అమృతం బాల భాషితం
Sakshi Education
చిన్నప్పుడు జన్మదినం జరుపుకుంటానని నాన్నని అడిగితే ‘‘మన పుట్టినరోజును మనం జరుపుకుంటే అహంకారం పెరుగుతుంది. ఎవరి జన్మదినాన్ని ఇతరులు గుర్తుంచుకుని స్మరించుకుంటారో వారి గురించి చదువు. పుట్టినవారు ఎలా జీవించాలో అర్థమవుతుంది’’ అనేవారు.
ఆ మాటల సారాంశం ఆ వయసులో పూర్తిగా బోధపడకపోయినా ఈ మధ్య నాకు ఎదురైన ఒక అనుభవం అప్పటి నాన్న మాటలు జ్ఞప్తికి వచ్చేలా చేసింది. నన్ను ఒక మిత్రుడు తన కుమారుడి ఐదో పుట్టినరోజు వేడుకలకు పదే పదే పిలిచాడు. పని ఒత్తిడుల వల్ల వెళ్లలేక పోయినా... ‘‘నీ జన్మదినాన్ని నీ కుటుంబ సభ్యులే కాక ప్రజలంతా వేడుకగా జరుపుకునేంత గొప్పవాడివి కావాలని నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నా’’ అనే సందేశాన్ని ఉత్తరం ద్వారా పంపాను.
కొన్ని రోజుల తర్వాత తారసపడ్డ ఆ తండ్రీ కొడుకులను నేను పంపిన ఉత్తరం గురించి వాకబు చేశాను. సమాధానంగా ఆ పిల్లవాడు ‘మీరేం గిఫ్ట్ పంపించలేదే’? అని అన్నాడు. నేను గిఫ్ట్ పంపలేదు నీ కోసం ఒక ఉత్తరం రాశాను అని నేనంటే ‘ఓహో, అలాగా నేను చూడలేదు’ అన్నాడా కుర్రాడు. నేను వెళ్లకపోవటం కంటే ... నేను బహుమానం ఏదీ పంపించలేదన్న విషయం పట్ల ఆ కుర్రాడిలో అసహనం వ్యక్తం కావటం ఆశ్చర్యం వేసింది. ఇక పంపిన సందేశాన్ని ఎందుకు చదవలేదు అని అడిగే ధైర్యం చేయలేదు. ఆ సందేశాన్ని కుమారుడికి చదివి వినిపిద్దామన్న ఆలోచనే మిత్రుడికి రానందుకు నాకు ఆవేదన కలిగింది. సమాజంలో మనుషుల మధ్య ఆర్థిక సంబంధాలే కానీ మానవీయ ఆత్మీయ అనుబంధాలు అదృశ్యమైపోతున్నాయని అనిపించింది. ఈ అనుభవంతో బాలలంతా ‘చాచా నెహ్రూ’ అని ప్రేమగా పిలుచుకునే జవహర్‌లాల్ నెహ్రూ మాటలు గుర్తుకొచ్చాయి. ‘‘మనం అద్దం ఎదురుగా నిలబడితే మన గురించి మనం ఏమనుకుంటామో అర్థం అవుతుంది. అదే మనం మన పిల్లలకెదురుగా నిలబడి వారి ప్రవర్తనను పరిశీలిస్తే మన గురించి లోకం ఏమనుకుంటుందో అర్థం అవుతుంది. భగవంతుడు మనకిచ్చిన సంపదలలోకెల్లా అత్యంత విలువైన సహజ సంపద పిల్లలు. వారే మన భవిష్యత్ నాగరికులు. మన ప్రజాస్వామ్య భవిష్యత్తుకు పునాది.’’
ఇస్మాయిల్ అన్నట్లు...

పిల్లలూ కవిత్వాలు
అమృతత్వాన్నిస్తాయి మనకు,
అనంతత్వాన్ని ప్రసాదిస్తాయి,
చావును దెబ్బతీస్తాయి,
జీవితాన్ని పొడిగిస్తాయి.
మానవుడిని కూడా సామాజిక జంతువుగానే పిలిచినా... మనిషికి జంతువుకు ప్రాథమికమైన తేడా ఉంది.
ఆహార నిద్రా భయమైథునాని
యేతత్సమానం పశుభిర్నరాణాం
జ్ఞానం నరాణాం అధికో విశేషః
జ్ఞానేన హీనః పశుభిస్సమానః
ఆహారం, నిద్ర, భయం, పిల్లల్ని కనటం మనుషుల్లోనూ, జంతువుల్లోనూ కూడా సమానమే. జంతువు నుంచి మనిషిని వేరుచేసేది విచక్షణా జ్ఞానం. అది లేని మానవుడు జంతువుతో సమానం. విచిత్రమేమిటంటే సృష్టిలో ఏ జంతువునైనా దాని అంతర్గుణాలను బట్టి అంచనా వేస్తారు. గుర్రాన్ని అది పరిగెత్తే వేగం, దాని చురుకుదనం వల్ల అభిమానిస్తారు కానీ దాని నాడాను చూసి కాదు. కుక్కను అది చూపే విశ్వాసం వల్ల అభిమానిస్తారు గానీ దాని లావు, పొడవూ చూసి కాదు. కోయిలను దాని తీయని గొంతును విని అభిమానిస్తారు గానీ అదెక్కి కూర్చున్న మామిడిచెట్టును చూసి కాదు. అయితే మనుషుల్ని మాత్రం వారు అర్జించే ఆదాయం, ధరించే దుస్తులు, అలంకరించుకునే ఆభరణాలు, నివసించే గృహం, ప్రయాణించే వాహనం ఆధారంగా అంచనా వేసి గౌరవిస్తున్నాం. జంతువుల సహజ గుణాలను గుర్తించి, అభిమానించి, ఆదరించే మనం... మనుషుల లోపల ఉన్న గుణాలను ఎందుకు గుర్తించలేకపోతున్నాం?
పిల్లలు తల్లిదండ్రుల ప్రతిరూపాలు. మన నడత, నడక అన్నింటిని పిల్లలు అనుకరిస్తారు. ఇంటికి బంధుమిత్రులు ఎవరెవరొస్తున్నారు, వారి వద్ద నుంచి ఏం నేర్చుకోగలం అని కాకుండా.. వారు ఎలా వస్తున్నారు? నాకోసం ఏం తెస్తున్నారు? అనే అంశం ఆధారంగా వారిని గౌరవిస్తున్నారు. ఇలా వస్తు గణితంతోనే పెరిగినవాళ్లు అంతర్గుణాలను గౌరవించటం ఒక్కసారిగా ఎలా నేర్చుకుంటారు? ఒక కవి చెప్పినట్లు
చిననాటి అలవాట్లు చిరకాలముండు
కనుక మంచివి నేడు కల్పించుకొండు
ఇదే విషయాన్ని ప్రఖ్యాత రచయిత మున్షీ ప్రేమ్‌చంద్ రెండు ఉదాహరణలతో చక్కగా వివరిస్తాడు. చిరుప్రాయంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఒక నిరుపేద బాలుడ్ని ఒక పేద వృద్ధురాలు చేరదీస్తుంది. పొలాల్లో పనిచేసి కొన్ని గోధుమలు సంపాదించటం, ఆ గోధుమలతో రొట్టెలు తయారుచేసి వాటిని అమ్ముతూ జీవనం సాగిస్తుంటుంది ఆమె. ప్రతిరోజూ... కాలే ఎర్రని బొగ్గుల మీద నుంచి రొట్టెలను తీసే క్రమంలో ఎన్నోసార్లు ఆమె వేళ్లు కాలటం, బాధపడటం చూస్తాడు ఆ బాలుడు. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. పొరుగు గ్రామంలో జరిగే తిరునాళ్ల ఉత్సవాలకు పిల్లలంతా వాళ్ల వాళ్ల తల్లిదండ్రులతో వెళ్లి నచ్చినవి కొనుక్కుని తిరిగిరావడం చూస్తాడా బాలుడు. బాలుని కళ్లలోని ఆశను అర్థం చేసుకున్న ఆ వృద్ధురాలు రొట్టెలమ్మిన డబ్బులు ఇచ్చి నచ్చిన వస్తువు కొనుక్కోమని చెబుతుంది. ఎంతో ఉత్సాహంతో తిరునాళ్లకు వెళ్లిన ఆ బాలుడు... ప్రతి దుకాణంలోనూ ఒక వస్తువు కోసం అడుగుతాడు. చివరకు ఒక దుకాణంలో దాన్ని కొనుక్కుని (డబ్బులు తక్కువైనా దుకాణ యజమాన్ని ప్రాధేయపడి) వస్తాడు. వృద్ధురాలు ‘నీకు నచ్చింది కొనుక్కున్నావా?’ అని ఆ బాలుడ్ని అడుగుతుంది. దీనికి ఆ బాలుడు ‘ఓ’ అని తాను తెచ్చిన వస్తువును ఆమె చేతిలో పెడతాడు. ఆ వస్తువును చూసి ఉద్వేగంతో ఆమె కళ్లు వర్షించాయి. కాలే రొట్టెలను పొయ్యిమీద నుంచి తీయటానికి ఉపయోగించే ‘చిమేటా’ (లోహ పరికరం) ఆ బాలుడు తెచ్చిన వస్తువు. అదేమిటి నీకిష్టమైంది కొనుక్కోమంటే ఇది కొనుక్కొచ్చావు? అని అడుగుతుంది ఆ వృద్ధురాలు. నీ చేతివేళ్లు కాలకుండా చూడటమే నాకిష్టమైంది. దానికి అవసరమైందే తెచ్చాను అంటాడా బాలుడు. ఎంతటి గొప్ప సంస్కారం ఆ బాలునిది. ఆ వృద్ధురాలు చూపిన మానవత్వం అతనిలో ఎంత కృతజ్ఞతా భావాన్ని నింపకపోతే అతడు అలా ప్రతిస్పందిస్తాడు?
రెండో ఉదాహరణకొద్దాం. ఒక వ్యక్తి బతికినంత కాలం తండ్రిని ‘నాకు నువ్వేం సంపాదించి ఇచ్చావని’ సూటిపోటి మాటలతో వేధించేవాడు. జీవచ్ఛవంలా బతకలేక ఒకరోజు తండ్రి తనువు చాలిస్తాడు. తండ్రి దేహాన్ని ఎడ్లబండి మీద వేసుకుని, ఆరేళ్ల తన కొడుకుని కూడా వెంట తీసుకుని గంగానది ఒడ్డుకు చేరతాడు. తండ్రి దహన సంస్కారాలకు అదనపు వృథా ఖర్చు ఎందుకని మృతదేహం కాళ్లకు ఒక తాడును కట్టి తండ్రి శవాన్ని బరబరా గంగానదిలోకి ఈడ్చుకెళతాడు. ఒడ్డున కూర్చుని జరుగుతున్నదంతా గమనిస్తుంటాడా బాలుడు. తాత శవాన్ని నదిలోకి ఈడ్చివేసి స్నానాదులు ముగించుకొని పైకొచ్చి బయలుదేరిన తండ్రితో.. ‘‘నాన్నా ఒక్క నిమిషం, తాత శవం పైకి లేచింది’’ అని పరిగెడతాడు పిల్లవాడు. అన్నట్టుగానే నిమిషంలో మళ్లీ తిరిగివస్తాడు. అయితే ఖాళీ చేతులతో కాకుండా చేతిలో ఒక తాడుతో వచ్చాడు. ‘‘నాన్నా నువ్వు తాత శవాన్ని లాక్కెళ్లిన తాడు తెచ్చా’’ అంటాడా బాలుడు. ‘‘ఇదెందుకిప్పుడు?’’ అని అడుగుతాడు తండ్రి. ‘‘నాన్న నువ్వు చచ్చిపోతే నిన్ను కూడా గంగానదిలోకి ఈడ్చుకెళ్లటానికి తాడు కావాలి కదా’’ అని సమాధానమివ్వడంతో తండ్రి నోట మాట రాలేదు.
పై రెండు ఉదాహరణల్లో కనిపించే అంశం ఒక్కటే. పిల్లలు బోధన, దండన కంటే పెద్దల్ని అనుకరించడం ద్వారా సంస్కారాన్ని, వ్యక్తిత్వాన్ని నేర్చుకుంటారు. ఇంట్లో తల్లిదండ్రులు, పాఠశాలలో గురువులు, ఇంటికి వచ్చే బంధుమిత్రులు.. వీరందరి ప్రతి కదలికనూ పిల్లలు ఆసక్తిగా గమనిస్తుంటారు. పిల్లల్ని పువ్వులతో పోలుస్తారు జవహర్‌లాల్ నెహ్రూ. ప్రతి పువ్వు సువాసనను కలిగి ఉంటేనే ఆ పువ్వు ఉనికిని కోల్పోకుండా పూల తోటను గుబాళింప చేస్తుందనేది ఆ మాటల అంతరార్థం. ఒకే రకం పూలున్న తోట కంటే రకరకాల సువాసనలతో కూడిన పూలుండే తోట నుంచి లభించే ఆహ్లాదం సందర్శకులను అమితంగా ఆకర్షిస్తుంది. అలానే పిల్లల్ని వారి సహజ అభిరుచులు, నైపుణ్యం ఆధారంగా పైకి వెళ్లనిస్తే, వారికి నచ్చిన రంగాల్లో అద్వితీయమైన ప్రతిభను కనబరచడమే కాకుండా, సామాజిక, సంతులనాన్ని కూడా సాధించి, బలమైన సామాజిక ప్రజాస్వామ్య వ్యవస్థను రూపొందించుకోగలమని ఆయన దృఢ విశ్వాసం. సుప్రసిద్ధ పాశ్చాత్య సంగీత కళాకారుడు మొజార్ట్ రెండేళ్ల ప్రాయంలో తండ్రితో కలసి రోడ్డుమీద వెళుతుంటే దగ్గరలో ఉన్న ఒక పంది భయంతో పారిపోతూ అరచిన అరుపు విని వెంటనే జీషార్ప్ (G#) అని అరిచాడు. జీషార్ప్ అనేది సంగీతంలో ఒక నోట్. పియానోపై ఒక ‘కీ’ నొక్కితే వెలువడే శబ్ధం. సహజ ప్రతిభను గమనించిన తండ్రి ఆ రంగంలోనే ప్రోత్సహించటంతో మొజార్ట్ ప్రపంచంలోనే అత్యుత్తమ పాశ్చాత్య సంప్రదాయ సంగీత కళాకారుడిగా ప్రసిద్ధుడయ్యాడు.
తలిదండ్రులు తమ సంతుకు
పలుతెరగుల నొసగు ఆస్తిపాస్తుల కంటెన్
తుల లేకయు వెల లేకయు
నలరెడి చదువిడుట మంచి దక్షయ నిధిగా
చిన్నప్పటి నుంచి పిల్లలకు మనమిచ్చే ఆటవస్తువులూ, బొమ్మలూ, మనం ఉపయోగించే వస్తువులను బట్టి కూడా వాళ్ల అభిరుచులు ఏర్పడతాయి. చిన్నప్పటి నుంచీ పుస్తకాలను సందర్భోచితంగా పిల్లలకు ప్రోత్సాహకాలుగా ఇస్తే పుస్తకాలు చదివే అలవాటు చిరుప్రాయంలోనే ఏర్పడి పెద్దయ్యేప్పటికి అది వృక్షమవుతుంది. పుస్తకాల్లో చదివిన దానిని ఆచరించేలా ప్రోత్సహిస్తే శాస్త్రీయ దృక్పథం ఏర్పడుతుంది.
మెకానిక్ కుటుంబం నుంచి వచ్చిన ఒక తల్లి.. వంట పాత్రల నుంచి పిల్లల ఆట వస్తువుల వరకూ తన బుద్ధిని ఉపయోగించి తయూరుచేస్తూ ఉండేది. దాంతో పిల్లలకు కూడా ఏ పని అయినా సొంతంగా చేయూలనే దృక్పథం ఏర్పడింది. ఒక రోజు ఆమె చిన్న చిన్న పుల్లలు, రబ్బర్ బ్యాండ్‌లను ఉపయోగించి, నేలమీద నుంచి పైకి ఎగిరి కిందపడే హెలికాప్టర్ లాంటి ఆటబొమ్మను తయారు చేసింది. పిల్లలు కూడా అలాంటి బొమ్మలు మరో 20 తయారు చేశారు. పైకి ఎగరగలిగిన బొమ్మ కింద పడకుండా ఎందుకు ఉండలేకపోతుంది? ఈ ప్రశ్న ఆ చిన్ని బుర్రలను తొలిచేసినా సమాధానం వెంటనే దొరకలేదు. స్కూల్లో కూడా అదే బొమ్మపై ప్రయోగాలు చేస్తూ టీచర్లతో ఆ పిల్లలిద్దరూ చీవాట్లు తిన్న రోజులెన్నో? ఎగిరిన దానిని గాలిలో ఉంచటమెలా? అన్న ప్రశ్న వారిని తొలుస్తూనే ఉండేది. మానవ మెదడును కొత్త ఆలోచన ఏదైనా స్పృశిస్తే ఆ తరంగాలు ఏళ్ల పాటు అలాగే ఉంటాయంటారు. కొన్నేళ్లు గడిచాయి. మానవుడు ప్రకృతి మీద ఎంతవరకు విజయం సాధించగలిగాడనే విషయంపై ఒక రోజు ఇంటికి వచ్చిన ఫిలాసఫీ మాస్టారుతో చర్చ జరుగుతోంది. ఈ సంభాషణలో.. మానవుడు ప్రకృతిలో శోధించాల్సినవన్నీ, శోధించి కనుగొన్నాడనీ, ఇంకేమీ మిగలలేదని ఆ పిల్లల తండ్రి అభిప్రాయపడ్డాడు. ఎలా చెప్పగలం? కొన్ని రోజుల్లో ఆకాశంలో కూడా ఎగరగలుగుతామేమో? అని మాస్టారు అన్నాడు. పిల్లల తండ్రి వెంటనే ప్రతిస్పందిస్తూ ఆకాశంలో ఎగరగలగటమనేది పక్షులకు, దేవతలకు మాత్రమే సాధ్యం. మనం ఆ రెండూ కాదు. ఇక అలాంటి ఊహలు అనవసరం అన్నాడు. ఈ సంభాషణ విన్న పిల్లలు కొన్నేళ్ల తర్వాత ప్రపంచం లోనే మొట్టమొదటి సారిగా గాలిలోకి ఎగిరి 57 సెకన్లపాటు ఆకాశంలో ఉండగలి గారు. ఆ పిల్లలే.. ప్రపంచం అంతా ముద్దుగా పిలుచుకునే రైట్ సోదరులు (ఆర్‌విల్ రైట్, విల్‌బర్ రైట్). వారి ఉత్సాహ పూరిత ఊహల మేథోమధనం నుంచి వచ్చిందే ‘విమానం’. ఆ పిల్లలకు తల్లి అలాంటి ఆట బొమ్మను ఇవ్వకపోయినా, ఆట బొమ్మద్వారా వారికలాంటి ఊహలు రాకపోయినా, తండ్రితో మాట్లాడటానికి ఇంటికి వచ్చిన ఫిలాసఫీ ప్రొఫెసర్ మాటలు ప్రేరేపించకపోయినా, ఈ రోజు మనకు విమానయానం ఉండేది కాదేమో.
మనమూ పిల్లలకు ఆటబొమ్మలు తెస్తాం. అయితే పిల్లలు వాటిని ఊడదీయబోయినా, వారికి నచ్చినట్టు చేయబోయినా వెంటనే అడ్డుకుంటాం. మరి వారి ఊహాశక్తి ఎలా పెరుగుతుంది. పై ఉదాహరణలోని పిల్లల తండ్రి పిల్లలతో కలిసి ఒకరోజు లాన్‌లో ఆటలాడుకుంటుండగా పొరుగింటి యజమాని... ‘‘లాన్ అలా తొక్కేస్తున్నారు లాన్ పాడైపోతుంది జాగ్రత్త’’ అని హెచ్చరించాడు. ‘‘నేను పిల్లల్ని పెంచుతున్నాను కానీ, గడ్డిని కాదని సమాధానమిచ్చాడు ఆ తండ్రి’’. పిల్లలకు ఆట వస్తువులు ఇచ్చి, వాటితో వారికి నచ్చినట్లు ఆడుకోనీయని మనలో ఎంతో మంది పై ఉదాహరణలోని తండ్రి నుంచి నేర్చుకోవలసింది ఎంతోఉంది. చిన్న పిల్లలకు ఐదు వేలు ఖరీదు చేసే ఆటబొమ్మకూ, ఐదు పైసలు ఖరీదు చేయని అడవి పురుగుకూ, తేడా తెలియదు. రెండూ వారిలో సమాన ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని నింపుతాయి. ఆ ఉత్సాహం విలువ తెలుసుకోలేని మనం ఆ వస్తువుల ధరకు విలువ ఇవ్వటం ద్వారా వారి సహజశక్తుల్ని, సంతోషాన్ని మనకు తెలియకుండానే అడ్డుకున్న వాళ్లమవుతున్నాం. అంతేకాదు ఇంటికి ఎవరన్నా రాగానే పిల్లలకు మనం నేర్పిన విషయాలూ, విద్యలూ, ఆటపాటలు వారి ముందు ప్రదర్శించమని బలవంతం చేస్తాం. పిల్లలకు ఏదైనా వారికి నచ్చినప్పుడు చేస్తే ఆట అవుతుంది. మనకి నచ్చినప్పుడు, నచ్చినట్టు చేయమంటే పని అవుతుంది. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు పై ఉదాహరణలోలాగా పిల్లలను వారి పరిశీలనకు వారిని వదిలేస్తే ఆ సంభాషణల్లో నుంచి వారికి నచ్చిన అంశాలు వారే ఎంచుకుంటారు. అందరూ రైట్ సోదరులంత అత్యున్నత స్థితికి కాకపోయినా తమ స్థాయిని, ఆసక్తిని బట్టి ముందుకు వెళతారు. ఇంటికి ఎవరైనా రాగానే తమపిల్లలను పిలిచి వారు నేర్చుకున్న విద్యలను ప్రదర్శింపచేసే వారు రామాయణంలో నలుడి పాత్ర నుంచి ఎంతైనా నేర్చుకోవచ్చు.
‘న చాప్య హమనుక్తోవ: ప్రబ్రూయూ మాత్మనోగుణాన్’
సముద్రంపై వారధి కట్టటం ఎలా అని ఆలోచిస్తున్న రామ,లక్ష్మణులకు నలుడు, నీలుడు అనే ఇద్దరు వానర సోదరులకున్న శక్తి గురించి జాంబ వంతుడు రాముడికి చెబుతాడు. వారిద్దరూ నీటిపై ఏది ఉంచినా అది మునగదు. తేలియాడుతుంది. అది వారిద్దరికి ఉన్నవరం. ముందే ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అన్న రాముడి ప్రశ్నకు... ‘మీరు అడగనిదే చెప్పటం హద్దు మీరినట్లవుతుందని నా శక్తిని వెల్లడించలేదు' అని నలుడు సమాధానమిస్తాడు. బాలలను వస్తువులుగా భావించి విద్యలను ప్రదర్శింపచేయాలనే తల్లిదండ్రులందరికీ నలుడి మాటలు ఆత్మావలోకనం కలిగించేవే.
శ్రీశ్రీ చెప్పినట్లు...

బాలలే విజ్ఞాన కేతువులు
నేడు రేపుల మధ్య సేతువులు
చంద్ర బంధుర సుధా శీతువులు
మానవత్వ వికాస హేతువులు
ఈ బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకు ఎంతసేపూ.. మనం చెప్పటమే కాదు, వారి మాటలు కూడా విందాం. ఎందుకంటే ‘‘అమృతం బాల భాషితం’’.
(బాలల మాటలు అమృతంతో సమానం)
టీచర్లూ... ఒక్క క్షణం!
అబ్రహాం లింకన్ తన కుమారుణ్ని స్కూలులో చేర్చినపుడు ఆ స్కూలు టీచరుకు రాసిన ఉత్తరం చదివితే బాలలను ఎలా తీర్చిదిద్దాలో అవగతమవుతుంది...
- ఈ ప్రపంచంలో అందరూ ధర్మాత్ములు కాదని చెప్పండి
- అయితే ప్రతి స్వార్థపరునికీ ఒక నిస్వార్థ నాయకుడు ఈ సమాజంలో ఉన్నాడని చెప్పండి.
- ప్రతి శత్రువుకూ ఒక మిత్రుడున్నాడని చెప్పండి.
- ప్రతి అబద్ధాలకోరుకూ ఒక నిజాయితీ పరుడుంటాడని బోధించండి.
- ద్వేషాన్ని వాడి దరిచేరనీయకండి. హాయిగా మనసునిండా ప్రశాంతంగా నవ్వుకోవటంలోనే దైవత్వముందని వివరించండి.
- పుస్తకాల్లో లభించే విజ్ఞానగని గురించి అతడిని ప్రేరేపించండి.
- అదే సమయంలో ఆకాశంలో ఎగిరే పక్షులు, ప్రకృతిలో పరుగులు పెట్టే తుమ్మెదలు, సుగంథభరిత పుష్పాలు, గంభీరంగా ఉండే పర్వతాలను గురించి కూడా వాడు అనుభవించి ఆలోచించేలా చేయండి.
- మోసం చేసి గెలవటం కంటే సన్మార్గంలో పరాజయం పాలవటం మేలని చెప్పండి.
- తన ఆలోచనలపై గట్టి నమ్మకాన్ని పెంపొందించుకొనేలా అతన్ని ప్రోత్సహించండి.
- ఎంతమంది వ్యతిరేకించినా తాను మంచి అనుకున్నది సాధించేవరకు విశ్రమించవద్దని చెప్పండి.
- మృదువైన వారితో పుష్పంలా, కఠినమైనవారితో వజ్రంలా ప్రవర్తించమని బోధించండి.
- అందరూ ఒక గుంపుగా ప్రవాహంలో పడిపోతోంటే వారిని అనుకరించకుండా.. ఆలోచించి తనమార్గం ఎంచుకునేలా ప్రోత్సహించండి.
- ఎవరేం చెప్పినా సహనంగా వినమని అయితే విన్నదాన్ని సత్యం అనే ఫిల్టర్‌తో ఒడగట్టి... వచ్చిన మంచిని మాత్రమే స్వీకరించమని చెప్పండి.
- మీరు చెప్పగలిగితే అతడు విచారంగా ఉన్నప్పుడు ఎలా నవ్వుకోవాలో నేర్పించండి.
- కన్నీళ్లు పెట్టటం సిగ్గుపడాల్సిన విషయం కాదని చెప్పండి.
- నిత్య శంకితుల పట్ల, అతి వినయం చూపేవారి పట్ల, అవసరాన్ని మించి తియ్యగా మాట్లాడేవారి పట్ల అప్రమత్తంగా ఉండమని చెప్పండి.
- తన శ్రమను, మేథస్సును అతి ఎక్కువ ధరకు అమ్మమని చెప్పండి.
- అయితే తన హృదయానికీ, ఆత్మకు వెలకట్టవద్దని బోధించండి.
- అసత్యాన్ని, సత్యంగా మార్చటం కోసం ఎలుగెత్తి అరిచే స్వార్థ సమూహాల మధ్య ధైర్యంగా నిలబడి తను నమ్మిన సిద్ధాంతాన్ని ధైర్యంగా చెప్పే పోరాట పటిమను అతనిలో రగిలించండి.
- అతన్ని జాగ్రత్తగా చూడండి కానీ సున్నితంగా ఉంచకండి. ఎందుకంటే, అగ్నిలో కాలితేనే నాణ్యత కలిగిన ఉక్కు తయారవుతుంది.
- అవసరమైనప్పుడు అసహనంతో కూడిన సాహసాన్ని, సహనంతో కూడిన ధైర్యాన్ని కలిగి ఉండేలా తీర్చిదిద్దండి.
- అన్ని వేళల్లోనూ వాడి మీద వాడికి నమ్మకం ఉండేలా ప్రోత్సహించండి.
- ఎందుకంటే అప్పుడే మానవాళిపై అచంచలమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని అతడు పెంపొందించుకోగలడు.
- ఇవన్నీ చాలా ఎక్కువ శ్రమతో కూడినవని నాకు తెలుసు. కానీ తియ్యని ఆ బాలుడు (ప్రతి బాలుడు) పై వాటన్నింటికి అర్హుడు.
అబ్రహాం లింకన్
ఈ ఉత్తరం సారాంశాన్ని బాలల దినోత్సవం నాడు బాలల కోసం.. పిల్లల శ్రేయస్సు కోరే వారందరూ అమలుచేయగలిగితే నెహ్రూగారి ఆశయాన్ని సాధించినట్లవుతాం.
Published date : 20 Nov 2021 02:28PM