CLAT Exam Preparation Tips: క్లాట్‌తో ప్రయోజనాలు.. పరీక్ష విధానం, సిలబస్, ప్రిపరేషన్ తదితర వివరాలు ఇవే!!
- క్లాట్–2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
- డిసెంబర్ 3, 2023న పరీక్ష
- పరీక్ష విధానంలో పలు మార్పులు
- క్లాట్ స్కోర్‌తో 24 నేషనల్ లా వర్సిటీల్లో ప్రవేశం
క్లాట్–2024 ద్వారా మొత్తం 24 నేషనల్ లా యూనివర్సిటీల్లో ప్రవేశం కల్పిస్తారు. గత ఏడాది 22 వర్సిటీలే ఉండగా..ఈ ఏడాది మరో రెండు యూనివర్సిటీలు క్లాట్ స్కోర్‌తో ప్రవేశాలు కల్పించేందుకు సిద్ధమయ్యాయి. క్లాట్ యూజీతో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ, క్లాట్ పీజీతో ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్‌లో అడ్మిషన్ లభిస్తుంది.
అర్హత
క్లాట్–యూజీకి దరఖాస్తు చేసుకునేందుకు కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులు కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. 2023–24లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
చదవండి: TS LAWCET 2023: లాసెట్ టాపర్స్ వీరే...
తగ్గిన ప్రశ్నల భారం
క్లాట్–యూజీ 2024లో ప్రశ్నల సంఖ్యను తగ్గిస్తూ.. పరీక్ష నిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుంది. గతేడాది వరకు 150 ప్రశ్నలతో ఈ పరీక్ష నిర్వహించగా.. క్లాట్–యూజీ 2024లో 120 ప్రశ్నలే ఉంటాయని పేర్కొన్నారు. పరీక్ష సమయాన్ని మాత్రం గతంలో మాదిరిగానే రెండు గంటలుగా నిర్ణయించారు. అంటే.. గతంలో రెండు గంటల వ్యవధిలో 150 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటే.. ఈ ఏడాది 2 గంటల వ్యవధిలో 120 ప్రశ్నలకు సమాధానం ఇస్తే సరిపోతుంది. దీనివల్ల ఒకవైపు ప్రశ్నల సంఖ్య తగ్గడంతోపాటు ప్రతి ప్రశ్నకు లభించే సగటు సమయం పెరుగుతుంది.
చదవండి: Guidance
అయిదు విభాగాలు
క్లాట్–యూజీ 2024 పరీక్షను అయిదు విభాగాలుగా నిర్వహిస్తారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 22–26 ప్రశ్నలు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 28–32 ప్రశ్నలు, లీగల్ రీజనింగ్ 28–32 ప్రశ్నలు, లాజికల్ రీజనింగ్ 22–26 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ టెక్నిక్స్ 10–14 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష ప్రశ్నల సంఖ్య తగ్గించిన నేపథ్యంలో ఆయా సబ్జెక్ట్‌లలో ప్రశ్నల సంఖ్యా శ్రేణిని కూడా తగ్గించారు. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. పరీక్షకు కేటాయించిన మార్కులు 120. నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.
ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు
క్లాట్–యూజీలో పేర్కొన్న అయిదు విభాగాల్లో.. నాలుగు విభాగా(ఇంగ్లిష్ లాంగ్వేజ్, కరెంట్ అఫైర్స్, లీగల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్)ల్లో పూర్తిగా ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలే అడుగుతారు. క్వాంటిటేటివ్ టెక్నిక్స్ విభాగంలో గ్రాఫ్, టేబుల్స్, డయాగ్రమ్స్ ఆధారిత ప్రశ్నలు ఉంటాయి.
క్లాట్–పీజీ.. ఇలా
- నేషనల్ లా యూనివర్సిటీల్లో ఎల్‌ఎల్‌ఎం కోర్సులో ప్రవేశాలకు క్లాట్–పీజీ నిర్వహిస్తారు. ఎల్‌ఎల్‌బీ తత్సమాన ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులు ఎల్‌ఎల్‌బీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులు సాధించాలి. ఈ ఏడాది చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- క్లాట్–పీజీ పరీక్షను 120 ప్రశ్నలు–120 మార్కులకు నిర్వహిస్తారు. ప్యాసేజ్ ఆధారితంగా ఆబ్జెక్టివ్ ప్రశ్నలుగా అడుగుతారు.
- పరీక్షలో కాన్‌స్టిట్యూషనల్ లా సంబంధిత ప్రశ్నలు, జ్యూరిస్పుడెన్స్, అడ్మినిస్ట్రేటివ్ లా, లా ఆఫ్ కాంట్రాక్ట్, టార్ట్స్, ఫ్యామిలీ లా, క్రిమినల్ లా, ప్రాపర్టీ లా,కంపెనీ లా, పబ్లిక్ ఇంటర్నేషనల్ లా, ట్యాక్స్ లా, ఎన్విరాన్‌మెంటల్ లా, లేబర్ అండ్ ఇండస్ట్రియల్ లా విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
- అభ్యర్థులు ముఖ్యమైన తాజా తీర్పులు; రాజ్యాంగ, శాసనపరమైన అంశాలు; చారిత్రాత్మక తీర్పులు, వాటి ప్రభావం వంటి వాటిపై అవగాహన పెంచుకుంటే.. క్లాట్–పీజీలో మెరుగైన మార్కులు సొంతం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు తాము ఎంపిక చేసుకోనున్న స్పెషలైజేషన్‌కు సంబంధించి అకడమిక్‌గా బ్యాచిలర్ స్థాయిలోని అంశాలపై పట్టు సాధించడం కూడా మేలు చేస్తుంది.
చదవండి: Law Aptitude
ప్రిపరేషన్ పక్కాగా
- ఇంగ్లిష్ లాంగ్వేజ్: ఈ విభాగంలో ఇంగ్లిష్ భాషా నైపుణ్యాన్ని పరిశీలించే ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రాణించేందుకు కాంప్రహెన్షన్, ప్యాసేజ్ రీడింగ్‌పై పట్టు పెంచుకోవాలి. సునిశిత పరిశీలన నైపుణ్యం, ఇచ్చిన ప్యాసేజ్ సారాంశాన్ని గ్రహించడం, ఈ ప్యాసేజ్ ప్రధాన ఉద్దేశం తెలుసుకోవడం వంటి నైపుణ్యాలు అవసరం. ఇందుకోసం జనరల్ ఎస్సేలు, న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్ వంటివి చదవాలి.
- కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్: ఈ విభాగంలో సమకాలీన అంశాలు, కళలు, సంస్కృతి, అంతర్జాతీయ వ్యవహారాలు, ప్రాధాన్యత కలిగిన చారిత్రక అంశాలకు సంబంధించిన ప్యాసేజ్‌లు ఇచ్చి.. వీటి నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు జాతీయోద్యమంలో కీలక ఘట్టాలపై దృష్టి పెట్టాలి. భారత రాజ్యాంగ రూపకల్పన నుంచి తాజా సవరణల వరకు అన్నీ తెలుసుకోవాలి. కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ద్వైపాక్షిక ఒప్పందాలు, ముఖ్యమైన సంఘటనలు, సదస్సుల గురించి పూర్తి స్థాయి అవగాహన పొందాలి.
- లీగల్ రీజనింగ్: అభ్యర్థుల న్యాయపరమైన దృక్పథం, సహేతుక ఆలోచన ధోరణి, నిర్ణయ సామర్థ్యాలను పరిశీలించే విభాగం ఇది. ఇందులో ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు అడుగుతారు. సంబంధిత ప్యాసేజ్‌ల నుంచి నిబంధనలు, సిద్ధాంతాలు, ఫ్యాక్ట్స్, వాటి ద్వారా చోటు చేసుకుంటున్న మార్పులకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ముఖ్యమైన చట్టాలు, న్యాయ శాఖకు సంబంధించి ఇటీవల కాలంలో చోటు చేసుకున్న తాజా పరిణామాలు, లీగల్ టెర్మినాలజీపై అవగాహన పెంచుకోవాలి.
- లాజికల్ రీజనింగ్: ఈ విభాగంలోనూ ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇందులో రాణించాలంటే.. ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు; అసెర్షన్ అండ్ రీజనింగ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఇందుకోసం సిలాజిజమ్, కోడింగ్–డీ కోడింగ్, డైరెక్షన్, అనాలజీ, సిరీస్, సీటింగ్ అరేంజ్‌మెంట్ వంటి అంశాలపై అవగాహన పొందాలి. స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నల కోసం కంపేరిటివ్ అప్రోచ్‌ను అలవర్చుకోవాలి.
- క్వాంటిటేటివ్ టెక్నిక్స్: ఈ విభాగంలో టాప్ స్కోర్ కోసం పదో తరగతి స్థాయిలోని గణిత అంశాలపై గట్టి పట్టు సాధించాలి. గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే అర్థమెటిక్‌కు కొంత ఎక్కువ వెయిటేజీ కనిపిస్తోంది. కాబట్టి పర్సంటేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ స్పీడ్, యావరేజ్, రేషియోస్ తదితర టాపిక్స్‌ను బాగా ప్రాక్టీస్ చేయాలి. దీంతోపాటు గ్రాఫ్‌లు, చార్ట్‌లను విశ్లేషించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి.
చదవండి: Arthimetic
కార్పొరేట్ అవకాశాల లా
నేషనల్ లా యూనివర్సిటీల్లో కోర్సు పూర్తి చేసుకున్న వారికి విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. న్యాయవాద వృత్తి మాత్రమే కాకుండా.. కార్పొరేట్ కొలువులు సైతం సొంతం చేసుకునే వీలుంది. ప్రస్తుత అంతర్జాతీయ వాణిజ్య విధానాలు, పలు దేశాల కంపెనీల మధ్య అవగాహన ఒప్పందాలు వంటి వాటి కారణంగా న్యాయ నిపుణులకు డిమాండ్ ఏర్పడింది. క్యాంపస్‌లలో రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్‌లో ఎంపికైన విద్యార్థులకు కన్సల్టింగ్ సంస్థలు, బ్యాంకులు సగటున రూ.10 లక్షల వార్షిక వేతనం ఆఫర్ చేస్తున్నాయి.
చదవండి: Study Material
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
- ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: జూలై 1 – నవంబర్ 3, 2023
- క్లాట్ పరీక్ష తేదీ: డిసెంబర్ 3, 2023
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ
- క్లాట్–పీజీ వెబ్‌సైట్: https://consortiumofnlus.ac.in/clat-2024/