Skip to main content

IIM-CAT Notification 2022: ఐఐఎం క్యాట్‌ 2022 వివరాలు.. విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు..

IIM-CAT Notification 2022
IIM-CAT Notification 2022

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌.. జాతీయ స్థాయిలో.. మేనేజ్‌మెంట్‌ విద్యలో ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లు! అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న విద్యాసంస్థలు! ఈ ఇన్‌స్టిట్యూట్స్‌లో.. మేనేజ్‌మెంట్‌ కోర్సులు పూర్తి చేసుకుంటే..ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్‌ అవకాశాలు ఖాయమనే అభిప్రాయం! అందుకే బ్యాచిలర్‌ డిగ్రీ అభ్యర్థుల్లో ఎక్కువ మంది లక్ష్యం.. ఐఐఎంల్లో చేరడం. ఈ ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశానికి తొలి మెట్టుగా భావించే క్యాట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పరీక్ష ఈ ఏడాది నవంబర్‌ 27న జరుగనుంది. ఈ నేపథ్యంలో.. ఐఐఎంక్యాట్‌2022 వివరాలు, పరీక్ష విధానం, విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు...

  • ఐఐఎంక్యాట్‌ 2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
  • నవంబర్‌ 27న జాతీయ స్థాయిలో పరీక్ష
  • నిర్వాహక ఇన్‌స్టిట్యూట్‌గా ఐఐఎంబెంగళూరు
  • ప్రాక్టీస్‌తోనే సక్సెస్‌ అంటున్న నిపుణులు

కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌.. సంక్షిప్తంగా క్యాట్‌గా సుపరిచితం. దేశ వ్యాప్తంగా ఉన్న 20 ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ క్యాంపస్‌లు, ఇతర ప్రముఖ బిస్కూల్స్‌లో ఎంబీఏ, ఇతర మేనేజ్‌మెంట్‌ పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష. క్యాట్‌ స్కోర్‌తోపాటు మలి దశ ఎంపిక ప్రక్రియలో ప్రతిభ చూపిన వారికి ఐఐఎంల్లో ప్రవేశం లభిస్తుంది.

చదవండి: CAT 2022: క్యాట్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష విధానం ఇలా..  

అర్హతలు

కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత(ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూడీ అభ్యర్థులకు కనీసం 45 శాతం మార్కులు) ఉండాలి. బ్యాచిలర్‌ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.అయితే వీరు ఇంటర్వ్యూ సమయానికి సర్టిఫికెట్లు అందించాల్సి ఉంటుంది.

మూడు విభాగాలు.. మార్పులు లేవు!

ఐఐఎం క్యాట్‌ అంటే.. ప్రతి సంవత్సరం ఏదో ఒక ఊహించని మార్పు ఉంటుందని అభ్యర్థులు భావిస్తుంటారు. కానీ.. ఈ ఏడాది ఎలాంటి మార్పులు లేకుండా.. గత క్యాట్‌ మాదిరిగానే పరీక్ష విధానం ఉంటుందని నిర్వాహక సంస్థ.. ఐఐఎంబెంగళూరు ప్రకటన స్పష్టం చేస్తోంది. పరీక్షను మొత్తం మూడు విభాగాల్లో నిర్వహించనున్నారు. 

విభాగం1లో.. వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌; విభాగం2లో.. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌; విభాగం3లో.. క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ ఉంటాయి. ప్రతి విభాగానికి కేటాయించిన సమయం 40 నిమిషాలు. 

చదవండి: GATE 2023 Notification: గేట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు..

ప్రశ్నలు కూడా గత ఏడాది మాదిరిగానే

తాజా ప్రకటన ప్రకారంవిభాగాల్లో మార్పులు లేవని స్పష్టం చేయడంతో.. ప్రశ్నల సంఖ్యలోనూ మార్పులు ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతేడాది క్యాట్‌2021లో వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌(వీఏఆర్‌సీ) నుంచి 26 ప్రశ్నలు; డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ నుంచి 24 ప్రశ్నలు; క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ(క్యూఏ) నుంచి 26 ప్రశ్నలు అడిగారు. ఈసారి కూడా ఇదే తీరులో ఆయా విభాగాల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.

సన్నద్ధతకు పదును

క్యాట్‌ పరీక్ష విధానం, ప్రశ్నల సంఖ్య, పరీక్ష తేదీపై స్పష్టత వచ్చింది. కాబట్టి అభ్యర్థులు ఇక తమ సన్నద్ధతకు పదును పెటాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటి నుంచే ప్రిపరేషన్‌ ప్రారంభిస్తే.. పరీక్షలో మెరుగైన స్కోర్‌ సాధించి.. ఐఐఎంలు తదుపరి దశలో నిర్వహించే జీడీ/పీఐకు అర్హత పొందే అవకాశం లభిస్తుంది. 

చదవండి: MBA Placements: విద్యార్థులకు ఆఫర్ల జోరు.. కోవిడ్‌ పూర్వ స్థితికి రిక్రూట్‌మెంట్స్‌..

వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌

ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్, ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌ను పరీక్షించే ఈ విభాగంలో రాణించాలంటే.. యాంటానిమ్స్, సినానిమ్స్, బేసిక్‌ గ్రామర్‌పై పట్టు సాధించాలి. అదే విధంగా ఫ్యాక్ట్స్, ఇన్ఫరెన్సెస్, జంబుల్డ్‌ పేరాగ్రాఫ్స్‌లను ప్రాక్టీస్‌ చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. ప్యాసేజ్‌ ఆధారిత ప్రశ్నలు అడిగే రీడింగ్‌ కాంప్రహెన్షన్‌లో రాణించాలంటే.. అసెంప్షన్, స్టేట్‌మెంట్స్‌పై పట్టు సాధించాలి.

డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌

అభ్యర్థుల్లోని విశ్లేషణాత్మక నైపుణ్యం, తార్కిక సామర్థ్యాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు ఉండే విభాగం ఇది. ఇందులో మెరుగైన స్కోర్‌ సాధించాలంటే.. టేబుల్స్, గ్రాఫ్స్, చార్ట్స్‌ ఆధారిత ప్రాబ్లమ్స్‌ను ప్రాక్టీస్‌ చేయాలి. లాజికల్‌ రీజనింగ్‌లో.. క్యూబ్స్, క్లాక్స్, నంబర్‌ సిరీస్, లెటర్‌ సిరీస్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ వంటి అంశాలను బాగా ప్రాక్టీస్‌ చేయాలి. 

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌

అభ్యర్థుల్లోని మ్యాథమెటికల్, అర్థమెటికల్‌ స్కిల్స్‌ను పరీక్షించే విధంగా ఈ విభాగం ఉంటుంది. ఇందులో అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వాలంటే..అర్థమెటిక్‌కు సంబంధించి పర్సంటేజెస్, రేషియోస్, డిస్టెన్స్‌టైం వంటి అంశాలపై పట్టు సాధించాలి. మ్యాథమెటిక్స్‌కు సంబంధించి అల్‌జీబ్రా, మోడ్రన్‌ మ్యాథ్స్, జామెట్రీ అంశాలపై అవగాహన పెంచుకోవాలి.

చదవండి: New Courses in IIM: ఇక్కడ విద్యనభ్యసించిన వారికి... టాప్‌ కంపెనీల్లో ఉద్యోగం

నిర్దిష్ట కటాఫ్‌ పర్సంటైల్‌

క్యాట్‌లో విజయం సాధించేందుకు అభ్యర్థులు ప్రతి సెక్షన్‌లోనూ నిర్దిష్ట కటాఫ్‌ మార్కులు పొందేలా కృషి చేయడం చాలా అవసరం. ఎందుకంటే.. ఐఐఎంలు మలి దశ ఎంపిక ప్రక్రియకు అభ్యర్థులను పిలిచేందుకు క్యాట్‌లో నిర్దిష్టంగా సెక్షనల్‌ కటాఫ్, ఓవరాల్‌ కటాఫ్‌లను పేర్కొంటున్నారు. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు ఓవరాల్‌ కటాఫ్‌ కనిష్టంగా 85, గరిష్టంగా 90 పర్సంటైల్‌ సాధించాలి. అదే విధంగా సెక్షనల్‌ కటాఫ్‌ 75 నుంచి 80 పర్సంటైల్‌ వరకూ ఉంటుంది.

కాన్సెప్ట్స్, ప్రాక్టీస్‌

మెరుగైన స్కోర్, పర్సంటైల్‌ సాధించేందుకు ప్రతి సెక్షన్‌ కీలకం. కాబట్టి అభ్యర్థులు తొలుత సిలబస్‌ను పరిశీలించి.. అందులోని టాపిక్స్, వాటికి సంబంధించిన కాన్సెప్ట్‌లపై అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత ప్రామాణిక మెటీరియల్‌ను ఆధారంగా చేసుకుని ప్రిపరేషన్‌ సాగించాలి. ప్రతి టాపిక్‌ పూర్తయిన తర్వాత సాధ్యమైనంత ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయాలి. వేగం, కచ్చితత్వం పెంచుకోవాలి. ఆయా టాపిక్స్‌కు సంబంధించి ప్రామాణిక మెటీరియల్‌ను సేకరించి.. వాటిలోని అంశాలను సాధన చేయాలి. ప్రతి యూనిట్‌ తర్వాత ఉండే మోడల్‌ కొశ్చన్స్‌ను ప్రాక్టీస్‌ చేయాలి.

మేలు చేసే మాక్, మోడల్‌ టెస్ట్‌

క్యాట్‌లో మెరుగైన స్కోర్‌ సాధించేందుకు మోడల్‌ టెస్ట్‌లు, మాక్‌ టెస్ట్‌లు ఉపకరిస్తాయి. కాబట్టి అభ్యర్థులు మాక్‌ టెస్ట్‌లకు హాజరయ్యేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. మోడల్‌ టెస్టులను ప్రాక్టీస్‌ చేయాలి. వీటి ఫలితాలను విశ్లేషించుకుని తాము ఇంకా పట్టుసాధించాల్సిన అంశాలను గుర్తించి.. వాటిపై మరింత ఎక్కువ దృష్టి సారించాలి. ఇలా ఒకవైపు సబ్జెక్ట్‌ ప్రిపరేషన్‌ సాగిస్తూనే మరోవైపు నిరంతరం ప్రాక్టీస్‌కు, నమూనా పరీక్షలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా పరీక్షలో మెరుగైన స్కోర్‌ సొంతం చేసుకునే అవకాశముంది.

మలి దశకూ సిద్ధంగా..!

అన్ని ఐఐఎంలు.. క్యాట్‌ స్కోర్‌ ఆధారంగా దరఖాస్తులను పరిశీలించి.. నిర్దేశిత కటాఫ్స్‌ పొందిన అభ్యర్థులకు మలి దశలో గ్రూప్‌ డిస్కషన్, రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్, పర్సనల్‌ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నాయి. వీటికి నిర్దిష్ట వెయిటేజీ కేటాయిస్తున్నాయి. ఆయా ఐఐఎంల గత ప్రవేశ విధానాలను పరిశీలిస్తే.. క్యాట్‌ స్కోర్‌కు 50 నుంచి 70 శాతం, జీడీ(గ్రూప్‌ డిస్కషన్‌)/పీఐ(పర్సనల్‌ ఇంటర్వ్యూ)లకు 30 నుంచి 50 శాతం మధ్యలో వెయిటేజీ ఇస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచే జీడీ, పీఐలో రాణించేందుకు కృషి చేయాలి. 

జీడీ, పీఐలు.. ఇలా

గ్రూప్‌ డిస్కషన్స్‌ సమయంలో అభ్యర్థులను నిర్దిష్ట సంఖ్యలో బృందాలుగా ఏర్పాటుచేసి.. ఒక్కో బృందానికి ఏదైనా టాపిక్‌ ఇచ్చి దానిపై మాట్లాడమంటారు. సాధారణంగా ఒక్కో బృందంలో ఎనిమిది నుంచి పది మంది అభ్యర్థులు ఉంటున్నారు. జీడీ సమయంలోనే పలు ఐఐఎంలు రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్‌ నిర్వహిస్తున్నాయి. ఇందులో నిర్దేశిత అంశంపై అభ్యర్థులు తమ అభిప్రాయాలను నిర్దిష్ట పద పరమితితో రాయాల్సి ఉంటుంది. ఈ రెండు దశల్లోనూ విజయం సాధించి మెరిట్‌ జాబితాలో నిలిచిన వారికి చివరగా పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. పీఐలో మేనేజ్‌మెంట్‌ విద్యనే అభ్యసించాలనుకోవడానికి కారణం.. భవిష్యత్తు లక్ష్యాలు వంటి ప్రశ్నలు అడుగుతున్నారు. వీటన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసుకుని తుది జాబితాలో నిలిస్తే ఐఐఎంలో సీటు ఖరారైనట్లే!

క్యాట్‌2022 సమాచారం

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: ఆగస్ట్‌ 3  సెప్టెంబర్‌ 14
అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ సదుపాయం: అక్టోబర్‌ 27  నవంబర్‌ 27
క్యాట్‌ పరీక్ష తేదీ: నవంబర్‌ 27, 2022
ఫలితాల వెల్లడి: 2023, జనవరి రెండో వారంలో.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://iimcat.ac.in
ఆన్‌లైన్‌ దరఖాస్తు వెబ్‌సైట్‌: https://cdn.digialm.com/EForms/configuredHtml/756/77650/Registration.html

Published date : 08 Aug 2022 05:19PM

Photo Stories