Skip to main content

Xavier Aptitude Test: మేనేజ్‌మెంట్‌ పీజీకి.. గ్జాట్‌

ఇంజనీరింగ్, డిగ్రీ ఉత్తీర్ణులు ఎక్కువగా మొగ్గు చూపే కోర్సు.. ఎంబీఏ! మేనేజ్‌మెంట్‌ పీజీలో చేరాలనుకునే అభ్యర్థులకు అందుబాటులో ఉన్న మరో చక్కటి మార్గం.. గ్జేవియర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌(ఎక్స్‌ఏటీ-గ్జాట్‌)!! దీన్ని గ్జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ), జంషెడ్‌పూర్‌ నిర్వహిస్తోంది. ఈ పరీక్షలో మంచి స్కోరు సాధిస్తే.. దేశంలోని ప్రసిద్ధ బీస్కూల్స్‌లో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. తాజాగా గ్జాట్‌-2024 ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో.. గ్జాట్‌ పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ తదితర వివరాలు..
xavier aptitude test exam pattern & syllabus & preparation tips
  • గ్జేవియర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ప్రకటన విడుదల
  • గ్జాట్‌ స్కోర్‌తో టాప్‌ బీస్కూల్స్‌లో ప్రవేశాలు

అర్హత 
ఏదైనా డిగ్రీ/బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత సాధించినవారు ఈ పరీక్షకు దరఖాస్తుకు అర్హులు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

అందిస్తున్న కోర్సులు
ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ అందిస్తున్న కోర్సులు.. పీజీడీఎం బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌; పీజీడీఎం హ్యూమన్‌ రిసో­ర్స్‌ మేనేజ్‌మెంట్‌. ఈ రెండు కోర్సుల కాల వ్యవధి: రెండేళ్లు. అలాగే మరో కోర్సు.. పీజీడీఎం-జనరల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌. దీని కాల వ్యవధి 15 నెల­లు. దీంతోపాటు ఎఫ్‌పీఎం-నాలుగేళ్ల ఫెలో ప్రోగ్రా­మ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌లోనూ ప్రవేశం పొందొచ్చు.

ప్రవేశం కల్పిస్తున్న పలు ఇన్‌స్టిట్యూట్స్‌
గ్జేవియర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్, ముంబై; సెయింట్‌ ఫ్రాన్సిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్, ముంబై; అమృత స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌; ఏషియా పసిఫిక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్, న్యూఢిల్లీ; ఏషియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్, భువనేశ్వర్‌; బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీ, గ్రేటర్‌ నోయిడా; బీఎంఎల్‌ ముంజల్‌ యూనివర్సిటీ, గుర్‌గావ్‌; సీఎంఎస్‌ బిజినెస్‌ స్కూల్‌; ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్, పుణె తదితరాలు.

చ‌ద‌వండి: Management Entrance Test: ఎక్స్‌ఏటీతో మేనేజ్‌మెంట్‌ విద్య

ఎంపిక విధానం
గ్జాట్‌ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసి గ్రూప్‌ డిస్కషన్‌/ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు. అందులో ప్రతిభ చూపిన వారికి ప్రవేశం లభిస్తుంది.

పరీక్ష విధానం
గ్జాట్‌ పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో ఆబ్జెక్టివ్‌ తరహాలో జరుగుతుంది. వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ 26 ప్రశ్నలు-26 మార్కులు; డెసిషన్‌ మేకింగ్‌ 22 ప్రశ్నలు-22 మార్కులు; క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ 28 ప్రశ్నలు-28 మార్కులు; జనరల్‌ నాలెడ్జ్‌ 25 ప్రశ్నలు-25 మార్కులకు ఉంటాయి. పరీక్షలో మొత్తం 101 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం మూడు గంటల 30 నిమిషాలు.

ప్రిపరేషన్‌ ఇలా
అభ్యర్థులు ముందుగా గ్జాట్‌ పరీక్ష ప్యాట్రన్, సిలబస్‌ గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత ప్రామాణిక పుస్తకాలు, మెటీరియల్‌ను సేకరించాలి. విభాగాల వారీగా ప్రిపేరవ్వాలి. డెసిషన్‌ మేకింగ్‌ విభాగంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.

వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌
ఈ విభాగంలో మంచి మార్కులు సాధించాలంటే.. లాంగ్వేజ్‌ ప్రొఫిషియెన్సీ తప్పనిసరి. ఈ దిశగా అభ్యర్థులు పత్రికల్లో వచ్చే సైకాలజీ, టెక్నాలజీ, సోషియాలజీలకు సంబంధించిన వ్యాసాలను చదవడం లాభిస్తుంది. అలాగే వేగంగా చదవడంతోపాటు, కాంప్రహెన్షన్‌ స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవాలి. రీడింగ్‌ కాంప్రహెన్షన్స్‌ను ప్రాక్టీస్‌ చేయాలి. గత ప్రశ్నపత్రాలను సాధించాలి. యాంటోనిమ్స్, సినానిమ్స్, ప్రిఫిక్స్, సఫిక్స్‌ల గురించి తెలుసుకోవాలి. వీటితోపాటు సాధ్యమైనన్ని మాక్‌ టెస్టులకు హాజరవ్వాలి. 

క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ అండ్‌ డేటా ఎంటర్‌ప్రిటేషన్‌
ఈ విభాగానికి సంబంధించి జామెట్రి, మెన్సురేషన్, క్యాల్కులేషన్స్‌తోపాటుడేటా ఇంటర్‌ప్రిటేషన్‌పై పట్టు సాధించాలి. క్యాల్కులేషన్, అప్రాక్సిమేషన్‌ స్కిల్స్‌ను పెంపొందించుకోవాలి. లైన్‌ గ్రాఫ్స్, పైచార్ట్స్, టాబ్యులర్‌ గ్రాఫ్స్, ఫ్రాక్షన్‌ వ్యాల్యూస్‌ను ప్రాక్టీస్‌ చేయాలి. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ సెట్స్‌ను సాధన చేయాలి. మ్యాథమెటికల్‌ థింకింగ్‌ను పెంపొందించుకోవాలి. పేపర్‌లెస్‌ క్యాల్కులేషన్స్‌ చేయాలి. జామె­ట్రి, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, టైమ్‌ అండ్‌ డిస్టెన్స్, పర్సంటేజెస్, రేషియో అండ్‌ ప్రపోర్షన్స్‌పై అధిక దృష్టిపెట్టాలి. ప్రతి వారం రెండు లేదా మూడు మాక్‌ టెస్టులకు హాజరవ్వాలి.

డెసిషన్‌ మేకింగ్‌ అండ్‌ అనలిటికల్‌ స్కిల్స్‌
ఇది పరీక్షలోనే అత్యంత క్లిష్టమైన విభాగం. ఇందులో ఎక్కువ మార్కులు సాధించాలంటే.. గరిష్ట ప్రాక్టీస్‌ అవసరం. ఇందులో ప్రశ్నలను సాధించే స­మయంలో వివక్షకు తావులేని, విలువలతో కూడిన నిర్ణయాలు తీసుకునే తరహాలో వ్యవహరించాలి. ప్రాక్టీస్, విశ్లేషణలతోనే ఇది సాధ్యమవుతుంది.

జనరల్‌ అవేర్‌నెస్‌
చరిత్ర-ముఖ్య సంఘటనలను అధ్యయనం చేయాలి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై థియరిటికల్, ప్రాక్టికల్‌ అవగాహనను పెంపొందించుకోవాలి. పాలిటీ, భారత రాజ్యాంగం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, స్పోర్ట్స్, ప్రభుత్వ వ్యవస్థలకు సంబంధించిన అంశాలపై పట్టుసాధించాలి. ఆ దిశగా హిందూ, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్, ఎకనామిక్‌ టైమ్స్, బిజినెస్‌ స్టాండర్డ్, బిజినెస్‌ లైన్, లైవ్‌ మింట్‌ తదితర దినపత్రికలను చదవడం లాభిస్తుంది.

ముఖ్యసమాచారం

  • దరఖాసు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 30, 2023
  • అడ్మిట్‌ కార్డులు జారీ ప్రారంభం: డిసెంబరు 24, 2023
  • ఎక్స్‌ఏటీ నిర్వహణ తేదీ: జనవరి 07, 2024
  • వెబ్‌సైట్‌: https://xatonline.in/
Published date : 15 Sep 2023 10:59AM

Photo Stories