Tanya Soni: సివిల్స్ కల జల సమాధి
ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్‌లో ఉన్న రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ సెల్లార్‌ను వరద ముంచెత్తిన దుర్ఘటనలో తెలంగాణలోని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన తానియా సోని (22) దుర్మరణం పాలయ్యింది. జూలై 27 రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా..అందులో సోని ఉన్నట్లు అందిన సమాచారంతో శ్రీరాంపూర్‌లో విషాదం నెలకొంది.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బిహార్‌లోని ఔరంగాబాద్‌కు చెందిన విజయ్‌కుమార్ సింగరేణి శ్రీరాంపూర్ డివిజన్‌లోని ఎస్సారీ్ప–1 గని మేనేజర్‌గా పని చేస్తున్నారు. నస్పూర్‌లోని సీసీసీ టౌన్‌షిప్ బీ–2 కంపెనీ క్వార్టర్‌లో నివాసం ఉంటున్నారు. విజయ్‌కుమార్– బబిత దంపతులకు ముగ్గురు సంతానం కాగా సోనిపెద్ద కుమార్తె. రెండో కూతురు పలక్ ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో బీటెక్ చేస్తోంది.
కుమారుడు ఆదిత్యకుమార్ హైదరాబాద్‌లో పదో తరగతి చదువుతున్నాడు. సోని గతేడాదే ఢిల్లీలోని అగ్రసేన్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. కలెక్టర్ కావాలనే తన కోరికను తండ్రికి చెప్పింది. తండ్రి ఆశ కూడా అదే కావడంతో మూడు నెలల క్రితం రావూస్ కోచింగ్ సెంటర్‌లో చేరి్పంచి శిక్షణ ఇప్పిస్తున్నారు.
జూలై 27 ఏం జరిగింది..?
ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో జూలై 27 సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఉన్న భవనం బేస్‌మెంట్‌లోకి భారీగా వరద నీరు రావడం ప్రారంభమయ్యింది. విషయం గమనించిన విద్యార్థులు బయటపడేందుకు ప్రయతి్నంచారు. కానీ విద్యుత్ సరఫరా నిలిచిపోయి బేస్‌మెంట్‌లోని లైబ్రరీలో బయోమెట్రిక్ గేటు జామ్ అయింది. దీంతో విద్యార్థులు చిక్కుకుపోయారు. బల్లలపై నిల్చుని ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు.
చూస్తుండగానే 10–12 అడుగుల లోతు నీళ్లు చేరాయి. పరిస్థితిని గమనించిన అక్కడివారు విద్యార్థులను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. రాత్రి ఏడు గంటల సమయంలో అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది మోటార్లతో నీటిని తోడారు. 14 మందిని తాళ్ల సహాయతో రక్షించారు. అర్ధరాత్రి వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగగా జూలై 28 తెల్లవారుజామున సోనితో పాటు యూపీకి చెందిన శ్రేయ యాదవ్ (22), కేరళకు చెందిన నెవిన్ డాలి్వన్ (29) మృతదేహాలను వెలికితీశారు.
స్పందించిన సింగరేణి అధికారులు
సమాచారం తెలిసిన వెంటనే సింగరేణి సీఎండీ, ఇతర డైరెక్టర్లు, శ్రీరాంపూర్‌లోని ఏరియా జీఎం బి.సంజీవరెడ్డి, అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి స్పందించారు. ఢిల్లీలోని సింగరేణి రెసిడెంట్ ఆఫీసర్ ఓజా, కోల్ కంట్రోలింగ్ ఆర్గనైజేషన్ డీజీఎం అజయ్‌కుమార్‌ను అప్రమత్తం చేశారు. దీంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని సోని మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి పోస్టుమార్టం చేయించారు. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టమ్ అనంతరం మూడు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ప్రయాణంలో ఉండగా మరణ వార్త
విజయ్‌కుమార్–బబిత దంపతులు రెండో కూతురు పలక్‌ను కాలేజీలో దింపడం కోసం జూలై 27 రైల్లో లక్నో బయల్దేరారు. కాగజ్‌నగర్‌కు చేరుకోగానే వారికి సోని మరణవార్త తెలిసింది. దీంతో వారు తీవ్ర విషాదంలోనే నాగ్‌పూర్ వరకు వెళ్లి అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఆసుపత్రిలో విగతజీవిగా పడి ఉన్న సోనిని చూసి బోరున విలపించారు. అనంతరం మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం తమ స్వస్థలమైన ఔరంగాబాద్‌కు తరలించారు. విజయ్‌కుమార్‌కు పిల్లలంటే ఎంతో ఇష్టమని, వారి కేరీర్ గురించి ఎప్పుడు తమతో చర్చిస్తూ ఉండేవాడని తోటి అధికారులు తెలిపారు.
10 మందికి పైగా గల్లంతు?
ముంపు ఘటన నేపథ్యంలో విద్యార్థులు అర్ధరాత్రి నుంచే ఆందోళనకు దిగారు. 10 మందికి పైగా గల్లంతయ్యారని ఆరోపించారు. మృతులు, గాయపడిన వారి వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
పోలీసుల అదుపులో స్టడీ సర్కిల్ యజమాని
స్టడీ సర్కిల్ యజమాని అభిõÙక్ గుప్తాను రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో బేస్‌మెంట్‌లోకి నీరు చేరిందని గుప్తా పోలీసుల విచారణలో అంగీకరించాడు. కాగా ఈ ఘటనపై ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) స్పందించింది.
రావూస్ సంస్థకు బేస్‌మెంట్‌లో లైబ్రరీ నిర్వహణకు తాము అనుమతివ్వలేదని స్పష్టం చేసింది. ఘటనపై దర్యాప్తుకు ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, రాష్ట్ర మంత్రి అతిషి ఆదేశాలు జారీ చేశారు.
ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా
ఢిల్లీ దుర్ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బిహార్‌కు చెందిన సోని తండ్రి విజయ్‌కుమార్ మంచిర్యాలలో సింగరేణి సంస్థలో పని చేస్తున్నారని ఆయన వివరించారు. కాగా విజయ్‌కుమార్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించాల్సిందిగా సీఎం ఆదేశించారు.
ఢిల్లీలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయ్‌కుమార్‌ను ఫోన్లో పరామర్శించారు. విద్యార్థుల మృతిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు.