Skip to main content

క్లాట్‌తో జాతీయ సంస్థల్లో న్యాయ విద్య.. ప్రిపరేషన్‌ సాగించండిలా.. !

కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌.. క్లుప్తంగా క్లాట్‌. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా నిర్వహించే ఉమ్మడి పరీక్ష. క్లాట్‌ను జూలై 23న నిర్వహించనున్నట్లు ఇటీవల కన్సార్టియం ప్రకటించింది. దీంతో క్లాట్‌ను లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు ప్రిపరేషన్‌పై మరింత దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో... క్లాట్‌ అభ్యర్థులకు ఉపయోగపడేలా పరీక్ష ప్యాట్రన్, సిలబస్, ప్రిపరేషన్‌ గైడెన్స్‌తో పాటు క్లాట్‌తో ప్రయోజనాలపై ప్రత్యేక కథనం..

క్లాట్‌.. దేశంలోని లా ఎంట్రన్స్‌ల్లో అత్యంత క్రేజీ పరీక్ష. దీన్ని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు కన్సార్టియంగా ఏర్పడి నిర్వహిస్తున్నాయి. క్లాట్‌–యూజీ ద్వారా దేశంలోని 22 నేషనల్‌ లా విశ్వవిద్యాలయాల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ లా, క్లాట్‌–పీజీ ద్వారా ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే క్లాట్‌ స్కోరును దేశంలోని 70కిపైగా లా ఇన్‌స్టిట్యూట్‌లు పరిగణనలోకి తీసుకుంటున్నాయి.

క్లాట్‌–యూజీ కోర్సులు..
క్లాట్‌లో ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు అందించే యూజీ స్థాయి కోర్సులు.. బీఏ ఎల్‌ఎల్‌బీ, బీఎస్సీ ఎల్‌ఎల్‌బీ, బీబీఎ ఎల్‌ఎల్‌బీ, బీకాం ఎల్‌ఎల్‌బీ, బీఎస్‌డబ్ల్యూ ఎల్‌ఎల్‌బీ. ఇంటర్మీడియెట్‌ లేదా తత్సమాన కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. పీజీ, పీహెచ్‌డీ స్థాయి కోర్సులను కూడా నేషనల్‌ లా యూనివర్సిటీలు అందిస్తున్నాయి.

పరీక్ష విధానం..
క్లాట్‌ పరీక్ష వ్యవధి రెండు గంటలు. పరీక్షను ఆఫ్‌లైన్‌ విధానం(పెన్‌ అండ్‌ పేపర్‌)లో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో 150 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు (ఎంసీక్యూలు) ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు లభిస్తుంది. ప్రతి తప్పు సమాధానానికి పావు వంతు మార్కు కోత పడుతుంది. ప్రశ్నపత్రంలో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, కరెంట్‌ అఫైర్స్‌(జనరల్‌ నాలెడ్జ్‌), లీగల్‌ రీజనింగ్, లాజికల్‌ రీజనింగ్, క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ విభాగాలు ఉంటాయి.

ప్రిపరేషన్‌..

 • ఇంగ్లిష్‌: కాంప్రహెన్షన్‌ ప్యాసేజెస్, గ్రామర్‌పై ప్రశ్నలు వస్తాయి. మొత్తంగా 28–32 ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఉంది. దీనికి 20 శాతం మేర వెయిటేజీ దక్కుతుంది.
 • క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌: ఎలిమెంటరీ నుంచి పదోతరగతి వరకు ఉన్న మ్యాథ్స్‌ను ప్రిపేరవ్వాలి. 13 నుంచి 17 ప్రశ్నల వరకు రావొచ్చు. దీనికి 10 శాతం వెయిటేజీ లభిస్తుంది.
 • కరెంట్‌ అఫైర్స్‌(జనరల్‌ నాలెడ్జ్‌ కలిపి): జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలతోపాటు చారిత్రక సంఘటనలు, జాగ్రఫీ, ఎకనామిక్స్, ఇడియమ్స్‌ అండ్‌ ప్రేజెస్, జనరల్‌ ఇంగ్లిష్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. 35–38 ప్రశ్నల వరకు రావొచ్చు. 25 శాతం మేర వెయిటేజీ లభిస్తుంది.
 • లాజికల్‌ రీజనింగ్‌: లాజికల్‌ అండ్‌ అనలిటికల్‌స్కిల్స్‌పై ప్రశ్నలు అడుగుతారు. 28–32 ప్రశ్నల వరకు వస్తాయి. సుమారు 20 శాతం మేర వెయిటేజీ దక్కుతుంది.
 • లీగల్‌ రీజనింగ్‌: స్టడీ ఆఫ్‌ లా, రీసెర్చ్‌ ఆప్టిట్యూడ్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ ఎబిలిటీ తదితరాలపై 35–39 ప్రశ్నల వరకు వస్తాయి. 25 శాతం మేర వెయిటేజీ లభిస్తుంది.

ఉపాధి అవకాశాలు..
క్లాట్‌ ద్వారా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశించి.. న్యాయ పట్టాతో బయటకు వచ్చిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు పుష్కలం. న్యాయ స్థానాలు, లా సంస్థలతోపాటు బహుళజాతి కంపెనీ(ఎమ్‌ఎన్‌సీ)లు, గవర్నమెంట్‌ ఏజెన్సీలు, బ్యాంకులు సైతం కొలువులు అందిస్తున్నాయి.

జాబ్‌ ప్రొఫైల్స్‌..
న్యాయ విద్య కోర్సులు పూర్తిచేసుకున్న అభ్యర్థులు–జడ్జి, అడ్వొకేట్, లీగల్‌ అడ్వైజర్, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్, టీచర్‌ లేదా లెక్చరర్, లీగల్‌ మేనేజర్, లీగల్‌ సర్వీస్‌ చీఫ్, లీగల్‌ రిపోర్టర్‌ తదితర ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.

టాప్‌ రిక్రూటర్స్‌..

 • అమర్‌చంద్‌ మంగల్‌దాస్, ఏజెడ్‌బీ అండ్‌ పార్టనర్స్, జే సాగర్‌ అండ్‌ అసోసియేట్స్, ఖైతాన్‌ అండ్‌ కో, లుథారా అండ్‌ లుథారా, ట్రైలీగల్, దేశాయ్‌ అండ్‌ దివాంజీ, సింఘానియా అండ్‌ పార్టనర్స్, టైటస్‌ అండ్‌ కో, వదియా గాంధీ అండ్‌ కో, లక్ష్మీ కుమరన్‌ అండ్‌ శ్రీధరన్, ఎకనామిక్‌ లాస్‌ ప్రాక్టీస్, వైష్‌ అండ్‌ అసోషియేట్స్‌.
 • పీఎస్‌యూలు: పలు పీఎస్‌యూలు క్లాట్‌ ద్వారా ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ(లా),అసిస్టెంట్‌ లా మేనేజర్, అసిస్టెంట్‌ లీగల్‌ అడ్వైజర్‌ పోస్టులను భర్తీ చేస్తున్నాయి. పీజీసీఐఎల్, ఓఎన్‌జీసీ, ఓఐఎల్, ఐఓసీఎల్‌ వంటి సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి.

క్లాట్‌–పీజీ
కోర్సు: ఎల్‌ఎల్‌ఎం
క్లాట్‌ పీజీ ఇలా: ప్రశ్నపత్రంలో 120 ఎంసీక్యూ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు లభిస్తుంది. ప్రతి తప్పు సమాధానానికి పావు వంతు మార్కు కోత పడుతుంది. పరీక్ష వ్యవధి రెండు గంటలు. పరీక్షను ఆఫ్‌లైన్‌ విధానం(పెన్‌ పేపర్‌)లో నిర్వహిస్తారు.

సిలబస్‌: కాన్‌స్టిట్యూషన్‌ లా, జ్యురిస్ప్రుడెన్స్, ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ లా, ఫ్యామిలీ లా, ప్రాపర్టీ లా, అడ్మినిస్ట్రేటివ్‌ లా, ట్యాక్స్‌ లా, ఎన్విరాన్‌మెంటల్‌ లా, లా ఆఫ్‌ టార్ట్స్, కంపెనీ లా, ఇంటర్నేషనల్‌ లా, లేబర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ లా, పబ్లిక్‌ ఇంటర్నేషనల్‌ లా, క్రిమినల్‌ లా, లా ఆప్‌ కాంట్రాక్ట్స్‌ తదితర అంశాలు క్లాట్‌ పీజీలో ఉంటాయి.

నేషనల్‌ లా యూనివర్సిటీలు..

 • నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ, బెంగళూరు.
 • నల్సార్, హైదరాబాద్‌.
 • నేషనల్‌ లా ఇన్‌స్టిట్యూట్‌ యూనివర్సిటీ, భోపాల్‌.
 • వెస్ట్‌ బెంగాల్‌ నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ జ్యుడిషియల్‌ సైన్సెస్, కోల్‌కతా.
 • నేషనల్‌ లా యూనివర్సిటీ, జో«ద్‌పూర్‌.
 • హిదాయుతుల్లా లా యూనివర్సిటీ, రాయ్‌పూర్‌.
 • గుజరాత్‌ నేషనల్‌ లా యూనివర్సిటీ, గాంధీనగర్‌.
 • డా.రామ్‌ మనోహర్‌ లోహియా నేషనల్‌ లా యూనివర్సిటీ, లక్నో.
 • రాజీవ్‌ గాంధీ నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా, పాటియాల.
 • చాణక్య నేషనల్‌ లా యూనివర్సిటీ, పట్నా.
 • నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ లీగల్‌ స్టడీస్, కోచి.
 • నేషనల్‌ లా యూనివర్సిటీ, ఒడిషా.
 • నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ స్టడీ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌ లా, రాంచీ.
 • నేషనల్‌ లా యూనివర్సిటీ అండ్‌ జ్యుడిషియల్‌ అకాడెమీ, అస్సాం.
 • దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా యూనివర్సిటీ, విశాఖపట్నం.
 • తమిళనాడు నేషనల్‌ లా యూనివర్సిటీ, తిరుచిరాపల్లి.
 • మహారాష్ట్ర నేషనల్‌ లా యూనివర్సిటీ, ముంబై.
 • నేషనల్‌ లా యూనివర్సిటీ, నాగ్‌పూర్‌.
 • మహారాష్ట్ర నేషనల్‌ లా యూనివర్సిటీ, ఔరంగాబాద్‌.
 • హిమాచల్‌ ప్రదేశ్‌ నేషనల్‌ లా యూనివర్సిటీ, సిమ్లా.
 • ధర్మశాస్త్ర నేషనల్‌ లా యూనివర్సిటీ, జబల్‌పూర్‌.
 • డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ నేషనల్‌ లా యూనివర్సిటీ, సోనెపట్‌.
 • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://consortiumofnlus.ac.in/
Published date : 29 Jun 2021 05:39PM

Photo Stories