Rishabh Ostwal CA Topper Success Story: ఇష్టంగా చదివితే ఏదీ కష్టం కాదు.. సీఏ ఆల్ ఇండియా టాపర్ రిషబ్ ఓస్వాల్ సక్సెస్ స్టోరీ..
![CA All India Topper Rishabh Oswal Success Story](/sites/default/files/images/2024/12/28/rishabhoswalsuccessstory-1735374619.jpg)
రాజస్తాన్ నుంచి పలమనేరుకు
రాజస్తాన్‌కు చెందిన మా కుటుంబం.. వృత్తి రీత్యా చిత్తూరు జిల్లాలోని పలమనేరులో స్థిరపడింది. నాన్న రాజేశ్ ఓస్వాల్ బంగారం, ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. నా స్కూల్ చదువు పలమనేరులోని ఎమ్మాస్ స్విస్ స్కూల్‌లోనే సాగింది. 2018లో ఐసీఎస్‌ఈ పదో తరగతిలో 97.5 శాతం మార్కులతో పాసయ్యాను. ఆ తర్వాత సీఏ కోర్సు అభ్యసించడానికి గుంటూరులోని మాస్టర్‌మైండ్స్ అకాడమీలో చేరాను. 2020లో ఇంటర్మీడియట్‌లో 96.8 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాను.
సీఏ దిశగా ఇలా..
ఇంటర్మీడియెట్ పూర్తవగానే 2020లో సీఏ కోర్సులో చేరాను. 2021లో సీఏ ఇంటర్మీడియట్‌లో జాతీయ స్థాయిలో ఎనిమిదో ర్యాంకు సాధించాను. ఆ తర్వాత ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ కేపీఎంజీలో ఆర్టికల్‌షిప్ పూర్తి చేశాను. ఒకవైపు ఆర్టికల్ షిప్ చేస్తూనే సీఏ ఫైనల్ పరీక్షలకు ప్రిపేరయ్యాను. గత నవంబర్‌లో పరీక్షలకు హాజరయ్యాను. తాజాగా విడుదలైన ఫలితాల్లో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు రావడం ఎంతో ఆనందంగా ఉంది.
సీఏంఏ కూడా..
సీఏ కోర్సు కంటే ముందు కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ) కోర్సులో చేరి.. 2020లోనే సీఎంఏ ఫౌండేషన్‌లో, 2021లో సీఎంఏ ఇంటర్మీడియట్‌లో జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకు సొంతం చేసుకున్నాను. అయితే సీఏనే నా లక్ష్యం కావటంతో 2021 నుంచి పూర్తిగా సీఏపైనే దృష్టి పెట్టాను.
ఐదో తరగతిలోనే ఆలోచన..
సీఏ కోర్సు చేయాలనే ఆలోచన నాలో ఐదో తరగతిలోనే మొదలైంది. ఇందుకు మా మేనమామ ప్రోత్సాహం ఎంతో ఉంది. మోతీలాల్ ఓస్వాల్ కంపెనీలో ఆయన సీఏగా పనిచేసే వారు. ఆయనకు లభిస్తున్న గుర్తింపు, హోదా చూసి.. నేను కూడా సీఏ చేయాలని నిర్ణయించుకున్నాను.
డైలీ ప్లానింగ్
సీఏ కోర్సులో రాణించడానికి ప్రతి రోజూ దాదాపు 10 గంటలు చదివాను. పరీక్షలకు నెల రోజుల ముందు నుంచి రోజుకు 12 గంటలు.. చివరి 15 రోజులు రోజుకు 14 నుంచి 15 గంటలు కష్టపడ్డాను. ఇన్‌స్టిట్యూట్ మెటీరియల్ చదవడం, ప్రాక్టీస్ టెస్ట్స్‌కు హాజరవడం కూడా ఎంతో ప్రయోజనం చేకూర్చాయి.
ఆర్టికల్‌షిప్‌లో ప్రిపరేషన్ కాస్త కష్టమే
సీఏ కోర్సులో ఆర్టికల్‌షిప్ (ప్రాక్టికల్ ట్రైనింగ్) తప్పనిసరి. ఈ సమయంలో మాత్రం ప్రిపరేషన్‌కు ఆశించిన సమయం దొరకలేదు. అందులోనూ ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ కేపీఎంజీలో ఆర్టికల్‌షిప్ కోసం చేరడంతో పని భారం కొంత ఎక్కువగానే ఉండేది. అయితే, పరీక్ష సమయం దగ్గరపడుతున్నప్పుడు మా మేనేజర్ నాకు చదువుకునేలా వీలు కల్పించారు. ఇది కూడా నాకు ఎంతో ఉపయోగపడింది.
చదవండి: Muskan Agrawal Sucess Story: కోడింగ్‌లో దిట్ట.. రూ. 60 లక్షల జీతంతో ప్రముఖ సంస్థలో ఉద్యోగం
ఒత్తిడి సహజం
సీఏ కోర్సు ప్రిపరేషన్ సమయంలో మానసిక ఒత్తిడి సహజం. కానీ దీన్ని చూసి ఆందోళన చెందకుండా.. ఒత్తిడిని అధిగమించే మార్గాలు అన్వేషించాలి. నేను రిలాక్సేషన్ కోసం స్నేహితులతోపాటు నా సోదరితో మాట్లాడానికి సమయం కేటాయించాను. నేను ఎప్పుడైన మరింత నిస్సత్తువగా ఉంటే మా సోదరి నాకు నైతిక బలం అందించింది.
మొదటి రోజు నుంచే ప్రణాళిక వేసుకోవాలి
సీఏ కోర్సులో చేరాలనుకునేవారికి నేనిచ్చే సలహా.. కోర్సులో చేరిన మొదటి రోజు నుంచే విజయం దిశగా ప్రణాళిక రూపొందించుకోవాలి. చాలామంది పరీక్షకు కొన్ని నెలల ముందు నుంచి చదవడం ప్రారంభిస్తారు. దీనివల్ల ఒత్తిడికి లోనవడమే కాకుండా.. ఆశించిన ఫలితం కూడా రాదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రెండున్నర సంవత్సరాలు కష్టపడితే.. భవిష్యత్తు అంతా బాగుంటుందని గుర్తించాలి. దానికి అనుగుణంగా నిత్యం కోర్సు పుస్తకాలను అభ్యసనం చేయాలి. అదేవిధంగా.. ఆర్టికల్‌షిప్ సమయంలో కూడా ఏ మాత్రం సమయం దొరికినా చదవడానికే కేటాయించాలి.
‘సాక్షి’ స్పెల్–బి
మెడల్ స్కూల్‌లో చదివేటప్పుడు కోకరిక్యులర్ యాక్టివిటీస్‌లో పాల్గొన్నాను. ఈ క్రమంలో 2016లో ‘సాక్షి’స్పెల్–బి ఫైనల్స్‌కు చేరుకుని మెడల్ కూడా సాధించాను. దీంతోపాటు వీఐటీ స్పెల్–బిలోనూ రెండో
ర్యాంకు సాధించాను.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
ప్రైవేట్ ఈక్విటీ సంస్థలో ఉద్యోగం
ప్రస్తుతం ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు లేదా కన్సల్టింగ్ సంస్థలో ఉద్యోగంలో చేరాలని భావిస్తున్నాను. ప్రజాసేవకు దోహదం చేసే సివిల్ సర్వీసెస్ వైపు భవిష్యత్తులో దృష్టి పెట్టాలనుకుంటున్నాను. మా నాన్న నన్ను సివిల్స్ దిశగా అడుగులు వేయాలని సూచిస్తున్నారు. దాన్ని కూడా ఆచరణలో పెడతాను.
రిషబ్ ఓస్వాల్ అకడమిక్ ప్రొఫైల్
- పదో తరగతి (ఐసీఎస్‌ఈ): 97.5 శాతంతో ఉత్తీర్ణత
- ఇంటర్మీడియట్: 96.8 శాతంతో ఉత్తీర్ణత
- సీఏ ఇంటర్మీడియట్: ఆల్ ఇండియా ఎనిమిదో ర్యాంకు
- సీఏ ఫైనల్: ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు
- సీఎంఏ ఫౌండేషన్, ఇంటర్మీడియట్: ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు
Tags
- CA All India Topper
- ICAI CA Final results 2024 out
- Chartered Accountants
- Success Story
- rajasthan
- Chittoor District
- Palamaneru
- Cost and Management Accountancy
- Sakshi Spell B
- inspirational story
- Competitive Exams Success Stories
- Success Stories
- motivational story in telugu
- Inspirational Story Of Successful Person
- success story in life
- Inspirational Story Of Successful Person news in telugu
- sakshieducation success stories
- Rishabh Ostwal Success Story
- Rajesh Ostwal
- Rishabh Ostwal Inspiring Story
- who is rishabh ostwal