Skip to main content

CAT 2023 notification: క్యాట్‌ 2023 వివరాలు.. మూడు విభాగాల్లో పరీక్ష

మేనేజ్‌మెంట్‌ విద్యను అందించడంలో.. ఐఐఎం(ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌)లకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ఈ క్యాంపస్‌ల్లో అడుగుపెట్టేందుకు మార్గం.. కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(క్యాట్‌)! దేశవ్యాప్తంగా లక్షల మంది ఎంబీఏ అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూసే క్యాట్‌ 2023 నోటిఫికేషన్‌ విడుదలైంది. నవంబర్‌ 26న ఆన్‌లైన్‌ విధానం(కంప్యూటర్‌ బేస్డ్‌)లో పరీక్ష జరుగనుంది. ఈ నేపథ్యంలో.. క్యాట్‌ 2023 వివరాలు, దరఖాస్తుకు అర్హతలు, ఐఐఎంల ఎంపిక విధానంపై ప్రత్యేక కథనం..
cat 2023 notification details and exam pattern
  • విడుదలైన క్యాట్‌ 2023 నోటిఫికేషన్‌
  • రేపటి నుంచే దరఖాస్తు ప్రక్రియ
  • నవంబర్‌ 26న క్యాట్‌
  • మూడు విభాగాల్లో పరీక్ష

ఐఐఎంలు మేనేజ్‌మెంట్‌ విద్యలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ.. భవిష్యత్‌ మేనేజర్లను తీర్చిదిద్దుతున్న మేటి ఇన్‌స్టిట్యూట్స్‌. వీటిలో ప్రవేశానికి ఏటా నిర్వహించే పరీక్ష.. కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(క్యాట్‌). 2024 ప్రవేశాలకు సంబంధించి క్యాట్‌-2023ను నవంబర్‌ 26న నిర్వహించనున్నారు. కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచి కృషి చేస్తే.. క్యాట్‌లో బెస్ట్‌ పర్సంటైల్‌ సొంతం చేసుకొని ఐఐఎంల నుంచి ఇంటర్వ్యూ కాల్స్‌ను అందుకునే అవకాశం దక్కించుకోవచ్చు. ఐఐఎంల్లో ప్రవేశాలకు పోటీ తీవ్రంగా ఉంటుంది. క్యాట్‌-2020కు 1,90,143 మంది, క్యాట్‌-2021కు 1,91,660 మంది, క్యాట్‌-2022కు 2,22,184 మంది అభ్యర్థులు హాజరు కావడమే ఇందుకు నిదర్శనం.

చ‌ద‌వండి: Latest Careers

అర్హత

  • క్యాట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులు సాధించాలి).
  • బ్యాచిలర్‌ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వీరు ఇంటర్వ్యూ సమయానికి సర్టిఫికెట్లు అందించాల్సి ఉంటుంది.

20 క్యాంపస్‌లు.. 4 వేల సీట్లు
కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ స్కోర్‌ ఆధారంగా దేశంలోని 20 ఐఐఎం క్యాంపస్‌ల్లో ఎంబీఏ, పీజీ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ల్లో దాదాపు 4 వేల సీట్లను భర్తీ చేస్తారు. ఐఐఎంలతోపాటు మరెన్నో ఇతర బీ స్కూల్స్‌ సైతం క్యాట్‌ స్కోర్‌ ఆధారంగా ఎంబీఏలో ప్రవేశం కల్పిస్తున్నాయి. 

మూడు విభాగాల్లో పరీక్ష
ప్రతి ఏటా క్యాట్‌లో ఏదో ఒక మార్పు కనిపిస్తోంది. ఈ మార్పు ప్రశ్నల సంఖ్యలోనే ఉంటుందని.. విభాగాల్లో పెద్దగా మార్పు ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా క్యాట్‌ పరీక్షను మూడు విభాగాల్లో నిర్వహిస్తారు. ఆ వివరాలు..:

  • విభాగం-1: వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌.
  • విభాగం-2: డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌.
  • విభాగం-3: క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ.

ప్రశ్నల సంఖ్య
గత ఏడాది వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ నుంచి 24 ప్రశ్నలు, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ నుంచి 20 ప్రశ్నలు, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ నుంచి 22 ప్రశ్నలు చొప్పున మొత్తం 66 ప్రశ్నలతో.. 198 మార్కులకు పరీక్ష నిర్వహించారు. ఈసారి కూడా ఇదే తీరులో ఆయా విభాగాల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.

చ‌ద‌వండి: Common Admission Test

వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌
ఈ విభాగంలో రాణించాలంటే.. ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్, ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌లను పెంచుకోవడాని­కి కృషి చేయాలి. యాంటానిమ్స్, సినానిమ్స్, బేసిక్‌ గ్రామర్‌పై పట్టు సాధించాలి. అదే విధంగా ఫ్యాక్ట్స్, ఇన్ఫరెన్సెస్, జంబుల్డ్‌ పేరాగ్రాఫ్‌లను ప్రాక్టీస్‌ చేయ­డం ఉపయుక్తంగా ఉంటుంది. ప్యాసేజ్‌ ఆధారిత ప్రశ్నలు అడిగే రీడింగ్‌ కాంప్రహెన్షన్‌లో.. బెస్ట్‌ స్కోర్‌ కోసం అసెంప్షన్, స్టేట్‌మెంట్స్‌పై పట్టు సాధించాలి.

డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌
ఇందులో విశ్లేషణాత్మక నైపుణ్యం, లాజికల్‌ స్కిల్స్‌ను పరిశీలించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఈ విభాగంలో మెరుగైన స్కోర్‌ సాధించాలంటే.. టేబుల్స్, గ్రాఫ్స్, చార్ట్స్‌ ఆధారిత ప్రాబ్లమ్స్‌ను బాగా ప్రాక్టీస్‌ చేయాలి. లాజికల్‌ రీజనింగ్‌లో క్యూబ్స్, క్లాక్స్, నంబర్‌ సిరీస్, లెటర్‌ సిరీస్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ వంటి వాటిపై దృష్టిపెట్టాలి.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌
మ్యాథమెటికల్, అర్థమెటికల్‌ స్కిల్స్‌ను పరీక్షించే విభాగం ఇది. ఇందులో అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వాలంటే.. అర్థమెటిక్‌కు సంబంధించి పర్సంటేజెస్, రేషియోస్, డిస్టెన్స్‌ అండ్‌ టైం వంటి అంశాలపై పట్టు సాధించాలి. మ్యాథమెటిక్స్‌కు సంబంధించి అల్‌జీబ్రా, మోడ్రన్‌ మ్యాథ్స్, జామెట్రీ టాపిక్స్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి.

కటాఫ్‌ పర్సంటైల్‌
క్యాట్‌లో ప్రతి సెక్షన్‌లోనూ నిర్దిష్ట కటాఫ్‌ మార్కు­లు పొందేలా కృషి చేయాలి. ఎందుకంటే.. ఐఐఎంలు మలి దశ ఎంపిక ప్రక్రియకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు క్యాట్‌లో నిర్దిష్టంగా సెక్షనల్‌ కటాఫ్, ఓవరాల్‌ కటాఫ్‌లను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు ఓవరాల్‌ కటాఫ్‌ కనిష్టంగా 85 పర్సంటైల్, గరిష్టంగా 90 పర్సంటైల్‌ పొందాలి. అదే విధంగా సెక్షనల్‌ కటాఫ్‌ 75 నుంచి 80 పర్సంటైల్‌ వరకూ ఉంటోంది.

కాన్సెప్ట్స్, ప్రాక్టీస్‌
క్యాట్‌లో మెరుగైన స్కోర్, పర్సంటైల్‌ సాధించేందుకు ప్రతి సెక్షన్‌ కీలకంగా నిలుస్తోంది. కాబట్టి అభ్యర్థులు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. తొలు­త సిలబస్‌ను పరిశీలించి..అందులోని అంశాలు, వాటికి సంబంధించి కాన్సెప్ట్‌లపై అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత ప్రామాణిక మెటీరియల్‌ను ఆధారంగా చేసుకుని ప్రిపరేషన్‌ సాగించాలి. దీంతోపాటు ప్రతి టాపిక్‌ పూర్తయిన తర్వాత ప్రాక్టీస్‌ చేయాలి.

మాక్, మోడల్‌ టెస్ట్‌లు
అభ్యర్థులు గత ఏడాది క్యాట్‌లో ఎక్కువ వెయిటేజీ లభించిన అంశాలను గుర్తించి వాటిపై అధికంగా దృష్టి పెట్టాలి. ఆయా టాపిక్స్‌కు సంబంధించి ప్రామాణిక మెటీరియల్‌ను సేకరించి.. ప్రశ్నలను ప్రాక్టీస్‌ చేయాలి. ప్రతి యూనిట్‌ చివర్లో ఉండే మోడల్‌ కొశ్చన్స్‌ను సాధన చేయాలి. అదేవిధంగా మోడల్‌ టెస్ట్‌లకు హాజరవడం ఎంతో మేలు చేస్తుంది. వీటి ఫలితాలను విశ్లేషించుకుని ఇంకా పట్టు సాధించాల్సిన టాపిక్స్‌ను గుర్తించి వాటిపై మరింత ఎక్కువ దృష్టి సారించాలి. ఇలా ఒకవైపు సబ్జెక్ట్‌ ప్రిపరేషన్‌ సాగిస్తూనే.. మరోవైపు నిరంతరం ప్రాక్టీస్‌కు, నమూనా పరీక్షలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా స్కోర్‌ పెంచుకోవచ్చు.

మలిదశలో.. మరో ప్రక్రియ
ఐఐఎంలు క్యాట్‌ స్కోర్‌ ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు మలి దశలో గ్రూప్‌ డిస్కషన్, రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్, పర్సనల్‌ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నాయి. వీటికి నిర్దిష్ట వెయిటేజీ కేటాయించే విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఆయా ఐఐఎంల గత ప్రవేశ విధానాలను పరిశీలిస్తే.. క్యాట్‌ స్కోర్‌కు 50 నుంచి 70 శాతం, జీడీ/పీఐలకు 30 నుంచి 50 శాతం మధ్యలో వెయిటేజీ ఇస్తున్నాయి. కాబట్టి క్యాట్‌ స్కోర్‌తోనే ప్రవేశం ఖరారవుతుందని భావించకుండా.. అభ్యర్థులు గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ, రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్‌లలోనూ రాణించేందుకు ఇప్పటి నుంచే కృషి చేయాలి.

జీడీ, పీఐలు ఇలా
గ్రూప్‌ డిస్కషన్స్‌(జీడీ)లో అభ్యర్థులను నిర్దిష్ట సంఖ్యలో బృందాలుగా విభజించి.. ప్రతి బృందానికి ఏదైనా టాపిక్‌ ఇచ్చి దానిపై మాట్లాడమంటారు. ఒక్కో బృందంలో ఎనిమిది నుంచి పది మంది అభ్యర్థులు ఉంటున్నారు. జీడీ సమయంలోనే కొన్ని ఐఐఎంలు రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్‌ను కూడా నిర్వహిస్తున్నాయి. ఈ టెస్ట్‌లో భాగంగా అభ్యర్థులు నిర్దిష్టంగా ఏదైనా ఒక అంశంపై తమ అభిప్రాయాలను పద పరిమితితో రాయాలని సూచిస్తున్నాయి. ఈ రెండు దశల్లోనూ విజయం సాధించి మెరిట్‌ జాబితాలో నిలిచిన వారికి చివరగా పర్సనల్‌ ఇంటర్వ్యూ ఉంటుంది. అభ్యర్థులు మేనేజ్‌మెంట్‌ విద్యనే అభ్యసించాలనుకోవడానికి కారణం ఏంటి.. భవిష్యత్తు లక్ష్యాలు, ఆసక్తులు, అభిరుచులు తదితర కోణాల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. వీటన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసుకుని తుది జాబితాలో నిలిస్తే ఐఐఎంలో సీటు ఖరారైనట్లే!

ఐఐఎంలు - పీజీ సీట్లు
అహ్మదాబాద్‌-445 సీట్లు; బెంగళూరు-412; కోల్‌కత-480; లక్నో-436; ఇండోర్‌-451; నాగ్‌పూర్‌-225; ఉదయ్‌పూర్‌-325; త్రిచీ-260; కాశీపూర్‌-90; కోజికోడ్‌-375; బో«ద్‌గయ-120; రోహ్‌తక్‌-264; రాంచీ-185; సిౖర్మౌర్‌-120; అమృత్‌సర్‌-160; షిల్లాంగ్‌-92, రాయ్‌పూర్‌ -90; జమ్ము-90; సంబల్‌పూర్‌-90; విశాఖపట్నం-120 సీట్లు ఉన్నాయి.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
  • దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.08.2023
  • దరఖాస్తులకు చివరి తేది: 13.09.2023
  • అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌: అక్టోబర్‌ 25- నవంబర్‌ 26, 2023 వరకూ
  • క్యాట్‌ పరీక్ష తేదీ: 26.11.2023
  • ఫలితాల వెల్లడి: 2024, జనవరి రెండో వారంలో
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://iimcat.ac.in/
     
Published date : 02 Aug 2023 10:19AM

Photo Stories