Skip to main content

Career Guidance: క్రీడా రంగం.. కొలువుల తరంగం!

Career Guidance and Career Opportunities in Sports Sector
Career Guidance and Career Opportunities in Sports Sector
  • క్రీడలపై యువతలో పెరుగుతున్న ఆసక్తి
  • కెరీర్‌ వేదికగా మారుగుతున్న క్రీడా రంగం
  • ట్రైనర్‌ నుంచి మేనేజ్‌మెంట్‌ ప్రొఫైల్స్‌ వరకు ఎన్నో కొలువులు
  • నైపుణ్యార్జనకు అకడమిక్‌గా ఎన్నో కోర్సులు

ఆటలపై ఆసక్తి ఉందా.. క్రీడా రంగంలో కెరీర్‌ కోరుకుంటున్నారా.. అయితే మీ ముందు ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. షార్ట్‌ టర్మ్‌ శిక్షణ మొదలు పీజీ స్థాయి కోర్సుల వరకూ.. అనేక మార్గాలు!! ఆ అర్హతలతో.. క్రీడాకారులుగా మొదలు మేనేజ్‌మెంట్‌ నిపుణులుగా స్థిరపడేందుకు వీలుంది. అంతర్జాతీయంగా, జాతీయంగా క్రీడారంగంపై ఆసక్తి, ప్రాధాన్యం పెరుగుతోంది. ఫలితంగా.. ఈ రంగం కొలువుల తరంగంగా మారుతోంది. ఈ నేపథ్యంలో.. స్పోర్ట్స్‌లో కెరీర్‌ అవకాశాలు, అకడమిక్‌ నైపుణ్యాలు, మార్గాలు, వ్యక్తిగత, శారీరకంగా అవసరమైన అర్హతలు, స్కిల్స్‌ గురించి తెలుసుకుందాం.. 
విరాట్‌ కోహ్లి, ఎం.ఎస్‌.ధోని, యువరాజ్‌ సింగ్, రోహిత్‌ శర్మ, హార్ధిక్‌ పాండ్యా.. క్రికెట్‌ అనగానే మనందరికీ గుర్తొచ్చే పేర్లు... మీరాబాయ్‌ చాను, పీవీ సింధు, నీరజ్‌ చోప్రా, భజ్‌రంగ్‌ పూనియా, లవ్లీనా, రవి దహియా – టోక్యో ఒలింపిక్స్‌తో భారత్‌ సత్తా చాటిన క్రీడాకారులు, అథ్లెట్లు. తాజాగా కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో జెరిమీ, బింద్యారాణి, ఆచింత షూలి, సంకేత్, గురురాజ్‌ తదితరులంతా అద్భుతాలు సృష్టిస్తున్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుంటూ.. తాము కూడా క్రీడారంగంలో దూసుకెళ్లాలని కోరుకుంటున్న యువత సంఖ్య దేశంలో క్రమేణా పెరుగుతోంది. హైస్కూల్‌ స్థాయి నుంచే తమకు ఆసక్తి ఉన్న క్రీడల్లో శిక్షణ కోసం అన్వేషిస్తున్నారు. తద్వారా సంబంధిత క్రీడలో రాణించొచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో క్రీడలపై ఆసక్తి ఉన్న యువతకు ఇప్పుడు ఎన్నో శిక్షణ మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ఆయా ఈవెంట్స్‌కు సంబంధించి ఫిజికల్‌ ట్రైనింగ్‌ మొదలు.. క్రీడారంగాన్ని శాస్త్రీయ అధ్యయనం చేసేందుకు వీలుగా అకడమిక్‌ కోర్సుల్లో చేరే అవకాశం కూడా ఉంది. 

ఖేలో ఇండియా

యువతలోని క్రీడాసక్తిని, నైపుణ్యం గల క్రీడాకారులను గుర్తించడానికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఖేలో ఇండియా పేరుతో కేంద్రం ప్రస్తుతం ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా క్రీడా పోటీలను నిర్వహిస్తూ.. విజేతలకు ఆర్థిక ప్రోత్సాహకం అందిస్తోంది. అంతేకాకుండా స్పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలోని శిక్షణ కేంద్రాల్లో శిక్షణకు వీలు కల్పిస్తున్నారు. ఖేలో ఇండియా స్కీమ్‌లో భాగంగా స్పోర్ట్స్‌ ఫర్‌ ఉమెన్‌ పేరుతో ప్రత్యేక విధానం రూపొందించి.. మహిళా క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నారు.

చ‌ద‌వండి: Career Opportunities in Yoga: యోగాతో కొలువులు.. నెలకు రూ.50 వేల వేతనం.. మార్గాలు ఇవే..

కెరీర్‌కు.. మార్గంగా

అంతర్జాతీయ వేదికలపై భారత కీర్తి పతాకాలను ఎగురవేస్తూ దూసుకెళ్తున్న క్రీడాకారులు దేశ యువతకు ప్రేరణగా నిలుస్తున్నారు. మరోవైపు ప్రభుత్వాల ప్రత్యేక ప్రోత్సాహకాలు, పథకాల ఫలితంగా.. యువతలోనూ క్రీడా రంగంపై ఆసక్తి పెరుగుతోంది. అందుకే వారు సరైన శిక్షణ కోసం అన్వేషిస్తున్నారు. దీంతో క్రీడాకారులకు శిక్షణనిచ్చే నిపుణుల అవసరం ఏర్పడింది. ప్రధానంగా ఫిజికల్‌ ట్రైనర్స్, ఫిజియోథెరపిస్ట్స్, స్పోర్ట్స్‌ న్యూట్రిషనిస్ట్, ఫిట్‌నెస్‌ ఎక్స్‌పర్ట్స్, స్పోర్ట్స్‌ ట్రైనర్స్‌ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. వీరికి ప్రారంభంలోనే నెలకు రూ.30 వేల నుంచి రూ. 50 వేల వరకు వేతనాలు లభిస్తున్నాయి.

సాయ్‌ ఆధ్వర్యంలో శిక్షణ

క్రీడాకారులుగా రాణించాలనుకునే వారికి స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(సాయ్‌) ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న 60కు పైగా శిక్షణ కేంద్రాల్లో అమెచ్యూర్‌ అథ్లెటిక్‌ ట్రైనింగ్‌ అందిస్తున్నారు. వీటిని విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి ముందుగా జాతీయ స్థాయిలో జూనియర్‌ లెవల్‌ కాంపిటీషన్స్, ఆ తర్వాత సీనియర్‌ లెవల్‌ కాంపిటీషన్స్, తర్వాత అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుతం టేబుల్‌ టెన్నిస్, రన్నింగ్, బాస్కెట్‌ బాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, రెజ్లింగ్, హాకీ, వెయిట్‌ లిఫ్టింగ్, కబడ్డీ, తైక్వాండో, ఆర్చరీ తదితర ఈవెంట్లలో ఈ శిక్షణ పొందే అవకాశం ఉంది. 

చ‌ద‌వండి: Career Planning: ఒకే ఒక్క నిర్ణయం.. మీ జీవిత గమనాన్నే మార్చేస్తుంది

డిగ్రీ కోర్సులు

క్రీడా రంగంలో కెరీర్‌ కోరుకునే వారికి.. డిగ్రీ స్థాయిలో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర యువజన సర్వీసులు,క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మూడు ఇన్‌స్టిట్యూట్‌లకు మంచి గుర్తింపు ఉంది. అవి..

  • లక్ష్మిబాయ్‌ నేషనల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌– తిరువనంతపురం. 
    కోర్సులు: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్, మాస్టర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్, ఎం.ఫిల్‌(ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌), పీహెచ్‌డీ.
    వెబ్‌సైట్‌: https://www.lncpe.gov.in
  • లక్మీబాయ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌–గ్వాలియర్‌.
    కోర్సులు: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్‌ స్పోర్ట్స్‌ కోచింగ్, ఎంఏ(యోగా, స్పోర్ట్స్‌ సైకాలజీ), మాస్టర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్, ఎమ్మెస్సీ(స్పోర్ట్స్‌ బయోమెకనిక్స్‌), స్పోర్ట్స్‌ జర్నలిజం, స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ స్పోర్ట్స్‌ కోచింగ్‌/ఫిట్‌నెస్‌ మేనేజ్‌మెంట్‌/యోగా ఎడ్యుకేషన్‌.
    వివరాలకు వెబ్‌సైట్‌: http://www.lnipe.edu.in/wordpress
  • నేతాజీ సుభాష్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌– పటియాల.
    స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రత్యక్ష పర్యవేక్షణలోని ఈ ఇన్‌స్టిట్యూట్‌లో డిప్లొమా ఇన్‌ స్పోర్ట్స్‌ కోచింగ్, పీజీ డిప్లొమా ఇన్‌ స్పోర్ట్స్‌ కోచింగ్, ఎమ్మెస్సీ–స్పోర్ట్స్‌ కోచింగ్, డిప్లొమా ఇన్‌ ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ మాసేజ్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు  సర్టిఫికెట్‌ కోర్సులను ఇన్‌స్టిట్యూట్‌ అందిస్తోంది. 
    వివరాలకు వెబ్‌సైట్‌: https://nsnis.org/academic-courses

నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ

కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీని నెలకొల్పింది. ఈ యూనివర్సిటీ బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయిలో.. స్పోర్ట్స్‌ కోచింగ్, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ ప్రోగ్రామ్‌; పీజీ స్థాయిలో.. ఎమ్మెస్సీ స్పోర్ట్స్‌ కోచింగ్, ఎంఏ–స్పోర్ట్స్‌ సైకాలజీ, మాస్టర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది.

  • అదే విధంగా జాతీయ స్థాయిలో పలు యూనివర్సిటీలు సైతం.. బ్యాచిలర్, పీజీ స్థాయిలో బీపీఈడీ, ఎంపీఈడీ వంటి కోర్సులను అందిస్తున్నాయి.

మేనేజ్‌మెంట్‌ కోర్సులు సైతం

క్రీడా రంగంలో కెరీర్స్, అకడమిక్‌ కోర్సుల కోణంలో మరో వినూత్నమైన విభాగం.. స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌. పలు వర్సిటీలు.. పీజీ స్థాయిలో స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ పేరుతో ప్రత్యేక కోర్సును అందిస్తున్నాయి. ఈ కోర్సు పూర్తి చేసుకున్న వారు.. స్పోర్ట్స్‌ మార్కెటింగ్, స్పోర్ట్స్‌ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్, టీమ్‌ మేనేజ్‌మెంట్, ప్లేయర్స్‌ మేనేజ్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌ తదితర విభాగాల్లో ఎగ్జిక్యూటివ్, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ కొలువుల్లో చేరి ప్రారంభంలోనే నెలకు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు వేతనం అందుకోవచ్చు. 

క్రీడా రంగం.. ఉపాధి వేదికలు

క్రీడా రంగానికి సంబంధించి స్పెషలైజ్డ్‌ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి స్పోర్ట్స్‌ అసోసియేషన్స్, స్పోర్ట్స్‌ క్లబ్స్, ట్రైనింగ్‌ అకాడమీలు ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. సొంత ఎంటర్‌ప్రెన్యూర్‌ వెంచర్‌ను కూడా ప్రారంభించొచ్చు. 

స్పోర్ట్స్‌ జర్నలిజం

క్రీడా రంగంలోనే వినూత్న కెరీర్‌ కోరుకునే వారికి మరో అవకాశం.. స్పోర్ట్స్‌ జర్నలిజం. పీజీ, పీజీ డిప్లొమా స్థాయిలో ఈ కోర్సులను అభ్యసించి మీడియా సంస్థల్లో జర్నలిస్ట్‌లు, రిపోర్టర్స్, అనలిస్ట్‌లుగా అవకాశాలు పొందొచ్చు. 

ఆర్థికంగా.. ప్రోత్సాహకంగా

క్రీడా రంగంలో స్పెషలైజ్డ్‌ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి.. ఆర్థికంగానూ ప్రోత్సాహకర పరిస్థితులున్నాయి. అర్హతలు, సొంతం చేసుకున్న కొలువు ఆధారంగా నెలకు రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు వేతనం పొందే అవకాశం ఉంది.

స్వయం ఉపాధి

స్పోర్ట్స్‌ సెక్టార్‌లో స్పెషలైజ్డ్‌ నైపుణ్యాలు పొందిన వారికి స్వయం ఉపాధి అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటున్నాయి. సొంతంగా ట్రైనింగ్‌ సెంటర్లు, ఫిట్‌నెస్‌ సెంటర్లను నెలకొల్పి నెలకు రూ.50వేల నుంచి లక్ష వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది. 

చ‌ద‌వండి: Cyber Security: ఈ నైపుణ్యాలు సొంతం చేసుకుంటే... జాబ్‌ గ్యారెంటీ!


స్పోర్ట్స్‌ సెక్టార్‌.. కెరీర్స్‌.. ముఖ్యాంశాలు

  • యువతకు సరికొత్త ఉపాధి వేదికగా స్పోర్ట్స్‌ సెక్టార్‌ 
  • బ్యాచిలర్, పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్‌ స్థాయిలో పలు స్పెషలైజ్డ్‌ కోర్సులు
  • సాయ్, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక ఇన్‌స్టిట్యూట్‌లు 
  • అకడమిక్‌ నైపుణ్యాలతో ఫిజికల్‌ ట్రైనర్స్, ఫిట్‌నెస్‌ ట్రైనర్స్, స్పోర్ట్స్‌ కోచ్, మేనేజర్స్‌ వంటి కొలువులు
  • అర్హతలు, హోదాలకు అనుగుణంగా నెలకు రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు సంపాదించే అవకాశం. 
  • ట్రైనింగ్, కోచింగ్‌ సెంటర్లు ద్వారా స్వయం ఉపాధి పొందే అవకాశం


ప్రత్యేక నైపుణ్యాలు అవసరం

ఎమర్జింగ్‌ సెక్టార్‌గా మారుతున్న క్రీడా రంగంలో కొలువు దీరాలంటే.. అకడమిక్‌ నైపుణ్యాలతోపాటు వ్యక్తిగత స్కిల్స్‌ కూడా చాలా అవసరం. ఈ రంగంలో రాణించాలంటే ఆసక్తి, కష్టపడే తత్వం,క్రమశిక్షణ, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలు, శారీరక ద్రుఢత్వం వంటివి తప్పనిసరి. కేవలం క్రేజ్‌ కోణంలోనే కాకుండా ఈ లక్షణాలు ఉంటేనే ఈ రంగంలో ప్రవేశించడం మేలు. 
డా‘‘ ఎ.యువరాజ్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ

Published date : 02 Aug 2022 06:09PM

Photo Stories