Skip to main content

సివిల్స్ ఫలితాలపై ఇంగ్లిష్ తొలగింపు ప్రభావం

యూపీఎస్సీ ఆగస్టు 24న నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ - 2014 ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఫలితాల తీరు తెన్నులపై విశ్లేషణ...
‘ఊహించిన పరిణామాలే ఫలితాల్లో ప్రతిబింబించాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్ విభాగంలోని ప్రశ్నలను మూల్యాంకనంలో పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల దేశవ్యాప్తంగా హిందీయేతర అభ్యర్థులకు నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి’.. ప్రిలిమ్స్ ఫలితాలు వెలువడిన రోజు నుంచి వెల్లువెత్తుతున్న అభిప్రాయాలు ఇవి. జాతీయ స్థాయిలో జరిగిన నిరసనల కారణంగా యూపీఎస్సీ కూడా ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్ సెక్షన్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సినవసరం లేదని ప్రకటించి పరీక్ష నిర్వహించింది. దీంతో ఈ విభాగంలో మార్కులు పొందాలనుకున్న హిందీయేతర, గ్రామీణ ప్రాంత, నాన్-మ్యాథ్స్ నేపథ్యం ఉన్న అభ్యర్థులకు ఫలితాల్లో నిరాశ ఎదురైందని చెప్పొచ్చు.

పదిహేడు వేల మంది ఎంపిక:
సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షకు దేశవ్యాప్తంగా 4,52,334 మంది హాజరయ్యారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల సంఖ్య 16,933. ఇక ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్‌కు 1,106 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వాస్తవానికి ఈ సంఖ్య గతేడాదితో పోల్చితే ఎక్కువే. కానీ ఇదే సమయంలో గుర్తించాల్సిన అంశం ఈ ఏడాది పోస్ట్‌ల సంఖ్య పెరగడం, అంతే స్థాయిలో అభ్యర్థుల ఎంపిక సంఖ్య పెరగడం. అంతేకాకుండా నోటిఫికేషన్ సమయంలో పేర్కొన్న పోస్టుల సంఖ్యకు తర్వాత దశలో మరో 70 పోస్టులు పెరగడంతో దాదాపు మరో వేయి మంది మెయిన్స్‌కు అర్హత సాధించి ఉంటారని అంచనా.

తెలుగు అభ్యర్థుల పరిస్థితి:
సివిల్స్ ప్రిలిమ్స్-2104కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని తెలుగు అభ్యర్థులు మొత్తం 28 వేల మంది హాజరయ్యారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం వీరిలో మెయిన్స్‌కు ఎంపికైన వారి సంఖ్య అయిదు నుంచి ఆరు వందల మధ్యలో ఉండొచ్చని నిపుణుల అంచనా.

కటాఫ్‌పైనే అభ్యర్థుల చూపు:
ప్రస్తుత ఫలితాల విషయానికొస్తే అత్యధిక శాతం అభ్యర్థు లు కటాఫ్ గురించే ఆలోచిస్తున్నారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్ విభాగం ప్రశ్నలను తొలగించడంతో ఈ ఆలోచన మరింత ఎక్కువైంది. అయితే నిపుణుల అంచనా ప్రకారం-గత ఏడాది కంటే ఈ ఏడాది కటాఫ్ మార్కులు తగ్గినట్లుగా ఫలితాల ద్వారా తెలుస్తోంది. మొత్తం 400 మార్కులకు నిర్వహించిన పరీక్షలో కటాఫ్ మార్కుల సంఖ్య ప్రతి కేటగిరీలో కనీసం 10 మార్కులు చొప్పున తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనరల్ కేటగిరీలో 210 నుంచి 215 మార్కుల మధ్యలో కటాఫ్ ఉండొచ్చని అంచనా.

ఆశావహులకూ నిరాశే:
తాజా ఫలితాలు ఆశావహులకు నిరాశే కలిగించాయి. దీనికి అందరూ చెప్పే ప్రధాన కారణం ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ విభాగాన్ని తొలగించడం. గతేడాది ఫలితాల్లో తుది జాబితాలో సైతం నిలిచి సెంట్రల్ సర్వీసెస్‌కు ఎంపికైన మెడికల్ గ్రాడ్యుయేట్ ఒకరు.. ఐఏఎస్ లక్ష్యంగా ఈ ఏడాది కూడా పరీక్ష రాశారు. కానీ ప్రిలిమ్స్‌లోనే ఉత్తీర్ణత సాధించలేకపోయారు. ఇంగ్లిష్ ప్రశ్నల విభాగాన్ని మూల్యాంకనంలో పరిగణిస్తే కచ్చితంగా మెయిన్స్‌కు ఎంపికయ్యే వాణ్ని అనేది సదరు అభ్యర్థి ఆభిప్రాయం.

ఆర్‌టీఐ అవకాశం లేదంటున్న కమిషన్:
అభ్యర్థులు కటాఫ్ మార్కులు తెలుసుకునే విషయంలో సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ)ను వినియోగించుకునే అవకాశం లేదని ఫలితాల వెల్లడి సమయంలోనే కమిషన్ స్పష్టం చేసింది. ఎంపిక ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక కటాఫ్ విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయంపై అభ్యర్థులు, నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ‘కీ’ ప్రకటించినా అభ్యర్థులకు ఒక అవగాహన వచ్చేదని, విజయం సాధించని అభ్యర్థులు వచ్చే ఏడాది అనుసరించాల్సిన వ్యూహాలపై స్పష్టత లభించేదని అంటున్నారు.

సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2013 కటాఫ్స్:

పరీక్ష

జనరల్

ఓబీసీ

ఎస్సీ

ఎస్టీ

ప్రిలిమ్స్

241

222

207

201

మెయిన్స్

564

534

518

510

ఫైనల్

775

742

719

707


మొత్తం 2025 మార్కులకు నిర్వహించే మూడు దశల (ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ) ఎంపిక ప్రక్రియలో జనరల్ కేటగిరీలో మెయిన్స్‌లో 564 మార్కులు కటాఫ్‌గా నిలిచాయి. దీంతో ప్రస్తుతం మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు కనీసం 750 మార్కులు లక్ష్యంగా ప్రిపరేషన్ సాగించాలి.

అభ్యర్థులకు నష్టమే
ప్రస్తుత ఫలితాలను చూస్తే అభ్యర్థులకు నష్టం జరిగిన సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతేడాది వరకు నాన్-మ్యాథ్స్, గ్రామీణ నేపథ్యం అభ్యర్థులు ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్‌లో మార్కులు పొందడం ద్వారా మెయిన్స్‌కు ఎంపికయ్యారు. కానీ ఈసారి ఆ అవకాశం లేకపోవడం నిరాశపరిచింది. ఇక మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు ప్రస్తుతం పరీక్షకు ఉన్న సమయాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రిపరేషన్ సాగించాలి. మెయిన్స్‌లో సగటున ఒక ప్రశ్నకు అయిదు నిమిషాల్లో సమాధానం ఇచ్చేలా సిద్ధమవాలి. ఈ క్రమంలో తక్కువ పదాల్లో వీలైనంత సమాచారం పొందుపర్చేలా ముఖ్యమైన అంశాలను రాయడం అలవర్చుకోవాలి. రైటింగ్ ప్రాక్టీస్‌తోనే ఇది సాధ్యం. ఎథిక్స్ పేపర్‌కు సంబంధించి కేస్ స్టడీ అనాలిస్‌లో పట్టు సాధించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి.


సీఐసీ చొరవ చూపాలి
Bavitha ఫలితాల కంటే అభ్యర్థులను ఎక్కువ వేధిస్తున్న అంశం కటాఫ్. కానీ ఇప్పుడే వీటిని ప్రకటించబోమని యూపీఎస్సీ పేర్కొనడం సరికాదు. ఆర్‌టీఐ వర్తించదని చెప్పడం కూడా సముచితం కాదు. ఈ విషయంలో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చొరవ చూపాలి. అభ్యర్థులు ఆర్‌టీఐ ద్వారా యూపీఎస్సీ నుంచి అవసరమైన సమాచారం పొందే విధంగా చర్యలు చేపట్టాలి. ఇక ఫలితాల విషయానికొస్తే ఇంగ్లిష్ విభాగం ప్రశ్నలను తొలగించడం వల్ల చాలా మంది నిరుత్సాహానికి గురయ్యారు. నాన్-మ్యాథ్స్ అభ్యర్థులకు నిరాశ ఎదురైంది. ఇక.. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు జనరల్ స్టడీస్‌కు సంబంధించి అంతర్జాతీయ అంశాలకు ప్రాధాన్యమిస్తూ ప్రిపరేషన్ సాగిస్తే మెరుగైన ఫలితాలు లభిస్తాయి.
Published date : 28 Oct 2014 04:04PM

Photo Stories