Skip to main content

ఇంటి వ‌ద్దే ఆర్కిటెక్చర్ కోర్సుల ప్రవేశ ప‌రీక్ష.. స‌మాచారం తెలుసుకోండిలా..

నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఆర్కిటెక్చర్‌(నాటా).. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌(బీఆర్క్‌) కోర్సులో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష. కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ ఏటా రెండుసార్లు నాటాను నిర్వహిస్తోంది.
తాజాగా కొవిడ్‌–19 కారణంగా మొదటి సారి నిర్వహించాల్సిన నాటా పరీక్షను వాయిదా వేయడంతోపాటు డ్రాయింగ్‌ టెస్టును సైతం ఆన్‌లైన్‌కు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా డ్రాయింగ్‌Sటెస్ట్‌ సిలబస్‌లోనూ పలు మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో.. నాటా 2020 తాజా మార్పుల గురించి తెలుసుకుందాం..
  • నాటా: నేషనల్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఆర్కిటెక్చర్‌.
  • కోర్సు: బీఆర్క్‌(బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌).
  • కోర్సు వ్యవధి: ఐదేళ్లు
  • అర్హతలు: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులతో, మొత్తంగా కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
  • దేశంలో బీఆర్క్‌ కోర్సుల్లో చేరేందుకు నాటా తప్పనిసరి.
  • నాటా 2020 మొదటి సారి పరీక్ష తేది: 29.08.2020. పరీక్ష రెండు సెషన్లలో జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు; అలాగే మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు ఉంటుంది. రెండోసారి నాటా 2020 పరీక్ష తేదీలను ఇంకా వెల్లడించలేదు.

పరీక్ష విధానం..
నాటా మొత్తం 200 మార్కులకు ఉంటుంది. ఇందులో 2 భాగాలు, పార్ట్‌–ఏ, పార్ట్‌–బీ ఉంటాయి. పార్ట్‌–ఏ డ్రాయింగ్‌పై, పార్ట్‌–బీ పీసీఎం, జనరల్‌ ఆప్టిట్యూడ్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌లపై నిర్వహిస్తారు.

కొత్త సిలబస్‌..

  • కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌.. పార్ట్‌–ఏ సిలబస్‌లో మార్పులు చేసింది. కానీ, పార్ట్‌–బీ సిలబస్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. పార్ట్‌–ఏ కొత్త సిలబస్‌లో.. 2డీ, 3డీ కంపోజిషన్‌లో సమతుల్యత, లయ, కూర్పు, దిశ, సోపానక్రమం వంటి దృశ్య సూత్రాలను పేర్కొన్నారు. అలాగే వీటితోపాటు జ్యామితిని అర్థం చేసుకోవడం, ఆకారాన్ని దృశ్యరూపంలోకి మార్చి పరిష్కరించగలగే సామర్థ్యం, విజువల్‌ మేధస్సును పరీక్షించే రేఖాగణిత పజిల్స్, కలర్‌ థియరీ, వివిధ కలర్‌ స్కీములు, విజువల్‌ సిస్టమ్‌ ఇంటర్‌ప్రిటేషన్, గ్రాఫికల్‌ సారూప్యతలు, ఇతర లక్షణాలను పరీక్షించగలగడం, వస్తువులు, చిత్రాలు, దృశ్యాల మధ్య ప్రాదేశిక సంబంధం, అవగాహన, శ్రద్ధ, జ్ఞాపకశక్తి, గుర్తింపులను పేర్కొన్నారు. ఈ విభాగం 125 మార్కులకు ఉంటుంది.
  • పార్ట్‌–బీ 75 మార్కులకు జరుగుతుంది. దీన్ని ఎప్పట్లానే ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఈ విభాగాన్ని 45 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ నుంచి నుంచి 15 ప్రశ్నలు, జనరల్‌ ఆప్టిట్యూడ్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ నుంచి 35 ఆబ్జెక్టివ్‌ తరహ ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 1.5 మార్కులు ఉంటాయి.

పార్ట్‌–బి..
పార్ట్‌–బి సిలబస్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో ప్యూర్‌ మ్యాథ్స్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఆల్జీబ్రా, లాగరిథమ్స్, మాట్రిసెస్, ట్రిగనోమెట్రీ, కోఆర్డినేట్‌ జామెట్రీ, 3 డెమైన్షనల్‌ కోఆర్డినేట్‌ జామెట్రీ, థియరీ ఆఫ్‌ క్యాలికులస్, అప్లికేషన్‌ ఆఫ్‌ క్యాలికులస్, పర్ముటేషన్‌ అండ్‌ కాంబినేషన్, స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రాబబిలిటీ అధ్యాయాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అలాగే మ్యాథమెటికల్‌ రీజనింగ్, సెట్స్‌ రిలేషన్స్, ఆర్కిటెక్చర్‌ అండ్‌ నిర్మాణాలకు సంబంధించిన ఆబ్జెక్ట్స్, డ్రాయింగ్‌పై ప్రశ్నలు వస్తాయి. వీటితోపాటు జాతీయ, అంతర్జాతీయ ఆర్కిటెక్ట్స్, ప్రఖ్యాత ఆర్కిటెక్చరల్‌ క్రియేషన్స్‌పై జనరల్‌ అవేర్‌నెస్‌ ప్రశ్నలు ఉంటాయి. అనలిటికల్‌ రీజనింగ్, మెంటల్‌ ఎబిలిటీ(విజువల్, న్యూమరికల్,వెర్బల్‌)పై కూడా ప్రశ్నలు ఎదురవుతాయి.

ఎక్కడ నుంచైనా..
కొవిడ్‌–19ను దృష్టిలో పెట్టుకొని నాటా–2020 పరీక్షకుS ఇంటి నుంచి హాజరయ్యే వెసులుబాటు కల్పించారు. ఇంటర్నెట్‌ కనెక్టివిటీ, పర్సనల్‌ కంప్యూటర్, ల్యాప్‌టాప్, వెబ్‌క్యామ్‌ వంటి టెక్నికల్‌/హార్డ్‌వేర్‌ సౌకర్యాలు లేనివారు కౌన్సిల్‌ కేటాయించిన కేంద్రం నుంచి పరీక్షకు హాజరవ్వొచ్చు. దీనికి సంబంధించి అభ్యర్థులు తమ అకౌంట్లలోకి లాగిన్‌ అయ్యి పరీక్ష కేంద్రం (ఇల్లు/టెస్టు సెంటర్‌) ఛాయిస్‌ను పేర్కొనాల్సి ఉంటుంది.
పూర్తి వివరాలకు  వెబ్‌సైట్‌: www.nata.in

కెరీర్‌..
నవీన నిర్మాణాల్లో ఆర్కిటెక్టులు.. నవ నిర్మాణాల్లో పాల్పంచుకుంటారు. నవీన డిజైన్లు, నిర్మాణాల్లో ఆర్కిటెక్చర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వీరు క్లయింట్లకు నచ్చే విధంగా కట్టడాలకు ఆకర్షణీయ రూపునిచ్చేందుకు కృషి చేస్తారు. ఆర్కిటెక్చర్‌ ఇంజనీరింగ్‌ ఔత్సాహికులకు సృజనాత్మకత, పరిశీలన జ్ఞానం, విశ్లేషణ నైపుణ్యాలు, మ్యాథమెటికల్‌ ఎబిలిటీ, డ్రాయింగ్‌ స్కిల్స్‌ ఉండాలి.

ఉన్నత విద్య..
ఉన్నత విద్య పరంగా  మాస్టర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌(ఎంఆర్క్‌) కోర్సు అందుబాటులో ఉంది. పీజీలో అర్బన్‌ డిజైనింగ్, రీజనల్‌ ప్లానింగ్‌ వంటి స్పెషలైజేషన్లలో చేరే వీలుంది. పీజీ తర్వాత ఆసక్తి మేరకు పీహెచ్‌డీ కోసం ప్రయత్నించొచ్చు.

ఉద్యోగావకాశాలు..
బీఆర్క్‌ పూర్తిచేసిన వారికి ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో కొలువులు లభిస్తాయి. టౌన్‌ ప్లానింగ్, మౌలిక వసతుల సముదాయాలు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్స్‌లో అవకాశాలు ఉంటాయి. వీటితోపాటు ఆర్కిటెక్చర్‌ డిజైన్‌ సంస్థలు, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్‌ సేవల కంపెనీలు, సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్, అర్బన్‌ డవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌లు ప్రధాన ఉపాధి వేదికలుగా నిలుస్తాయి.

బొమ్మలు గీయాల్సిన అవసరం లేదు..
ఈ సంవత్సరం నాటాలో డ్రాయింగ్‌ టెస్టును ఆన్‌లైన్‌లో జరుగనుంది. తదనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేశారు. గతంలో డ్రాయింగ్‌ టెస్టు సిలబస్‌.. స్కిల్స్‌ను పరీక్షించేదిగా ఉండేది. ప్రస్తుతం దాన్ని అవగాహనను పరీక్షించేదిగా మార్చారు. ఈ విధానంలో అభ్యర్థి బొమ్మలు గీయాల్సిన అవసరం లేదు. కేవలం కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌ ముందు కూర్చొని సమాధానాలు ఇస్తే సరిపోతుంది. ప్రశ్నలను సైతం పజిల్స్‌ రూపంలో అడిగే అవకాశం ఉంది.
- ప్రొ.డా.ఎస్‌.కుమార్, ప్రిన్సిపల్, స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్, జేఎన్‌ఏఎఫ్‌ఏ విశ్వవిద్యాలయం.

Published date : 03 Aug 2020 02:32PM

Photo Stories