Skip to main content

బీఆర్క్ లో ప్రవేశానికి తొలి అడుగు... ‘నాటా’

జాతీయ స్థాయిలోని కళాశాలల్లో బీఆర్క్ ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (నాటా)కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షను కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నిర్వహిస్తుంది. బీఆర్క్‌లో ప్రవేశాల కోసం దేశంలోని గుర్తింపు పొందిన కళాశాలలు.. నాటా స్కోరును ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. నాటా వివరాలు...
ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్‌లో కెరీర్ కోరుకునే వారికి తొలి అడుగు.. 5 ఏళ్ల బీటెక్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్. బిల్డింగ్‌లు, ఇంటీరియర్ డిజైన్లు, నగర నిర్మాణాలు చేపట్టడంలో ఆర్కిటెక్చర్ ఇంజనీర్లది ప్రధాన పాత్ర. వారిచ్చిన బ్లూ ప్రింట్స్ ఆధారంగానే ఆయా నిర్మాణాలు ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంటాయి. ఈ నైపుణ్యాలను ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కోర్సు అందిస్తుంది.

ప్రస్తుతం మన దేశంలో ఐఐటీలు, ఎన్‌ఐటీలు సహా దాదాపు నాలుగువందల ఇన్‌స్టిట్యూట్‌లలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. ఐఐటీలు, ఎన్‌ఐటీలు జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తున్నాయి. ఇతర ఇన్‌స్టిట్యూట్‌లు నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (నాటా)లో ర్యాంకు ఆధారంగా విద్యార్థులకు ప్రవేశం లభిస్తుంది. దేశంలోని ఆర్కిటెక్చర్ కళాశాలలను పర్యవేక్షించే కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆధ్వర్యంలో నాటా పరీక్ష జరుగుతుంది.
  • కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్: ఇది స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. ఇది ఆర్కిటెక్చర్ విద్యను పర్యవేక్షిస్తుంది. భారతదేశంలో ఆర్కిటెక్ట్‌గా ప్రాక్టీస్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవటం తప్పనిసరి. దేశంలోని వివిధ సంస్థల్లో ఆర్కిటెక్చర్ విద్యను కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నియంత్రిస్తుంది. ఎప్పటికప్పుడు నిపుణులతో కూడిన కమిటీలతో కళాశాలల నియంత్రణ చేపడుతుంది.
  • నాటా: ఈ పరీక్ష ద్వారా ఆర్కిటెక్చర్‌లో విద్యార్థుల ఆప్టిట్యూడ్‌ను పరీక్షిస్తారు. ఇందులో అభ్యర్థి పరిశీలనా నైపుణ్యాలు, డ్రాయింగ్, ఈస్థటిక్ సెన్సిటివిటీ, క్రిటికల్ థింకింగ్ వంటి అంశాలను పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి.
    అర్హత: పదో తరగతి లేదా తత్సమానం పూర్తయిన అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో ఇంటర్మీడియెట్ లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులకు మాత్రమే బీఆర్క్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. నాటా స్కోరు రెండేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది.
పరీక్ష స్వరూపం:
నాటా రెండు విభాగాలుగా ఉంటుంది.
  • డ్రాయింగ్ టెస్ట్: ఈ పరీక్ష పేపర్ బేస్డ్ విధానంలో ఉంటుంది. రెండు గంటల వ్యవధిలో ఉండే డ్రాయింగ్ టెస్ట్‌లో అభ్యర్థిలోని స్కెచ్, విజువలైజింగ్, క్రియేటివిటీ వంటి నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఇందులో మూడు ప్రశ్నలుంటాయి.
  • ఈస్థటిక్ సెన్సిటివిటీ టెస్ట్: ఇది కంప్యూటర్ బేస్డ్ పరీక్ష. ఈస్థటిక్ సెన్సిటివిటీ టెస్ట్‌లో అభ్యర్థుల్లోని పరిశీలనాత్మక దృక్పథం, సృజనాత్మకత, ఆర్కిటెక్చర్ అవేర్‌నెస్, ఇమాజినేషన్ వంటి నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఇందులో మొత్తం 40 ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. సమయం: ఒక్కో ప్రశ్నకు 60 నుంచి 90 సెకన్లు. ఇలా మొత్తం రెండు వందల మార్కులకు ఉండే ఈ పరీక్షలో కనీసం 40 శాతం మార్కులు పొందితేనే కౌన్సిలింగ్/ప్రవేశ ప్రక్రియకు పరిగణనలోకి తీసుకుంటారు. అన్ని ప్రశ్నల సగటు కాఠిన్యత స్థాయితోపాటు అభ్యర్థి ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారనే అంశాలపై మార్కులు ఆధారపడి ఉంటాయి. ఇందులో నెగెటివ్ మార్కులు ఉండవు.
  • దరఖాస్తు ఫీజు: రూ.1250. దీన్ని ఆన్‌లైన్‌లో క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చు. ఆఫ్‌లైన్‌లో సిస్టం ద్వారా జనరేట్ అయిన చలాన్‌ను ఉపయోగించి, డబ్బును ఐసీఐసీఐ బ్యాంకులో డిపాజిట్ చేయవచ్చు.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి.
  • పరీక్ష షెడ్యూల్: ఏప్రిల్ 01, 2016 నుంచి మే 28, 2016; జూన్ 06, 2016 నుంచి ఆగస్టు 20, 2016 - రెండుసార్లు నిర్ణీత స్లాట్‌లలో జరుగుతుంది.
  • అభ్యర్థులు తమకు అందుబాటులోని స్లాట్‌లలో పరీక్షకు గరిష్టంగా 5 సార్లు హాజరు కావచ్చు.
  • ఒక స్లాట్‌లో తక్కువ స్కోర్ వచ్చినా మరో స్లాట్‌ను ఎంపిక చేసుకుని మెరుగైన స్కోర్ పొందేందుకు ఆస్కారం లభిస్తుంది.
పరీక్ష హాలులోకి తీసుకెళ్లాల్సిన వస్తువులు:
  • ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్.
  • రిజిస్ట్రేషన్ సమయంలో అపాయింట్‌మెంట్ వోచర్ వస్తుంది. ఇందులో పరీక్ష తేదీ, పరీక్ష సమయం, పరీక్ష సెంటర్ తదితర వివరాలు ఉంటాయి. దీన్ని తీసుకెళ్లటం తప్పనిసరి.
  • 3 లేదా 4 సాఫ్ట్ లెడ్ పెన్సిళ్లు, అరేజర్. క్లచ్ పెన్సిల్స్ వంటివాటిని హాలులోకి అనుమతించరు.
  • క్రేయాన్లు, పోస్టర్/వాటర్ కలర్స్, బ్రష్‌లు, డిష్‌లు.
  • జామెట్రీ ఇన్‌స్ట్రుమెంటేషన్ బాక్స్.
  • బ్లూ/బ్లాక్ బాల్ పాయింట్ పెన్.
కళాశాలల్లో ప్రవేశ విధానం:
  • నాటా స్కోరు, ఇంటర్/10+2లో వచ్చిన మార్కులను 50:50 నిష్పత్తిలో తీసుకొని ప్రవేశాలు కల్పిస్తారు.
  • రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ రిజర్వేషన్లు అమలవుతాయి.
ముఖ్య సమాచారం:
  • నాటా స్లాట్ తేదీలు: ఏప్రిల్ 1, 2016 నుంచి మే 28, 2016; జూన్ 6, 2016 నుంచి ఆగస్టు 20, 2016.
  • రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఆగస్టు 18, 2016.
    వెబ్‌సైట్:  www.nata.in/2016/
Published date : 29 Jan 2016 10:45AM

Photo Stories