Skip to main content

Inspirational Story : ఇందుకే సీబీఐ ఉద్యోగానికి రాజీనామా చేశా.. ఇంకా ఎన్నో ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను వ‌దులుకున్నా..

నేటి సమాజంలో యువత రెండు రకాలు. ఏదైనా సమస్యను చూస్తారు.. వదిలేస్తారు. అలాగే మరికొంతమంది ఆ సమస్యకు పరిష్కారం దొరికేవరకూ అన్వేషిస్తారు. అవసరమైతే మరికొంతమందితో చర్చిస్తారు. విభిన్న ఆలోచనల్ని, పరిష్కార మార్గాల్ని సేకరిస్తారు.
Nagavalli Siva

ఆ కోవకు చెందిన వారే నాగవల్లి శివ. మారుమూల పల్లెలో పుట్టి కేంద్ర దర్యాప్తు సంస్థలో(సీబీఐ) ఉద్యోగాన్ని సాధించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని గుడ్డిగూడెం గ్రామానికి చెందిన శివ పేదింట్లో పుట్టారు. చిన్నప్పుడు ట్యూషన్లు చెప్పుకుంటూ తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టకుండా తన చదువుకు అవసరమైన డబ్బును సమకూర్చుకునేవారు. 

వ‌చ్చిన ఉద్యోగాల‌ను..
ఎంఏ ఇంగ్లిష్‌ని డిస్టింక్షన్‌లో పాసైన శివ.. 2012లో డీఎస్‌సీ రాసి ఇంగ్లిష్‌ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. అనంతరం 2014లో ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. గ్రూప్‌–4లో కమర్షియల్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లోనూ, గ్రూప్‌–3లో ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌లో కొలువులు సాధించారు. అయినా ఏదో వెలితి శివని వెంటాడింది.

అందుకే సీబీఐ ఉద్యోగానికి రాజీనామా చేసి నేరుగా..
ఢిల్లీలో విధుల్లో చేరినప్పుడు.. అక్కడ ఉన్న తోటి ఉద్యోగులతో మాట్లాడుతుండగా.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలుగువారు చాలా తక్కువగా ఉన్నారని గ్రహించారు. దీనికి కారణమేంటని శోధిస్తే.. ఇంగ్లిష్‌ భాష అని తెలుసుకున్న శివ.. ఈ గ్యాప్‌ని తగ్గించి.. తెలుగువారు ఎందులోనూ తక్కువ కాకూడదని అనుకున్నారు. అందుకే సీబీఐ ఉద్యోగానికి రాజీనామా చేసి నేరుగా విశాఖ చేరుకున్నారు. తక్కువ ఖర్చుతో విద్యార్థులకు ఇంగ్లిష్‌తో పాటు పోటీ పరీక్షలకు తర్ఫీదునిచ్చేందుకు త్రినేత్ర పేరుతో అకాడమీని స్థాపించారు. 

☛ Family Success Story : ఈ పేదింటి బిడ్ద‌లు.. చ‌దువును ఆయుధంగా చేసుకున్నారు.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టారిలా.. కానీ..

ఉద్యోగాన్ని వదులుకున్నా తనకేమీ బాధగా లేదని..
ఇంగ్లిష్‌ భాషలో ప్రతి తెలుగు విద్యార్థి ప్రావీణ్యం పొందేలా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని శివ చెబుతున్నారు. అందుకే లక్షల రూపాయల జీతం ఇచ్చే ఉద్యోగాాన్ని వదులుకున్నా తనకేమీ బాధగా లేదని.. భార్య అంజలి కూడా ప్రోత్సహించడం మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందంటున్నారు. విద్య విజ్ఞానాన్ని, ఆలోచన శక్తిని, సృజనాత్మకతను పెంపొందిస్తుందని, అది పది మందికి పంచితే సమాజం మరింత మెరుగవుతుందన్న లక్ష్యంతోనే అకాడమీ స్థాపించానని శివ చెబుతున్నారు. శివ చేసిన ఈ ప్రయోగానికి సీబీఐ అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.

 Motivational Story : మాది నిరుపేద కుటుంబం.. ఏడాది కాలంలో ఈ మూడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల‌ను కొట్టానిలా.. కానీ..

ఒకే టికెట్‌పై 15 సినిమాల పేరుతో..
ఓవైపు సామాజిక సేవా కార్యక్రమాలు, మరోవైపు ఉద్యోగాలే టార్గెట్‌గా నిర్దేశించుకున్న శివ పాతికేళ్ల వయసులోనే రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇంగ్లిష్‌ భాషపై తాను సాధించిన పట్టు.. ప్రతి ఒక్కరికీ అందించాలన్న లక్ష్యంతో ఇంగ్లిష్‌ వ్యాకరణం అనే పేరుతో.. ప్రతి ఒక్క తెలుగు విద్యార్థి సులువుగా గ్రామర్‌ నేర్చుకునేలా పుస్తకాన్ని 2011లో రాశారు. వెంటనే వెర్బ్స్‌ అండ్‌ ఇట్స్‌ కాంజుగేషన్‌, స్పోకెన్‌ ఇంగ్లిష్‌ పుస్తకాల్ని రచించగా దీన్ని వీజేఎస్‌ సంస్థ అచ్చేసేందుకు ముందుకొచ్చింది. ఈ పుస్తకాలు 2015లో మద్రాస్‌లోని కన్నెమర సెంట్రల్‌ లైబ్రరీలో చోటు దక్కించుకుంటూ జాతీయ స్థాయి గుర్తింపు పొందాయి. ఒకే టికెట్‌పై 15 సినిమాల పేరుతో రాసిన పుస్తకం సంచలనంగా మారింది. శివ పుస్తకాలు అమెజాన్‌లోనూ బెస్ట్‌ సెల్లర్‌ బుక్స్‌గా చోటు దక్కించుకున్నాయి. శివ రచనలకు జాతీయ స్థాయిలో సత్కారాలు వరించాయి.

☛ Inspiring Success Story : యదార్ధ కథ.. ఆక‌లి త‌ట్టుకోలేక బిక్షాటన చేసి క‌డుపు ఆక‌లి తీర్చుకునే వాళ్లం.. ఈ క‌సితోనే చ‌దివి జిల్లా ఎస్పీ స్థాయికి వ‌చ్చానిలా..

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌లోనూ..
ఏదైనా నిజాయితీగా పనిచేస్తూ.. దేశానికి సేవ చెయ్యాలన్నదే శివ లక్ష్యం. అందుకే స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) రాయాలని నిర్ణయించుకున్నారు. 2015లో ఎస్‌ఎస్‌సీ సీబీఐ ఎస్‌ఐ రాతపరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. రాష్ట్రం నుంచి ఎంపికైన‌ నలుగురిలో శివ ఒకరిగా నిలిచారు. ఘజియాబాద్‌లోని సీబీఐ అకాడమీలో ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్న తర్వాత 2017లో సీబీఐ ఎస్‌ఐగా విధుల్లో చేరారు. వైజాగ్‌ బ్రాంచ్‌లో ఎస్‌ఐగా విధుల్లో చేరిన శివ.. అనేక కీలకమైన కేసుల్లో పురోగతి వచ్చేలా ప్రతిభ కనబరిచారు. అందుకే ఐదేళ్లలోనే సీఐగా పదోన్నతి పొందారు. వైజాగ్‌లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో సీబీఐ బ్రాంచ్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారు కూడా. పదోన్నతి పొందిన తర్వాత 6 నెలల క్రితం సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌కు శివ బదిలీ అయ్యారు. ఇదే సమయంలో శివకు కొత్త ఆలోచన వచ్చింది.

నేర్చుకున్న విద్యను పది మందికి పంచితే..

Nagavalli Siva CBI Officer Story

ప్రతిభకు పదునుపెడితే సరికొత్త ప్రపంచాన్ని సృష్టించే యువతరానికుంది. పుస్తకాలతో కుస్తీలు, ర్యాంకులు, ఆపై ఐదంకెల జీతంతో ఉద్యోగం.. ఇదీ యువత ఒకప్పటి ఆలోచన. నూతన ఒరవడిలో దూసుకుపోవాలనే కాంక్ష.. తాము నేర్చుకున్న విద్యను పది మందికి పంచితే.. వారికి కూడా అద్భుత భవిష్యత్తును అందించొచ్చు అనే ఆలోచన కొందర్ని కొత్త దారిలోకి తీసుకెళ్తోంది. యువతరమంటే అంచనా వేసేందుకు కాదు.. అన్వేషించడానికి. నిర్ణయించడానికి కాదు.. అమలు చేయడానికి..., స్థిరమైన పనులు చేసేందుకు కాదు.. సాటివారి తలరాతలు మార్చడానికి అన్న మాటల్ని అక్షర సత్యం చేస్తున్నారు ఆ సీబీఐ అధికారి. దర్యాప్తు అధికారిగా లక్షల జీతం ఇస్తున్న ఉద్యోగానికి స్వస్తి చెప్పి కొత్త మార్గం వైపు పయనిస్తున్నారు.

☛ Inspirational Story: న‌న్ను పేదవాడు.. రిక్షావాలా కొడుకు అని హీనంగా చూశారు.. ఈ క‌సితోనే ఐఏఎస్ అయ్యానిలా..

Published date : 21 May 2024 03:24PM

Photo Stories