Skip to main content

Common Law Admission Test: క్లాట్‌ వివరాలు.. ప్రత్యేకతలు, పరీక్షలో విజయానికి మార్గాలు..

CLAT 2023 exam details and guidance, preparation tips

కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌.. క్లాట్‌గా సుపరిచితం! జాతీయ స్థాయిలోని ప్రతిష్టాత్మకమైన నేషనల్‌ లా యూనివర్సిటీల్లో.. ఐదేళ్ల బీఏ-ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష. క్లాట్‌లో ప్రతిభ చూపి.. నేషనల్‌ లా యూనివర్సిటీల్లో కోర్సు పూర్తి చేసుకుంటే..న్యాయవాద వృత్తితోపాటు.. కార్పొరేట్‌ రంగంలోనూ.. కొలువుదీరొచ్చు. ఇంతటి కీలకమైన క్లాట్‌లో రాణించేందుకు అభ్యర్థులు తమ సన్నద్ధతకు పదును పెట్టుకోవాల్సిన సమయం! ఎందుకంటే.. పరీక్ష తేదీ సమీపిస్తుండడమే! క్లాట్‌-2023 పరీక్ష డిసెంబర్‌ 18న జరగనుంది. ఈ నేపథ్యంలో.. క్లాట్‌ వివరాలు, ప్రత్యేకతలు, పరీక్షలో విజయానికి మార్గాలపై ప్రత్యేక కథనం...

  • నేషనల్‌ లా యూనివర్సిటీల్లో ప్రవేశాలకు క్లాట్‌
  • డిసెంబర్‌ 18న ఆఫ్‌లైన్‌ విధానంలో పరీక్ష
  • బీఏ-ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో చేరే అవకాశం
  • కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ

న్యాయ విద్య అంటే ఎల్‌ఎల్‌బీ లేదా ఎల్‌ఎల్‌ఎం. ఈ కోర్సులు పూర్తి చేస్తే న్యాయవాద వృత్తిలోనే కొనసాగాలనే అభిప్రాయం ఉండేది. అదంతా గతం. కాని నేటి కార్పొరేట్‌ ప్రపంచంలో న్యాయ నిపుణులకు బహుళజాతి సంస్థల్లో కొలువులు లభిస్తున్నాయి. ఈ కోర్సుల బోధనలో ప్రసిద్ధిగాంచిన నేషనల్‌ లా యూనివర్సిటీల్లో ప్రవేశానికి నిర్వహించే క్లాట్‌కు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.

చ‌ద‌వండి: CLAT 2023 Notification: క్లాట్‌తో ప్రయోజనాలు.. పరీక్ష విధానం, భవిష్యత్తు అవకాశాలు..

22 నేషనల్‌ లా యూనివర్సిటీలు

క్లాట్‌ ఎంట్రన్స్‌లో స్కోర్‌ ఆధారంగా 22 నేషనల్‌ లా యూనివర్సిటీల్లో.. అయిదేళ్ల వ్యవధిలోని ఇంటిగ్రేటెడ్‌ బీఏ-ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. ఇంటిగ్రేటెడ్‌ బీఏ-ఎల్‌ఎల్‌బీ ప్రవేశాలకు క్లాట్‌-యూజీ, ఎల్‌ఎల్‌ఎం ప్రవేశాలకు క్లాట్‌-పీజీ పేరుతో వేర్వేరుగా పరీక్షలు ఉంటాయి. 

అర్హతలు

  • క్లాట్‌-యూజీ: కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణత ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • క్లాట్‌-పీజీ: అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణులవ్వాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులు సాధించాలి.

క్లాట్‌-యూజీ ఇలా

  • క్లాట్‌-యూజీని ఆఫ్‌లైన్‌ విధానంలో అయిదు సబ్జెక్ట్‌లలో నిర్వహిస్తారు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 28 నుంచి 32ప్రశ్నలు; జీకే అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌35 నుంచి 39ప్రశ్నలు; లీగల్‌ రీజనింగ్‌ 35నుంచి 39 ప్రశ్నలు; లాజికల్‌ రీజనింగ్‌ 28 నుంచి 32 ప్రశ్నలు; క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ 13నుంచి 17 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. పరీక్షకు కేటాయించిన మొత్తం మార్కులు 150. పరీక్ష సమయం రెండు గంటలు. 
  • ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, కరెంట్‌ అఫైర్స్, లీగల్‌ రీజనింగ్, లాజికల్‌ రీజనింగ్‌లలో పూర్తిగా ప్యాసేజ్‌ ఆధారిత ప్రశ్నలే అడుగుతారు. క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ విభాగంలోనూ గ్రాఫ్, టేబుల్స్, డయాగ్రమ్స్‌ ఆధారిత ప్రశ్నలు ఎదురవుతాయి.

క్లాట్‌-పీజీ.. 120 మార్కులు

  • బీఏ-ఎల్‌ఎల్‌బీ, లేదా ఎల్‌ఎల్‌బీ అర్హతగా నేషనల్‌ లా యూనివర్సిటీల్లోని ఎల్‌ఎల్‌ఎం స్పెషలైజేషన్లలోని సీట్ల భర్తీకి క్లాట్‌-పీజీ నిర్వహిస్తారు. ఈ పరీక్ష 120 ప్రశ్నలతో.. 120 మార్కులకు ఉంటుంది. ఇందులోనూ ప్యాసేజ్‌ ఆధారితంగా ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలుగా అడుగుతారు. 
  • క్లాట్‌ పీజీలో కాన్‌స్టిట్యూషనల్‌ లా సంబంధిత ప్రశ్నలు, జ్యూరిస్పుడెన్స్, అడ్మినిస్ట్రేటివ్‌ లా, లా ఆఫ్‌ కాంట్రాక్ట్, టార్ట్స్, ఫ్యామిలీ లా, క్రిమినల్‌ లా, ప్రాపర్టీ లా, కంపెనీ లా, పబ్లిక్‌ ఇంటర్నేషనల్‌ లా, ట్యాక్స్‌ లా, ఎన్విరాన్‌మెంటల్‌ లా, లేబర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ లా విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. 

విజయం సాధించాలంటే
క్లాట్‌-యూజీ

క్లాట్‌ యూజీలో ఉండే అయిదు సెక్షన్లలోనూ మెరుగైన ప్రతిభ చూపేందుకు ఆయా సిలబస్‌ అంశాలపై సమగ్ర ప్రిపరేషన్‌ సాగించాల్సి ఉంటుంది.

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ నైపుణ్యాన్ని పరిశీలించే ఈ సబ్జెక్ట్‌లో ప్యాసేజ్‌ ఆధారిత ప్రశ్నలు ఉంటాయి. ఈ విభాగంలో రాణించడానికి కాంప్రహెన్షన్, ప్యాసేజ్‌ రీడింగ్‌పై అవగాహన పెంచుకోవాలి. సునిశిత పరిశీలన నైపుణ్యం, ఇచ్చిన ప్యాసేజ్‌ సారాంశాన్ని గ్రహించడం, ఈ ప్యాసేజ్‌ ప్రధాన ఉద్దేశం తెలుసుకోవడం ముఖ్యం. ఇందుకోసం జనరల్‌ ఎస్సేలు, న్యూస్‌ పేపర్‌ ఎడిటోరియల్స్, ఇతర ముఖ్య ప్రచురణలు నిత్యం చదవాలి.

చ‌ద‌వండి: General Knowledge

కరెంట్‌ అఫైర్స్, జనరల్‌ నాలెడ్జ్‌

సమకాలీన అంశాలు, కళలు, సంస్కృతి, అంతర్జాతీయ వ్యవహారాలు, ప్రాధాన్యత కలిగిన చారిత్రక అంశాలకు సంబంధించిన ప్యాసేజ్‌లు ఇచ్చి వీటి నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు జాతీయోద్యమంలో కీలక ఘట్టాలపై దృష్టి పెట్టాలి. భారత రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగ రూపకల్పన నుంచి తాజా సవరణల వరకు అన్నీ తెలుసుకోవాలి. కరెంట్‌ అఫైర్స్‌కు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ద్వైపాక్షిక ఒప్పందాలు, ముఖ్యమైన సంఘటనలు, సదస్సులు గురించి పూర్తి స్థాయి అవగాహన ఏర్పరచుకోవాలి.

లీగల్‌ రీజనింగ్‌

న్యాయపరమైన దృక్పథం, సహేతుక ఆలోచన ధోరణి, నిర్ణయ సామర్థ్యాలను పరిశీలించే ఈ విభాగంలో ప్యాసేజ్‌ ఆధారిత ప్రశ్నలు అడుగుతారు. సంబంధిత ప్యాసేజ్‌ల నుంచి నిబంధనలు, సిద్ధాంతాలు, ఫ్యాక్ట్స్, వాటి ద్వారా చోటు చేసుకుంటున్న మార్పులకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. నిర్దిష్టంగా ఒక సంఘటన, వివాదాన్ని పరిష్కరించేందుకు అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనే నైపుణ్యం పొందాలి. ముఖ్యమైన చట్టాలు, న్యాయ శాఖకు సంబంధించి ఇటీవల కాలంలో చోటు చేసుకున్న తాజా పరిణామాలు, లీగల్‌ టెర్మినాలజీపై అవగాహన పెంచుకోవడం ఈ విభాగంలో మంచి మార్కులకు దోహదం చేస్తుంది.

లాజికల్‌ రీజనింగ్‌

తార్కిక విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉండే విభాగం ఇది. ఇందులోనూ ప్యాసేజ్‌ ఆధారిత ప్రశ్నలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. దీంతోపాటు అసెర్షన్‌ అండ్‌ రీజనింగ్‌ విధానం ప్రశ్నలు కూడా అడుగుతారు. ఇందుకోసం సిలాజిజమ్, కోడింగ్‌-డీ కోడింగ్, డైరెక్షన్, అనాలజీ, సిరీస్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ వంటి అంశాలపై అవగాహన పొందాలి. స్టేట్‌మెంట్‌ ఆధారిత ప్రశ్నల కోసం కంపేరిటివ్‌ అప్రోచ్‌ను అలవర్చుకోవాలి. 

క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌

ఈ విభాగంలో రాణించేందుకు పదో తరగతి స్థాయిలోని గణిత అంశాలపై పట్టు సాధించాలి. గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే అర్థమెటిక్‌కు కొంత ఎక్కువ వెయిటేజీ కనిపిస్తోంది. కాబట్టి పర్సంటేజెస్, టైమ్‌ అండ్‌ డిస్టెన్స్, టైమ్‌ అండ్‌ స్పీడ్, యావరేజ్, రేషియో తదితర అంశాలను ప్రాక్టీస్‌ చేయాలి. గ్రాఫ్‌లు, చార్ట్‌లను విశ్లేషించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి.

క్లాట్‌ పీజీలో ఇలా

క్లాట్‌ పీజీలో విజయానికి.. అభ్యర్థులు తాజా ముఖ్యమైన తీర్పులు, రాజ్యాంగ, శాసనపరమైన అంశాలు, చారిత్రాత్మక తీర్పులు, వాటి ప్రభావం వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. తాము ఎంపిక చేసుకోనున్న స్పెషలైజేషన్‌కు సంబంధించి అకడమిక్‌గా బ్యాచిలర్‌ స్థాయిలోని అంశాలపై పట్టు సాధించడం కూడా ఈ పరీక్షలో స్కోర్‌కు దోహదం చేస్తుంది. 

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
  • దరఖాస్తులకు చివరి తేది: నవంబర్‌ 13, 2022
  • క్లాట్‌ పరీక్ష తేదీ: డిసెంబర్‌ 18, 2022
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ
  • పూర్తి వివరాలకు  https://consortiumofnlus.ac.in/clat-2023

నేషనల్‌ లా యూనివర్సిటీలు

నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా-బెంగళూరు; నల్సార్‌-హైదరాబాద్‌; నేషనల్‌ లా యూనివర్సిటీ-భోపాల్‌; వెస్ట్‌ బెంగాల్‌ నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ జ్యురిడికల్‌ సైన్సెస్‌-కోల్‌కత; నేషనల్‌ లా యూనివర్సిటీ-జోథ్‌పూర్‌; హిదయతుల్లా నేషనల్‌ లా యూనివర్సిటీ-రాయ్‌పూర్‌; గుజరాత్‌ నేషనల్‌ లా యూనివర్సిటీ-గాంధీనగర్‌; డా''రామ్‌మనోహర్‌ లోహియా నేషనల్‌ లా యూనివర్సిటీ-లక్నో; రాజీవ్‌గాంధీ నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా-పంజాబ్‌; చాణక్య నేషనల్‌ లా యూనివర్సిటీ-పాట్నా; నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ లీగల్‌ స్టడీస్‌-కొచి; నేషనల్‌ లా యూనివర్సిటీ-కటక్‌(ఒడిశా);నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ స్టడీ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌ లా-రాంచి; నేషనల్‌ లా యూనివర్సిటీ అండ్‌ జ్యురిడికల్‌ అకాడమీ-అసోం; దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా యూనివర్సిటీ-విశాఖపట్నం; తమిళనాడు నేషనల్‌ లా స్కూల్‌-తిరుచిరాపల్లి; మహారాష్ట్ర నేషనల్‌ లా యూనివర్సిటీ-ముంబై; మహారాష్ట్ర నేషనల్‌ లా యూనివర్సిటీ-నాగ్‌పూర్‌; మహారాష్ట్ర నేషనల్‌ లా యూనివర్సిటీ-ఔరంగాబాద్‌; హిమాచల్‌ప్రదేశ్‌ నేషనల్‌ 
లా యూనివర్సిటీ-సిమ్లా;ధర్మశాస్త్ర నేషనల్‌ లా యూనివర్సిటీ(ఎంపీడీఎన్‌ఎల్‌యూ)-జబల్‌పూర్‌; డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ నేషనల్‌ లా యూనివర్సిటీ- సోనేపట్, హర్యానా.

విస్తృత అవకాశాలు

క్లాట్‌లో విజయంతో నేషనల్‌ లా యూనివర్సిటీల్లో చేరి కోర్సులు పూర్తిచేసుకున్న అభ్యర్థులు కార్పొరేట్‌ కొలువులు సైతం సొంతం చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుత అంతర్జాతీయ వాణిజ్య విధానాలు, పలు దేశాల మధ్య కంపెనీల ఒప్పందాలతో జరుగుతున్న కార్యకలాపాల నేపథ్యంలో సంస్థలు న్యాయ నిపుణులను నియమించు కుంటున్నాయి. అదే విధంగా క్లాట్‌కు పోటీ కూడా పెరుగుతోంది.కాబట్టి అభ్యర్థులు మెరుగైన స్కోర్‌ సాధించే విధంగా ఇప్పటి నుంచే కృషి చేయాలి.
- ప్రొ'' వి.బాలకిష్టారెడ్డి, ఇంచార్జ్‌ వీసీ, నల్సార్, హైదరాబాద్‌

Published date : 20 Oct 2022 05:12PM

Photo Stories