Skip to main content

CAT 2023 Preparation: క్యాట్‌ పరీక్ష విధానం.. ఇందులో బెస్ట్‌ స్కోర్‌కు మార్గాలు ఇవే..

కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌.. క్యాట్‌గా సుపరిచితం! దేశంలోని ప్రతిష్టాత్మక మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్స్‌.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) క్యాంపస్‌లలో.. ఎంబీఏ, ఇతర పీజీ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష! ఇందులో సాధించిన స్కోర్‌ ఆధారంగానే ఐఐఎంలు మలిదశ ఎంపిక ప్రక్రియ నిర్వహించి అడ్మిషన్స్‌ కల్పిస్తాయి. నవంబర్‌ 26న పరీక్ష జరుగనుంది. ఈ నేపథ్యంలో.. క్యాట్‌ పరీక్ష విధానం, ఇందులో బెస్ట్‌ స్కోర్‌కు మార్గాలపై ప్రత్యేక కథనం..
IIM Admissions Process,CAT 2023 Exam Date & Exam Pattern & Preparation Tips,ndian Institutes of Management (IIM) Campuses
  • నవంబర్‌ 26న క్యాట్‌-2023
  • దాదాపు 2.5 లక్షల మంది దరఖాస్తు
  • క్యాట్‌కు ఏటేటా పెరుగుతున్న పోటీ
  • కీలకంగా మలి దశ ఎంపిక ప్రక్రియ

క్యాట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇప్పటికే తమ ప్రిపరేషన్‌ను దాదాపు పూర్తి చేసుకుని ఉంటారు. పరీక్ష తేదీ సమీపిస్తున్న వేళ.. అందుబాటులో ఉన్న ఈ కొద్ది రోజుల వ్యవధిలో తమ ప్రిపరేషన్‌ శైలిని మార్చుకోవాలి. ప్రస్తుత సమయంలో ప్రధానంగా రివిజన్, ప్రాక్టీస్‌పై దృష్టిపెట్టాలి అంటున్నారు నిపుణులు.

సొంత నోట్స్‌
క్యాట్‌ తుది దశ ప్రిపరేషన్‌లో భాగంగా.. అభ్యర్థులు ఇప్పటికే ఆయా టాపిక్స్‌కు సంబంధించి తాము రూపొందించుకున్న సొంత నోట్స్‌పై దృష్టి పెట్టాలి. షార్ట్‌ నోట్స్‌లో రాసుకున్న ముఖ్యమైన ఫార్ములాలు, కాన్సెప్ట్‌లను తరచూ రివిజన్‌ చేసుకోవడం ద్వారా.. ఆయా అంశాలకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు వచ్చినా సమాధానం సాధించే సంసిద్ధత లభిస్తుంది.

చ‌ద‌వండి: Management Entrance Test: ఎక్స్‌ఏటీతో మేనేజ్‌మెంట్‌ విద్య

గత ప్రశ్న పత్రాల సాధన
ప్రస్తుత సమయంలో మంచి స్కోర్‌కు మార్గం.. గత ప్రశ్న పత్రాల సాధన. కనీసం గత నాలుగేళ్ల ప్రీవియస్‌ కొశ్చన్‌ పేపర్స్‌ను అభ్యర్థులు సొంతంగా ప్రాక్టీస్‌ చేయాలి. వాటిని మూల్యాంకన చేసుకొని తమకు క్లిష్టంగా భావించిన అంశాలను గుర్తించాలి. ఇలాంటి వాటి ప్రిపరేషన్‌కు కొంత ఎక్కువ సమయం కేటాయించాలి.

మాక్‌ టెస్ట్‌లు
అభ్యర్థులకు కలిసొచ్చే మరో సాధనం.. మాక్‌ టెస్ట్‌లకు హాజరు కావడం. సెక్షన్‌ల వారీగా మాక్‌ టెస్ట్‌లకు హాజరయ్యే విధానాన్ని అనుసరించాలి. ఇలా సెక్షన్‌ వారీగా, మొత్తం పేపర్‌ వారీగా మాక్‌ టెస్ట్‌లకు హాజరయ్యాక.. తమ అవగాహన స్థాయి­పై స్పష్టత తెచ్చుకోవాలి. ఈ మాక్‌ టెస్ట్‌లు, మోడల్‌ టెస్ట్‌ల వ్యూహాన్ని పరీక్షకు వారం రోజుల ముందే పూర్తి చేసే విధంగా సమయ పాలన పాటించాలి.

చ‌ద‌వండి: Common Admission Test

విభాగాల వారీగా ఫోకస్‌

  • వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌: ఈ విభాగంలో రీడింగ్‌ కాంప్రహెన్షన్‌కు సంబంధించి­న అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. వెర్బల్‌ ఎబిలిటీకి సంబంధించి యాంటానిమ్స్, సినానిమ్స్, బేసిక్‌ గ్రామర్‌ అంశాలను మరోసారి తిరగేయాలి. 
  • డేటా ఇంటర్‌ప్రిటేషన్, లాజికల్‌ రీజనింగ్‌: ఇందు­లో ఇప్పటికే తాము ప్రిపరేషన్‌ పూర్తి చేసిన అంశాలకు సంబంధించిన టేబుల్స్, గ్రాఫ్స్, చార్ట్స్‌ ఆధారిత ప్రాబ్లమ్స్‌ను మరోసారి ప్రాక్టీస్‌ చేయా­లి. లాజికల్‌ రీజనింగ్‌లో క్యూబ్స్, క్లాక్స్, నంబర్‌ సిరీస్, లెటర్‌ సిరీస్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ వంటి అంశాల పునశ్చరణ ఎంతో కీలకం.
  • క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: ఈ విభాగానికి సంబంధించి పర్సంటేజెస్, రేషియోస్, డిస్టెన్స్‌-టైం వంటి అంశాలపై పట్టు సాధించాలి. మ్యాథమెటిక్స్‌కు సంబంధించి అల్‌జీబ్రా, మోడ్రన్‌ మ్యాథ్స్, జామెట్రీ అంశాలపై తాము రాసుకున్న షార్ట్‌ నోట్స్‌ ఆధారంగా పునశ్చరణకు సమయం కేటాయించాలి.

చ‌ద‌వండి: Study Abroad in USA: యూఎస్‌లో క్రేజీ కోర్సులు.. వీసాకు కావల్సిన పత్రాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

పరీక్షకు వారం రోజుల ముందు
అభ్యర్థులు పరీక్ష తేదీ సమీపిస్తున్న కొద్దీ తమ వ్యూహాన్ని మార్చుకోవాలి. పరీక్షకు వారం రోజుల ముందు నుంచి పూర్తిగా పునశ్చరణకే సమయం కే­టాయించాలి. ఏవైనా క్లిష్టమైన అంశాలుంటే.. వా­టికి సంబంధించిన కాన్సెప్ట్‌లు, ఫార్ములాలను షార్ట్‌ నోట్స్‌ ఆధారంగా అవగాహన పెంచుకోవాలి. ఈ స­మయంలో కూడా అభ్యర్థులు తమ వ్యక్తిగత సా­మర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రతిరోజు ఒక మాక్‌ టెస్ట్‌ రాసేందుకు సమయం కేటాయించుకోవచ్చు.

వేగం, కచ్చితత్వం
పరీక్షలో విజయానికి వేగం, కచ్చితత్వం చాలా ముఖ్యమని గుర్తించాలి. హార్డ్‌ వర్క్‌ కంటే స్మార్ట్‌ వర్క్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. రివిజన్‌ సమయంలో ఎదురయ్యే పొరపాట్లను సరిదిద్దుకునేందుకు ప్రయత్నించాలి. టెస్ట్‌లను వేగంగా పూర్తి చేసి.. మిగిలిన సమయాన్ని రివిజన్‌కు లేదా మరో మాక్‌ టెస్ట్‌కు హాజరయ్యేందుకు కేటాయించాలి.

షార్ట్‌ కట్‌ మెథడ్స్‌
క్యాట్‌ అభ్యర్థులు షార్ట్‌ కట్‌ మెథడ్స్‌ను అనుసరించడం మేలు చేస్తుంది. ముఖ్యంగా అంచెల వారీగా సమాధానాలు సాధించాల్సిన ఆవశ్యకత ఉన్న క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ విభాగాల్లో షార్ట్‌ కట్‌ మెథడ్స్‌ను అనుసరించాలి. మెమొరీ కోసం పాయింటర్‌ అప్రోచ్, విజువలైజేషన్‌ టెక్నిక్స్‌ వంటి వాటిని ఫాలో కావాలి.

పరీక్ష రోజు.. పకడ్బందీగా
నిర్ణయాత్మకమైన పరీక్ష రోజున అభ్యర్థులు వ్యూ­హాత్మకంగా వ్యవహరించాలి. ముందుగా సులువైన ప్రశ్నలు, ఆ తర్వాత ఓ మోస్తరు క్లిష్టత ప్రశ్నలు, చి­వరగా అత్యంత క్లిష్టమైన ప్రశ్నలపై దృష్టి పెట్టాలి. పరీక్ష హాల్లో.. కంప్యూటర్‌ బెస్డ్‌ టెస్ట్‌ విధానంలో ప్రశ్న పత్రం విండో ఓపెన్‌ కాగానే.. మొత్తం ప్రశ్న పత్రాన్ని చదవడానికి కనీసం పది నిమిషాలు కేటాయించాలి. ఫలితంగా తమకు సులభమైన, క్లిష్టమైన ప్రశ్నలు, విభాగాల గురించి అవగాహన లభిస్తుంది. దాని ఆధారంగా సమాధానాలు ఎక్కడి నుంచి మొదలు పెట్టొచ్చు అనే విషయంపైనా స్పష్టత లభిస్తుంది. అలాకాకుండా ఎగ్జామ్‌ విండో ఓపెన్‌ కాగానే సమాధానాలు ఇచ్చేందుకు ఉపక్రమిస్తే.. మొదట్లోనే ఏవైనా క్లిష్టమైన ప్రశ్నలు ఎదురైతే... ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది.

చ‌ద‌వండి: Xavier Aptitude Test: మేనేజ్‌మెంట్‌ పీజీకి.. గ్జాట్‌

సెక్షనల్‌ కటాఫ్స్‌ పొందేలా
క్యాట్‌ పరీక్షలో స్కోర్‌ ఆధారంగా ఐఐఎంలు నిర్వహించే మలి దశ ఎంపిక ప్రక్రియలో సెక్షనల్‌ కటాఫ్స్‌ నిబంధన అమలవుతోంది. కాబట్టి అభ్యర్థులు ప్రతి సెక్షన్‌లోనూ కనీస కటాఫ్‌ పర్సంటైల్‌ పొందేలా కృషి చేయాలి. ఇందుకోసం సెక్షన్‌ వారీ మోడల్‌ టెస్ట్‌లను ఆయుధంగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆయా సెక్షన్‌లలో పట్టు లభించడమే కాకుండా.. ఓవరాల్‌ కటాఫ్‌ మెరుగుపరచుకునేందుకు వీలవుతుంది.

క్యాట్‌ స్కోర్‌కు గరిష్టంగా 40 శాతం
తుది విజేతల జాబితా రూపకల్పనలో ఆయా ఐఐఎంలు క్యాట్‌ స్కోర్‌కు కనిష్టంగా 30 శాతం, గరిష్టంగా 40శాతం వెయిటేజీ కేటాయిస్తున్నాయి. క్యా­ట్‌ స్కోర్‌లో అధిక శాతం వెయిటేజీ సొంతం చేసుకోవాలన్నా.. వెయిటేజీ గణనలో తమ దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవాలన్నా.. అభ్యర్థులు సదరు ఐఐఎంలు పేర్కొన్న విధంగా క్యాట్‌లో సెక్షనల్‌ కటాఫ్‌లు, మొత్తం కటాఫ్‌ల పరంగా కనీస కటాఫ్‌ మార్కులు పొందాల్సిన ఆవశ్యకత నెలకొంది.

క్యాట్‌-2023.. ఎగ్జామ్‌ డే టిప్స్‌

  • నవంబర్‌ 26న ఐఐఎం-క్యాట్‌-2023
  • ప్రస్తుత సమయంలో పూర్తిగా రివిజన్‌కే కేటాయించడం ఉపయుక్తం.
  • సెక్షన్‌ వారీగా ప్రతి రోజు ప్రాబ్లమ్స్‌ ప్రాక్టీస్‌కు సమయం కేటాయించాలి.
  • షార్ట్‌ నోట్స్, షార్ట్‌ కట్‌ మెథడ్స్‌తో రివిజన్‌ను వేగవంతం చేసుకునే అవకాశం.
  • పరీక్ష హాల్లో.. ప్రశ్న పత్రం పరిశీలనకు సమయం కేటాయించడం ఆవశ్యకం.
  • ఈజీ టు డిఫికల్ట్‌ విధానంలో సమాధానాలు ఇచ్చేందుకు ఉపక్రమించాలి.

చ‌ద‌వండి: CAT 2023 notification: క్యాట్‌ 2023 వివరాలు.. మూడు విభాగాల్లో పరీక్ష

ఐఐఎం-బెంగళూరు.. మారిన విధానం

  • ఐఐఎం-బెంగళూరు ఈ ఏడాది ప్రవేశ ప్రక్రియలో కొన్ని మార్పులు చేసింది. 
  • మలిదశ ఎంపిక ప్రక్రియకు అభ్యర్థులను షార్ట్‌ లిస్ట్‌ చేసే క్రమంలో ఈ ఏడాది క్యాట్‌ స్కోర్‌కు 55 శాతం; పదో తరగతి మార్కులకు 10శాతం; ఇంటర్మీడియెట్‌ మార్కులకు 10 శాతం; డిగ్రీ మార్కులకు 10 శాతం; పని అనుభవానికి పది శాతం; జండర్‌ డైవర్సిటీకి 5 శాతం చొప్పున వెయిటేజీ ఇవ్వనున్నట్లు ఐఐఎం-బెంగళూరు వర్గాలు ప్రకటించాయి.
  • వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ వెయిటేజీ కోణంలో కనీసం మూడేళ్ల పని అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోనున్నారు.
  • ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది విజేతల జాబితాను రూపొందించే క్రమంలోనూ ఈ ఏడాది ఐఐఎం-బెంగళూరు మార్పులు చేసింది. పర్సనల్‌ ఇంటర్వ్యూ వెయిటేజీని 35 శాతం నుంచి 40 శాతానికి పెంచింది.
  • మొత్తంగా తుది జాబితా రూపకల్పనలో.. క్యాట్‌ స్కోర్‌కు 25 శాతం; పదో తరగతి నుంచి డిగ్రీ వరకు మార్కులకు అయిదు శాతం చొప్పున; పని అనుభవానికి 10 శాతం; రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్‌కు 10 శాతం, పర్సనల్‌ ఇంటర్వ్యూకు 40 శాతం వెయిటేజీ ఇవ్వనుంది.
Published date : 18 Oct 2023 08:22AM

Photo Stories