప్రదక్షిణలు చేశాను (భూమి సూర్యుడి చుట్టూ తిరగటానికి ఒక సంవత్సరం పడుతుంది అంటే నా శరీరానికి 83 ఏళ్లు సాధించటమే నేను సాధించింది) అని అణకువతో సెలవిచ్చిన ఆ మహామనిషి, మానవతామూర్తి 84వ ప్రదక్షిణలో ఆగిపోవటం మనసున్న ప్రతివారినీ మనోవేదనకు గురిచేసేదే. వ్యక్తి ప్రేమకంటే వస్తు ప్రేమ సత్సాంగత్యానికంటే సుఖసామాగ్రి సాంగత్యం పెరుగుతున్న ఆధునిక సమాజంలో కనీసం టెలివిజన్ కూడా కొనుక్కోకుండా రేడియోలో వార్తలు వింటూ అతి సాధారణమైన జీవితాన్ని గడిపిన అసాధారణ వ్యక్తి ఆయన.

తరువులు అతిరస ఫలభార గురుతగాంచు
నింగివ్రేలుచు అమృతమొసంగు మేఘుడు
ఉద్ధతులుగారు బుధులు సమృద్ధి చేత
జగతినుపకర్తలకిది సహజగుణము


... (మిక్కిలి రసభరితమైన ఫలాలు కలిగిన చెట్లు నేలవైపు వంగి ఉంటాయి. ప్రాణాధారమైన వర్షాన్నిచ్చే మేఘుడు నేలవైపే చూస్తుంటాడు. తమ విజయాల చేత ఎదిగినకొద్దీ గొప్పవారు ఒదిగే ఉంటారు. సృష్టిలో ఉపకార స్వభావం కలవారికి ఇది సహజగుణం) అన్న భర్తృహరి సుభాషితానికి సజీవరూపం కలాం.

శరీరం క్షణ విధ్వంసి కల్పాన్తస్థాయినో గుణాః

శరీరం క్షణ భంగురమైనా గుణాలు కల్పాంతం వరకూ నిలిచి ఉంటాయనటానికి ఆయనే నిలువెత్తు ఉదాహరణ. తను జీవించిన చివరి రోజున ఆయన మనలను శాశ్వతంగా వదిలివెళ్తూ మాట్లాడబోయిన అంశం ‘‘క్రియేటింగ్ ఏ లివబుల్ ప్లానెట్ ఎర్‌‌త’’. తన జీవితమే ఒక పెద్ద ఆచరణీయ గ్రంథంగా మలచుకొన్న ఆయన తను జీవించిన విధానంతోనే అన్ని వృత్తుల, వయసుల, వర్గాల వారికీ పాఠాలు నేర్పి అనాయసంగా అమరులయ్యారు. తన జీతభత్యాలను మారుమూల గ్రామాలలో పట్టణ సౌకర్యాలను ఏర్పరచడానికి కృషి చేసే పీయూఆర్‌ఏ (ప్రొవైడింగ్ అర్బన్ ఫెసిలిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్) ట్రస్టుకు అప్పజెప్పి తనకు వారసత్వంగా లభించిన నిజాయతీ, క్రమశిక్షణ (తండ్రి నుంచి), మంచితనంపై విశ్వాసం (తల్లినుంచి) చేసే పనిపట్ల అంకితభావం, నాయకత్వ లక్షణాలు(గురువుల నుంచి) లాంటి అమూల్య ఆస్తులను మన తరానికి, వారసత్వ సంపదగా అందించి.. మరణించాక కూడా ప్రజల మధ్య జీవించగలగడం ఎలాగో చేసి చూపించారు. గాంధీజీ నోటినుంచి వెలువడిన మంత్రముగ్ధమైన మాటలు..
  1. Be the change you want to see in the world.
  2. My life is my message.
ఈ మాటలకు సజీవ రూపంగా తననుతాను మలచుకొని, చిరస్మరనీయుడైన సాత్విక శిల్పి కలాం.

అనాయసేన మరణం వినాదైన్యేన జీవితం
దేహాంతే తావసాయుజ్యం దేహిమే పరమేశ్వర


(అనాయాసంగా ప్రాణాన్ని విడిచిపెట్టడం, జీవించి ఉన్నప్పుడు దీనస్థితి లేకుండా జీవించడం, తనువు చాలించిన తర్వాత పరమాత్మ సన్నిధిని పొందడం నాకు అనుగ్రహించు పరమేశ్వరా)

నిత్యబ్రహ్మచారిగా ఉన్న ఆయన తన కార్యక్షేత్రం అనే బ్రహ్మంలో చరిస్తూ,విశ్వవీణకు తంత్రిగా మారి లోక కల్యాణం కోసం తపిస్తూ.. రుషి తుల్యుడైన విదురుడు భగవంతుడిని పైన ప్రార్థించినట్టుగా ‘జీవించగలిగే భూగ్రహ నిర్మాణానికి’ తన జీవితాన్ని చదివితే చాలని, కులమతాల గోడలు దాటి భారతీయుడిగా బతకడం ముఖ్యమని, శరీరం, మనసు, ఆత్మల నిండా భారతీయ తత్వం నింపుకొని చివరిసారిగా మాట్లాడబోతూ మన మధ్య నుంచి మహాప్రస్థానం చేశారు. ఎందరో మహానుభావులు అని తన మెట్లను మీటుతూ ఆయన పలికించిన ఆ వీణ ఆ మహానుభావుని తలచుకుంటూ ఎంత దుఃఖ సాగరంలో మునిగిందో!కర్మయోగి కలాంగారు కారణజన్ములే.

A.V.RajaMouli IAS
ఎ.వి.రాజమౌళి, ఐఏఎస్.
Published date : 20 Nov 2021 01:18PM

Photo Stories