Skip to main content

CLAT 2022: ఇంటర్‌ అర్హతతోనే న్యాయ కోవిదులుగా

clat 2022 notification test format preparation tips syllabus Books, Planning
clat 2022 notification test format preparation tips syllabus Books, Planning

కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌.. సంక్షిప్తంగా క్లాట్‌! ఇది జాతీయ స్థాయిలో.. ఏర్పాటైన ప్రతిష్టాత్మక నేషనల్‌ లా యూనివర్సిటీల్లో.. న్యాయ శాస్త్రంలో బ్యాచిలర్‌(బీఏ–ఎల్‌ఎల్‌బీ), పీజీ (ఎల్‌ఎల్‌ఎం) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష. ఇంటర్‌ తర్వాత వినూత్న కెరీర్స్‌ దిశగా ఆలోచించే వారికి చక్కటి మార్గం.. క్లాట్‌ ఇంటర్మీడియెట్‌ అర్హతతోనే..ప్రతిష్టాత్మక నేషనల్‌ లా యూనివర్సిటీల్లో అడుగుపెట్టేందుకు.. క్లాట్‌–యూజీ ప్రామాణికం! ఈ బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సు పూర్తి చేసుకుంటే.. భవిష్యత్తులో న్యాయవాద వృత్తితోపాటు కార్పొరేట్‌ కొలువులూ అందుకోవచ్చు. ఇంతటి ప్రాముఖ్యం సంతరించుకున్న క్లాట్‌ 2022 ప్రవేశ పరీక్ష తేదీ ఖరారైంది. ఈ నేపథ్యంలో.. క్లాట్‌–2022 విధి విధానాలు, పరీక్ష స్వరూపం, విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు, మార్పులు తదితర అంశాలపై విశ్లేషణ...

  • క్లాట్‌తో నేషషనల్‌ లా యూనివర్సిటీల్లో యూజీ, పీజీ కోర్సులు
  • క్లాట్‌–2022 తేదీల్లో స్వల్ప మార్పులు
  • మే 9 వరకు దరఖాస్తులు, జూన్‌ 19న పరీక్ష
  • ఇంటర్‌ అర్హతతోనే న్యాయ కోవిదులుగా రాణించేందుకు మార్గం

కెరీర్‌ అవకాశాల పరంగా లా విభాగం కొత్త పుంతలు తొక్కుతోంది. గతంలో న్యాయవాద విద్య, ఆ తర్వాత ఉద్యోగ అవకాశాలు అంటే.. లాయర్‌గా ప్రాక్టీస్‌ చేయడమే ప్రధాన గమ్యంగా ఉండేది. కానీ.. ఇప్పుడు కార్పొరేట్‌ యుగంలో న్యాయవాద వృత్తి రూపు మారుతోంది. కార్పొరేట్‌ దిగ్గజాలు అంతర్గతంగా తమ సంస్థల్లో న్యాయ నిపుణులను నియమించుకుంటున్నాయి. ఇంటర్‌ అర్హతతోనే న్యాయ విద్యలో అడుగుపెట్టే అవకాశం, వృత్తి నైపుణ్యాలు అందించే నేషనల్‌ లా యూనివర్సిటీల్లో ప్రవేశానికి నిర్వహించే క్లాట్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటే.. ఇంజనీరింగ్, మెడిసిన్‌ కోర్సులకు దీటుగా కెరీర్‌లో రాణించే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు. 

క్లాట్‌ యూజీ, పీజీ

దేశంలోని ప్రతిష్టాత్మక న్యాయ విశ్వవిద్యాలయాలైన నేషనల్‌ లా యూనివర్సిటీల్లో బ్యాచిలర్, పీజీ స్థాయి కోర్సుల్లో అడుగుపెట్టేందుకు మార్గం.. కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌)– యూజీ, పీజీ. వీటికి సంబంధించి తాజాగా 2022–23 సంవత్సరానికి క్లాట్‌ షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ పరీక్ష తేదీని కూడా మార్చారు. దీంతో ఇప్పటి వరకు దీనిపై దృష్టిపెట్టని విద్యార్థులు.. ఈ జాప్యాన్ని తమకు అవకాశంగా మలచుకుంటే.. ప్రముఖ లా యూనివర్సిటీల్లో అడ్మిషన్‌ సొంతం చేసుకోవచ్చు.

చ‌ద‌వండి: After Inter: ఇంటర్ తర్వాత.. ఎన్నెన్నో అవకాశాలు 

జూన్‌ 19న క్లాట్‌

వాస్తవానికి క్లాట్‌–2022ను మే 8న నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. ప్రస్తుత అకడమిక్‌ సంవత్సరంలో దేశంలోని అన్ని బోర్డ్‌లు, యూనివర్సిటీల స్థాయిలో అకడమిక్‌ క్యాలెండర్, వార్షిక పరీక్షలను పరిగణనలోకి తీసుకున్న క్లాట్‌ నిర్వాహక కమిటీ(కన్సార్షియం ఆఫ్‌ నేషనల్‌ లా యూనివర్సిటీస్‌).. క్లాట్‌ పరీక్ష తేదీలోనూ మార్పులు చేసింది. తాజాగా క్లాట్‌ను జూన్‌ 19న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అదే విధంగా ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును సైతం పొడిగించింది. తొలి విడత నోటిషికేషన్‌లో మార్చి 31నే ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ గడువుగా పేర్కొనగా..ఇప్పుడు క్లాట్‌ దరఖాస్తును మే 9వ తేదీ వరకు పొడిగించింది.

క్లాట్‌–2023 ఈ ఏడాది డిసెంబర్‌లోనే

క్లాట్‌ మరో ముఖ్యమైన మార్పు.. క్లాట్‌–2023తో ప్రారంభించి.. ఇకపై ప్రతి ఏటా క్లాట్‌ను డిసెంబర్‌ నెలలోనే నిర్వహించాలని నిర్ణయించడం. దీనికి ప్రధాన కారణం.. పరీక్ష తేదీల విషయంలో స్పష్టమైన క్యాలెండర్‌ విధానాన్ని అనుసరించాలని భావించడమే. అందుకోసం.. ఇక నుంచి క్లాట్‌ను ప్రతి ఏటా డిసెంబర్‌లోనే నిర్వహించనున్నారు. క్లాట్‌–2023కి సంబంధించి నోటిఫికేషన్‌ కూడా ఈ ఏడాదే జూన్‌ లేదా జూలై నెలలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.

క్లాట్‌.. యూజీ, పీజీగా

  • క్లాట్‌ పరీక్షను రెండు స్థాయిల్లో క్లాట్‌–యూజీ, క్లాట్‌–పీజీ పేరిట నిర్వహిస్తున్నారు.
  • క్లాట్‌–యూజీని నేషనల్‌ లా యూనివర్సిటీల్లో.. అందుబాటులో ఉన్న అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఏ –ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశానికి నిర్దేశించారు.
  • క్లాట్‌–పీజీని.. ఎల్‌ఎల్‌ఎం స్పెషలైజేషన్స్‌లో ప్రవేశానికి పేర్కొన్నారు.


చ‌ద‌వండి: Engineering‌ Entrance‌‌: బెస్ట్‌ ఇంజనీరింగ్‌కు.. బిట్‌శాట్‌

అర్హతలు

  • క్లాట్‌ యూజీ అభ్యర్థులు 45 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • క్లాట్‌ పీజీ అభ్యర్థులు ఎల్‌ఎల్‌బీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి.

క్లాట్‌–యూజీ.. ఇలా

ఇంటర్మీడియెట్‌ అర్హతగా ఇంటిగ్రేటెడ్‌ బీఏ–ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే క్లాట్‌–యూజీ పరీక్ష అయిదు సబ్జెక్ట్‌లలో నిర్వహిస్తారు. ఆ వివరాలు..

సబ్జెక్ట్‌  ప్రశ్నలు
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 28 నుంచి 32 ప్రశ్నలు
జీకే అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ 35 నుంచి 39 ప్రశ్నలు
లీగల్‌ రీజనింగ్‌ 35 నుంచి 39 ప్రశ్నలు
లాజికల్‌ రీజనింగ్‌ 28 నుంచి 32 ప్రశ్నలు
క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ 13 నుంచి 17 ప్రశ్నలు
  • పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహించే ఈ పరీక్షకు కేటాయించిన మార్కులు 150. అభ్యర్థులు రెండు గంటల సమయంలో పరీక్ష పూర్తి చేయాల్సి ఉంటుంది.
  • ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, కరెంట్‌ అఫైర్స్, లీగల్‌ రీజనింగ్, లాజికల్‌ రీజనింగ్‌లలో పూర్తిగా ప్యాసేజ్‌ ఆధారిత ప్రశ్నలే అడుగుతారు.
  • క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ విభాగంలోనూ.. గ్రాఫ్, టేబుల్స్, డయాగ్రమ్స్‌ ఆధారిత ప్రశ్నలు అడుగుతారు.

విజయం సాధించండి‘లా’!

క్లాట్‌–యూజీలో విజయం సాధించాలంటే.. అభ్యర్థులు పూర్తిగా విశ్లేషణాత్మక దృక్పథంతో వ్యవహరించాలి. మొత్తం అయిదు సబ్జెక్ట్‌లలో అయిదు సెక్షన్లుగా నిర్వహించే క్లాట్‌–యూజీలో విజయానికి అభ్యర్థులు అనుసరించాల్సిన వ్యూహాలు..

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌

  • ప్యాసేజ్‌ ఆధారిత ప్రశ్నలు ఉండే ఈ విభాగంలో రాణించడానికి కాంప్రహెన్షన్, ప్యాసేజ్‌ రీడింగ్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. సునిశిత పరిశీలన నైపుణ్యం, ఇచ్చిన ప్యాసేజ్‌ సారాంశాన్ని గ్రహించడం, ఈ ప్యాసేజ్‌ ప్రధాన ఉద్దేశం తెలుసుకోవడం వంటి నైపుణ్యాలు పెంచుకోవాలి. ఇందుకోసం జనరల్‌ ఎస్సేలు,న్యూస్‌ పేపర్‌ ఎడిటోరియల్స్, ఇతర ముఖ్య ప్రచురణలు చదవాలి. 

చ‌ద‌వండి: Latest Current Affairs
కరెంట్‌ అఫైర్స్, జనరల్‌ నాలెడ్జ్‌

ఈ విభాగంలోనూ ప్యాసేజ్‌ ఆధారిత ప్రశ్నలు ఉంటాయి. సమకాలీన అంశాలు, కళలు, సంస్కృతి, అంతర్జాతీయ వ్యవహారాలు, ప్రాధాన్యత కలిగిన చారిత్రక అంశాలకు సంబంధించిన ప్యాసేజ్‌లు ఇచ్చి.. వీటి నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు జాతీయోద్యమంలో కీలక ఘట్టాలపై దృష్టి పెట్టాలి. భారత రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగ రూపకల్పన నుంచి తాజా సవరణల వరకూ.. అన్నీ తెలుసుకోవాలి. కరెంట్‌ అఫైర్స్‌కు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ద్వైపాక్షిక ఒప్పందాలు, ముఖ్యమైన సంఘటనలు, సదస్సులు గురించి పూర్తి స్థాయి అవగాహన ఏర్పరచుకోవాలి. ప్రామాణిక జనరల్‌ నాలెడ్జ్‌ పుస్తకాలతోపాటు, ప్రతిరోజు న్యూస్‌ పేపర్‌ రీడింగ్‌ను అలవాటు చేసుకోవాలి. 

లీగల్‌ రీజనింగ్‌

ఈ విభాగంలోనూ ప్యాసేజ్‌ ఆధారిత ప్రశ్నలే ఎదురవుతాయి. సంబంధిత ప్యాసేజ్‌ల నుంచి నిబంధనలు, సిద్ధాంతాలు, ఫ్యాక్ట్స్, వాటిద్వారా చోటు చేసుకుంటున్న మార్పులకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు న్యాయపరమైన దృక్పథం, సహేతుక ఆలోచన ధోరణి, నిర్ణయ సామర్థ్యాలను పరిశీలించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. నిర్దిష్టంగా ఒక సంఘటన, వివాదాన్ని పరిష్కరించేందుకు అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనే నైపుణ్యం పొందాలి. ముఖ్యమైన చట్టాలు, న్యాయ శాఖకు సంబంధించి ఇటీవల కాలంలో చోటు చేసుకున్న తాజా పరిణామాలు, లీగల్‌ టెర్మినాలజీపై అవగాహన పెంచుకోవడం ఈ విభాగంలో మంచి మార్కులకు దోహదం చేస్తుంది.

లాజికల్‌ రీజనింగ్‌

అభ్యర్థుల్లోని తార్కిక విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉండే విభాగం ఇది. ఇందులో కొన్ని ప్యాసేజ్‌ ఆధారిత ప్రశ్నలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఈ విభాగంలో రాణించాలంటే.. ప్యాసేజ్‌ ఆధారిత ప్రశ్నలు; అసెర్షన్‌ అండ్‌ రీజనింగ్‌ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఇందుకోసం సిలాజిజమ్, కోడింగ్‌–డీ కోడింగ్, డైరెక్షన్, అనాలజీ, సిరీస్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ వంటి అంశాలపై అవగాహన పొందాలి. స్టేట్‌మెంట్‌ ఆధారిత ప్రశ్నల కోసం కంపేరిటివ్‌ అప్రోచ్‌ను అలవర్చుకోవాలి. 

క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌

ఈ విభాగంలో మంచి మార్కులు సాధించాలంటే.. ముందుగా పదో తరగతి స్థాయిలోని గణిత సబ్జెక్ట్‌ అంశాలపై పట్టు సాధించాలి. గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే..అర్థమెటిక్‌కు కొంచెం ఎక్కువ వెయిటేజీ కనిపిస్తోంది. దీన్ని పరిగణనలోకి తీసుకొని పర్సంటేజెస్, టైమ్‌ అండ్‌ డిస్టెన్స్, టైమ్‌ అండ్‌ స్పీడ్, యావరేజ్, రేషియో తదితర అంశాలను ప్రాక్టీస్‌ చేయాలి. గ్రాఫ్‌లు, చార్ట్‌లను విశ్లేషించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి.

క్లాట్‌–పీజీ.. 120 ప్రశ్నలే

  • ఎల్‌ఎల్‌ఎం స్పెషలైజేషన్స్‌లో ప్రవేశానికి నిర్వహించే.. క్లాట్‌–పీజీలో ప్రశ్నల సంఖ్యను 120గా పేర్కొన్నారు. గత ఏడాది క్లాట్‌ పీజీ పరీక్ష 150 ప్రశ్నలతో జరిగింది. 

పరీక్ష స్వరూపం..

  •  మొత్తం 120 మార్కులకు.. 120 ప్రశ్నలు అడుగుతారు.
  • ఇవి కూడా ప్యాసేజ్‌ ఆధారిత ప్రశ్నలుగానే ఉంటాయి. 
  • పరీక్షలో కాన్‌స్టిట్యూషనల్‌ లా సంబంధిత ప్రశ్నలు, జ్యూరిస్పుడెన్స్, అడ్మినిస్ట్రేటివ్‌ లా, లా ఆఫ్‌ కాంట్రాక్ట్, టార్ట్స్, ఫ్యామిలీ లా, క్రిమినల్‌ లా, ప్రాపర్టీ లా, కంపెనీ లా, పబ్లిక్‌ ఇంటర్నేషనల్‌ లా, ట్యాక్స్‌ లా, ఎన్విరాన్‌మెంటల్‌ లా, లేబర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ లా విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 
  • అభ్యర్థులు తాజా ముఖ్యమైన తీర్పులు, రాజ్యాంగ, శాసనపరమైన అంశాలు, చారిత్రాత్మక తీర్పులు, వాటి ప్రభావం వంటి అంశాలపై అవగాహన ఏర్పరచుకుంటే..క్లాట్‌–పీజీలో మెరుగైన మార్కులు సొంతం చేసుకునే ఆస్కారం ఉంది.

కోర్సు పూర్తి చేస్తే.. ఉజ్వల కెరీర్‌

నేషనల్‌ లా యూనివర్సిటీల్లో బీఏ–ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సులు పూర్తి చేసుకుంటే.. ఉజ్వల కెరీర్‌ అవకాశాలు సొంతమవడం ఖాయం. న్యాయవాద వృత్తితోపాటు కార్పొరేట్‌ కొలువులు దక్కించుకోవచ్చు. దీనికి కారణం.. ప్రస్తుతం ప్రతి సంస్థ కూడా తమకంటూ ఒక ప్రత్యేక న్యాయ విభాగం ఉండాలని, వాటి ద్వారా కార్పొరేట్‌ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహించాలని భావిస్తుండటమే. నేషనల్‌ లా యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన వారిని నియమించుకునేందుకు కార్పొరేట్‌ సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలు, ఆర్‌ అండ్‌ డీ సంస్థలు, బ్యాంకులు వీరిని నియమించుకుంటున్నాయి. ప్రతి ఏటా ఆయా ఇన్‌స్టిట్యూట్‌లలో క్యాంపస్‌ నియామకాలు చేపడుతున్నాయి. సగటున రూ.8లక్షల నుంచి రూ.15 లక్షల వార్షిక వేతనం అందిస్తున్నాయి. అదే విధంగా ఇటీవల కాలంలో జీఎస్‌టీ అమలు విస్తృతం కావడం కూడా కార్పొరేట్‌ కొలువులకు మార్గంగా నిలుస్తోంది. 

క్లాట్‌–యూజీ–2022 సమాచారం

  • ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు తేదీ: మే 9, 2022
  • క్లాట్‌ పరీక్ష తేదీ: జూన్‌ 19, 2022
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://consortiumofnlus.ac.in/clat-2022


చ‌ద‌వండి: క్లాట్‌తో జాతీయ సంస్థల్లో న్యాయ విద్య.. ప్రిపరేషన్‌ సాగించండిలా.. !​​​​​​​

Published date : 02 May 2022 05:42PM

Photo Stories