Skip to main content

NATA-2022: బీఆర్క్‌ పూర్తి చేసుకుంటే.. రూ.5లక్షల వేతనంతో కొలువు..

application process for NATA-2022 has begun
application process for NATA-2022 has begun

ఆర్కిటెక్చర్‌.. అద్భుత కట్టడాలు, ఆకర్షణీయమైన నిర్మాణాలు రూపొందించే విభాగం. అలాంటి నైపుణ్యాలను.. అకడమిక్‌ స్థాయిలోనే అందుకునేందుకు మార్గం.. బీఆర్క్‌. ఇంటర్‌తోనే ఈ బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ కోర్సులో ప్రవేశం పొందొచ్చు. అందుకు నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఆర్కిటెక్చర్‌(నాటా)లో కు సాధించాలి. కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ పర్యవేక్షణలో.. నిర్వహించే నాటాలో బెస్ట్‌ స్కోర్‌తో.. దేశ వ్యాప్తంగా ఆరు వందలకుపైగా ఇన్‌స్టిట్యూట్స్‌లో.. బీఆర్క్‌లో అడ్మిషన్‌ లభిస్తుంది. ఇటీవల నాటా–2022కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. నాటా తీరుతెన్నులు, పరీక్ష విధానం, బీఆర్క్‌తో కెరీర్‌ అవకాశాలపై ప్రత్యేక కథనం...  

  • నాటా స్కోర్‌తో బీఆర్క్‌ కోర్సులో ప్రవేశం
  • జాతీయ స్థాయిలో 600కు పైగా ఇన్‌స్టిట్యూట్‌లు
  • అయిదేళ్ల బీఆర్క్‌ పూర్తి చేసుకుంటే బ్రైట్‌ ఫ్యూచర్‌ ఖాయం
  • నాటా–2022 ప్రక్రియ ప్రారంభం
  • ఈ ఏడాది మూడు సార్లు పరీక్ష నిర్వహణ

ఆర్కిటెక్చర్‌.. ఎవర్‌గ్రీన్‌గా నిలుస్తున్న విభాగం. నేటి ఆధునిక సాంకేతిక యుగంలో బహుళ అంతస్తుల కట్టడాలు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు మొదలు.. వ్యక్తిగత గృహాల వరకు ఆకర్షణీయంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక నిర్మాణానికి సంబంధించి నిర్దేశిత వ్యయానికి అనుగుణంగా.. ఆకర్షణీయ డిజైన్‌లను రూపొందించే ప్రత్యేక నైపుణ్యాలను అందించే కోర్సు ఆర్కిటెక్చర్‌. ఇంటర్మీడియెట్‌ ఎంపీసీ పూర్తి చేసిన విద్యార్థులు.. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ కోర్సును చక్కటి ప్రత్యామ్నాంగా భావిస్తున్నారు.
 
సీఓఏ ఆధ్వర్యంలో నాటా

దేశంలోని ఆర్కిటెక్చర్‌ కళాశాలల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఏర్పాటైన కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ ఆ«ధ్వర్యంలో నాటా నిర్వహిస్తారు. దేశ వ్యాప్తంగా ఆరు వందలకుపైగా ఇన్‌స్టిట్యూట్‌లలో నాటా స్కోర్‌తో బీఆర్క్‌ కోర్సులో ప్రవేశించే అవకాశం లభిస్తోంది. ఎన్‌ఐటీలు, ఐఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లు మినహా మిగతా అన్ని ఇన్‌స్టిట్యూట్‌లు నాటా స్కోర్‌తోనే బీఆర్క్‌లో ప్రవేశం కల్పిస్తున్నాయి.

చ‌ద‌వండి: ఇంటి వ‌ద్దే ఆర్కిటెక్చర్ కోర్సుల ప్రవేశ ప‌రీక్ష.. స‌మాచారం తెలుసుకోండిలా..​​​​​​​

ఈ ఏడాది మూడుసార్లు

తాజాగా విడుదలైన నాటా నోటిఫికేషన్‌లో పలు కీలక మార్పులు ప్రకటించారు. ప్రధానంగా ఈ ఏడాది నాటాను మూడు సార్లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కాబట్టి ఈ ఏడాది మూడు అటెంప్ట్‌లు ఇచ్చే అవకాశం లభించనుంది. ఈ మూడు అటెంప్ట్‌లకు హాజరైన విద్యార్థుల విషయంలో.. మంచి స్కోర్‌ సాధించిన రెండు అటెంప్ట్‌ల స్కోర్‌ల సగటును గణించి తుది స్కోర్‌ ఖరారు చేయనున్నారు. రెండు అటెంప్ట్‌లకు మాత్రమే హాజరైతే.. రెండు అటెంప్ట్‌లలో ఉత్తమ స్కోర్‌నే నాటా స్కోర్‌గా పేర్కొంటారు. దీనివల్ల విద్యార్థులు ఒక అటెంప్ట్‌లో సరిగా ప్రతిభ చూపలేదని భావిస్తే.. మరో అటెంప్ట్‌కు మరింత సమర్థవంతంగా సన్నద్ధమై మంచి స్కోర్‌ సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది.

పరీక్ష ఇలా

ఈ ఏడాది నాటాను ఆన్‌లైన్‌ విధానంలో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌గా నిర్వహించనున్నారు. ఇది మొత్తం 125 ప్రశ్నలు–200 మార్కులకు ఉంటుంది. ఇందులో డయాగ్రమటిక్‌ రీజనింగ్, న్యూమరికల్‌ రీజనింగ్, వెర్బల్‌ రీజనింగ్, ఇండక్టివ్‌ రీజనింగ్, సిట్యుయేషనల్‌ జడ్జ్‌మెంట్, లాజికల్‌ రీజనింగ్, అబ్‌స్ట్రాక్ట్‌ రీజనింగ్‌ విభాగాల నుంచి ప్రశ్నలు అడగనున్నారు.

ప్రశ్నలు పలు రకాలుగా

నాటా–2022లో ప్రశ్నలను పలు రకాలుగా అడగనున్నారు. బహుళైచ్ఛిక ప్రశ్నలు (ఎంసీక్యూస్‌), మల్టిపుల్‌ సెలక్ట్‌ కొశ్చన్స్‌(ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఉండే ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు), న్యూమరికల్‌ టైప్‌ కొశ్చన్స్, ప్రిఫరెన్షియల్‌ ఛాయిస్, మ్యాచ్‌ ద ఫాలోయింగ్‌ తరహా ప్రశ్నలు అడుగుతారు. ఈ విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. అభ్యర్థులకు ఆయా అంశాలపై సంపూర్ణ అవగాహనను పరీక్షించడం ప్రధాన ఉద్దేశంగా చెప్పొచ్చు. అభ్యర్థులు మ్యాథ్స్, ఫిజిక్స్‌లకు సంబంధించి ఎక్కువ ప్రాక్టీస్‌ చేయాల్సిన ఆవశ్యకత నెలకొంది.

చ‌ద‌వండి: బీఆర్క్ లో ప్రవేశానికి తొలి అడుగు... ‘నాటా’

నాటా సన్నద్ధత ఇలా
డయాగ్రమెటిక్‌ రీజనింగ్‌

ఈ విభాగంలో అభ్యర్థులు ఏదైనా ఒక సందర్భాన్ని, సన్నివేశాన్ని ఊహించి విశ్లేషించి.. దాని గురించి అడిగిన ప్రశ్నకు అనుగుణంగా సరిపడే సమాధానాన్ని గుర్తించాల్సి ఉంటుంది. స్కెచ్‌ విజువౖలైజేషన్, క్రియేటివిటీ, స్కేల్‌ అండ్‌ ప్రపోర్షన్‌ ఆఫ్‌ ఆబ్జెక్ట్, జియోమెట్రిక్‌ కంపోజిషన్, బిల్డింగ్‌ ఫామ్స్, ఎలిమెంట్స్, కలర్‌ టెక్స్చర్, హార్మోనీ అండ్‌ కాంట్రాస్ట్, డ్రాయింగ్‌ ఆఫ్‌ ప్యాట్రన్, ఫామ్‌ ట్రాన్‌ఫర్మేషన్స్, ఇన్‌ 2డీ, 3డీ, సబ్‌స్ట్రాక్షన్, రొటేషన్, సర్ఫేసెస్‌ అండ్‌ వాల్యుమ్స్, జేనరేటింగ్‌ వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.

న్యూమరికల్‌ రీజనింగ్‌

ఈ విభాగంలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, కాలిక్యులస్, ఇంటీజర్స్‌ వంటి మ్యాథమెటిక్స్‌ అంశాలపై దృష్టి పెట్టాలి. ఫిజిక్స్‌కు సంబంధించి ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, కరెంట్‌ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నటిజం, రే ఆప్టిక్స్, రేడియేషన్, ఆటమ్స్‌ అండ్‌ న్యూక్లియస్‌ వంటి వంటి ముఖ్యాంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

ఇండక్టివ్‌ రీజనింగ్‌

ఈ విభాగంలో అభ్యర్థులకు నిర్దిష్టంగా ఒక డేటా, లేదా టేబుల్స్‌ను పరిశీలించి.. వాటికి సంబంధించి పలు ప్యాట్రన్‌లను విశ్లేషించాల్సి ఉంటుంది. అభ్యర్థులు డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ సంబంధిత అంశాలను ప్రాక్టీస్‌ చేయడం ఉపయుక్తంగా ఉంటుంది.

సిట్యుయేషనల్‌ రీజనింగ్‌

అభ్యర్థుల్లోని ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్స్‌ను పరిశీలించే విధంగా.. ఈ విభాగంలో ప్రశ్నలను అడుగుతారు. ఏదైనా ఒక అంశాన్ని లేదా దృశ్యాన్ని చూపించి.. వాటికి పరిష్కారం చూపే విధంగా సమాధానాల్ని గుర్తించాల్సి ఉంటుంది.

అబ్‌స్ట్రాక్ట్‌ రీజనింగ్‌

  • ఈ విభాగంలో జనరల్‌ నాలెడ్జ్‌తోపాటు వర్తమాన అంశాలు, లేదా ఏదైనా ఒక అంశానికి సంబంధించి తాజా పరిస్థితులపై అవగాహనను తెలుసుకునే విధంగా ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు స్టాక్‌ జీకే, కరెంట్‌ అఫైర్స్, ఆర్కిటెక్చర్‌ విభాగంలోని తాజా పరిణామాల గురించి తెలుసుకోవాలి. అదే స్టాక్‌ జీకే విషయంలో.. అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న కట్టడాలు, రూపకర్తలు, కరెంట్‌ అఫైర్స్‌ అంశాలపై దృష్టి పెట్టాలి. 
  • కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో.. అభ్యర్థుల్లోని సృజనాత్మక, పరిశీలనాత్మక దృక్పథం, ఆర్కిటెక్చర్‌పై ఉన్న అవగాహన, ఇమాజినేషన్, ఆయా సబ్జెక్ట్‌లపై వారికున్న పట్టు, ప్రతిభ నైపుణ్యాలను పరీక్షిస్తారు. 
  • బహుళైచ్ఛిక ప్రశ్నల విషయంలో 1,2,3 మార్కుల ప్రశ్నలు అడుగుతారు. 

మలి దశలో కౌన్సెలింగ్‌

నాటా స్కోర్‌ సొంతం చేసుకున్న అభ్యర్థులు.. మలి దశలో ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ద్వారా సీట్ల కేటాయింపు చేస్తారు. ఇంటర్మీడియెట్‌లో పొందిన మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇచ్చే విధానం అమలవుతోంది. ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న కళాశాలల ప్రాథమ్యాలను పేర్కొనాల్సి ఉంటుంది.
 
లభించే అవకాశాలు

  • బీఆర్క్‌ కోర్సు పూర్తయిన తర్వాత.. ప్రైవేట్‌ రంగంలో, ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ప్రభుత్వ విభాగాల్లో పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్, ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్, మినిస్ట్రీ ఆఫ్‌ డిఫెన్స్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ రైల్వే, పోస్ట్‌ అండ్‌ టెలిగ్రాఫ్, పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌ టేకింగ్, నేషనల్‌ బిల్డింగ్, ఆర్గనైజేషన్స్, టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్, హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌.. ఇలా చాలా ప్రభుత్వ, అనుబంధ రంగాల్లో కొలువులు లభిస్తాయి.
  • ప్రైవేట్‌ రంగంలో గ్రాఫిక్, ఇంటీరియర్‌ డిజైన్, ఫర్నిచర్‌ డిజైన్‌ వంటి సంస్థల్లో, నిర్మాణ రంగంలోని కార్పొరేట్‌ సంస్థల్లో సగటున రూ.5లక్షల వేతనంతో కొలువు సొంతం చేసుకోవచ్చు. 

క్రియేటివ్‌ స్కిల్స్‌ ఉండాలి

ఆర్కిటెక్చర్‌ విభాగంలో రాణించాలంటే.. విద్యార్థులకు స్వతహాగా క్రియేటివిటీ స్కిల్స్‌ ఉండాలి. వీటితోపాటు ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా టెక్నికల్‌ స్కిల్స్‌(3–డి డిజైన్, 2–డిజైన్, టెక్నికల్‌ డ్రాయింగ్‌ తదితర) నైపుణ్యాలు కూడా పెంచుకుంటే.. కెరీర్‌ అవకాశాలు ఉన్నతంగా ఉంటాయి. ఉద్యోగంతోపాటు స్వయం ఉపాధి అవకాశాలు కూడా లభిస్తున్నాయి. బీఆర్క్‌తో సరిపెట్టుకోకుండా.. పీజీ, పీహెచ్‌డీ కూడా చేస్తే.. ఉజ్వల అవకాశాలు సొంతమవుతాయి.
–ప్రొ‘‘ఎస్‌.కుమార్, ప్రిన్సిపాల్, స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ

నాటా–2022 ముఖ్యాంశాలు

  • నాటా 2022ను మూడు సార్లు నిర్వహించనున్న సీఓఏ
  • అభ్యర్థులు తమ ఆసక్తి మేరకు సెషన్‌ను ఎంచుకునే అవకాశం
  • ఒకటి కంటే ఎక్కువ సెషన్‌లకు హాజరైతే.. బెస్ట్‌ స్కోర్‌ వచ్చిన సెషన్‌నే ఫలితాల ప్రకటనలో పరిగణనలోకి తీసుకోనున్నట్లు వెల్లడి.

నాటా–2022 అర్హత, ముఖ్య తేదీలు

  • అర్హత: ఇంటర్మీడియెట్‌ ఎంపీసీ లేదా మూడేళ్ల డిప్లొమాలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి.
  • దరఖాస్తు విధానం: ఈ ఏడాది మూడుసార్లు నిర్వహించనున్న నాటాకు మూడు సార్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • నాటా పరీక్ష తేదీలు: మొదటి సెషన్‌ జూన్‌ 12; రెండో సెషన్‌ జూలై 3, మూడో సెషన్‌ జూలై 24.

నాటా–2022 మూడు సెషన్ల ముఖ్య తేదీలు: 

  • మొదటి సెషన్‌ ముఖ్య తేదీలు
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: మే 23
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ: మే 19 – మే 23
  • అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌: జూన్‌ 7
  • నాటా పరీక్ష తేదీ: జూన్‌ 12
  • ఫలితాల వెల్లడి: జూన్‌ 20

రెండో సెషన్‌ ముఖ్య తేదీలు

  • ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: ఏప్రిల్‌ 8– జూన్‌ 20
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ: జూన్‌ 18 – జూన్‌ 20
  • అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌: జూన్‌ 30
  • నాటా పరీక్ష తేదీ: జూలై 3
  • ఫలితాల వెల్లడి: జూలై 13

మూడో సెషన్‌ ముఖ్య తేదీలు

  • ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: ఏప్రిల్‌ 8 – జూలై 11
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ: జూలై 9 – జూలై 11
  • అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌: జూలై 21
  • నాటా పరీక్ష తేదీ: జూలై 24
  • ఫలితాల వెల్లడి: ఆగస్ట్‌ 3
  • తెలుగు రాష్ట్రాల్లో ఫరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.nata.in


చ‌ద‌వండి: కెరీర్ నిర్మాణానికి.. ఆర్కిటెక్చర్!​​​​​​​

Published date : 25 Apr 2022 05:37PM

Photo Stories