టీఎస్ లాసెట్–2021 నోటిఫికేషన్ విడుదల.. వివరాలు తెలుసుకోండిలా..
ఈ రెండు ఎంట్రెన్స్ టెస్టుల ద్వారా తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు న్యాయ కళాశాలల్లో బ్యాచిలర్ లా, మాస్టర్ లా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ నేపథ్యంలో.. అభ్యర్థులకు ఉపయోగపడేలా లాసెట్, పీజీఎల్‌సెట్ నోటిఫికేషన్ల వివరాలు, అర్హతలు, పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం..
టీఎస్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్(లాసెట్) ర్యాంకు ద్వారా.. రాష్ట్ర స్థాయి న్యాయ కళాశాలల్లో మూడేళ్ల బీఎల్/ఎల్‌ఎల్‌బీ కోర్సు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ/బీఎల్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. లాసెట్ ద్వారా ఇంటర్ అర్హతతో ఐదేళ్ల లా కోర్సుకు, డిగ్రీ అర్హతతో మూడేళ్ల లా కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.అదేవిధంగా ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన అభ్యర్థులు పీజీ చేయడానికి టీఎస్ పీజీఎల్‌సెట్ నిర్వహిస్తారు.
అర్హతలు..
- ఐదేళ్ల లా కోర్సుకు 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ (10+2 విధానంలో) (ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే 40 శాతం మార్కులు సరిపోతాయి) ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే మూడేళ్ల లా కోర్సుకు ఏదైనా డిగ్రీని (10+2+3 విధానం) 45 శాతం మార్కులతో పూర్తి చేయాలి. ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన వారు పీజీఎల్‌సెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్‌సెట్ దరఖాస్తుకు ఎలాంటి వయోపరిమితి లేదు.
- అర్హత పరీక్షలో 44.5 శాతం మార్కులతో ఉత్తీర్ణత శాతం సాధించిన జనరల్ అభ్యర్థులను 45 శాతంగా, 39.5 శాతం సాధించిన రిజర్వ్‌డ్ అభ్యర్థులను 40 శాతంగా పరిగణనలోకి తీసుకుని ప్రవేశాలు కల్పిస్తారు.
టీఎస్ లాసెట్ పరీక్ష విధానం..
టీఎస్ లాసెట్‌ను ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్‌గా నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి గంటన్నర.
విభాగం ప్రశ్నలు మార్కులు
జనరల్ నాలెడ్జ్, అండ్ మెంటల్ ఎబిలిటీ 30 30 కరెంట్ అఫైర్స్ 30 30 ఆప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ ఆఫ్ లా 60 60 మొత్తం 120 120
ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ ప్రశ్నపత్రం ఇంటర్మీడియెట్ స్థాయి లో, మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ ప్రశ్నపత్రం డిగ్రీ స్థాయిలో ఉంటుంది. ఈ పరీక్షలో నెగిటివ్ మార్కులు లేవు.
టీఎస్ పీజీఎల్‌సెట్– పరీక్ష ప్యాట్రన్..
ఎల్‌ఎల్‌ఎం అన్ని కోర్సులకు ఒకే ఉమ్మడి ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం 120 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి గంటన్నర. ప్రశ్నపత్రం మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. నెగిటివ్ మార్కులు లేవు.
పార్ట్ ఏ: 40 మార్కులు
- జ్యురిస్ప్రుడెన్స్–20 మార్కులు
- కాన్‌స్టిట్యూషన్ లా–20 మార్కులు
పార్ట్ బీ: 80 మార్కులు
- పబ్లిక్ ఇంటర్నేషనల్ లా–16 మార్కులు
- మర్కంటైల్ లా–16 మార్కులు
- లేబర్ లా – 16 మార్కులు
- క్రైమ్స్ అండ్ టార్ట్స్–16 మార్కులు
- ఐ–పీఆర్ అండ్ ఇతర లాస్– 16 మార్కులు
కనీస అర్హత మార్కులు..
- టీఎస్ లాసెట్‌లో కనీసం 35 శాతం మార్కులు అంటే మొత్తం 120 మార్కులకు గాను కనీసం 42 మార్కులు స్కోర్ చేస్తే.. అర్హత సాధించినట్లు ప్రకటిస్తారు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కుల నిబంధన లేదు.
- అలాగే పీజీఎల్‌సెట్‌ల్లో 25 శాతం మార్కులను కనీస క్వాలిఫయింగ్ మార్కులుగా నిర్ణయించారు. అంటే.. మొత్తం 120 మార్కులకు కనీసం 30 మార్కులు స్కోర్ చేస్తేనే.. అర్హత సాధించినట్లు పేర్కొంటారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు కనీస క్వాలిఫయింగ్ మార్కుల నిబంధనలు వర్తించవు.
లాసెట్ ప్రిపరేషన్ ఇలా..
జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ..
ఇది మిగిలిన రెండు విభాగాల కంటే కొంచెం క్లిష్టంగా ఉంటుంది. మ్యాథ్స్, షార్ట్ కట్ మెథడ్స్‌పై పట్టున్న వారు మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలను సులభంగా సాధించగలరు. ఇందులో ఇండియన్ హిస్టరీ, ఇండియన్ కాన్‌స్టిట్యూషన్, ఇండియన్ పాలిటీ, ఆల్ఫాబెట్ అనాలజీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, వెర్బల్ రీజనింగ్, ఆడ్ ఔట్, బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్‌మెంట్స్, వెర్బల్ అనాలజీ, లాజికల్ రీజనింగ్‌లపై ప్రశ్నలు వస్తాయి.
కరెంట్ అఫైర్స్..
రోజూ దినపత్రికలు చదివే అలవాటు ఉన్న అభ్యర్థులకు ఈ విభాగం సులభంగానే ఉంటుంది. ఇందులో అవార్డులు,అచీవ్‌మెంట్స్, శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు,జాతీయ,అంతర్జాతీయ ప్రాధాన్యాంశాలపై ప్రశ్నలు వస్తాయి. తెలంగాణ రాష్ట్ర సంబంధిత కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యం దక్కుతుంది.
ఆప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ ఆఫ్ లా..
చట్టాలకు సంబంధించిన ప్రాథమిక భావనలపై ప్రశ్నలు వస్తాయి. కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ముఖ్యమైన ఆర్టికల్స్, రాజ్యాంగ సవరణలు, లీగల్ పదజాలం, జ్యుడిషియరీలపై ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలు ప్రాథమిక అవగాహనను పరీక్షించేవిగా ఉంటాయి.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్‌సెట్ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 26, 2021
- టీఎస్ లాసెట్ దరఖాస్తు ఫీజు: ఓసీ, బీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.800, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500.
- టీఎస్ పీజీఎల్‌సెట్ దరఖాస్తు ఫీజు: ఓసీ, బీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు రూ.800.
- హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడ్ ప్రారంభం: ఆగస్టు 9 నుంచి ఊ టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్‌సెట్ నిర్వహణ: ఆగస్టు 23, 2021
- ప్రాథమిక కీ వెల్లడి: ఆగస్టు 26
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://lawcet.tsche.ac.in/TSLAWCET/TSLAWCET_HomePage.aspx