Skip to main content

Inspirational Success Story : గొర్రెల కాపరి కుమార్తె... కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగం కొట్టిందిలా.. కానీ..

మ‌న ల‌క్ష్యం సాధించాల‌నే.. బ‌ల‌మైన ప‌ట్టుద‌ల‌, క‌సి ఉండాలే కానీ.. ఎన్ని అడ్డు గోడలు ఉన్నా.. ఎన్ని అవరోధాలు ఎదురైనా సాధించ‌వ‌చ్చ‌ని నిరూపించారు ఈ పెదింటి బిడ్డ శ్రీనిధి.
Srinidhi Success Story

ఈమె కేవ‌లం లక్ష్యంపై మాత్రమే గురి పెట్టింది. అన్నింటినీ దాటుకుని 19 ఏళ్ల వయసులోనే నేవీ ఉద్యోగం సాధించింది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అనంతగిరి గ్రామానికి చెందిన బందాపు శ్రీనిధి. ఈ నేప‌థ్యంలో శ్రీనిధి స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం...

కుటుంబ నేప‌థ్యం :
శ్రీనిధి తండ్రి బందాపు తేజేశ్వరరావు గొర్రెల కాపరి(పెద్ద కోనారి). తల్లి గౌరి గృహిణి. వీరిది పేద‌కుటుంబం. చెల్లి శ్రీజ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. శ్రీనిధి మొదటి నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే చదివింది. ఆమె పెదనాన్న బందాపు గణపతిరావు ఇండియన్‌ ఆర్మీలో సుబేదార్‌గా విధులు నిర్వహించడం చూసి ఆయనను స్ఫూర్తిగా తీసుకుంది. 

➤☛ TSPSC Group 2 Ranker Interview : ఇంటి నుంచే చ‌దివి గ్రూప్‌-2 జాబ్‌ కొట్టానిలా...| గ్రూప్‌-2కు నేను చ‌దివిన పుస్త‌కాలు ఇవే...

ఏదైనా సాధిస్తేనే సమాజంలో గౌరవం అనే క‌సితో..
బాబాయ్‌ బందాపు తిరుమలరావు ప్రోత్సాహంతో నేవీలో కొలువు సాధించాలని కలలు కన్నది. నేవీ కొలువు అంటే చదువులోనే కాదు శారీరకంగా కూడా చురుగ్గా ఉండాలి. ప్రతి రోజూవెంకటాపురం - పర్లాకిమిడి రహదారిపై పరుగులో సాధన చేసేది. పుష్ అప్స్, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ కోసం ఇతర ఎక్స్‌ర్‌సైజ్‌లు చేసేది. ఏదైనా సాధిస్తేనే సమాజంలో గౌరవం అని గమనించి పట్టుదలలో ఇండియన్‌ నేవీలో ఉద్యోగం పొందింది. ఇటీవల విడుదలైన ఆలిండియా మెరిట్‌ జాబితాలో ఎంపికై నవంబరు 11న ఒడిశాలోని చిలకలో శిక్షణ తీసుకోనుంది.

పోలీస్‌ రాత పరీక్షలో కూడా..
జూలై 2024లో సీబీటీ పరీక్షలో అర్హత సాధించిన శ్రీనిధి విశాఖపట్నంలోని ఐఎన్‌ఎస్‌ శాతవాహనలో ఆగస్టు 2024లో జరిగిన ఫిజికల్, మెడికల్‌ పరీక్షల్లో విజేతగా నిలిచింది. పరీక్షల ఫలితాలు ఈ నెలలో విడుదలై నేవీలో జీడీ (ఎస్‌ఎస్‌ఆర్‌) ఉద్యోగానికి ఎంపికైంది. మరో పక్క ఏప్రిల్‌ 30, 2024న విశాఖపట్నంలోనే జరిగిన ఉమెన్‌ మిటరీ పోలీస్‌ రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆ ఉద్యోగానికి కూడా చేరువైంది.

నా కాళ్లపై నేను నిలబడాల‌నే ల‌క్ష్యంతో.. : బందాపు శ్రీనిధి
నా కాళ్లపై నేను నిలబడాలి. దేశానికి సేవ చేయాలనే ఆలోచనతో నేవీ ఉద్యోగం సాధించాను. మాది చాలా సాధారణ కుటుంబం. ఏదైనా సాధిస్తేనే సమాజంలో గుర్తింపు, గౌరవం లభిస్తాయి. అలాగే ఒకే చోట ఉండిపోకూడదు. లక్ష్యం ఏర్పాటు చేసు కుని ప్రతి రోజూ సాధన చేయాలి. మా పెదనాన్న భారత సైన్యంలో మంచి ఉద్యోగంలో ఉన్నారు. ఆయన నిత్యం ప్రోత్సహించే వారు. మా బాబాయ్‌ తిరుమల నిత్యం నా వెన్ను తట్టి లక్ష్యం వైపు పయనించేలా సహకరించారు. ఈ విజయం వారికే అంకితం.

Published date : 28 Oct 2024 04:17PM

Photo Stories