Law Entrance: ఎన్‌ఎల్‌యూ ప్రత్యేకత.. ఏఐఎల్‌ఈటీ పరీక్ష విధానం, సిలబస్ విశ్లేషణ..
దేశంలో న్యాయవిద్యను అందించే సంస్థలు చాలానే ఉన్నా.. అందులో ద నేషనల్ లా యూనివర్సిటీ, ఢిల్లీ ఎంతో ప్రత్యేకతమైంది. తక్కువ సీట్లు మాత్రమే ఉన్న ఈ సంస్థలో ప్రవేశం పొందడానికి దేశవ్యాప్తంగా వేల మంది పోటీ పడుతుంటారు. ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ(ఎన్‌ఎల్‌యూ).. తమ సంస్థలో ప్రవేశం కోసం ప్రతి ఏటా ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్(ఏఐఎల్‌ఈటీ)ను నిర్వహిస్తోంది. ప్రస్తుతం 2022కు సంబంధించి ఈ ప్రవేశ పరీక్షకు ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఎన్‌ఎల్‌యూ ప్రత్యేకత, ఏఐఎల్‌ఈటీ పరీక్ష విధానం, సిలబస్ విశ్లేషణ, కెరీర్ స్కోప్‌పై కథనం...
సమాజంలో గౌరవంతోపాటు మంచి కెరీర్‌ను సొంతం చేసుకోవడానికి అవకాశం ఉన్న కోర్సు.. లా! ప్రసుతం ప్రపంచ వ్యాప్తంగా న్యాయవాద విద్యకు డిమాండ్ ఏర్పడింది. యూనివర్సిటీలు, న్యాయవిద్య సంస్థలు పలు లా కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో న్యాయ విద్యకు ప్రసిద్ధి చెందిన ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ ఒకటి. ఇందులో ప్రవేశం పొందాలంటే.. ఏఐఎల్‌ఈటీలో ప్రతిభ చూపాల్సి ఉంటుంది. దీంట్లో సాధించిన ర్యాంక్ ఆధారంగా ఐదేళ్ల కాలవ్యవధితో ఉండే ఇంటిగ్రేటెడ్ బీఏ ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎమ్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఏడాదికి ఒకసారి నిర్వహించే ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా 20వేల మంది దాకా హాజరవుతుంటారు.
అర్హతలు
- బీఏ ఎల్‌ఎల్‌బీ: కనీసం 45శాతం మార్కులతో గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన(10+2) విద్యార్హతను కలిగి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు 40శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. ఎటువంటి వయోపరిమితి నిబంధన లేదు. ఇంటర్ లేదా తత్సమాన విద్యా చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే.
- ఎల్‌ఎల్‌ఎం: కనీసం 50శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎల్‌ఎల్‌బీ(3ఏళ్లు ఎల్‌ఎల్‌బీ లేదా ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ) పూర్తిచేసి ఉండాలి. ఎస్సీ/ఎసీ/దివ్యాంగులు 45శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. ఎటువంటి వయోపరిమితి నిబంధన లేదు. సంబంధిత కోర్సు చివరి సెమిస్టర్ లేదా చివరి ఏడాది చదివే వారు కూడా దరఖాస్తుకు అర్హులే.
- పీహెచ్‌డీ: ఎల్‌ఎల్‌ఎం లేదా తత్సమాన విద్యార్హతలో కనీసం 55శాతం(ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు 50శాతం) మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
చదవండి: క్లాట్‌తో జాతీయ సంస్థల్లో న్యాయ విద్య.. ప్రిపరేషన్ సాగించండిలా.. !
పరీక్ష విధానం
బీఏ ఎల్‌ఎల్‌బీ
- ఈ పరీక్షను ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష సమయం 90 నిమిషాలు. మూడు సెక్షన్‌ల నుంచి ఆబ్జెక్టివ్ పద్ధతిలో 150 ప్రశ్నలు ఇస్తారు. సరైన సమాధానానికి ఒక మార్కు లభిస్తుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కును తగ్గిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది.
- ఇంగ్లిష్ లాంగ్వేజ్(50 ప్రశ్నలు–50 మార్కులు): ఈ విభాగంలో నుంచి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, కాంప్రహెన్షన్ ప్యాసెజ్, యాంటోనిమ్స్, సినోనిమ్స్,ఇడియమ్స్,జంబుల్ వర్ట్స్ అండ్ సెంటెన్సె స్,సెలెక్టింగ్ కరెక్ట్ వర్డ్స్ నుంచి ప్రశ్నలుంటాయి.
- కరెంట్ ఆఫైర్స్(30 ప్రశ్నలు–30 మార్కులు): ఎకనామిక్స్, సివిక్స్, కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ, జనరల్ అవేర్‌నెస్ విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
- లాజికల్ రీజనింగ్(70 ప్రశ్నలు–70 మార్కులు): ఈ విభాగం నుంచి లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్ స్కిల్స్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. అలాగే లీగల్ ప్రిపోజిషన్స్ అండ్ రీజనింగ్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి.
ఎల్‌ఎల్‌ఎం
- ఈ పరీక్ష కూడా ఆఫ్‌లైన్ విధానంలో జరుగుతుంది. పరీక్ష సమయం 90 నిమిషాలు. రెండు సెక్షన్‌లుగా 150 మార్కులకు పరీక్ష ఉంటుంది.
- సెక్షన్–ఎ: ఈ విభాగంలో రెండు పార్ట్‌ల నుంచి ప్రశ్నలుంటాయి. పార్ట్–1 ఇంగ్లిష్ లాంగ్వేజ్(50 ప్రశ్నలు–50 మార్కులు), పార్ట్–2 లాజికల్ రీజనింగ్(50 ప్రశ్నలు–50 మార్కులు) నుంచి ప్రశ్నలను అడుగుతారు.
- సెక్షన్–బి: ఈ విభాగంలో లీగల్ నాలెడ్జ్–చట్టంలోని వివిధ శాఖల నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 10 ప్రశ్నలు ఇస్తారు. రెండు ప్రశ్నలకు(ఒక్కో ప్రశ్నకు 25 మార్కులు) సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
- సిలబస్: సెక్షన్–బి పరీక్షకు సంబంధించి న్యాయ శాస్త్రం, టార్ట్స్ చట్టం, ఆస్తిచట్టం, కుటుంబ చట్టం, మేధో సంపత్తి చట్టం, అంతర్జాతీయ చట్టాలు, లా ఆఫ్ కాంట్రాక్ట్స్, క్రిమినల్ లా నుంచి ప్రశ్నలను అడుగుతారు.
కెరీర్
ప్రస్తుతం న్యాయ విద్యకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ నెలకొంది. నైపుణ్యాలుంటే.. ఈ రంగంలో ఉజ్వలమైన కెరీర్ సొంతం చేసుకోవచ్చు. యువ లా గ్రాడ్యుయేట్స్‌కు ఎన్నడూ లేని విధంగా అవకాశాలు లభిస్తున్నాయి. న్యాయ విద్య పూర్తిచేసిన పట్టభద్రులకు జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఆఫర్లు వస్తున్నాయి. ఫండ్ రైజింగ్, షేర్లు, జాయింట్ వెంచర్లు, మెర్జర్‌లు, టెక్నాలజీ కొలాబరేషన్ తదితర అంశాల్లో న్యాయ నిపుణుల సలహాలు కీలకంగా మారుతున్నాయి. దీంతో వీరికి విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి.
ముఖ్యమైన సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ: 07.04.2022
- అడ్మిట్‌కార్డ్: ఏప్రిల్ 21, 2022
- పరీక్ష తేదీ: మే 01, 2022
- పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://nludelhi.ac.in
చదవండి: ఎన్నో సమస్యలకు పరిష్కారాలు చూపే.. లా కోర్సుల ప్రవేశ పరీక్షల గురించి తెలుసుకోండిలా..