Skip to main content

Youtube: యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండిలా.. డబ్బు సంపాదించండిలా!

నేడు ప్రపంచమంతా ఇంటర్నెట్ మీద ఆధారపడి నడుస్తోంది. మన దేశంలోనూ గత మూడేళ్లుగా డేటా వినియోగం విపరీతంగా పెరిగింది.
how to create youtube channel and make money
how to create youtube channel and make money

 ముఖ్యంగా వీడియో కంటెంట్ పట్ల వీక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. అదే సమయంలో డేటా చార్జీలు తగ్గడం మరింత ఊతమిస్తోంది. గూగుల్ తర్వాత ఎక్కువ మంది, ఎక్కువ సార్లు వీక్షిస్తున్న వెబ్‌సైట్.. ‘యూట్యూబ్’. ఈ డిజిటల్ వీడియో వేదిక ప్రజలకు విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచడంతోపాటు వీడియో క్రియేటర్లకు ఆదాయాన్ని కూడా తెచ్చిపెడుతోంది. మన అభిరుచికి తగిన టాపిక్ ఎంచుకొని.. దానికి సంబంధించిన వివరాలను వీడియోల రూపంలో యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తూ సంపాదించుకోవచ్చు. ఇటీవల కాలంలో ఎంతోమంది యూట్యూబ్‌ను ఆఫ్‌బీట్ కెరీర్‌గా ఎంచుకుంటున్నారు. యూట్యూబర్‌గా మారి ఉపాధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో.. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉపాధి మార్గాల గురించి తెలుసుకుందాం...

యూట్యూబ్.. వీడియో డిజిటల్ వేదిక. ఫుడ్ నుంచి ఫార్మింగ్ వరకూ.. అనేకానేక అంశాలపై విజ్ఞానం, వినోదం, సమీక్షలు.. ఇలా ఎన్నో విషయాలను యూట్యూబ్ ద్వారా తెలుసుకోవచ్చు. దీనిద్వారా మనకు తెలియని ఎన్నో విషయాలపై అవగాహన పెంచుకోవచ్చు. యూట్యూబ్ మిమ్మల్ని రాత్రికి రాత్రే స్టార్లుగా మార్చేయవచ్చు. ఊహించని డబ్బు తెచ్చిపెట్టవచ్చు. ఇందుకోసం పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. వినూత్నంగా ఆలోచించేతత్వం, ఆసక్తికరమైన కొత్త సబ్జెక్టును ఎంచుకోవడం, టెక్నికల్ నాలెడ్జ్, నాణ్యమైన కంటెంట్, ఓపికగా ఎడిటింగ్ చేయగలగడం, సరికొత్తగా ప్రజెంటేషన్ చేయగలిగితే చాలు.. యూట్యూబ్ ఛానల్ ఆదాయ వనరుగా మారుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. విభిన్న ఆలోచనా ధోరణి, సృజనాత్మకత ఉన్నవారికి యూట్యూబ్ చక్కటి వేదిక.

చ‌ద‌వండి: Career Planning: ఒకే ఒక్క నిర్ణయం.. మీ జీవిత గమనాన్నే మార్చేస్తుంది

ప్రతిభ‌కు వేదిక..
ప్రతిభ‌ను ప్రపంచానికి చాటేందుకు యూట్యూబ్ ప్లాట్‌ఫాం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సినిమా రంగంలో రైటింగ్, డెరైక్షన్, ఫోటోగ్రఫీ, స్క్రీన్‌ప్లే, మ్యూజిక్, ఎడిటింగ్, విజువల్ వర్క్స్ మొదలైన విభాగాల్లో అవకాశాల కోసం యూట్యూబ్‌ను ఉపయోగించుకోవచ్చు. సాహో సుజిత్, పెళ్లి చూపులు తరుణ్ భాస్కర్, ఘూజీ సంకల్ప్ రెడ్డి, వైవా హర్ష, ప్రియదర్శి, రాహుల్ వంటి ఎంతోమంది యూట్యూబ్‌లో తమ ప్రతిభను నిరూపించుకొని సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నవారే.

ఛానల్ ప్రారంభం :
గూగుల్ అకౌంట్ ఆధారంగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయొచ్చు. గూగుల్ ఖాతాతోనే యూట్యూబ్ అకౌంట్ తీసుకొని అదే పేరుతో ఛానల్ నడిపించవచ్చు. యూట్యూబ్ చానల్ ఓపెన్ చేశాక.. అప్‌లోడ్ బటన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి వీడియో అప్‌లోడ్ చేయవచ్చు. అప్‌లోడింగ్ చేసే వీడియోలు సొంతంగా తీసినవి మాత్రమే పెట్టాలి. ఇతరుల వీడియోలు పెడితే కాపీ రైట్ కింద వాటిని తొలగిస్తారు. ఖాతా కూడా డిలీట్ చేసే ఆస్కారం ఉంటుంది. మీరు అప్‌లోడ్ చేసే వీడియోలకు యూట్యూబ్ మేనేజ్‌మెంట్ యాడ్స్ జత చేస్తుంది. వాటిద్వారా వచ్చే యాడ్ రెవెన్యూలో మెజారిటీ వాటా (దాదాపు 60 శాతం రెవెన్యూ) మీకే చెందుతుంది. ఇందుకోసం పలు నిబంధనలను యూట్యూబ్ అమలు చేస్తుంది.

నిబంధనలు :
కనీసం వెయి మంది ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే కనీసం 4000 గంటల వాచ్‌టైం పూర్తవ్వాలి. ఇటీవల యూట్యూబ్‌లో స్పామ్ కంటెంట్ పెరగడం, వీడియోలను వాయిస్‌ఓవర్‌తో తప్పుదోవ పట్టిస్తున్న సందర్భాలు ఎక్కువ అవడంతో గూగుల్ సంస్థ యూట్యూబ్ నిబంధనలను కఠినతరం చేసింది. దీంతో సొంతంగా రూపొందించిన, నాణ్యమైన కంటెంట్ ఉంటేనే ప్రాధాన్యం లభిస్తోంది. సరైన సబ్జెక్టు ఎంచుకొని.. నాణ్యమైన వీడియోలు అప్‌లోడ్ చేయడం ద్వారా ముందుకు దూసుకుపోవచ్చు. మొబైల్స్, గాడ్జెట్స్, మ్యూజిక్, ట్రావెల్, గేమింగ్, టెక్నాలజీ, ఫుడ్, బ్యూటీ అండ్ ఫ్యాషన్, రివ్యూలు, సినిమా, ఫన్, ప్రాంక్, స్పోర్ట్స్ విభాగాల్లో వీడియోలకు డిమాండ్ ఉందని యూట్యూబర్స్ చెబుతున్నారు.

ఆదాయం ఎలా ?
నిర్దేశిత సబ్‌స్క్రిప్షన్స్, వాచ్‌టైమ్ లక్ష్యం చేరిన తర్వాత యాడ్స్ ప్లే అవడానికి గూగుల్ యాడ్‌సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చే ఒక ఐడీ నంబర్‌ను మానిటైజేషన్ ఆప్షన్‌లో నమోదు చేసిన తర్వాత యూట్యూబ్ నుంచి మెయిల్ వస్తుంది. తర్వాత బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం వ్యూస్ ఆధారంగా డబ్బు రావడం ప్రారంభమవుతుంది. యాడ్‌సెన్స్ అకౌంట్‌లో ఖాతా వివరాలను తెలుసుకోవచ్చు. సాధారణంగా ప్రతి వెయ్యి వీక్షణలకు వీడియో నిడివి, జోనర్, లోకేషన్ ఆధారంగా 1.5 డాలర్ల నుంచి 6 డాలర్లకు వస్తుంటాయి. పది లక్షల వ్యూస్ వస్తే సగటును 2 వేల డాలర్లు వరకు వచ్చే అవకాశం ఉంటుంది. 2017 నుంచి యాడ్ రెవెన్యూ తగ్గినట్లు ప్రముఖ యూట్యూబర్ ఒకరు చెప్పారు. ట్రెండింగ్, రికమెండెడ్, సెర్చ్‌లో వీడియోలు కనిపించడం తగ్గుతోందని చెబుతున్నారు.

ప్రమోషన్స్ ద్వారా..
యూట్యూబ్ అంటే కేవలం వ్యూస్(వీక్షణలు) ద్వారానే కాకుండా.. ఇతర మార్గాల ద్వారా కూడా డబ్బు సంపాదించుకోవచ్చు. వాటిల్లో ప్రధానంగా ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవడం ద్వారా ఆకర్షణీయమైన మొత్తం పొందవచ్చు. యూట్యూబ్‌లో తక్షణమే ఛానల్‌కు పేరు రావడం, ఆదాయం పెరగడం జరగదు. సబ్‌స్క్రైబర్స్‌ను ఆకట్టుకుంటూ.. వారి సంఖ్య పెంచుకునేందుకు చాలాకాలం ఓపికతో ఉండాలి. సబ్‌స్క్రిప్షన్స్ పెరిగాక వస్తువుల ఉత్పత్తిదారులు, సేవలు అందించే సంస్థలు మీ ఛానల్ ద్వారా ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తాయి. వారి ఉత్పత్తులను, సేవలను ప్రమోట్ చేయడం ద్వారా డబ్బు సంపాదించుకోవచ్చు. పెద్ద సంస్థలు కూడా ఛానల్ ద్వారా ప్రమోషన్స్ పొందేందుకు ప్రయత్నిస్తుంటాయి. మరోవైపు సొంతంగా.. టీ షర్ట్స్, బుక్స్ వంటి వాటిని ప్రమోట్ చేసుకుంటూ.. వాటి అమ్మకాల ద్వారా కూడా ఆర్జించొచ్చు.

స్పాన్సర్‌షిప్ :

  • కొన్ని ఛానల్స్ పలు ఉత్పత్తుల రివ్యూలు చేసి.. వాటిని కొనుగోలు చేసుకునేందుకు ఆ వీడియో కిందనే లింక్ ఇస్తాయి. వాటిని అఫిలియేట్ లింక్స్ అంటారు. ఎవరైనా యూజర్ మీరు ఇచ్చే లింక్ ద్వారా కొనుగోలు చేస్తే.. మీకు సుమారు 6 శాతం కమీషన్ దక్కుతుంది.
  • స్పాన్పర్‌షిప్స్ ద్వారా మంచి ఆదాయాన్ని పొందొచ్చు. సబ్‌స్క్రైబర్ల సంఖ్య, వస్తున్న వీక్షణలు మొదలైన వాటి ఆధారంగా చాలా బ్రాండెడ్ కంపెనీలు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి.. ప్రచారం పొందేందుకు ముందుకు వస్తాయి. ఇప్పటికే ప్రముఖ బ్రాండెడ్ సంస్థ అదిదాస్ సంప్రదాయక టీవీ, పేపర్ యాడ్స్ మానేసి.. పూర్తిగా డిజిటల్ యాడ్స్ ద్వారా మాత్రమే వినియోగదారులకు చేరువ అవుతున్నట్లు చెబుతోంది. రాబోయే రోజుల్లో ప్రముఖ సంస్థలన్నీ యూట్యూబ్ ద్వారా ప్రమోషన్ పొందేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయబోతున్నాయి. కాబట్టి మీ ఛానల్ పేరు పొందితే స్పాన్సర్‌షిప్స్ ద్వారా డబ్బు సంపాదించుకోవచ్చు. అయితే స్పాన్సర్‌షిప్స్ వీడియోల వల్ల ఛానల్స్ విశ్వసనీయత దెబ్బతింటున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యూజర్లు సదరు ఛానెల్స్‌కు దూరమయ్యే అవకాశం ఉంటుంది.


చ‌ద‌వండి: Cyber Security: ఈ నైపుణ్యాలు సొంతం చేసుకుంటే... జాబ్‌ గ్యారెంటీ!

ముఖ్యమైన టూల్స్ :

  • యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడానికి పెట్టుబడి అవసరం లేకున్నా .. వీడియోలను కొన్ని టూల్స్ ద్వారా ఆకర్షణీయంగా రూపొందించవచ్చు. ఫలితంగా వ్యూస్‌తోపాటు సబ్‌స్క్రిప్షన్స్ కూడా పెరుగుతాయి.
  • ఛానల్ ప్రారంభించే ముందు మీరు ఎంచుకునే జోనర్‌పై స్పష్టత ఉండాలి. దాని కోసం కొంత పరిశోధన చేయాలి. వీడియో రికార్డింగ్ కోసం 720పి రెజల్యూషన్ కంటే ఎక్కువ క్వాలిటీతో రికార్డింగ్ చేస్తే మేలు. బడ్జెట్ అనుకూలిస్తే తక్కువ బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న డీఎస్‌ఎల్‌ఆర్ కెమెరాలు తీసుకొని..వాటితో వీడియోలు చేయవచ్చు. ప్రస్తుతం మొబైల్‌లోనూ హైరెజల్యూషన్ వీడియోస్ తీసే అవకాశం ఉంది.
  • ట్రైపాడ్స్ తీసుకుంటే రికార్డింగ్ సులువు అవుతుంది. మార్కెట్‌లో తక్కువ పెట్టుబడితో ట్రైపాడ్స్ కొనుగోలు చేయవచ్చు.
  • మైక్రోఫోన్ ఆధారంగా చక్కటి ఆడియోతో వీడియో రికార్డింగ్ సాధ్యపడుతుంది. ఇది ప్రేక్షకుల ఆదరణ పొందడానికి ఉపయోగపడుతుంది.
  • బ్లూ స్క్రీన్ లేదా గ్రీన్ స్క్రీన్ ఉపయోగిస్తే బ్యాక్‌గ్రౌండ్ ఎడిటింగ్ సులువు అవుతుంది.
  • వీడియో రికార్డింగ్ చేసే క్రమంలో ఏవైనా అవాంతరాలు రావడం సహజం. వాటిని డిలీట్ చేయడానికి ఎడిటింగ్ టూల్స్ ఉపయోగపడతాయి. అంతేగాకుండా, వీడియో, ఆడియో ఎడిటింగ్ టూల్స్ ఉపయోగించి వీడియోను ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దవచ్చు. ముఖ్యంగా వీడియో ఎడిటర్‌ల కోసం థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్లను ఉపయోగించుకోవచ్చు. యూట్యూబ్‌లోనూ ఇన్‌బిల్డ్ ఎడిటింగ్ టూల్స్ ఉంటాయని.. వాటిని ఉపయోగించుకుంటే.. కోరుకున్న అవుట్ పుట్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

చిట్కాలు..
 వ్యూస్ పెంచుకునేందకు కొన్ని చిట్కాలు పాటించడం తప్పనిసరి. ప్రధానంగా టైటిల్స్ ఆకర్షించే విధంగా ఉండాలి. అలానే, థంబ్‌నైల్స్ కూడా చూపరులను ఇట్టే కట్టిపడేసే విధంగా కనిపించాలి. తెలుగులో ఛానల్ ప్రారంభిస్తే.. తెలుగు భాషలోనే కీవర్డ్స్ ఇవ్వాలి. ఇక, యూట్యూబ్ నుంచి కూడా ఆటోమేటిక్/సజెస్టెడ్ కీవర్డ్స్ వస్తుంటాయి. వాటిని ఉపయోగించుకోవాలి. 'కీవర్డ్స్', 'కీఫ్రేజెస్' ఇచ్చేటప్పుడు సెట్ అయ్యేవి ఇవ్వాలి. కొత్త ఛానల్ పెట్టిన వారు 'కీ ఫ్రేజెస్'కు ప్రాధాన్యం ఇవ్వాలి. 'స్కూఫ్స్', 'ఎంటర్‌టైన్‌మెంట్' విభాగాల వీడియోలు ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి!!


చ‌ద‌వండి: New Courses in IIM: ఇక్కడ విద్యనభ్యసించిన వారికి... టాప్‌ కంపెనీల్లో ఉద్యోగం

Published date : 05 Feb 2022 04:34PM

Photo Stories