CLAT 2022: క్లాట్ రెండుసార్లు.. అందుకే!
» వచ్చే విద్యాసంవత్సరంలో రెండుసార్లు క్లాట్
» మేలో క్లాట్–2022,డిసెంబర్(2022)లో క్లాట్–2023
» ఇకపై ప్రతి ఏటా డిసెంబర్‌లోనే క్లాట్ నిర్వహణ
» న్యాయ విశ్వవిద్యాలయాల సమాఖ్య కీలక నిర్ణయం
» క్లాట్‌తో 22 నేషనల్ లా యూనివర్సిటీల్లో ప్రవేశం
» ఇంటర్‌తోనే న్యాయ కోర్సుల్లో చేరొచ్చు
- క్లాట్–యూజీ: నేషనల్ లా యూనివర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్ బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష.
- క్లాట్–పీజీ: నేషనల్ లా యూనివర్సిటీల్లో పీజీ స్థాయిలో ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం జరిపే పరీక్ష. వాస్తవానికి ఈ రెండు లా ఎంట్రన్స్‌లను ప్రతి ఏటా ఏప్రిల్ లేదా మే నెలల్లో నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా.. క్లాట్–2021ను జూలైలో నిర్వహించారు. 2022లో మాత్రం రెండుసార్లు క్లాట్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఇకపై డిసెంబర్‌లోనే
క్లాట్ పరీక్ష తేదీల విషయంలో స్పష్టమైన క్యాలెండర్ విధానాన్ని అనుసరించాలని భావిస్తున్నారు. అందుకోసం క్లాట్‌ను ప్రతి ఏటా డిసెంబర్‌లోనే నిర్వహించనున్నారు. ఈ విధానాన్ని క్లాట్ 2023 నుంచే అమలు చేయాలని ఇటీవల జరిగిన కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ సమావేశంలో నిర్ణయించారు. క్లాట్–2022ను ఈ ఏడాది(2021) డిసెంబర్‌లో నిర్వహించగలిగే పరిస్థితి లేదు. కాబట్టి 2022–23 ప్రవేశాలకు క్లాట్–2022ను వచ్చే ఏడాది మేలో; 2023–24 ప్రవేశాలకు క్లాట్–2023ను వచ్చే ఏడాది డిసెంబర్‌లో నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. అంటే..2022లో ఒకే సంవత్సరంలో రెండుసార్లు క్లాట్ నిర్వహించనున్నారు. ఆ మేరకు తేదీలను కూడా ప్రకటించారు.
Also read: 2022లో రెండు CLAT పరీక్షలు: జాతీయ సంస్థల్లో న్యాయ విద్య.. ప్రిపరేషన్ సాగించండిలా.. !
జాప్యం లేకుండా
క్లాట్‌ను డిసెంబర్‌లోనే నిర్వహించాలనే నిర్ణయానికి కారణం ఏంటి? అంటే.. నిర్వాహక వర్గాలు చెబుతున్న సమాధానం.. నేషనల్ లా యూనివర్సిటీల్లో ఏటా జూలై 1వ తేదీన విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. క్లాట్‌ను మేలో నిర్వహిస్తున్న కారణంగా.. ఫలితాల విడుదల లేదా కౌన్సెలింగ్‌లో ఏమాత్రం జాప్యం జరిగినా.. అది మొత్తం విద్యా సంవత్సరంపై ప్రభావం చూపుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగానే 2022 నుంచి క్లాట్‌ను డిసెంబర్‌లోనే నిర్వహించాలని.. ఫలితంగా 2023–24 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు, అకడమిక్ క్యాలెండర్ పరంగా ఎలాంటి జాప్యం జరగదని పేర్కొంటున్నారు.
సన్నద్ధతకు వీలుగా
క్లాట్‌ను డిసెంబర్‌లో నిర్వహించడం వల్ల విద్యార్థులు సన్నద్ధమయ్యేందుకు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. మేలో క్లాట్‌ను నిర్వహిస్తే.. అంతకుముందు సంవత్సరం నవంబర్/డిసెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు జనవరి నుంచి ఏప్రిల్ వరకూ.. తమ అకడమిక్ వార్షిక పరీక్షలకు సన్నద్ధమవుతుంటారు. వార్షిక పరీక్షల తర్వాత క్లాట్ ప్రిపరేషన్‌కు చాలా తక్కువ సమయం అందుబాటులో ఉంటుంది. డిసెంబర్‌లో నిర్వహిస్తే.. జూన్ లేదా జూలై నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తారు. దీనివల్ల అకడమిక్ పరీక్షల ఒత్తిడి లేకుండా.. కేవలం క్లాట్‌కు సన్నద్ధమయ్యేందుకు వీలవుతుంది.
ఒత్తిడి తగ్గేలా
ప్రస్తుతం క్లాట్‌కు ఎక్కువ మంది హెచ్‌ఈసీ, సీఈసీ గ్రూప్‌ల విద్యార్థులు హాజరవుతున్నారు. వీరితోపాటు ఇంజనీరింగ్, మెడికల్ ఎంట్రన్స్‌లకు ప్రిపేర్ అవుతున్న ఎంపీసీ, బైపీసీ గ్రూప్‌ల విద్యార్థులు సైతం దాదాపు 40 శాతం మేర ఉంటున్నారు. డిసెంబర్‌లో క్లాట్ నిర్వహణ ద్వారా ఇలాంటి వారిపై ఒత్తిడి తగ్గుతుందనే వాదన వినిపిస్తోంది.
కౌన్సెలింగ్ ఫీజు తగ్గింపు
ప్రస్తుత విధానం ప్రకారం–క్లాట్ ఉత్తీర్ణులు కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు రూ.50వేలు కౌన్సెలింగ్ ఫీజుగా చెల్లించాల్సి వస్తోంది. ఒకవేళ సీటు వస్తే ఈ మొత్తాన్ని ట్యూషన్ ఫీజుకు బదిలీ చేస్తున్నారు. సీటు రాకపోతే ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తున్నారు. ఇలా ఒకేసారి రూ.50 వేలు చెల్లించాల్సి రావడం వల్ల విద్యార్థులపై ఆర్థిక భారం పడుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని క్లాట్–2022 నుంచి కౌన్సెలింగ్ ఫీజును తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. జనరల్ కేటగిరీ విద్యార్థులు రూ.30 వేలు, రిజర్వ్‌డ్ కేటగిరీ విద్యార్థులు రూ.20 వేలు కౌన్సెలింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
Also read: Gujarat National Law University Recruitment 2021 Assistant Librarian & Assistant Director
22 ఎన్‌ఎల్‌యూలలో ప్రవేశం
క్లాట్ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా దేశవ్యాప్తంగా 22 నేషనల్ లా యూనివర్సిటీస్/ ఇన్‌స్టిట్యూట్స్ ప్రవేశం కల్పిస్తున్నాయి. అవి..
» నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా–బెంగళూరు » నల్సార్–హైదరాబాద్ » నేషనల్ లా యూనివర్సిటీ–భోపాల్» వెస్ట్ బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యురిడికల్ సైన్సెస్–కోల్‌కత » నేషనల్ లా యూనివర్సిటీ–జోథ్‌పూర్ » హిదయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ–రాయ్‌పూర్ » గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ–గాంధీనగర్ » డా‘‘రామ్‌మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీ–లక్నో » రాజీవ్‌గాంధీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లా–పంజాబ్ » చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ–పాట్నా » నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్స్‌డ్ లీగల్ స్టడీస్–కొచి » నేషనల్ లా యూనివర్సిటీ–కటక్(ఒడిశా) » నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ స్టడీ అండ్ రీసెర్చ్ ఇన్ లా–రాంచి » నేషనల్ లా యూనివర్సిటీ అండ్ జ్యురిడికల్ అకాడమీ–అసోం » దామోదరం సంజీవయ్య నేషనల్ లా » యూనివర్సిటీ – విశాఖపట్నం » తమిళనాడు నేషనల్ లా స్కూల్ – తిరుచిరపల్లి » మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ–ముంబై » మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ – నాగ్‌పూర్ » మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ– ఔరంగాబాద్ » హిమాచల్‌ప్రదేశ్ నేషనల్ లా యూనివర్సిటీ – సిమ్లా » ధర్మశాస్త్ర నేషనల్ లా యూనివర్సిటీ(ఎంపీడీఎన్‌ఎల్‌యూ)–జబల్‌పూర్ » డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ నేషనల్ లా యూనివర్సిటీ–సోనేపట్, హర్యానా
క్లాట్–2022 ముఖ్య సమాచారం
- అర్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత, ద్వితీయ సంవత్సరం అభ్యర్థులు కూడా అర్హులే.
- పరీక్ష విధానం:
పెన్–పేపర్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.
- నోటిఫికేషన్ విడుదల: నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదటి వారం
- క్లాట్ 2022 పరీక్ష తేదీ: మే 8, 2022
- క్లాట్–2021 ద్వారా 2,578 సీట్ల భర్తీ.
- నల్సార్–హైదరాబాద్‌లో 84 సీట్లు, తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు స్థానిక కోటా కింద 21 సీట్లు.