Skip to main content

CLAT 2023 Notification: క్లాట్‌తో ప్రయోజనాలు.. పరీక్ష విధానం, భవిష్యత్తు అవకాశాలు..

clat 2023 notification details

న్యాయశాస్త్రం.. సంప్రదాయ న్యాయవాద వృత్తి మొదలు కార్పొరేట్‌ సంస్థల్లో సైతం నేడు కొలువులు సొంతం చేసుకోవచ్చు. 'లా'లో రాణించాలంటే.. అకడమిక్‌గా అద్భుత నైపుణ్యాలు ఉండాలి. అలాంటి నైపుణ్యాలు అందించే వేదికలే.. నేషనల్‌ లా యూనివర్సిటీలు! వీటిల్లో ఇంటర్మీడియెట్‌ అర్హతతోనే అయిదేళ్ల బీఏ ఎల్‌ఎల్‌బీలో ప్రవేశం పొందొచ్చు! అందుకోసం జాతీయ స్థాయిలో నిర్వహించే కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌(క్లాట్‌)లో ర్యాంకు సాధించాలి. తాజాగా 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి క్లాట్‌ 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. క్లాట్‌తో ప్రయోజనాలు, పరీక్ష విధానం, భవిష్యత్తు అవకాశాలపై ప్రత్యేక కథనం.. 

 • ఇంటర్‌తోనే నేషనల్‌ 'లా' యూనివర్సిటీల్లో బీఏ ఎల్‌ఎల్‌బీ
 • క్లాట్‌లో ర్యాంకు ద్వారా ప్రవేశాలు ఖరారు
 • డిసెంబర్‌ 18న క్లాట్‌2023 మొదలైన దరఖాస్తు ప్రక్రియ

ఇంజనీరింగ్‌కు ఐఐటీలు, మేనేజ్‌మెంట్‌ విద్యకు ఐఐఎంల మాదిరిగానే ఉన్నత ప్రమాణాలతో న్యాయ విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన విద్యాసంస్థలు.. నేషనల్‌ లా యూనివర్సిటీస్‌. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 22 న్యాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటిల్లో బ్యాచిలర్, పీజీ స్థాయి కోర్సుల్లో ప్రవేశాలకు క్లాట్‌యూజీ, క్లాట్‌పీజీ నిర్వహిస్తున్నారు. క్లాట్‌యూజీ ద్వారా అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశం లభిస్తుంది. అలాగే క్లాట్‌పీజీ ద్వారా ఎల్‌ఎల్‌ఎంలో అడ్మిషన్‌ పొందొచ్చు. 

అర్హతలు

 • క్లాట్‌యూజీ: 45 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణత ఉండాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు. 
 • క్లాట్‌పీజీకి దరఖాస్తు చేసుకునేందుకు కనీసం 50 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ/బీఏఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాల అభ్యర్థులకు కనీసం 45 శాతం మార్కులు రావాలి. 

క్లాట్‌యూజీ ఇలా

 • క్లాట్‌యూజీ పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. ఇందులో అయిదు విభాగాలు ఉంటాయి. అవి..ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో 28 నుంచి 32 ప్రశ్నలు; జీకే అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌లో 35 నుంచి 39 ప్రశ్నలు; లీగల్‌ రీజనింగ్‌లో 35 నుంచి 39 ప్రశ్నలు; లాజికల్‌ రీజనింగ్‌లో    28 నుంచి 32 ప్రశ్నలు; క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌లో 13 నుంచి 17 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. పరీక్ష సమయం రెండు గంటలు. 
 • ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, కరెంట్‌ అఫైర్స్, లీగల్‌ రీజనింగ్, లాజికల్‌ రీజనింగ్‌లలో పూర్తిగా ప్యాసేజ్‌ ఆధారిత ప్రశ్నలే అడుగుతారు.
 • క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ విభాగంలోనూ గ్రాఫ్, టేబుల్స్, డయాగ్రమ్స్‌ ఆధారిత ప్రశ్నలు ఉంటాయి.

క్లాట్‌ పీజీ..

 • బీఏఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌బీ అర్హతగా నేషనల్‌ లా యూనివర్సిటీల్లోని ఎల్‌ఎల్‌ఎం స్పెషలైజేషన్లలోని సీట్ల భర్తీకి నిర్వహించే క్లాట్‌పీజీ పరీక్షను 120 ప్రశ్నలు120 మార్కులకు నిర్వహిస్తారు. వీటిని కూడా ప్యాసేజ్‌ ఆధారితంగా ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలుగా అడుగుతారు. పరీక్ష సమయం రెండు గంటలు. 
 • పరీక్షలో కాన్‌స్టిట్యూషనల్‌ లా సంబంధిత ప్రశ్నలు, జ్యూరిస్పుడెన్స్, అడ్మినిస్ట్రేటివ్‌ లా, లా ఆఫ్‌ కాంట్రాక్ట్, టార్ట్స్, ఫ్యామిలీ లా, క్రిమినల్‌ లా, ప్రాపర్టీ లా, కంపెనీ లా, పబ్లిక్‌ ఇంటర్నేషనల్‌ లా, ట్యాక్స్‌ లా, ఎన్విరాన్‌మెంటల్‌ లా, లేబర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ లా విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 

విజయం సాధించండి'లా'!
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌

అభ్యర్థుల్లోని ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ నైపుణ్యాన్ని పరిశీలించే ఈ విభాగంలో.. ప్యాసేజ్‌ ఆధారిత ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రాణించడానికి కాంప్రహెన్షన్, ప్యాసేజ్‌ రీడింగ్‌పై అవగాహన పెంచుకోవాలి. సునిశిత పరిశీలన నైపుణ్యం, ఇచ్చిన ప్యాసేజ్‌ సారాంశాన్ని గ్రహించడం, ప్యాసేజ్‌ ప్రధాన ఉద్దేశం తెలుసుకోవడం వంటి నైపుణ్యాలు పెంచుకోవాలి. ఇందుకోసం జనరల్‌ ఎస్సేలు, న్యూస్‌ పేపర్‌ ఎడిటోరియల్స్, ఇతర ముఖ్య ప్రచురణలు చదవాలి.

కరెంట్‌ అఫైర్స్, జనరల్‌ నాలెడ్జ్‌

ఈ విభాగం నుంచి కూడా ప్యాసేజ్‌ ఆధారిత ప్రశ్నలే అడుగుతారు. సమకాలీన అంశాలు, కళలు, సంస్కృతి, అంతర్జాతీయ వ్యవహారాలు, ప్రాధాన్యత కలిగిన చారిత్రక అంశాలకు సంబంధించిన ప్యాసేజ్‌లు ఇచ్చి.. వీటి నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు జాతీయోద్యమంలో కీలక ఘట్టాలపై దృష్టి పెట్టాలి. భారత రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగ రూపకల్పన నుంచి తాజా సవరణల వరకు అన్నీ తెలుసుకోవాలి. కరెంట్‌ అఫైర్స్‌కు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ద్వైపాక్షిక ఒప్పందాలు, ముఖ్యమైన సంఘటనలు, సదస్సులు గురించి పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి.

లీగల్‌ రీజనింగ్‌

ఈ విభాగం ద్వారా అభ్యర్థుల న్యాయపరమైన దృక్పథం, సహేతుక ఆలోచన ధోరణి, నిర్ణయ సామర్థ్యాలను పరిశీలిస్తారు.ఈ విభాగంలోనూ ప్యాసే జ్‌ ఆధారిత ప్రశ్నలే ఎదురవుతాయి. సంబంధిత ప్యాసేజ్‌ల నుంచి నిబంధనలు,సిద్ధాంతాలు,ఫ్యాక్ట్స్, వాటిద్వారా చోటు చేసుకుంటున్న మార్పులకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ముఖ్యమైన చట్టాలు,న్యాయ శాఖకు సంబంధించి ఇటీవల కాలం లో చోటు చేసుకున్న తాజా పరిణామాలు, లీగల్‌ టెర్మినాలజీపై అవగాహన పెంచుకోవడం ద్వారా ఈ విభాగంలో మంచి మార్కులు సాధించొచ్చు. 

లాజికల్‌ రీజనింగ్‌

ఈ విభాగంలో అభ్యర్థుల్లోని తార్కిక విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ప్యాసేజ్‌ ఆధారిత ప్రశ్నలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఈ విభాగంలో రాణించాలంటే.. ప్యాసేజ్‌ ఆధారిత ప్రశ్నలు; అసెర్షన్‌ అండ్‌ రీజనింగ్‌ విధానం ప్రశ్నలపై పట్టు సాధించాలి. ఇందుకోసం సిలాజిజమ్, కోడింగ్‌డీ కోడింగ్, డైరెక్షన్, అనాలజీ, సిరీస్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ వంటి అంశాలపై అవగాహన పొందాలి. స్టేట్‌మెంట్‌ ఆధారిత ప్రశ్నల కోసం కంపేరిటివ్‌ అప్రోచ్‌ను అలవర్చుకోవాలి.

క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌

ఈ విభాగంలో మంచి మార్కులు సాధించాలంటే..ముందుగా పదో తరగతి స్థాయిలోని గణిత అం శాలపై పట్టు సాధించాలి. గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే అర్థమెటిక్‌కు కొంత ఎక్కువ వెయిటేజీ కనిపిస్తోంది. కాబట్టి పర్సంటేజెస్, టైమ్‌ అండ్‌ డిస్టెన్స్, టైమ్‌ అండ్‌ స్పీడ్, యావరేజెస్, రేషియో తదితర అంశాలను బాగా ప్రాక్టీస్‌ చేయాలి. గ్రాఫ్‌లు, చార్ట్‌లను విశ్లేషించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి.

క్లాట్‌ పీజీలో విజయానికి

క్లాట్‌ పీజీలో విజయానికి.. అభ్యర్థులు తాజా తీర్పులు, రాజ్యాంగ, శాసనపరమైన అంశాలు, చారిత్రాత్మక తీర్పులు, వాటి ప్రభావం వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. అంతేకాకుండా అకడమిక్‌గా బ్యాచిలర్‌ స్థాయిలోని అంశాలపై పట్టు సాధించడం కూడా మేలు చేస్తుంది.

ఉజ్వల కెరీర్‌

నేషనల్‌ లా యూనివర్సిటీల్లో కోర్సులు పూర్తి చేసుకున్న వారికి ఉజ్వల కెరీర్‌ అవకాశాలు ఖాయమని చెప్పొచ్చు. వీరికి న్యాయవాద వృత్తితోపాటు కార్పొరేట్‌ కొలువులు సైతం సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది. ప్రస్తుత అంతర్జాతీయ వాణిజ్య విధానాలు, పలు దేశాల కంపెనీల మధ్య ఒప్పందాలు తదితరాల కారణంగా న్యాయ నిపుణులకు డిమాండ్‌ పెరుగుతోంది. పలు సంస్థలు లీగల్‌ డిపార్ట్‌మెంట్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటున్నాయి. సదరు న్యాయ విభాగాల్లో లా కోర్సులు పూర్తి చేసిన వారిని నియమించుకుంటున్నాయి. నేషనల్‌ లా యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన వారిని నియమించుకునేందుకు కార్పొరేట్‌ సంస్థలు క్యూ కడుతున్నాయి. వీరికి సగటున రూ.8లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ వార్షిక వేతనం అందిస్తున్నాయి. 

క్లాట్‌తో ప్రవేశాలు కల్పించే నేషనల్‌ లా యూనివర్సిటీలు

1) నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియాబెంగళూరు; 2) నల్సార్‌హైదరాబాద్‌; 3) నేషనల్‌ లా యూనివర్సిటీభోపాల్‌; 4) వెస్ట్‌ బెంగాల్‌ నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ జ్యురిడికల్‌ సైన్సెస్‌కోల్‌కత; 5) నేషనల్‌ లా యూనివర్సిటీజోథ్‌పూర్‌; 6)హిదయతుల్లా నేషనల్‌ లా యూనివర్సిటీ రాయ్‌పూర్‌; 7) గుజరాత్‌ నేషనల్‌ లా యూనివర్సిటీగాంధీనగర్‌; 8) డా''రామ్‌మనోహర్‌ లోహియా నేషనల్‌ లా యూనివర్సిటీలక్నో; 9) రాజీవ్‌గాంధీ నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లాపంజాబ్‌; 10)చాణక్య నేషనల్‌ లా యూనివర్సిటీపాట్నా; 11) నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ లీగల్‌ స్టడీస్‌కొచి; 12) నేషనల్‌ లా యూనివర్సిటీకటక్‌ (ఒడిశా); 13) నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ స్టడీ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌ లారాంచి; 14) నేషనల్‌ లా యూనివర్సిటీ అండ్‌ జ్యురిడికల్‌ అకాడమీఅసోం; 15)దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా యూనివర్సిటీవిశాఖపట్నం; 16) తమిళనాడు నేషనల్‌ లా స్కూల్‌  తిరుచిరాపల్లి;17) మహారాష్ట్ర నేషనల్‌ లా యూనివర్సిటీముంబై; 18) మహారాష్ట్ర నేషనల్‌ లా యూనివర్సిటీనాగ్‌పూర్‌; 19)మహారాష్ట్ర నేషనల్‌ లా యూనివర్సిటీఔరంగాబాద్‌; 20) హిమాచల్‌ప్రదేశ్‌ నేషనల్‌ లా యూనివర్సిటీషిమ్లా; 21) ధర్మశాస్త్ర నేషనల్‌ లా యూనివర్సిటీ(ఎంపీడీఎన్‌ఎల్‌యూ)జబల్‌పూర్‌. 22)డాక్టర్‌.బి.ఆర్‌.అం బేడ్కర్‌ నేషనల్‌ లా యూనివర్సిటీసోనేపట్, హర్యానా.

క్లాట్‌2023 సమాచారం

 • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
 • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: నవంబర్‌ 13, 2022
 • క్లాట్‌ పరీక్ష తేదీ: డిసెంబర్‌ 18, 2022
 • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ
 • వివరాలకు వెబ్‌సైట్‌: https://consortiumofnlus.ac.in/clat2023
Published date : 24 Aug 2022 06:09PM

Photo Stories