Skip to main content

Skill Development: కొలువులకు నిచ్చెన.. అప్రెంటీస్‌ శిక్షణ!

National Apprentice Training Scheme (NATS) 2021
National Apprentice Training Scheme (NATS) 2021

డిగ్రీ, డిప్లొమా కోర్సులు చదువుతున్నారా.. పరిశ్రమల్లో పని చేస్తూ క్షేత్ర నైపుణ్యాలు సొంతం చేసుకోవాలని భావిస్తున్నారా.. అదే సమయంలో ఆర్థిక వెసులుబాటు కూడా కోరుకుంటున్నారా! అయితే.. మీకు చక్కటి మార్గం..నేషనల్‌ అప్రెంటీస్‌ ట్రైనింగ్‌ స్కీమ్‌(ఎన్‌ఏటీఎస్‌)!! ఈ స్కీమ్‌ ద్వారా.. ఎంఎస్‌ఎంఈల నుంచి ఎంఎన్‌సీల వరకూ.. ఆయా సంస్థల్లో అప్రెంటీస్‌ అవకాశం దక్కించుకోవచ్చు. విద్యార్థులకు, ఇండస్ట్రీకి అనుసంధాన వేదికగా నిలుస్తోంది ఎన్‌ఏటీఎస్‌. అప్రెంటిస్‌తో విద్యార్థులకు క్షేత్ర నైపుణ్యాలతోపాటు ఉపాధి కూడా లభిస్తోంది. ఇలాంటి ప్రత్యేకతలు కలిగిన అప్రెంటిస్‌ స్కీమ్‌ను కేంద్రం ఇటీవల మరో అయిదేళ్లు పొడిగించింది. ఈ నేపథ్యంలో.. నేషనల్‌ అప్రెంటీస్‌షిప్‌ ట్రైనింగ్‌ స్కీమ్‌తో ప్రయోజనాలు, దరఖాస్తుకు అర్హతలు, శిక్షణ విధానాలపై ప్రత్యేక కథనం.. 

  • నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ స్కీమ్‌ అయిదేళ్లు పొడిగింపు 
  • గ్రాడ్యుయేట్, డిప్లొమా విద్యార్థులకు సదవకాశం
  • అప్రెంటీస్‌గా ఎంపికైతే ఆకర్షణీయమైన స్టైపెండ్‌
     
  • అప్రెంటీస్‌షిప్‌.. ఐటీఐ, డిప్లొమా విద్యార్థులకు ఇది సుపరిచితమే. విద్యార్థులు తమ బ్రాంచ్‌లకు సరితూగే సంస్థలు, విభాగాల్లో కొంతకాలం పని చేసి శిక్షణ పొందేందుకు మార్గం. 
  • స్కిల్‌ గ్యాప్‌.. కంపెనీలు కోరుకునే స్కిల్స్‌ విద్యార్థుల్లో ఉండటం లేదని, ఇది స్కిల్‌ గ్యాప్‌కు దారితీస్తోందని ఇండస్ట్రీ వర్గాల నుంచి తరచూ వినిపిస్తున్న మాట.
  • ఇలాంటి పరిస్థితుల్లో ఆయా కోర్సుల విద్యార్థులకు అప్రెంటిస్‌ శిక్షణ ద్వారా నైపుణ్యాలు    పెంచేందుకు ప్రారంభించిన పథకమే.. నేషనల్‌ అప్రెంటీస్‌షిప్‌ ట్రైనింగ్‌ స్కీమ్‌! ఈ పథకం కాల పరిమితిని మరో అయిదేళ్లు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది.

ఎన్‌ఏటీఎస్‌ అంటే

దేశంలో వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులే కాకుండా.. ఇతర అన్ని కోర్సుల విద్యార్థులకూ అప్రెంటీస్‌ శిక్షణ అందించే ఉద్దేశంతో ప్రారంభించిన ప్రత్యేక పథకం.. నేషనల్‌ అప్రెంటీస్‌షిప్‌ ట్రైనింగ్‌ స్కీమ్‌(ఎన్‌ఏటీఎస్‌). అప్పటి వరకు అమ ల్లో ఉన్న అప్రెంటీస్‌షిప్‌ నిబంధనల్లో మార్పులు చేస్తూ.. 2016లో ఈ కొత్త స్కీమ్‌ను రూపొందించారు. ఇందులో అప్రెంటీస్‌ ట్రైనీలకు స్టైపెండ్‌ పెంచడం, శిక్షణ అందించే సంస్థలకు ప్రోత్సాహం, స్టైపెండ్‌ భారం భరించడం వంటివి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అంతేకాకుండా వృత్తి విద్యా కోర్సులకే పరిమితం అనుకునే అప్రెంటీస్‌షిప్‌ ట్రైనింగ్‌.. సంప్రదాయ డిగ్రీ కోర్సుల విద్యార్థులకూ అందుబాటులోకి వచ్చింది.

చ‌ద‌వండి: IIT Jobs: ఐఐటీల్లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌.. ఏడాదికి రూ.2కోట్లకు పైగా వేత‌నం..

స్టైపెండ్‌ పెంపు

నేషనల్‌ అప్రెంటీస్‌షిప్‌ ట్రైనింగ్‌ స్కీమ్‌ ద్వారా.. ఆయా కోర్సుల విద్యార్థులకు శిక్షణ సమయంలో ఇచ్చే స్టైపెండ్‌ను పెంచారు. ఆర్ట్స్, హ్యుమానిటీస్, కామర్స్, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు నెలకు రూ.9వేలు, డిప్లొమా ఉత్తీర్ణులకు నెలకు రూ.8వేలు ఇవ్వాలని నిర్ణయించారు. 

సంస్థలకు ప్రోత్సాహకం

  • ఎన్‌ఏటీఎస్‌లో భాగంగా సంస్థలకు సైతం ప్రోత్సాహకాలు ప్రకటించారు. విద్యార్థికి ఇచ్చే స్టైపెండ్‌లో 50 శాతాన్ని ప్రభుత్వం భరిస్తుంది. దీంతో సంస్థలు భారీగా అప్రెంటీస్‌ నియామకాలు చేపట్టే అవకాశం ఉంటుంది. 
  • సంస్థలు అప్రెంటీస్‌ ట్రైనీలను నియమించుకునే విషయంలోనూ పలు సడలింపులను ఇచ్చారు. గతంలో కనీసం 40 మంది ఉద్యోగులున్న సంస్థలే అప్రెంటీస్‌ ట్రైనీలను నియమించుకునేందుకు అనుమతి ఉండేది. ఇప్పుడు ఆ నిబంధనను సడలించి.. 30 మంది సిబ్బంది ఉన్న సంస్థలు కూడా అప్రెంటీస్‌లను నియమించుకోవచ్చని పేర్కొన్నారు. అంతేకాకుండా కనీసం ఆరుగురికి శిక్షణ ఇవ్వాలనే నిబంధనను కూడా సడలించి..నలుగురిని నియమించుకున్నా సరిపోతుందన్నారు. 

లెర్నింగ్‌ బై డూయింగ్‌

ఆయా కోర్సులు చదువుతున్న విద్యార్థులతోపాటు కోర్సు పూర్తయ్యాక కూడా అప్రెంటీస్‌ ట్రైనింగ్‌కు దరఖాస్తు చేసుకొని శిక్షణ పొందే వెసులుబాటును కొత్త స్కీమ్‌ ద్వారా కల్పించారు. దీంతో విద్యార్థులకు లెర్నింగ్‌ బై డూయింగ్, ఎర్నింగ్‌ బై లెర్నింగ్‌ అనే రెండు రకాల ప్రయోజనాలు కలుగుతున్నాయి. అంటే.. ఒకవైపు తాము చదువుకుంటున్న అంశాలకు సంబంధించి అప్పటికప్పుడు క్షేత్ర నైపుణ్యాలు పొందొచ్చు. మరోవైపు సంస్థల్లో పని చేస్తున్న సమయంలో స్టైపెండ్‌ రూపంలో ఆర్థిక ప్రోత్సాహం కూడా లభిస్తోంది.

సర్టిఫికెట్‌

ఎన్‌ఏటీఎస్‌ నిబంధనల ప్రకారం–ఏడాది వ్యవధిలో ఉండే అప్రెంటీస్‌ ట్రైనింగ్‌ పూర్తయ్యాక సర్టిఫికెట్‌ ఆఫ్‌ ప్రొఫిషియన్సీ పేరుతో సర్టిఫికెట్‌ను కూడా అందిస్తున్నారు. ఈ సర్టిఫికెట్‌ చేతిలో ఉంటే జాబ్‌ మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు దక్కుతుంది. వీరికి సంస్థలు తొలి ప్రాధాన్యం ఇస్తున్నాయి. అంతేకాకుండా ఏడాది పాటు పొందిన శిక్షణను పని అనుభవంగానూ పరిగణిస్తారు.

చ‌ద‌వండి: Tech Skills: పైథాన్‌.. కొలువుల కొండ!

స్వయం ఉపాధి

ఎన్‌ఏటీఎస్‌ ద్వారా శిక్షణ తీసుకున్న వారు స్వయం ఉపాధి అవకాశాలు అందుకోవచ్చు. ముఖ్యంగా మొబైల్‌ మాన్యుఫ్యాక్చరింగ్, వైద్య పరికరాల ఉత్పత్తి, ఫార్మా రంగం, ఆటో మొబైల్‌ రంగాల్లో.. ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్‌సెంటివ్‌ విధానంలో శిక్షణ ఇవ్వనున్నారు. దాంతో శిక్షణ పూర్తి చేసుకున్నాక.. విద్యార్థులకు ఆయా విభాగాలకు సంబంధించి పూర్తి స్థాయి నైపుణ్యాలు లభిస్తాయి. ఫలితంగా ఉద్యోగాలతోపాటు స్వయం ఉపాధి మార్గాలు కూడా అన్వేషించుకోవచ్చు.

డిమాండ్‌–సప్లయ్‌

ప్రస్తుతం అన్ని రంగాల్లో నైపుణ్యాలున్న మానవ వనరుల డిమాండ్‌–సప్లయ్‌ మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. దీన్ని తగ్గించే లక్ష్యంగా ఎన్‌ఏటీఎస్‌ను పొడిగించినట్లు చెబుతున్నారు. రానున్న మూడు, నాలుగేళ్లలో భారీ సంఖ్యలో నిపుణులైన మానవ వనరుల అవసరం ఏర్పడనుందని అంచనా వేస్తున్నారు. అందుకే అప్రెంటిస్‌ ద్వారా లక్షల మందికి శిక్షణ అందించి.. డిమాండ్‌–సప్లయ్‌ గ్యాప్‌ తగ్గించాలని భావిస్తున్నారు. 

అనుసంధాన కర్తగా

ఎన్‌ఏటీఎస్‌.. అభ్యర్థులు, ఇండస్ట్రీకి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తోంది. అందుకోసం ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌ను రూపొందించింది. ఇందులో అభ్యర్థులు, ఇండస్ట్రీ వర్గాలు లాగిన్‌ అయి.. తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఫలితంగా విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్న అవకాశాల గురించి తెలుసుకోవచ్చు. అదే సమయంలో సంస్థలు తమ అవసరాలకు సరితూగే అభ్యర్థులను గుర్తించడం తేలిక అవుతుంది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు

  • ఎన్‌ఏటీఎస్‌ ద్వారా అప్రెంటీస్‌ ట్రైనింగ్‌ అవకాశాలను సొంతం చేసుకోవాలనుకునే విద్యార్థులు.. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
  • ముందుగా ఎన్‌ఏటీఎస్‌ వెబ్‌సైట్‌ (https://portal.mhrdnats.gov.in) లో ఎన్‌రోల్‌మెంట్‌ ఆప్షన్‌ ద్వారా తమ ప్రొఫైల్‌ను నమోదు చేసుకోవాలి.
  • ఇలా ప్రొఫైల్‌ నమోదు చేసుకున్న వారికి గుర్తింపు సంఖ్య(యూనిక్‌ ఐడీ నెంబర్‌)కేటాయిస్తారు. 
  • ఎన్‌ఏటీఎస్‌ వెబ్‌సైట్‌ హోమ్‌ పేజ్‌లోనూ అప్రెంటీస్‌ నియామకాలు చేపడుతున్న సంస్థలకు సంబంధించిన సమాచారం కనిపిస్తుంది. విద్యార్థులు ఎన్‌ఏటీఎస్‌ యూనిక్‌ ఐడీ నెంబర్‌ ద్వారా వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఆ తర్వాత అభ్యర్థుల విద్యార్హతలకు అనుగుణంగా వారికి సరితూగే సంస్థలు, విభాగాల్లో అవకాశాలు లభిస్తాయి.

ధ్రువపత్రాలు

ఎన్‌ఏటీఎస్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకునేందుకు విద్యార్థులు తప్పనిసరిగా కొన్ని ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలి. అవి.. ఆధార్‌ కార్డ్, ఈ–మెయిల్‌ ఐడీ, మొబైల్‌ నెంబర్, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోగ్రాఫ్, ఆధార్‌ సీడింగ్‌ పూర్తయిన బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు, విద్యార్హతల సర్టిఫికెట్లు.

  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://portal.mhrdnats.gov.in 


చ‌ద‌వండి: Apprentice Posts

Published date : 15 Dec 2021 06:42PM

Photo Stories