NATA 2023 Notification: ఆర్కిటెక్చర్‌తో.. కెరీర్ నిర్మించుకుంటారా!
- బీఆర్క్ కోర్సులో ప్రవేశానికి నాటా
- సీఓఏ ఆధ్వర్యంలో ఈ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహణ
- జాతీయ స్థాయిలో 450కు పైగా ఇన్‌స్టిట్యూట్‌లు
- 2023 సంవత్సరం నాటా–2023 ప్రక్రియ ప్రారంభం
- ఈ ఏడాది కూడా మూడుసార్లు నాటా పరీక్ష నిర్వహణ
కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్
ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ వందల ఏళ్ల నుంచి మనుగడలో ఉంది. ఎన్నో చారిత్రక కట్టడాలకు ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ నైపుణ్యాలే మూలం. ఆధునిక సాంకేతికతలు, పరిస్థితులకు తగ్గట్టు ఆర్కిటెక్చర్ విభాగంలో నిపుణులను తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అయిదు దశాబ్దాల క్రితం ఏర్పాటైన సంస్థ.. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్(సీఓఏ). ఈ సంస్థ జాతీయ స్థాయిలో ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ విద్య, ఇన్‌స్టిట్యూట్‌ల విషయంలో నియంత్రణ సంస్థగా వ్యవహరిస్తోంది. ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కోర్సులు అందించే ఇన్‌స్టిట్యూట్‌లు సీఓఏ గుర్తింపు పొందాల్సి ఉంటుంది. ఈ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఆయా కోర్సుల్లో ప్రవేశాలను కూడా సీఓఏ పర్యవేక్షిస్తుంది. బ్యాచిలర్ స్థాయిలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు ప్రత్యేకంగా..జాతీయ స్థాయిలో నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్(నాటా) పేరిట ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది.
అర్హత
- ఎంపీసీ గ్రూప్‌తో 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత(లేదా)..మూడేళ్ల డిప్లొమాలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి.
- 2023లో చివరి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
చదవండి: Best Course After Intermediate MPC: ఎంపీసీ.. ఇంజనీరింగ్‌తోపాటు మరెన్నో!
నాటా మార్గం
బీఆర్క్‌లో చేరాలనుకునే విద్యార్థులకు చక్కటి మార్గంగా నిలుస్తోంది.. నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్. ఈ టెస్ట్‌లో స్కోర్ ఆధారంగా కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లలో బీఆర్క్‌లో ప్రవేశానికి అర్హత లభిస్తుంది. తాజా గణాంకాల ప్రకారం–ప్రస్తుతం జాతీయ స్థాయిలో 450కు పైగా ఇన్‌స్టిట్యూట్‌లు నాటా స్కోర్ ఆధారంగా బీఆర్క్‌లో ప్రవేశం కల్పిస్తున్నాయి.
125 ప్రశ్నలు–200 మార్కులు
మొత్తం 125 ప్రశ్నలతో 200 మార్కులకు నాటా పరీక్ష నిర్వహిస్తారు. నిర్దేశిత విభాగాల నుంచి మల్టిపుల్ ఛాయిస్ కొశ్చన్స్, మల్టిపుల్ సెలక్ట్ కొశ్చన్స్
(ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఉండే ప్రశ్నలు), ప్రిఫరెన్షియల్ ఛాయిస్ టైప్ కొశ్చన్స్, న్యూమరికల్ ఆన్సర్ టైప్ కొశ్చన్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ కొశ్చన్స్ అడుగుతారు.
విశ్లేషణ, పరిశీలన
ఆయా విభాగాల్లో సునిశిత పరిశీలన, తార్కిక విశ్లేషణను పరిశీలించేలా ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో కూడా డైనమిక్ రీజనింగ్, న్యూమరికల్ రీజనింగ్, వెర్బల్ రీజనింగ్, ఇండక్టివ్ రీజనింగ్, సిట్యుయేషనల్ జడ్జ్‌మెంట్, లాజికల్ రీజనింగ్, అబ్‌స్ట్రాక్ట్ రీజనింగ్ విభాగాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి.
చదవండి: Best Courses After 12th BiPC: బైపీసీతో... క్రేజీ కోర్సులివే!
నాటా–2023.. మూడు విడతలు
- నాటా–2023ని మూడు విడతలుగా నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న విడత పరీక్షకు హాజరు కావచ్చు. మొత్తం మూడు విడతల పరీక్షలకు కూడా హాజరు కావచ్చు. ఇలా ఒకటి కంటే ఎక్కువసార్లు హాజరయ్యే అభ్యర్థుల స్కోర్ నిర్ధారించేందుకు.. నిర్దిష్ట విధానాలను అవలంబిస్తారు.
- రెండుసార్లు పరీక్షకు హాజరైతే బెస్ట్ స్కోర్ వచ్చిన విడతను పరిగణనలోకి తీసుకుంటారు.
- మూడు విడతలకు హాజరైతే బెస్ట్ స్కోర్ వచ్చిన రెండు విడతలను కలిపి..వాటి సగటు స్కోర్‌ను తుది స్కోర్‌గా పరిగణిస్తారు.
- ఇలా పలు విడతల్లో హాజరయ్యే అవకాశం కల్పించడం ద్వారా ఒక అటెంప్ట్‌లో సరైన ప్రతిభ చూపలేదని భావిస్తే.. మరో అటెంప్ట్‌కు మరింత సమర్థవంతంగా సన్నద్ధమై మరిన్ని మార్కులు, స్కోర్ సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది.
చదవండి: Job Opportunities After Class 12th MPC : ఎంపీసీతో.. కొలువులు ఇవిగో!
మెరుగైన స్కోర్‌కు మార్గాలివే
డయాగ్రమెటిక్ రీజనింగ్
ఈ విభాగంలో అభ్యర్థుల సృజనాత్మకత, ఊహాత్మక దృష్టిని పరిశీలించేలా ప్రశ్నలు అడుగుతారు. నిర్దిష్టంగా ఒక ఒక సందర్భాన్ని, సన్నివేశాన్ని ఊహించి విశ్లేషించి సమాధానాలు ఇవ్వాల్సిన విధంగా ప్రశ్నలు ఉంటాయి. స్కెచ్ విజువౖలైజేషన్, క్రియేటివిటీ, స్కేల్ అండ్ ప్రపోర్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్, జియోమెట్రిక్ కంపోజిషన్, బిల్డింగ్ ఫామ్స్, ఎలిమెంట్స్, కలర్ టెక్స్చర్, హార్మోనీ అండ్ కాంట్రాస్ట్, డ్రాయింగ్ ఆఫ్ ప్యాట్రన్, ఫామ్ ట్రాన్‌ఫర్మేషన్స్, ఇన్ 2డీ, 3డీ, సబ్‌స్ట్రాక్షన్, రొటేషన్, సర్ఫేసెస్ అండ్ వాల్యుమ్స్, జనరేటింగ్ వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.
న్యూమరికల్ రీజనింగ్
ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు వచ్చే విభాగం ఇది. ఇందులో రాణించాలంటే.. అభ్యర్థులు జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, కాలిక్యులస్స్, ఇంటీజర్స్ వంటి మ్యాథమెటిక్స్ అంశాలపై దృష్టి పెట్టాలి. ఫిజిక్స్‌కు సంబంధించి ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నటిజం, రే ఆప్టిక్స్, రేడియేషన్, ఆటమ్స్ అండ్ న్యూక్లియస్ వంటి ముఖ్యాంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
వెర్బల్ రీజనింగ్
ఈ విభాగంలో రాణించాలంటే.. అభ్యర్థులు వర్డ్ సీక్వెన్స్, పజిల్స్, సిలాజిజమ్, అనాలజీ, క్లాసిఫికేషన్, బ్లడ్ రిలేషన్, కోడింగ్, డీ–కోడింగ్, క్యాలెండర్, డైరక్షన్స్ వంటి అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
ఇండక్టివ్ రీజనింగ్
ఈ విభాగంలో డేటా ఆధారిత ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు నిర్దిష్టంగా ఒక డేటా, లేదా టేబుల్స్‌ను పరిశీలించి వాటికి సంబంధించి పలు ప్యాట్రన్‌లను విశ్లేషించాల్సి ఉంటుంది. డేటా ఇంటర్‌ప్రిటేషన్ సంబంధిత అంశాలను ప్రాక్టీస్ చేయడం ఉపయుక్తంగా ఉంటుంది.
సిట్యుయేషనల్ జడ్జ్‌మెంట్
అభ్యర్థుల్లోని ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ను పరిశీలించే విధంగా ఈ విభాగంలో ప్రశ్నలను అడుగుతారు.ఏదైనా ఒక అంశాన్ని లేదా దృశ్యాన్ని చూపించి అందులోని పొరపాట్లు,వాటికి పరిష్కారం చూపే విధంగా సమాధానాల్ని గుర్తించాల్సి ఉంటుంది.
అబ్‌స్ట్రాక్ట్ రీజనింగ్
జనరల్ నాలెడ్జ్‌తోపాటు వర్తమాన అంశాలు, లేదా ఏదైనా ఒక అంశానికి సంబంధించి తాజా పరిస్థితులపై అవగాహనను తెలుసుకునే విధంగా ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు స్టాక్ జీకే, కరెంట్ అఫైర్స్, ఆర్కిటెక్చర్ విభాగంలోని తాజా పరిణామాల గురించి తెలుసుకోవాలి. స్టాక్ జీకే విషయంలో ప్రధానంగా.. అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న కట్టడాలు, రూపకర్తలు, కరెంట్ అఫైర్స్ అంశాలపై దృష్టి పెట్టాలి.
ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారా సీట్ల భర్తీ
నాటాలో నిర్దిష్ట కటాఫ్ మార్కులతో స్కోర్ సాధించి మెరిట్ జాబితాలో నిలిచిన వారికి తదుపరి దశలో ఆన్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహించి సీట్ల కేటాయింపు చేస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇలా ఆన్‌లైన్ కౌన్సెలింగ్ దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న కళాశాలల ప్రాథమ్యాలను పేర్కొనాల్సి ఉంటుంది.
విస్తృత అవకాశాలు
నాటా స్కోర్ ద్వారా సీఓఏ గుర్తింపు ఇన్‌స్టిట్యూట్స్‌లో అయిదేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సులో ప్రవేశించిన వారికి.. కోర్సు పూర్తయిన తర్వాత.. ప్రైవేట్ రంగంతోపాటు ప్రభుత్వ విభాగాల్లోనూ ఉద్యోగాలు లభిస్తున్నాయి. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ రైల్వే, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్, నేషనల్ బిల్డింగ్, ఆర్గనైజేషన్స్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్.. ఇలా వివిధ ప్రభుత్వ విభాగాల్లో కొలువులు లభిస్తాయి. అదే విధంగా ప్రైవేట్ రంగంలో గ్రాఫిక్, ఇంటీరియర్ డిజైన్, ఫర్నిచర్ డిజైన్ వంటి సంస్థల్లో, నిర్మాణ రంగంలోని కార్పొరేట్ సంస్థల్లో సగటున రూ.అయిదు లక్షల వేతనంతో కొలువు సొంతం చేసుకోవచ్చు.
నాటా–2023 ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: మూడు విడతలుగా నిర్వహించనున్న నాటాకు వేర్వేరుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. –మొదటి విడత దరఖాస్తులకు చివరి తేది ఏప్రిల్ 13, 2023. పరీక్ష ఏప్రిల్ 21వ తేదీన జరుగుతుంది. హాల్‌టికెట్లు ఏప్రిల్ 18 నుంచి అందుబాటులోకి వస్తాయి.
రెండో విడత ముఖ్య తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: మార్చి 20 – మే 13
- ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ: మే 9 – మే 13
- అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: మే 21 నుంచి
- నాటా రెండో విడత పరీక్ష తేదీ: మే 28, 2023
- ఫలితాల వెల్లడి: జూన్ 5
మూడో విడత ముఖ్య తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: మార్చి 20–జూన్ 24
- ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ: జూన్ 20–జూన్ 24
- అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: జూలై 2 నుంచి
- నాటా మూడో విడత పరీక్ష తేదీ: జూలై 9
- ఫలితాల వెల్లడి: జూలై 17
- మూడు విడతల్లోనూ పరీక్షలను ఉదయం 10 నుంచి 1 వరకు; మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు నిర్వహిస్తారు.
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కాకినడా, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్
- వెబ్‌సైట్: https://www.nata.in/